‘రొమ్ములు పట్టుకోవడం, పైజామా నాడా లాగడం అత్యాచార యత్నాన్ని నిరూపించడానికి చాలవు’ అన్న హైకోర్ట్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్ట్ ఏమంది?

హైకోర్టులు, సుప్రీంకోర్టు, మహిళ, అనుచిత వ్యాఖ్యలు, లైంగిక దాడి

ఫొటో సోర్స్, Getty Images

మహిళలపై లైంగిక నేరాల కేసుల్లో కోర్టులు చేసే అనుచిత వ్యాఖ్యలు బాధితుల కుటుంబంపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

చాలాసార్లు హైకోర్టులు చేసిన కొన్ని వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటున్నాయని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది.

శరీరాన్ని నేరుగా తాకకపోతే లైంగిక వేధింపులుగా పరిగణించలేమని ఒక హైకోర్టు వ్యాఖ్యానించింది. మైనర్లు తమ ''లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని'' మరో హైకోర్టు సలహా ఇచ్చింది.

ఇంకో హైకోర్టు తీర్పులో అయితే ఒక స్త్రీని 'చట్టవిరుద్ధమైన భార్య' , 'నమ్మకం లేని సహచరి' అని కూడా పిలిచారు.

ఇలాంటి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కఠిన వైఖరి అవలంబంచింది. మహిళల గౌరవం విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసింది. భాష, న్యాయం రెండూ సున్నితంగా ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
హైకోర్టులు, సుప్రీంకోర్టు, మహిళ, అనుచిత వ్యాఖ్యలు, లైంగిక దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలహాబాద్ హైకోర్టు

'ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడం అత్యాచారం కాదు'

అత్యాచార యత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు మార్చి 17, 2025న ఓ తీర్పు ఇచ్చింది.

మైనర్ బాలిక వక్షోజాలను పట్టుకోవడం, ఆమె పైజామా నాడా లాగడం, ఆమె దుస్తులు విప్పడానికి ప్రయత్నించడం అత్యాచార యత్నాన్ని నిరూపించడానికి సరిపోవని హైకోర్టు వ్యాఖ్యానించింది.

నిందితులపై తక్కువ తీవ్రమైన అభియోగాలు మోపాలని కూడా హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు నిర్ణయాన్ని న్యాయ నిపుణులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల నిపుణులు వ్యతిరేకించారు.

ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారించిన సుప్రీంకోర్టు డిసెంబరు 8న కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక వేధింపుల కేసుల్లో దిగువ కోర్టులు చేసే అనుచిత వ్యాఖ్యలు బాధితులపైనా, వారి కుటుంబాలపైనా, సమాజంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

అలాంటి వ్యాఖ్యలు చేయకుండా దిగువ కోర్టులకు సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయడాన్ని పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

"మార్గదర్శకాలను జారీ చేయడాన్ని పరిశీలిస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు బాధితులను, వారి కుటుంబాలను ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేస్తాయి. సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతాయి" అని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జాయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం పేర్కొంది.

ఇటీవలి కాలంలో అనేక హైకోర్టులు.. లైంగిక వేధింపుల కేసుల్లో ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని, తీర్పులిస్తున్నాయని సీనియర్ న్యాయవాది శోభా గుప్తా, ఇతర న్యాయవాదులు చెప్పారు.

అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తామని, కేసు విచారణను కొనసాగించడానికి అనుమతిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

హైకోర్టులు, సుప్రీంకోర్టు, మహిళ, అనుచిత వ్యాఖ్యలు, లైంగిక దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాలిక సమ్మతి ఉన్నా పోక్సో చట్టం కింద నేరం నేరమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

లైంగిక కోరికలను అదుపులో ఉంచుకోవాలి

మైనర్లపై లైంగిక నేరాల కేసుల్లో కోర్టులు అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని చెప్తూ సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్టుకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది .

బాధితులు, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కాబట్టి కోర్టులు తమ నిర్ణయాల్లో అలాంటి వాటికి దూరంగా ఉండాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

పోక్సో చట్టంలో 'పరస్పర సమ్మతి' వంటి మినహాయింపు లేదని, మైనర్ సమ్మతి ఉన్నా నేరం నేరమేనని సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టంగా పేర్కొంది.

అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన ఆరోపణల నుంచి ఒక వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

జిల్లా కోర్టు అతనికి ఐపీసీలోని అనేక సెక్షన్లు, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద ఇరవై సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

హైకోర్టు తన తీర్పులో టీనేజ్ అమ్మాయిల లైంగిక ప్రవర్తనపై వ్యాఖ్యలు చేసింది. ''అమ్మాయిలు తమ లైంగిక కోర్కెలను నియంత్రించుకోవాలి'' అని వ్యాఖ్యానించింది.

