హిందువులు, కశ్మీర్ గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నారు? పాకిస్తాన్, భారత్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?

ప్రవాసీ పాకిస్తానీయులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్

ఫొటో సోర్స్, YouTube/@ISPR

ఫొటో క్యాప్షన్, ప్రవాసీ పాకిస్తానీయులను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కశ్మీర్, హిందువుల గురించి చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌, భారత్‌లో చర్చ జరుగుతోంది.

ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రవాస పాకిస్తానీల సదస్సు-2025 కార్యక్రమానికి అసిమ్ మునీర్ హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసిమ్ మునీర్ ద్విదేశ సిద్ధాంతం, బలూచిస్తాన్, భారత ఆర్మీ, కశ్మీర్, హిందువుల గురించి వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై భారత మీడియా చాలా వార్తలు ప్రచురించింది.

ఆయన వ్యాఖ్యలపై అనేక మంది అగ్ర నాయకులు, జర్నలిస్టులు, సామాన్య ప్రజలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

మరోవైపు, మునీర్ వ్యాఖ్యలపై పాకిస్తాన్‌లోనూ జోరుగా చర్చ జరుగుతోంది.

బలూచిస్తాన్‌పై ఆయన వ్యాఖ్యలను బలూచ్ అమెరికన్ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అసిమ్ మునీర్ ఫైల్ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అసిమ్ మునీర్ ఫైల్ ఫోటో

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నారు?

ప్రవాస పాకిస్తానీల సదస్సు 2025లో అసిమ్ మునీర్ మాట్లాడుతూ, పాకిస్తాన్ ప్రజలంతా తమ పిల్లలకు తమ దేశ కథను చెప్పాలని, దాని వల్ల పిల్లలు పాకిస్తాన్ కథను మర్చిపోరన్నారు.

హిందువుల గురించి ప్రస్తావిస్తూ, ‘‘మనం అన్నికోణాలలోనూ హిందువులకు భిన్నమని మన పూర్వీకులు భావించారు. మన మతం వేరు, ఆచార వ్యవహారాలు వేరు. మన సంస్కృతి వేరు, మన ఆలోచనా విధానం వేరు. మన ఆశయాలు కూడా వేరు. ద్విదేశ సిద్ధాంతానికి ఇదే మూలం’’ అన్నారు.

ద్విదేశ సిద్ధాంతానికి ముస్లిం లీగ్ మద్దతు ఇచ్చింది. దీని ప్రకారం, భారత ఉపఖండంలోని హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలు. దీని ఆధారంగానే పాకిస్తాన్ ఏర్పాటు డిమాండ్ వచ్చింది.

''మనవి రెండు దేశాలు, ఒక దేశం కాదు. ఈ దేశం కోసం మన పూర్వీకులు త్యాగాలు చేశారు. ఈ దేశాన్ని నిర్మించడం కోసం వారు చాలా త్యాగాలు చేశారు. ఈ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో మనకు తెలుసు'' అని జనరల్ మునీర్ అన్నారు.

అయితే తూర్పు పాకిస్తాన్ విముక్తి పోరాటం తరువాత 1971లో బంగ్లాదేశ్ ఏర్పడటంతో ద్విదేశ సిద్ధాంతంపై ప్రశ్నలు తలెత్తాయి.

అసిమ్ మునీర్

ఫొటో సోర్స్, YouTube/@ISPR

జనరల్ మునీర్ తన ప్రసంగంలో భారత ఆర్మీ గురించి కూడా ప్రస్తావించారు.

''దేశంలో అక్కడక్కడ జరిగే తీవ్రవాద కార్యకలాపాలను చూపి, పాకిస్తాన్‌కు పెట్టుబడులు రావని ప్రచారం చేస్తున్నవారంతా నేను చెప్పేది స్పష్టంగా వినాలి. మా దేశ భవితను తీవ్రవాదం మా నుంచి లాక్కోగలదని మీరు భావిస్తున్నారా? 13 లక్షల సామర్థ్యం ఉన్న భారత సైన్యమే మమ్మల్ని భయపెట్టలేదు. అలాంటిది తీవ్రవాదులు పాకిస్తాన్ సైన్యాన్ని అణచగలరా?’’

