మానవ అక్రమ రవాణా: జపాన్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ పాకిస్తానీ నకిలీ ఫుట్‌బాల్ క్లబ్, ఎలా దొరికింది?

మానవ అక్రమ రవాణా, పాకిస్తాన్, జపాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎహతేశామ్ శామీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అహ్మద్ ( పేరు మార్చాం) ఈయేడాది జూన్ 15న సియాల్‌కోట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జపాన్‌లోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఒక పాకిస్తానీ ఫుట్‌బాల్ క్లబ్‌లో సభ్యుడు.

22 మంది ఆటగాళ్ల ఆ బృందంలోని అందరూ క్లబ్ యూనిఫామ్‌లు ధరించి ఉన్నారు. పాకిస్తాన్‌లోని ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ చెక్స్ సాఫీగా పూర్తిచేసుకుని జపాన్ చేరుకోవడంతో ఆనందంగా ఉన్నారు.

వీరు పాకిస్తాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు తమను ‘గోల్డెన్ ఫుట్‌బాల్ ట్రయల్’ అనే క్లబ్ ఆటగాళ్లమని తెలిపారు. జపాన్‌లోని పలు క్లబ్‌లతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడి, తిరిగి వస్తామని చెప్పారు. వీరందరికీ జపాన్ వీసాలు కూడా జారీ అయ్యాయి.

ఎఫ్‌ఐఏ (ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) గుజ్రన్‌వాలా రీజనల్ డైరెక్టర్ మహ్మద్ బిన్ అష్రఫ్ చెప్పినదాని ప్రకారం, అహ్మద్ తన వాంగ్మూలంలో, తాను మిగతా సభ్యులంతా జూన్ 15న ఎఫ్‌జెడ్ 338 విమానంలో సియాల్‌కోట్ నుంచి బయలుదేరామని చెప్పాడు. పాకిస్తాన్‌లో ఎలాంటి సమస్య లేకుండా వారికి ఫ్లైట్ అనుమతి లభించింది.

విమాన ప్రయాణంలో వీరు ఫోటోలు తీసుకుంటూ, సరదాగా గడిపారు. కానీ కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఒసాకా) చేరుకున్న వెంటనే, జపాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని పక్కకు తీసుకెళ్లి ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిని వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లి ప్రశ్నించారు.

అహ్మద్ చెప్పినదారి ప్రకారం...జపాన్ అధికారులు వారి పాస్‌పోర్టులు, స్పోర్ట్స్ పేపర్లు స్వాధీనం చేసుకుని ఆన్‌లైన్‌లో చెక్ చేశారు. కొందరు అధికారులు ఫోన్ కాల్స్ కూడా చేశారు.

"మమ్మల్ని వేర్వేరు గదుల్లో పెట్టి, డాక్యుమెంట్ల పరిశీలన పూర్తయ్యే వరకు బయటకు రావద్దని చెప్పారు" అని అహ్మద్ తెలిపాడు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మానవ అక్రమ రవాణా

ఫొటో సోర్స్, FIA

ఐదారు గంటల పాటు విచారణ అనంతరం, వారిని దేశంలోకి అనుమతించలేమని చెప్పి జపాన్ అధికారులు వారిని తిప్పి పంపించారు. పాస్‌పోర్టులు, పేపర్లు ఫ్లైట్ మేనేజర్‌కు ఇచ్చి, ఎఫ్‌జెడ్ 337 విమానంలో పాకిస్తాన్‌కు పంపారు.

‘‘మేం పాకిస్తాన్ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఎఫ్‌ఐఏ అధికారులు మమ్మల్ని అదుపులోకి తీసుకుని, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. స్టేట్‌మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత ఇళ్లకు వెళ్లనిచ్చారు’’ అని అహ్మద్ వెల్లడించాడు.

ఈ 22 మంది యువకుల తప్పుడు స్టేట్‌మెంట్లు, అనుమానాస్పద ప్రవర్తన, టూర్‌కు గల కారణాలు సరిగ్గా చెప్పలేకపోవడంవంటి కారణాలతో వారిని డిపోర్ట్ చేశామని జపాన్ అధికారులు తమ చెక్‌షీట్లలో రాశారు.

