పాకిస్తానీలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఈ భారత యువ క్రికెటర్ ఎవరు.. ఎందుకు?

అభిషేక్ శర్మ, పాకిస్తాన్, టీ20, యువరాజ్‌సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఇరవై తొమ్మిది టీ20 మ్యాచ్‌లు.. 37.48 సగటుతో 1,012 పరుగులు. 189.51 స్ట్రైక్ రేట్.

పాకిస్తాన్ ప్రజలు ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా వెతికిన క్రికెటర్‌గా నిలిచిన బ్యాటర్ గణాంకాలు ఇవి.

తన బ్యాటింగ్‌తో కేవలం ఒకటిన్నర సంవత్సరాలలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న అభిషేక్ శర్మకు భారత్‌లోనే కాదు, పాకిస్తాన్‌లోనూ అభిమానులున్నారు.

పాకిస్తానీలు గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆటగాళ్ళలో బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, హారిస్ రవూఫ్ వంటి ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్లు టాప్ 10లో కూడా చోటు దక్కించుకోలేకపోయారు.

ఈ జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత, క్రికెటర్ హసన్ నవాజ్ రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, సాహిబ్‌జాదా ఫర్హాన్, మహ్మద్ అబ్బాస్ ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అభిషేక్ శర్మ, పాకిస్తాన్, టీ20, యువరాజ్‌సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అభిషేక్‌శర్మ

39 బంతుల్లో 74 పరుగులు

ఈ ఏడాది అభిషేక్ శర్మ అనేక కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతను 40.75 సగటుతో సుమారు 161 స్ట్రైక్ రేట్‌తో 163 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను భారత్ 2-1తేడాతో గెలుచుకుంది.

ఆసియా కప్‌లో ఆయన పాకిస్తాన్‌పై కేవలం 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి భారత్‌ను విజయపథంలో నడిపించాడు. ఆ తర్వాత అతను టీ20ల్లో ఎదుగుతున్న స్టార్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు.

భారత్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్ భారత ఓపెనర్లతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.

రవూఫ్, అభిషేక్ శర్మ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంపైర్ జోక్యం చేసుకోవలసి వచ్చింది.

ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను సిక్స్‌తో ప్రారంభించి 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 6 ఫోర్లు 5 సిక్సర్లు కొట్టాడు.

"వాళ్లు (పాకిస్తాన్ ఆటగాళ్లు) ఎలాంటి కారణం లేకుండా మాతో అలా ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదు. అందుకే నేను అలా బ్యాటింగ్ చేశాను" అని మ్యాచ్ తర్వాత అభిషేక్ శర్మ చెప్పాడు.

అభిషేక్ శర్మ, పాకిస్తాన్, టీ20, యువరాజ్‌సింగ్

ఫొటో సోర్స్, Matt Roberts - CA/Cricket Australia via Getty Images

తండ్రి భావోద్వేగం

ఆ మ్యాచ్ తర్వాత బీబీసీ ప్రతినిధి భరత్ శర్మ అభిషేక్‌శర్మ తండ్రితో మాట్లాడారు.

"నేను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాను. నా సహచరులందరూ భారతదేశం తరపున ఆడారని నేను మా అమ్మకు చెప్తుండేవాణ్ని. కానీ నేను ఆడలేకపోయాను. ఎందుకు ఆడలేకపోయానో నాకు తెలియదు. బహుశా విధిరాత కావొచ్చు. కానీ మా అమ్మ ''నువ్వు ఆడలేదు, కానీ నీ కొడుకు ఖచ్చితంగా భారతదేశం తరపున ఆడతాడు'' అని సమాధానం ఇచ్చేవారు అని రాజ్ కుమార్ శర్మ బీబీసీతో చెపపారు.

ఆ రోజుల గురించి మాట్లాడుతూ రాజ్ కుమార్ శర్మ భావోద్వేగానికి లోనయ్యారు.

"ఇది నాకు చాలా అద్భుతమైన సమయం. గర్వకారణమైన క్షణం. ప్రతి తల్లిదండ్రులు తమ కొడుకు లేదా కూతురు తమ కాళ్లపై తాము నిలబడాలని, తాము ఎంచుకున్న ఏ రంగంలోనైనా రాణించాలని కోరుకుంటారు" అని ఆయన అన్నారు.

