‘‘జనం మా 11ఏళ్ల ప్రేమను కాకుండా, శరీరాల రంగునే చూశారు’’

ఫొటో సోర్స్, Rishabh and Sonali's family
- రచయిత, విష్ణుకాంత్ తివారీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
రిషబ్ రాజ్‌పుత్, సోనాలీ చౌక్సీ నూతన దంపతులు. జబల్పూర్‌లోని తమ ఇంట్లో మధ్యాహ్నం వేళ, నిశ్శబ్ద వాతావరణంలో సోఫా మీద కూర్చొని ఒక వీడియోను వారిద్దరూ పదేపదే చూస్తున్నారు. అది తమ వివాహం మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయిన వీడియో.
నవంబర్ 23న వారి వివాహం సందర్భంగా రిషబ్ సోదరి రికార్డు చేసిన 30 సెకన్ల వీడియో అది.
రెండు రోజుల తర్వాత, అది వైరల్ అయి, లెక్కలేనన్ని వాట్సాప్ గ్రూప్‌ల నుంచి మీమ్ పేజీల వరకూ చేరింది.
ఈ వైరల్ మెసేజ్‌ల్లో వారికి వివాహ శుభాకాంక్షల మాటేమో కానీ, ఆ దంపతులిద్దర్నీ ట్రోల్ చేస్తూ వారి శరీర వర్ణం గురించి వ్యాఖ్యలే ఉన్నాయి.
ఇదేమీ తెలియని వారి కుటుంబం, వివాహ అనంతర ఆచారాల్లో తీరిక లేకుండా ఉన్నారు.


పొరుగింటి మహిళ వచ్చి ''మీ అబ్బాయి వీడియో వైరల్ అయ్యింది, మీమ్స్ కూడా చేస్తున్నారు'' అని తన తల్లికి చెప్పారని రిషబ్ అన్నారు.
''దీన్ని మొదట నేను జోక్ అనుకున్నాను. సరే, దీన్ని కొంతమంది షేర్ చేసి ఉండవచ్చనుకున్నాను. కానీ మొబైల్ చూసి షాక్ అయ్యాను'' అని చెప్పారు.
కుటుంసభ్యులు కూడా స్క్రీన్‌పై కామెంట్లు చూడటంతో అప్పటివరకూ ఉన్న సందడి వాతావరణం కాస్తా మారిపోయింది.
సోనాలీ వారందర్నీ వారిస్తూ, ''ఇద్దరు వ్యక్తుల ఆనందం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. మా ఆనందం ఆన్‌లైన్‌లో ఉన్నవారికి కనిపించలేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కృత్రిమ ప్రపంచంలో, 11 ఏళ్ల కిందట మేము చూసిన మా కల, మా ప్రేమ కనిపించకుండాపోయాయి. కేవలం మా శరీర వర్ణంపైనే దృష్టి పెట్టారు'' అని అన్నారు.
వారి జంట సరిగా నప్పలేదని, వరుడు నల్లగా ఉంటే వధువు అందంగా ఉందని, వారి వివాహం వింతగా ఉందని కామెంట్లు ఉన్నాయి.
‘‘మా పెళ్లికి నా రంగు సమస్య కావచ్చని మా చుట్టుపక్కల ఉన్నవారెవ్వరూ అంటుండగా మేము ఎప్పుడూ వినలేదు. సోషల్ మీడియాలో జనాల ఆలోచనలను చూసిన తర్వాత, ఇంటర్నెట్ ప్రపంచం ఎంత పైపై మెరుగులతో ఉంటుందో మాకు తొలిసారి అర్ధమైంది. మేము 11 సంవత్సరాలుగా ఎదురుచూసిన మా మధుర క్షణాల్ని ఇంటర్నెట్‌లో ప్రజలు అపహాస్యం చేశారు'' అని రిషబ్ అన్నారు.

ఫొటో సోర్స్, Rishabh Rajput and Sonali Chouksey
సోషల్ మీడియాలో ఊహాగానాలు...
కేవలం వారి శరీర వర్ణంపై కామెంట్లతోనే ఆగిపోలేదు. అది ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత, రిషబ్‌పై సోషల్ మీడియాలో ఊహాగానాలు, జోకులు మొదలయ్యాయి.
అతను చాలా ధనవంతుడని కొంతమంది, అతనికి ఐదు పెట్రోల్ పంపులు ఉన్నాయని మరికొంతమంది, అతనో మంత్రి కొడుకని ఇంకొందరు రాశారు.
కేవలం ప్రభుత్వం ఉద్యోగం చూసే సోనాలి ఆయనను వివాహం చేసుకున్నారని చాలామంది కామెంట్ చేశారు.
వాస్తవానికి సోనాలి, రిషబ్ ఇద్దరూ గ్రాడ్యుయేట్లు. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు.
‘‘మా వ్యక్తిగత విషయంలో సోనాలీని, నన్ను దేశవ్యాప్తంగా అపరిచితులు బహిరంగంగానే ఎగతాళి చేశారు. అదే సమయంలో, వారి వర్ణ వివక్ష మనస్తత్వం బయటపడింది'' అని రిషబ్ అన్నారు.
''అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, సోషల్ మీడియాలో జనాలు నన్ను మాత్రమే కాకుండా, నా కుటుంబాన్నీ టార్గెట్ చేయడం మొదలెట్టారు. వైరల్ అయిన వీడియో, ఫోటోల్లో ఉన్న నా తల్లి, అక్కచెల్లెళ్లు, బంధువులపైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు'' అని ఆయన చెప్పారు.
సోనాలి స్పందిస్తూ, ''ట్రోలింగ్ చేస్తున్నవారు వ్యూస్ పొందడానికి ఇదొక మార్గం మాత్రమే. కానీ చాలామంది జీవితాలకు, గోప్యతకు తీవ్రభంగం కలిగింది'' అని అన్నారు.
వైరల్ వీడియో వెనుక ఉన్న 11 సంవత్సరాల ప్రేమను విస్మరించారని ఆమె అన్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత ప్రజలకు చేరిన కథ వారి నిజమైన కథలో చాలా కొద్దిభాగం మాత్రమే.

