మద్యం తాగి సైకిల్ తొక్కినందుకు వందలాది మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల సస్పెన్షన్.. జపాన్ పోలీస్‌ల చర్యలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కో ఇవే
- హోదా, బీబీసీ ప్రతినిధి
మద్యం తాగి సైకిళ్లు నడుపుతూ దొరికిన సుమారు 900 మంది కార్ డ్రైవింగ్ లైసెన్స్‌లను జపాన్ పోలీసులు సస్పెండ్ చేసినట్లు స్థానిక మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
ఈ సైక్లిస్టులు "కారు నడిపేటప్పుడు కూడా ఇలాగే చేస్తే ప్రమాదాలకు అవకాశం ఉంది" అని అధికారులు భావించడమే దీనికి కారణం.
సైక్లిస్టులపై కఠినమైన జరిమానాలు విధించే కొత్త ట్రాఫిక్ చట్టాలను జపాన్ తీసుకురావడంతో, 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సస్పెండ్ చేసిన కార్ డ్రైవింగ్ లైసెన్స్‌ల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే బాగా పెరిగింది.
2024 నవంబర్‌లో ప్రారంభమైన కొత్త నిబంధనల ప్రకారం, మద్యం తాగిన తర్వాత సైకిల్ తొక్కే ఎవరికైనా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా 5,00,000 యెన్ (రూ.2.8 లక్షలు) వరకు జరిమానా విధించవచ్చు.
తాగి సైకిల్ తొక్కేవారిని శిక్షించే పరిమితిని కూడా తగ్గించారు. నిబంధనల ప్రకారం, బ్రీత్ ఆల్కహాల్ పరీక్షలో లీటరుకు 0.15 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లు గుర్తిస్తే సైక్లిస్టులకు జరిమానా విధించవచ్చు.

ప్రమాదాలు పెరగడంతో..
అంతకుముందు, సైకిళ్లను సరిగ్గా నడపలేని రైడర్లపై మాత్రమే జరిమానాలు అధికంగా ఉండేవి.
సైకిలిస్టులకు మద్యం అందించే వ్యక్తులకు లేదా తాగినవారికి సైకిల్ ఇచ్చినవారికీ జరిమానాలు వర్తించనున్నాయి.
"తాగి సైక్లింగ్ చేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది" అని స్థానిక వార్తాపత్రిక యోమియురి షింబున్‌తో ఒక పోలీసు అధికారి చెప్పారు
"తాగి నడపవద్దు అనే నియమాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తారని ఆశిస్తున్నాను" అన్నారు.
2024 నవంబర్ నుంచి 2025 జూన్ మధ్య జపాన్‌లో 4,500 మందికి పైగా మద్యం తాగాక సైకిల్ తొక్కుతూ పట్టుబడ్డారని మైనిచి వార్తాపత్రిక పోలీసు గణాంకాలను ఉటంకిస్తూ రిపోర్టుచేసింది.
సైకిళ్ల రైడింగ్ విషయంలో నిబంధనలను జపాన్ అధికారులు సమీక్షిస్తూ వస్తున్నారు. కరోనా సమయం నుంచి దేశంలో సైకిల్ ఎక్కువగా వాడుతున్నారు. అదేసమయంలో సైక్లిస్టుల తప్పిదాలు చాలా ప్రమాదాలకు కూడా దారితీశాయి.
2023లో జపాన్‌లో 72 వేలకు పైగా సైకిల్ ప్రమాదాలు నమోదయ్యాయి, ఇది దేశంలో జరిగిన మొత్తం ట్రాఫిక్ ప్రమాదాలతో పోలిస్తే 20 శాతం ఎక్కువగా ఉందని స్థానిక మీడియా తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏప్రిల్ నుంచి మరిన్ని నిబంధనలు
వేల సంవత్సరాలుగా జపనీయుల సామాజిక జీవితంలో మద్యం ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. మద్యం తాగడం వల్ల సంభాషణలు మరింత ప్రశాంతంగా ఉంటాయని నమ్ముతున్నందున, ప్రజలు తరచుగా బీరు లేదా సాకే తాగుతూ వ్యాపార ఒప్పందాలు లేదా క్లిష్ట సమస్యలను చర్చిస్తుంటారు.
వచ్చే ఏప్రిల్‌లో అమల్లోకి వచ్చే మరిన్ని కొత్త నిబంధనల ప్రకారం,
- సైక్లిస్టులు గొడుగు పట్టుకుని సైకిల్ తొక్కడం
- బైక్‌పై ఫోన్‌లను ఉపయోగించడం
- ట్రాఫిక్ లైట్లను విస్మరించడం
- రాత్రిపూట లైట్లు లేకుండా ప్రయాణించడం
వంటి తప్పిదాలకు కూడా జరిమానా విధించబోతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














