‘భారత్ ఎలాంటి భ్రమల్లో ఉండకూడదు’ అని ఆసిమ్ మునీర్ ఎందుకన్నారు?

ఫొటో సోర్స్, ISPR
పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ భారత్ విషయంలో చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయమవుతున్నాయి.
పాకిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రక్షణ దళాల ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
"భారత్ ఎలాంటి భ్రమలో ఉండకూడదు. ఈ సారి పాకిస్తాన్ ప్రతిస్పందన మరింత కఠినంగా ఉంటుంది. మరింత వేగంగా స్పందిస్తుంది" అని అన్నారు.
ఈ ప్రకటనపై భారత్ ఇంకా స్పందించలేదు.
ఏప్రిల్‌లో కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యటకులు మరణించారు. ఆ తర్వాత మే 7న పాకిస్తాన్‌లోని అనేక "ఉగ్రవాద స్థావరాలను" భారత్ లక్ష్యంగా చేసుకుంది.


ఫొటో సోర్స్, Getty Images
జై శంకర్ ఏమన్నాంటే...
ఆ తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ జరిగింది. దానికి భారత్ "ఆపరేషన్ సిందూర్" అని పేరు పెట్టింది.
రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణల తర్వాత కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈ వివాదంలో తామే పైచేయి సాధించామని రెండు దేశాలు చెప్పాయి.
ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ సైన్యం గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల చేసిన ప్రకటనపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ ఆదివారం(డిసెంబరు 7)స్పందించారు.
రెచ్చగొట్టే, నిరాధారమైన, బాధ్యతారహితమైన ప్రకటనను పాకిస్తాన్ పూర్తిగా ఖండిస్తోందని అన్నారు.
శనివారం(డిసెంబరు 6) జరిగిన ఒక కార్యక్రమంలో ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌కు సంబంధించిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిస్తూ భారత్ ఎదుర్కొంటున్న చాలా సమస్యలు పాకిస్తాన్ సైన్యం వల్లే ఉత్పన్నమవుతాయని అన్నారు.
ఉగ్రవాదం, శిక్షణ శిబిరాలు, భారత్ వ్యతిరేక భావజాలం అన్నీ పాకిస్తాన్ సైన్యానికి సంబంధించినవని జై శంకర్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ISPR
అఫ్గాన్ తాలిబన్లపై మాట్లాడిన ఆసిమ్ మునీర్
ఇటీవల పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో సైనిక ఘర్షణలు జరిగాయి. పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ ఉద్రిక్తతలపై ఆసిమ్ మునీర్ స్పందించారు. కాబూల్‌లోని అఫ్గాన్ తాలిబన్ పాలనకు స్పష్టమైన సందేశం పంపామని అన్నారు.
ఆసిమ్ మునీర్ తన ప్రసంగంలో తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) లేదా పాకిస్తాన్..ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవడం తప్ప అప్గాన్ తాలిబన్లకు వేరే మార్గం లేదని సందేశం ఇచ్చినట్టు పాకిస్తాన్ టీవీ తెలిపింది.
తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)పై పాకిస్తాన్‌లో నిషేధం ఉంది.
"కొత్తగా నిర్మించిన రక్షణ దళాల ప్రధాన కార్యాలయం చరిత్రాత్మకమైనది" అని ఆసిమ్ మునీర్ అన్నారు.
"పెరుగుతున్న, మారుతున్న ముప్పుల దృష్ట్యా, మూడు సేవలు ఒకే వ్యవస్థ కింద మల్టీ-డొమైన్ ఆపరేషన్లను మరింత మెరుగుపరచడం చాలా ముఖ్యం" అని ఆయన అన్నారు.
ఈ మార్పు దిశగా రక్షణ దళాల ప్రధాన కార్యాలయాన్ని నిర్మించడం ఒక ముఖ్యమైన అడుగు అని తెలిపారు.

ఫొటో సోర్స్, ISPR
ఆసిమ్ మునీర్ ఏయే పదవుల్లో ఉన్నారంటే...
"పాకిస్తాన్ శాంతిని ఇష్టపడే దేశమని నేను మరొక్కసారి చెబుతున్నా. అయితే, పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను బెదిరించడానికి, మన ఉద్దేశాలను పరీక్షించడానికి ఎవరికీ అనుమతి ఉండదు. పాకిస్తాన్ భావజాలం అజేయమైనదని, ధైర్యవంతులైన యోధులతో, ఐక్యతతో దృఢ సంకల్పంతో దేశానికి రక్షణ లభిస్తుందని అందరూ తెలుసుకోవాలి" అని ఆర్మీ చీఫ్ అన్నారు.
ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరై రక్షణ వ్యూహంలోని వివిధ అంశాలపై చర్చించారు.
పాకిస్తాన్ సాయుధ దళాలు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని, ఉమ్మడి కార్యకలాపాల ద్వారా జాతీయ భద్రతను నిర్ధారించాలని ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అన్నారు.
గత వారం ప్రభుత్వం జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఫీల్డ్ మార్షల్ మునీర్ ఐదేళ్ల కాలానికి మొదటి సీడీఎఫ్‌గా కొత్త పదవిని చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
2030వరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ స్టాఫ్ పదవిలో
27వ రాజ్యాంగ సవరణ, పాకిస్తాన్ ఆర్మీ, వైమానిక దళం, నేవీ (సవరణ) బిల్లు 2025లో చేసిన మార్పుల తర్వాత గత నెలలో సీడీఎఫ్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ స్టాఫ్) ఏర్పడింది.
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ నెల నాలుగోతేదీన ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను ఆర్మీ స్టాఫ్ చీఫ్, డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్‌గా నియమించడానికి ఆమోదం తెలిపారు.
పాకిస్తాన్ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పదవీకాలం ఐదేళ్లు.
అంటే ఆయన పదవీకాలం 2030లో ముగుస్తుంది.
జనరల్ ఆసిమ్ మునీర్ నవంబరు 2022లో ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు.
పాకిస్తాన్ ఆర్మీ చట్టంలో సవరణ తర్వాత ఆర్మీ చీఫ్ పదవీకాలం మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెరిగింది.
ఆర్మీ చీఫ్‌గా ఆయన పదవీకాలం నవంబరు 2027లో ముగియనుంది.
27వ సవరణ తర్వాత ఆర్మీ చీఫ్ రక్షణ దళాల అధిపతిగాఉన్నారు. రాబోయే ఐదేళ్లపాటు ఆయన రక్షణ దళాల అధిపతి, సైనిక దళాల అధిపతిగా ఉంటారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