ఫొటో సోర్స్, Rohit Lohia/BBC
వారి పరిచయం ఎలా జరిగింది?
సోనాలిని తొలిసారిగా 2014లో కాలేజీలో చూశానని రిషబ్ చెప్పారు.
''2015లో నేను ప్రపోజ్ చేశాను. పది రోజుల తర్వాత ఆమె అంగీకారం తెలిపారు. మేము ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటామని మాకు అప్పుడే తెలుసు. వైరల్ అయింది కేవలం 30 సెకెండ్ల వీడియో మాత్రమే కాదు, మా 11 ఏళ్ల ప్రయాణ ఫలితం. ఇది మేము 11 ఏళ్లుగా కష్టపడి సాకారం చేసుకున్న మా కల'' అని ఆయన అన్నారు.
''ఈ సంబంధానికి పునాది శరీరపు రంగు కాదు, అవతలి వ్యక్తి గుణగణాలు, గౌరవం'' అని చెప్పారు.
సోనాలి స్పందిస్తూ, ''ఈ సంబంధంలో ఎలాంటి బలవంతం లేదు, ఎలాంటి మోసమూ లేదు. ఇది నా సొంత నిర్ణయం. ఈ నిర్ణయంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను'' అని అన్నారు.
'జాతి వివక్ష సమాజం...'
ఇంటర్నెట్‌లో అత్యధికంగా చర్చించిన అంశం జాతి వివక్ష. దేశ సామాజిక నిర్మాణంలో దీర్ఘకాలంగా పాతుకుపోయిన ఈ వివక్ష, డిజిటల్ ప్రపంచంలోనూ అంతే స్థాయిలో స్పష్టంగా కనిపించింది.
''ఏకత్వంలో భిన్నత్వం ఉన్న భారతదేశంలో 70 నుంచి 80 శాతం మంది ప్రజలు నల్ల రంగులోనే ఉంటారు. కానీ తెలుపు రంగు ఇప్పటికీ గొప్పగా పరిగణించడం విచారకరం. ఒక వ్యక్తి రంగు మాత్రమే చూసి, వారి క్యారెక్టర్, మంచితనం లేదా ప్రవర్తన ఎలా ఉంటుందో నిర్ణయించగలమా?'' అని రిషబ్ ప్రశ్నించారు.
ఇదే విషయమై సోనాలి మాట్లాడుతూ, ''నాకు అర్థంకాని విషయమేమిటంటే, మా చర్మం రంగు గురించి ప్రజలు ఎందుకు అంతగా పట్టించుకుంటున్నారు? భారతదేశంలో వేర్వేరు వాతావరణ పరిస్థితులు, వేర్వేరు వర్ణాలు ఉన్నాయి. మరిదాన్ని అంగీకరించడానికి ఎందుకంత కష్టం? ఒకవేళ తెల్లరంగు చర్మం ఉన్న అబ్బాయి తప్పుగా ప్రవర్తించినా, నేరం చేసినా, కేవలం అతని రంగును చూసి మంచివాడిగా భావిస్తామా? రంగు మాత్రమే ఒక వ్యక్తి తాలూకు మంచితనాన్ని లేదా చెడ్డతనాన్ని నిర్ణయించగలదా?'' అని ప్రశ్నించారు.
రిషబ్, సోనాలి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ, ''ఇటువంటి సంఘటనలతో ప్రజలు కొంచెం అసౌర్యంగా భావిస్తారు. కానీ మేము ఒకరికొకరు తోడుగా నిలబడ్డాం, ఒకరికొకరు మద్దతుగా ఉన్నాం'' అని చెప్పారు.
''మా కుటుంబంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు. కొంచెం ఒప్పించడంతో అంతా అంగీకరించారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్న తొలిరోజు నుంచే దాని గురించి ఆలోచించుకున్నాం. చిన్న మొత్తాలను పొదుపు చేసుకున్నాం. కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుగా నిలబడ్డాం'' అని సోనాలి చెప్పారు.
సోనాలివైపు చూస్తూ రిషబ్, ''ఈ లోకమంతా ట్రోలింగ్ చేస్తున్నా, చాలామందికి లేనిది ఒకటి మా దగ్గర ఉంది. నాకు సోనాలి ఉంది, సోనాలికి నేను ఉన్నాను'' అని అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