ఇది తప్పుడు వ్యాఖ్య అని, అభ్యంతరకరమైనది అని సుప్రీంకోర్టు ఖండించింది. ఇలాంటి కేసులకు సంబంధించిన తీర్పుల్లో తగిన భాష కోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించింది.

ఈ కేసు 2018 నాటిది. పశ్చిమ బెంగాల్‌లో 14 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. తరువాత ఆమె 25 ఏళ్ల వ్యక్తి వద్ద ఉన్నట్టు తేలింది.

ఆ బాలిక తల్లి కిడ్నాప్, అత్యాచారం కేసు దాఖలు చేశారు. 2023లో హైకోర్టులో జరిగిన విచారణలో ఆ బాలిక తన ఇష్టప్రకారమే ఆయనతో వెళ్లినట్టు తెలిపింది.

హైకోర్టులు, సుప్రీంకోర్టు, మహిళ, అనుచిత వ్యాఖ్యలు, లైంగిక దాడి

ఫొటో సోర్స్, Getty Images

'చట్టవిరుద్ధమైన భార్య', 'విశ్వసనీయత లేని సహచరి'

బాంబే హైకోర్టు నిర్ణయాన్ని ఫిబ్రవరి 2025లో సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది.

2004లో, బాంబే హైకోర్టు, 'భౌసాహెబ్ బనామ్ వర్సెస్ లీలాబాయి' కేసులో పరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తూ, రెండో భార్యను 'చట్టవిరుద్ధమైన భార్య', 'విశ్వసనీయత లేని సహచరి' వంటి అవమానకరమైన పదాలను ఉపయోగించింది.

అలాంటి భాష అనుచితమైనది మాత్రమే కాకుండా ఆ మహిళ రాజ్యాంగ హక్కులను కూడా ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు లైవ్ లా తెలిపింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉందని, అలాంటి మాటలతో స్త్రీని సంబోధించడం ఆమె గౌరవాన్ని దెబ్బతీస్తుందని సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది.

హైకోర్టు పూర్తి బెంచ్ నిర్ణయంలో ఇలాంటి భాషను ఉపయోగించడం విచారకరమని సుప్రీంకోర్టు పేర్కొంది.

వివాహానికి సంబంధించిన వివాదాల్లో పురుషులపై ఎప్పుడూ ఇలాంటి భాషను ఉపయోగించరని కానీ మహిళల విషయంలో ఇది కనిపిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

ఇటీవల సుప్రీంకోర్టు 'హ్యాండ్‌బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్'ను కూడా విడుదల చేసింది. కోర్టులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు స్త్రీని ద్వేషించే భాషను ఉపయోగించకూడదని ఇది పేర్కొంది.

ఏ మహిళా తెలియకుండా కూడా అలాంటి వివక్షకు గురికాకుండా, అలాంటి సందర్భాలలో ఎలాంటి భాషను ఉపయోగించాలో ఇది వివరిస్తుంది.

హైకోర్టులు, సుప్రీంకోర్టు, మహిళ, అనుచిత వ్యాఖ్యలు, లైంగిక దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలపై విమర్శలొచ్చాయి.

'ఆ అమ్మాయి తనంత తానుగా ఇబ్బందులను తెచ్చుకున్నారు'

ఒక అత్యాచార కేసులో ఏప్రిల్ 10న అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది .

ఆ మహిళ స్వయంగా ఇబ్బందులను ఆహ్వానించారని, ఆమెకేం జరిగినా ఆమే బాధ్యత వహించాలని నిందితునికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు వ్యాఖ్యానించింది.

హైకోర్టు వ్యాఖ్యలపై జస్టిస్ బీఆర్ గవాయ్, ఎజి మసీహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

"బెయిల్ మంజూరు చేయవచ్చు... కానీ ఆమె ఇబ్బందులను ఆహ్వానిస్తున్నారన్న మాటలేంటి? అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మన వైపు నుంచి(న్యాయమూర్తులు)'' అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.

అలహాబాద్ హైకోర్టులో ఈ కేసును జస్టిస్ సంజయ్ కుమార్ విచారించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఎంఏ విద్యార్థిని తన స్నేహితుడిపై అత్యాచారం ఆరోపణలు చేశారు.

ఈ కేసు సెప్టెంబరు 2024 నాటిది. ఈ కేసులో నిందితుడి పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజయ్ కుమార్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

''సెప్టెంబరు 2024లో ఆ విద్యార్థిని ముగ్గురు అమ్మాయిలతో కలిసి దిల్లీలోని ఒక బార్‌కి వెళ్లారు. అక్కడ వారు తమకు తెలిసిన కొంతమంది అబ్బాయిలను కలిశారు. వారిలో ఒకరు నిందితుడు'' అని బార్ & బెంచ్ అనే లీగల్ న్యూస్ పోర్టల్ తెలిపింది.

