భారత్‌కు తహవ్వుర్ రాణా అప్పగింత.. 26/11ముంబయి దాడులలో అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, @NIA_India
ముంబయి దాడుల నిందితుడు తహవ్వుర్‌రాణాను అమెరికా భారత్‌కు అప్పగించింది.
ముంబయి దాడులకు బాధ్యుడైన తహవ్వుర్ రాణాను అమెరికా గురువారం అప్పగించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది.
అప్పగింత ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు రాణా.. అమెరికాలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని ఎన్ఐఏ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాణాకు చట్టపరంగా ఉన్న దారులన్నీ మూసుకుపోవడంతో ఆయన అప్పగింత సాధ్యపడిందని తెలిపింది.
తహవ్వూర్ రాణా 2013లో ఆయన స్నేహితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీతో కలిసి ముంబై దాడులకు పాల్పడినందుకు, డెన్మార్క్‌లో దాడికి ప్రణాళిక వేసినందుకు అమెరికాలో ఆయన దోషిగా తేలారు.
ఈ కేసుల్లో, తహవ్వూర్ హుస్సేన్ రాణాకు అమెరికా కోర్టు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.


ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/Getty Images
ఆ రోజు ముంబయిలో ఏం జరిగింది?
భారీగా ఆయుధాలు ధరించి శిక్షణ పొందిన పది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబయిలోని అనేక ప్రదేశాలు, ప్రసిద్ధ భవనాలపై దాడులు చేశారు. ఈ దాడులు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. 160 మందికి పైగా మరణించారు.
ముంబయి నగరం 2008 నవంబర్ 26వ తేదీ రాత్రి, అకస్మాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. దాడి చేసిన వ్యక్తులు ముంబయిలోని రెండు ఫైవ్ స్టార్ హోటళ్ళు, ఒక ఆసుపత్రి, రైల్వే స్టేషన్లు, ఒక యూదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
మొదట్లో ఇంత పెద్ద దాడి జరిగుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ క్రమంగా దాడి తీవ్రత అర్థమయింది.
నవంబర్ 26వతేదీ రాత్రి, ఉగ్రవాద నిరోధక దళం చీఫ్ హేమంత్ కర్కరే సహా ముంబయి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
లియోపోల్డ్ కేఫ్, ఛత్రపతి శివాజీ టెర్మినల్ వద్ద ప్రారంభమైన ఈ మారణకాండ తాజ్ మహల్ హోటల్ వద్ద ముగిసేలోపు దీనిని ఆపేందుకు భద్రతా సిబ్బందికి 60గంటల సమయం పట్టింది. 160మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, PAL PILLAI/Getty Images
లియోపోల్డ్ కేఫ్
దాడిచేయడానికి వచ్చినవారు రెండు గ్రూపులుగా విడిపోయినట్టు ముంబయి పోలీసులు, దర్యాప్తు అధికారులు చెప్పారు.
వీరిలో ఇద్దరు వ్యక్తులు లియోపోల్డ్ కేఫ్‌లోకి చేరుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ కేఫ్‌కి ఎక్కువగా విదేశీయులు వస్తుంటారు.
అక్కడ ఉన్న ప్రజలకు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే వారు విచక్షణారహితంగా తూటాలు పేల్చి అక్కడి నుంచి పారిపోయారు.
అధికారిక గణాంకాల ప్రకారం, లియోపోల్డ్ కేఫ్‌లో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు.

ఫొటో సోర్స్, Supriya
ఛత్రపతి శివాజీ టెర్మినస్
రద్దీగా ఉండే ఈ రైల్వే స్టేషన్‌లో బీభత్సం జరిగింది.
దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ కూడా ఒకటి .
ఆ సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు.
దుండగులు ఒక్కసారిగా విచక్షణారహితంగా తూటాలు పేల్చారు.
ఈ కాల్పుల్లో అజ్మల్ అమీర్ కసబ్, ఇస్మాయిల్ ఖాన్ పాల్గొన్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు.
తరువాత అజ్మల్ అమీర్ కసబ్ పట్టుబడ్డారు కానీ ఇస్మాయిల్ ఖాన్ చనిపోయారు.
ఈ కాల్పుల్లో 58 మంది మరణించారు.