‘‘బలూచిస్తాన్ పాకిస్తాన్ అదృష్టం. అది పాకిస్తాన్ నుదుటిపై పాపిటబిళ్లలాంటిది. మీ 1500 (బీఎల్, బీఎల్‌ఎఫ్, బీఆర్‌ఏ సభ్యులు) మంది దాన్ని తీసుకుంటామని అంటున్నారు. మీ తర్వాతి 10 తరాలు కూడా దాన్ని పొందలేరు. మీరు చూస్తూ ఉండండి. అతి త్వరలో మేం ఈ తీవ్రవాదులను ఓడిస్తాం'' అని మునీర్ వ్యాఖ్యానించారు.

జనరల్ మునీర్, కశ్మీర్ గురించి ప్రస్తావిస్తూ, కశ్మీర్‌పై పాకిస్తాన్ సైన్యం, సర్కారు వైఖరి స్పష్టంగా ఉందన్నారు.

''కశ్మీర్ పట్ల మా వైఖరి స్పష్టం. మేం దాన్ని మర్చిపోం. భారత ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్న మా కశ్మీరీ సోదరులను మేం మర్చిపోం'' అని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్‌లో ఏం చర్చ జరుగుతోంది?

మునీర్ వ్యాఖ్యలపై బలూచ్ అమెరికన్ కాంగ్రెస్ స్పందించింది. పాకిస్తాన్ ఆర్మీ మర్యాదగా బలూచిస్తాన్‌ను వదిలి వెళ్లాలని సూచించింది.

మీరు బలూచ్ ప్రజలను అణచివేయడం కొనసాగిస్తే తదుపరి పరిణామాలు గతంలో కంటే చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది జనరల్ మునీర్‌ను సమర్థించారు.

జనరల్ మునీర్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ జర్నలిస్ట్ గులామ్ అబ్బాస్ షా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేశారు.

బలూచిస్తాన్ పట్ల పాక్ నిబద్ధతను జనరల్ అసిమ్ మునీర్ చాటిచెప్పారని వ్యాఖ్య జోడించారు. పాక్ గమ్యస్థానం బలూచిస్తాన్ అని రాసుకొచ్చారు.

అనుమ్ ఫాతిమా అనే మరో యూజర్ ట్విట్టర్‌లో జనరల్ మునీర్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తీవ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటానని తన ప్రసంగం ద్వారా మునీర్ చాటిచెప్పారని అనుమ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రియాంక చతుర్వేది

భారత్‌లో ఏమన్నారు?

భారత మీడియాలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ ప్రసంగానికి సంబంధించిన చాలా వార్తలు వచ్చాయి. దీనిపై చాలామంది స్పందించారు.

భారత్, పాకిస్తాన్ అనేవి రెండు వేర్వేరు దేశాలని జనరల్ మునీర్ సరిగ్గా చెప్పారని శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. ఈ రెండు దేశాల ఆశయాలు కూడా భిన్నమని ఆమె ట్వీట్ చేశారు.

''వరల్డ్ లీడర్ కావడం, వారధులు నిర్మించడమే మా లక్ష్యం. పాకిస్తాన్ మాత్రం తీవ్రవాదులకు గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని, వారధులను బాంబులతో కూల్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది'' అని ట్వీట్‌లో ఆమె పేర్కొన్నారు.

హిందువులను, భారతదేశాన్ని తాను ద్వేషిస్తున్నట్లు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ స్పష్టంగా చెప్పాడని భారత ఆర్మీ మాజీ అధికారి మేజర్ మదన్ కుమార్ అన్నారు.

జనరల్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలు తనను నిరాశపరిచాయని మరో రిటైర్డ్ భారత ఆర్మీ అధికారి ప్రవీణ్ సాహ్ని అన్నారు.

జనరల్ మునీర్ వ్యాఖ్యలు సిగ్గుచేటని జర్నలిస్ట్ తాహా సిద్ధిఖీ ట్వీట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)