తాను మద్యం మత్తులో ఉన్నానని, అయినప్పటికీ నిందితుడు తన దగ్గరికి వస్తున్నారని విద్యార్థిని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు తెల్లవారుజామున మూడు గంటల వరకు బార్‌లోనే ఉన్నారు. నిందితుడు ఆమెను తనతో పాటు రమ్మని పదే పదే కోరారు.

నిందితుడు పదే పదే కోరడంతో ఆయన ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడానికి అంగీకరించానని, అయితే నిందితుడు తనను నోయిడాలోని ఆయన ఇంటికి తీసుకెళ్లడానికి బదులుగా తన బంధువుల ఫ్లాట్‌కు తీసుకెళ్లారని విద్యార్థిని తెలిపింది.

అక్కడ తనపై అత్యాచారం జరిగిందని ఆమె చెప్పారు. విద్యార్థిని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి డిసెంబరు 2024లో నిందితుడిని అరెస్టు చేశారు.

ఆ సమయంలో తనకు సపోర్ట్‌ కావాలని ఆమె భావించారని, స్వచ్ఛందంగా తనతో పాటు రావడానికి అంగీకరించారని నిందితుడు తన బెయిల్ దరఖాస్తులో కోర్టుకు తెలిపారు. అత్యాచార ఆరోపణలను ఖండించిన ఆయన ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధం జరిగిందని పేర్కొన్నారు.

"బాధితురాలి ఆరోపణలు నిజమని అంగీకరించినప్పటికీ, ఆ మహిళ స్వయంగా ఇబ్బందులను ఆహ్వానించారని, ఈ సంఘటనకు ఆమె స్వయంగా బాధ్యురాలని కోర్టు విశ్వసిస్తోంది" అని బెయిల్ పిటిషన్‌ను విచారిస్తూ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

"ఆ మహిళ తన వాంగ్మూలంలో కూడా ఇవే విషయాలను చెప్పారు. వైద్య పరీక్షల్లో కూడా లైంగిక దాడి గురించి డాక్టర్ ఏమీ ప్రస్తావించలేదు"

''ఆ మహిళ పోస్ట్ గ్రాడ్యుయేట్. తన ప్రవర్తన నైతికతను ఆమె అర్థం చేసుకోగలరు'' అని జస్టిస్ సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

"అన్ని వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, అలాగే నేరం స్వభావం, ఆధారాలు, రెండు వైపుల వారి స్టేట్‌మెంట్‌లను పరిశీలిస్తే పిటిషనర్ బెయిల్ పొందే అర్హత కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. కాబట్టి, బెయిల్ మంజూరు చేస్తున్నాను" అని జస్టిస్ సంజయ్ కుమార్ చెప్పారు.

హైకోర్టులు, సుప్రీంకోర్టు, మహిళ, అనుచిత వ్యాఖ్యలు, లైంగిక దాడి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోక్సో చట్టం కింద నేరంగా పరిగణించడానికి శరీరాన్ని నేరుగా తాకాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.

‘శరీరాన్ని నేరుగా తాకలేదు’

బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇచ్చిన వివాదాస్పద నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది.

దుస్తులు తీయకుండా రొమ్ములను తాకడం పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులు కాదని హైకోర్టు పేర్కొంది.

'' 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు 39 ఏళ్ల వ్యక్తి దోషిగా తేలాడు. కానీ కోర్టు అతనికి సెక్షన్ 354 కింద ఒక సంవత్సరం జైలు శిక్ష మాత్రమే విధించింది'' అని లైవ్ లా తెలిపింది.

ఈ కేసులో 'శరీరాన్ని నేరుగా తాకలేదు’’ అని బాంబే హైకోర్టు పేర్కొంది.

పోక్సో చట్టం కింద నేరాన్ని పరిగణించడానికి శరీరాన్ని నేరుగా తాకాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

బాంబే హైకోర్టు చట్టాన్ని చాలా సంకుచితంగా అర్థం చేసుకుందని సుప్రీంకోర్టు పేర్కొంది. లైంగిక వేధింపుల నుంచి పిల్లలను రక్షించడమే పోక్సో చట్టం ఉద్దేశమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. లైంగిక ఉద్దేశంతో శరీరాన్ని ఎలా తాకినా పోక్సో కింద నేరమని శరీరాన్ని నేరుగా తాకడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు వివరించింది.

'' బాంబే హైకోర్టు వివరణను అంగీకరిస్తే ఒక వ్యక్తి గ్లోవ్స్ ధరించి కూడా పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడి తప్పించుకోవచ్చు'' అని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)