ఫొటో సోర్స్, Hindustan Times/Getty Images
ది ఓబెరాయ్ హోటల్
ఒబెరాయ్ హోటల్ వ్యాపార వర్గాలలో బాగా పేరొందింది.
పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రితో దుండగులు ఈ హోటల్‌లోకి ప్రవేశించారు.
ఆ సమయంలో అక్కడ 350 మందికి పైగా ఉన్నారని భావిస్తున్నారు.
వారిలో చాలా మందిని దుండగులు బందీలుగా చేసుకున్నారు.
దాడి చేసిన ఇద్దరు దుండగులను జాతీయ భద్రతా దళ సిబ్బంది హతమార్చారు.

ఫొటో సోర్స్, Uriel Sinai/Getty Images
తాజ్ మహల్ హోటల్
తాజ్ మహల్ హోటల్‌లో చెలరేగిన అగ్నిప్రమాదం ప్రజల గుండెల్లో అలానే ఉంది.
కాల్పులు, పేలుళ్ల మధ్య, తాజ్ మహల్ హోటల్ కాలిపోవడాన్ని వారింకా మరచిపోలేరు.
ఈ భవనం 105 సంవత్సరాల పురాతనమైనది.
గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఉన్న ఈ హోటల్‌కి ఎక్కువగా విదేశీ పర్యటకులు వస్తుంటారు. ఇక్కడి నుంచి సముద్ర తీరం కూడా కనిపిస్తుంది.
హోటల్‌పై దాడి జరిగినప్పుడు, భోజన సమయం కావడంతో అక్కడ చాలా మంది గుమిగూడి ఉన్నారు. అప్పుడు దుండగులు అకస్మాత్తుగా కాల్పులు మొదలుపెట్టారు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, తాజ్ మహల్ హోటల్‌లో 31 మంది మరణించారు.
దాడి చేసిన నలుగురు వ్యక్తులు భద్రతా సిబ్బంది చేతిలో చనిపోయారు.

ఫొటో సోర్స్, Uriel Sinai/Getty Images
కామా హాస్పిటల్
కామా హాస్పిటల్ అనేది ఓ చారిటీ ఆసుపత్రి, దీనిని 1880లో ఒక సంపన్న వ్యాపారవేత్త నిర్మించారు.
ముంబయి పోలీసుల కథనం ప్రకారం, నలుగురు దుండగులు ఒక పోలీసు వ్యాన్‌ను హైజాక్ చేసి, ఆపై ఆపకుండా కాల్పులు జరిపారు.
ఈ క్రమంలో వారు ఆసుపత్రిలోపలికి కూడా ప్రవేశించారు.
ఆసుపత్రి బయట జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాద నిరోధక దళం అధిపతి హేమంత్ కర్కరే, ముంబయి పోలీసులకు చెందిన అశోక్ కామ్టే, విజయ్ సలాస్కర్ మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
నారిమన్ హౌస్
దుండగులు నారిమన్ హౌస్‌ను కూడా లక్ష్యంగా చేసుకున్నారు.
దీనిని చాబాద్ లుబావిచ్ సెంటర్ అని కూడా పిలుస్తారు.
నారిమన్ హౌస్‌లో కూడా అనేక మందిని బందీలుగా చేసుకున్నారు దుండగులు.
ఈ భవనం యూదులకు సహాయం చేయడానికి నిర్మించిన కేంద్రం, ఇక్కడ యూదు పర్యటకులు కూడా తరచుగా బస చేసేవారు.
ఈ కేంద్రంలో యూదు గ్రంథాల లైబ్రరీ, ప్రార్థనా స్థలం కూడా ఉన్నాయి.
దుండగుల ఆట కట్టించేందుకు ఎన్ఎస్‌జీ కమాండోలు ఈ భవనం పక్కనున్న భవనంపైకి హెలికాప్టర్ నుంచి దిగారు. ఎస్ఎస్‌జీ కాల్పుల్లో దుండగులు మరణించారు. అయితే దుండుగుల అదుపులోని బందీలు కూడా చనిపోయారు. ఆ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు వ్యక్తులు, ఇద్దరు దుండగులు మరణించారు.
చాబాద్ హౌస్‌పై జరిగిన దాడిలో, దానిని నడిపిన గావ్రియల్, ఆయన భార్య రివ్కా కూడా మరణించారు. వారి రెండేళ్ల కుమారుడు మోషేను రక్షించారు. ఈ దాడిలో ఆరుగురు యూదులు మరణించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














