డెమెన్షియా: వృద్ధులను వెంటాడుతున్న ఈ సమస్యకు టెక్నాలజీ పరిష్కారం చూపగలదా?

కేర్ టేకింగ్ రోబోట్
    • రచయిత, సురంజనా తివారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గతేడాది, జపాన్‌లో డెమెన్షియా (మతిభ్రమణం) సమ్యసలతో బాధపడుతున్న వృద్ధులు దాదాపు 18వేలమంది తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లి తప్పిపోయారు.

వీరిలో దాదాపు 500 మందిని మరణించినట్లుగా తర్వాత గుర్తించారు. 2012 సంవత్సరం నుంచి ఇలాంటి కేసులు రెట్టింపయ్యాయని జపాన్ పోలీసులు చెబుతున్నారు.

ప్రస్తుతం జపాన్‌లో 65 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య మొత్తం జనాభాలో 30 శాతం కన్నా ఎక్కువే. వరల్డ్ బ్యాంకు డేటా ప్రకారం, జనాభాలో వృద్ధుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశాల్లో మొనాకో తరువాత, జపాన్‌ది రెండో స్థానం.

తగ్గిపోతున్న శ్రామికశక్తి, ఇతర దేశాల నుంచి వచ్చే కేర్‌ టేకర్లపై కఠిన నిబంధనలు- ఈ సంక్షోభ తీవ్రతను అధికం చేస్తున్నాయి.

దేశం అత్యవసరంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లలో డెమెన్షియా కూడా ఒకటిగా జపాన్ ప్రభుత్వం గుర్తించింది.

2030 సంవత్సరంకల్లా డెమెన్షియా సంబంధిత ఆరోగ్య సమస్యలు, వాటి చికిత్సకు అయ్యే ఖర్చులు 14 ట్రిలియన్ యెన్లు ( 90 బిలియన్ డాలర్లు) దాటుతాయని ఆ దేశ ఆరోగ్యశాఖ అంచనా. ఇది ప్రస్తుత వ్యయాల కన్నా 9 ట్రిలియన్ యెన్లు ఎక్కువ.

అయితే, టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను అధిగమించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది జపాన్ ప్రభుత్వం.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సమస్యలతో బాధపడుతున్నవారు ఎటు వెళ్లారో ఎక్కడున్నారో తెలుసుకునేందుకు చాలామంది జీపీఎస్‌తో పని చేసే సాధానాలను వినియోగిస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో జీపీఎస్ ట్యాగులు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్యాగును ధరించిన వారు ఒక నిర్ణీత ప్రాంతాన్ని దాటి వెళితే ఈ ట్యాగు వెంటనే అధికారులను ఎలర్ట్ చేస్తుంది.

కొన్ని జిల్లాల్లో, దుకాణాల్లో పనిచేసేవారికి సైతం రియల్-టైం నోటిఫికేషన్లు అందేలా, కొన్ని గంటల వ్యవధిలోనే తప్పిపోయిన వారి ఆచూకీని కనిపెట్టేలా ఈ వ్యవస్థలు పని చేస్తాయి.

ఇలా ఒక కమ్యూనిటీ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు.

జపాన్‌లో డెమెన్షియా సంక్షోభం, రోబోల సహాయం

డెమెన్షియాను ముందుగా గుర్తించేందుకు మరికొన్ని పరికరాలు కూడా సహాయ పడుతున్నాయి. ఫుజిట్సు, ఏసర్‌ మెడికల్‌ సంయుక్తంగా డెవలప్ చేసిన aiGait అనే వ్యవస్థ, వ్యక్తి నడక, భంగిమలను విశ్లేషిస్తూ డెమెన్షియాను ప్రారంభ దశలోనే గుర్తిస్తుంది. నడుస్తూ కాలును ఈడ్వడం, తిరగడంలో, నిలబడటంలో ఇబ్బంది వంటి లక్షణాలను ఇది గుర్తుపడుతుంది.

సాధారణ పరీక్షల్లో వైద్యులు పరిశీలించేందుకు స్కెలిటన్ అవుట్ లైన్లను ఈ ఏఐ రూపొందిస్తుంది.

‘‘వృద్ధాప్య సంబంధిత రోగాలను ముందుగానే గుర్తించడం కీలకం’’ అని ఫుజిట్సు ప్రతినిధి హిడెనోరి ఫుజివారా చెప్పారు.

మరోవైపు వాసెడా యూనివర్సిటీ పరిశోధకులు 150 కిలోల బరువున్న హ్యూమనాయిడ్‌ కేర్ రోబోట్‌ 'AIREC'ని తయారుచేసే పనిలో ఉన్నారు.

ఇది మనుషులకు సాక్సులు తొడగడం, గుడ్లు ఉడకబెట్టి ఇవ్వడం, దుస్తులు మడత పెట్టడం వంటి పనులు చేయగలదు.