"మా అబ్బాయి చాలా సంవత్సరాల క్రితం బ్యాట్ పట్టుకున్నాడు. బాగా కష్టపడ్డాడు. ఇప్పుడు అతను భారతదేశం తరపున ఆడుతున్నాడు. మ్యాచ్‌లను కూడా గెలుస్తున్నాడు. ఇది చూసి నా హృదయం ఉప్పొంగుతోంది'' అని రాజ్‌కుమార్‌ శర్మ ఆనందం వ్యక్తంచేశారు.

అభిషేక్ శర్మ, పాకిస్తాన్, టీ20, యువరాజ్‌సింగ్

ఫొటో సోర్స్, CA/Cricket Australia via Getty Images

యువరాజ్, సెహ్వాగ్ శైలి

అభిషేక్‌శర్మలో క్రికెట్ నిపుణులు వీరేంద్ర సెహ్వాగ్ దూకుడును, యువరాజ్ సింగ్ సొగసైన బ్యాటింగ్‌ను చూస్తున్నారు.

ముఖ్యంగా అభిషేక్ శర్మను యువరాజ్ సింగ్ ఆకట్టుకున్నాడు. రంజీ ట్రోఫీ సమయంలో వారిద్దరూ కలుసుకున్నారు.

అభిషేక్, శుభ్‌మన్‌లకు రంజీ ట్రోఫీలో అవకాశం ఇవ్వాలని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కోరుకుంది. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్ సింగ్ భారత జట్టులోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, బీసీసీఐ సూచనల మేరకు రంజీ ట్రోఫీలో ఆడడానికి వచ్చిన సమయంలో ఇది జరిగింది.

యువరాజ్ సింగ్‌కి అండర్-19 జట్టు నుంచి ఇద్దరు అబ్బాయిలు వస్తున్నారని చెప్పారు. ఒకరు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అని, మరొకరు ఎడమచేతి వాటం స్పిన్నర్ అని చెప్పారు.

"తన దగ్గర ఇప్పటికే బౌలర్లు ఉన్నందున తనకు బ్యాట్స్‌మన్ అవసరమని యువరాజ్ చెప్పాడు" అని రాజ్ కుమార్ శర్మ గుర్తుచేసుకున్నారు.

అభిషేక్ శర్మ, పాకిస్తాన్, టీ20, యువరాజ్‌సింగ్

ఫొటో సోర్స్, RAJ KUMAR SHARMA

ఫొటో క్యాప్షన్, తండ్రి రాజ్ కుమార్ శర్మతో అభిషేక్ శర్మ

‘శిక్షణ ఇస్తోంది యువరాజ్.. ఇది ప్రారంభం మాత్రమే’

''సెలెక్టర్లు ఇద్దరికీ అవకాశం ఇవ్వాలని అన్నారు. ఒక మ్యాచ్‌లో ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను ముందుగానే అవుటయ్యారు. యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. తర్వాత అభిషేక్ క్రీజులోకి వచ్చాడు. యువరాజ్ చూస్తూనే ఉన్నాడు. యువరాజ్ సింగ్ 40పరుగుల దగ్గర ఉండగానే అభిషేక్ వేగంగా ఆడుతూ 100 పరుగులు చేశాడు" అని రాజ్‌కుమార్ శర్మ తెలిపారు.

‘దాంతో.. ‘నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటావా’ అని అభిషేక్‌శర్మను యువరాజ్‌సింగ్ కోరాడు. యువరాజ్‌ తనకు స్ఫూర్తి అని.. ఆయన్ను చూసే ఆడటం నేర్చుకున్నానని అభిషేక్ చెప్పడంతో అప్పటి నుంచి యువరాజ్ అభిషేక్‌కు శిక్షణ ఇస్తున్నాడు’ అని రాజ్ కుమార్ శర్మ చెప్పారు.

"అభిషేక్‌కు శిక్షణ ఇచ్చేది యువరాజ్. నా కొడుకును పూర్తిగా చూసుకునేది అతనే. అభిషేక్‌ను యువరాజ్ మానసికంగా, శారీరకంగా బలంగా మార్చాడు. ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్ శిక్షణ ఇస్తే, ఒక ఆటగాడు ఎంత దూరం వెళ్ళగలడో ఊహించుకోండి. ఇది ప్రారంభం మాత్రమే" అని అభిషేక్‌శర్మ తండ్రి వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)