తర్వాత జరిపిన దర్యాప్తులో వీరు అసలు ఆటగాళ్లే కాదని, వాళ్లు చూపించిన పేపర్లన్నీ నకిలీవని ఎఫ్‌ఐఏ గుర్తించింది.

మానవ అక్రమ రవాణాలో భాగంగా వీరిలో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.40 లక్షలు వసూలు చేసి, వీరిని జపాన్ చేర్చడానికి ప్రయత్నించారని తేలింది.

జపాన్ ప్రయాణానికి ముందు వీరికి ఫుట్‌బాల్‌లో ప్రాథమిక శిక్షణ ఇచ్చి, ఇమ్మిగ్రేషన్ దగ్గర అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేలా తయారుచేసినట్లు తెలిసింది.

పాకిస్తాన్, జపాన్, ఫుట్‌బాల్ క్లబ్ , మానవ అక్రమ రవాణా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ( ప్రతీకాత్మక చిత్రం)

ఈ ఘటనపై ప్రభుత్వం ఎఫ్‌ఐఏలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మానవ అక్రమ రవాణాలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి ఇటీవలే అరెస్టయ్యాడు.

ప్రాథమిక దర్యాప్తులో "గోల్డెన్ ఫుట్‌బాల్ ట్రయల్" అనే నకిలీ క్లబ్ పేరిట పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అనుబంధ పత్రాలు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరణ పత్రాలు నకిలీగా తయారు చేసినట్లు బయటపడింది. వీటి సాయంతోనే జపాన్ ఎంబసీ నుండి వీసాలు పొందారు.

ఎఫ్‌ఐఏ తరువాత పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సంప్రదించగా, ఆ క్లబ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, అందిన పత్రాలు నకిలీవని ఫెడరేసన్ స్పష్టం చేసింది.

ఎఫ్‌ఐఏ అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఇదే గ్యాంగ్ ఈ సంవత్సరం జనవరి 1న కూడా ఇలాగే నకిలీ జట్టు పేరుతో కొందరిని జపాన్‌కి పంపింది.

మానవ అక్రమ రవాణాలో పాల్గొంటున్న మిగత వ్యక్తుల కోసం అధికారులు నిందితుడి నుంచి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. నకిలీ పత్రాలను సృష్టించడం కోసం వాడిన ప్రింటర్లు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మానవ అక్రమ రవాణా, పాకిస్తాన్, ఫుట్‌బాల్ క్లబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫుట్‌బాల్ ఆట (ప్రతీకాత్మక చిత్రం)

మానవ అక్రమ రవాణా కేసులను దగ్గరగా గమనించే జర్నలిస్ట్ ఇక్బాల్ మీర్జా ప్రకారం, భూ మార్గంగుండా అక్రమంగా జపాన్‌లో ప్రవేశించడం కష్టం కావడం, జలమార్గాల్లో ప్రమాదాలు పెరుగుతున్నందున, కొందరు ఇలా నకిలీ డాక్యుమెంట్లతో ప్రయత్నాలు చేస్తున్నారు.

గత రెండేళ్లలో అనేక బోటు ప్రమాదాల్లో పంజాబ్ (పాకిస్తాన్‌లోని ప్రావిన్స్) యువకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. దీంతో ప్రభుత్వ చర్యలు కఠినమవ్వడంతో నకిలీ పత్రాల ద్వారా వెళ్లే ప్రయత్నాలు పెరిగాయని ఆయన అన్నారు.

"గుజ్రన్‌వాలాలో బాడీ బిల్డింగ్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడలు ప్రాచుర్యంలో ఉన్నా, వాటి పేరుతో మానవ అక్రమ రవాణా జరగలేదు. కానీ ఫుట్‌బాల్ పేరుతో ఇలాంటి సంఘటన జరగడం షాకింగ్. దేశ గౌరవం దెబ్బతినకుండా, ఇందులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని మీర్జా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)