భవిష్యత్తులో వృద్ధులకు డైపర్లు మార్చడం, ఎక్కువసేపు పడుకోవడం వల్ల అయ్యే పుండ్లు కాకుండా నివారించడం లాంటి పనులు చేయగలుగుతుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఇప్పటికే ఇలాంటి రోబోట్లు కొన్ని కేర్‌ హోమ్‌లలో వృద్ధులకు సంగీతం వినిపించడం, వ్యాయామాలు చేయించడం వంటి పనులు చేస్తున్నాయి. రాత్రివేళ ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించే రోబోట్లు కూడా వాడుతున్నారు. దీంతో అక్కడ పనిచేసే ఉద్యోగుల మీద భారం తగ్గుతోంది.

జపాన్‌లో డెమెన్షియా సంక్షోభం, రోబోల సహాయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 12 సెం.మీ ఎత్తున్న 'పోకెటోమో' అనే చిన్న రోబోట్‌ను బ్యాగ్‌లోనో, జేబులోనో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు.

రోబోల సహాయం

అయితే, హ్యూమనాయిడ్‌ రోబోట్లు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే, కచ్చితత్వం, మేధస్సు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.

"ఫుల్ బాడీ సెన్సింగ్, ప్రతి వ్యక్తి పరిస్థితికి తగినట్లుగా స్పందించే సామర్థ్యం కావాలి" అని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తామోన్‌ మియాకే చెప్పారు. ఇది సురక్షితంగా మానవులతో పనిచేయాలంటే కనీసం ఐదేండ్లు పడుతుందని ఆయన అన్నారు.

మెంటల్ హెల్ప్ కూడా ఈ నూతన ఆవిష్కరణలలో భాగమే.

12 సెం.మీ ఎత్తున్న 'పోకెటోమో' అనే చిన్న రోబోట్‌ను బ్యాగ్‌లోనో, జేబులోనో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు. ఇది మాత్రలు వేసుకొమ్మని, మందులు తాగమని గుర్తుచేస్తుంది. బయట వాతావరణానికి ఎలా సిద్ధం కావాలో కూడా చెబుతుంది. ఒంటరిగా జీవించే వారికి మాటలతో కాలక్షేపం చేయిస్తుంది.

"సామాజిక సమస్యలపై దృష్టి పెట్టి, వాటిని పరిష్కరించేందుకు కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నాం" అని షార్ప్‌ సంస్థలో డెవలప్‌మెంట్ మేనేజర్ మిహో కగేయి చెప్పారు.

పరికరాలు, రోబోట్లు సహాయం చేసే అవకాశాలు పెరుగుతున్నా, మానవ అనుబంధం మాత్రం భర్తీ చేయలేనిది.

"రోబోట్లు సాయం చేయాలి అంతే. మనుషుల స్థానాన్ని ఆక్రమించకూడదు. ప్రధానంగా రోగులు, సంరక్షకులకు సహాయం చేయటమే వీటి లక్ష్యమై ఉండాలి" అని మియాకే అన్నారు.

టోక్యోలోని సెంగావాలో అకికో కన్నా స్థాపించిన 'రెస్టారెంట్‌ ఆఫ్‌ మిస్టేకన్‌ ఆర్డర్స్‌'లో డెమెన్షియా బాధితులే ఉద్యోగులుగా పనిచేస్తారు. అకికోకు తన తండ్రి వల్ల ఏర్పడిన అనుభవం ఈ ఆలోచనకు స్ఫూర్తి. ఇక్కడ పనిచేసే వారు తమకిష్టమైన పనుల్లో పాల్గొంటూ ఉత్సాహంగా ఉండగలుతున్నారు.

ఇక్కడ సర్వర్‌గా పనిచేసే తోషియో మోరిటా, ఏ టేబుల్‌ ఏ ఆర్డర్‌ ఇచ్చిందో గుర్తుంచుకోవడానికి పూలను ఉపయోగిస్తారు. మానసిక సామర్థ్యం తగ్గుతున్నప్పటికీ, ఆయనకు ప్రజలతో మెలగడం ఆనందంగా ఉంటుంది. ఆయన భార్యకు కూడా ఇది ఒక రిలాక్సింగ్ ప్రదేశం. అకికో ఏర్పాటు చేసిన ఈ కేఫే సామాజిక సంబంధాలు, కమ్యూనిటీ మద్దతు ఎంత ముఖ్యమో చాటి చెబుతుంది.

సాంకేతికత, ఉపశమనాన్ని ఇచ్చినా, డెమెన్షియాతో జీవించే వారికి నిజంగా ఆత్మస్థైర్యం ఇచ్చేది మానవ సంబంధాలే

"నిజం చెప్పాలంటే కొంచెం జేబు ఖర్చులకు డబ్బులు కావాలి అందుకే ఈ పని. అలాగే అందరినీ కలవడం నాకు ఇష్టం" అని మోరిటా నవ్వుతూ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)