యవ్వనం 32 ఏళ్ల వరకు ఉంటుందంటున్న అధ్యయనం.. మనిషి మెదడు కీలక మార్పులకు గురయ్యే వయసులు ఇవే

mind

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ గలఘర్
    • హోదా, హెల్త్ అండ్ సైన్స్ కరస్పాండెంట్

మనిషి మెదడు జీవితంలో ఐదు ప్రత్యేక దశలను చూస్తుందని.. అందులో తొమ్మిదేళ్లు, 32, 66, 83 ఏళ్ల వయసులో కీలక మలుపులు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు.. సుమారు4 వేల మంది మెదళ్లను స్కాన్ చేసి విశ్లేషించారు.

ఈ నాలుగు వేలమందిలో పసికందుల నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు.

ఈ విశ్లేషణలో మెదడులోని నాడీ కణాల మధ్య ఉండే సంబంధాలలోని మార్పులను పరిశోధకులు గుర్తించారు.

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించిన వివరాల మేరకు.. మనిషి మెదడు 30ల ప్రారంభం వరకు యవ్వన దశలోనే ఉంటుంది. అదే సమయంలో మనం అత్యుత్తమ స్థాయి పనితీరుకు చేరుతాం.

ఈ ఫలితాలు మానసిక ఆరోగ్య సమస్యలు, మతిమరుపు వంటి వ్యాధులు జీవితంలో ఏ దశలో ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయానే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెబుతున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జీవితాంతం మెదడు మార్పు చెందుతుంది

సరికొత్త జ్ఞానం, అనుభవాలకు ప్రతిస్పందనగా మన మెదడు జీవితాంతం మార్పు చెందుతుంది. అయితే ఈ మార్పు పుట్టుక నుంచి మరణం దాకా ఒకే విధంగా, సాఫీగా జరిగే ప్రక్రియ కాదని పరిశోధన చెబుతోంది.

నిజానికి మెదడు అభివృద్ధి చెందే 5 దశలు ఇవే

1. బాల్యం: పుట్టుక నుంచి 9 ఏళ్ల వరకు

2. కౌమార/యవ్వన దశ: 9 నుంచి 32ఏళ్ల వరకు

3. వయోజన దశ: 32 నుంచి 66 వరకు

4. తొలి వృద్ధాప్య దశ: 66 నుంచి 83 వరకు

5. మలి వృద్ధాప్య దశ: 83 ఏళ్ల నుంచి..

‘‘జీవితాంతం మెదడు తనను తాను తిరిగి మలుచుకుంటూ ఉంటుంది. కొంత సమాచారాన్ని బాగా నిల్వ చేసుకుంటుంది. మరికొంత వదిలేస్తుంది. ఈ మార్పు ఒకే విధంగా జరగదు. దశలవారీగా మార్పులతో సాగుతుంది’’ అని ఈ అధ్యయన ప్రధాన రచయిత డాక్టర్ అలెక్సా మౌస్లీ బీబీసీకి తెలిపారు.

ఈ మెదడు దశలు అందరికీ ఒకే వయసులో ఉండకపోవచ్చు. కొందరు ముందుగా, మరికొందరు ఆలస్యంగా చేరతారు. కానీ డేటాలో మాత్రం ఈ వయసులు ఇంత స్పష్టంగా కనిపించడం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద సంఖ్యలో మెదడు స్కాన్లు లభించడం వల్ల మాత్రమే ఈ ప్యాటర్న్స్ తెలిశాయని నేచర్ కమ్యూనికేషన్ పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం పేర్కొంటోంది.

మెదడు

ఫొటో సోర్స్, AFP via Getty Images

1. బాల్యం

పుట్టిన తరువాత తొలిదశలో మెదడు పరిమాణం వేగంగా పెరుగుతుంది.

అలాగే జనన సమయంలో ఎక్కువగా ఏర్పడిన సైనాప్స్ అనే నాడీ కణాల మధ్య సంబంధాలు క్రమంగా తగ్గడం మొదలవుతుంది.

ఈ దశలో మెదడు తక్కువ సామర్థ్యంతో ఉంటుంది.

ఆ సమయంలో గమ్యం లేకుండా పార్కులో పిల్లాడు తనకు ఆకర్షణీయంగా కనిపించిన ప్రతిదాని వెంట నడిచినట్టుగా మెదడు తీరు ఉంటుంది.

మనిషి మెదడు

ఫొటో సోర్స్, Monty Rakusen/Getty

2. కౌమార లేదా యవ్వన దశ

కౌమారదశ 9వ ఏట ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మెదడులోని నాడీకణాల అనుసంధానాలు కఠినమైన వడపోత దశను ఎదుర్కొంటాయి. అలాగే సమర్థంగా మారుతాయి. ‘‘ఇది చాలా పెద్దమార్పు’’ అని మెదడు దశలో కనిపించే అత్యంత ప్రభావవంతమైన మార్పును వివరించిన డాక్టర్ మౌస్లీ చెప్పారు.

ఇదే సమయంలో మానసిక ఆరోగ్య సమస్యలు మొదలయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.

యవ్వనం టీనేజ్ సంవత్సరాలలోనే ముగుస్తుందని అనుకున్నప్పటికీ, తాజా ఆధారాలు ఇది మనం ఊహించినదానికంటే చాలా ఆలస్యంగా ముగుస్తుందని చూపుతున్నాయి. ఒకప్పుడు ఇది కేవలం టీనేజ్ కాలానికి మాత్రమే పరిమితమని భావించేవారు. న్యూరోసైన్స్ ఇది 20లవరకు కొనసాగుతుందని సూచించింది. తాజా ఆధారాలు యవ్వనం 30ల ప్రారంభం వరకు సాగుతుందని చెబుతున్నాయి.

నాడీకణాల నెట్‌వర్క్ మరింత పనితీరు చూపే ఏకైక దశ ఇదే. మెదడు పనితీరు 30ల ప్రారంభంలోనే అత్యున్నతస్థాయికి చేరుకుంటుందని చెప్పే అనేక పరిశోధనలకు ఇది బలం చేకూరుస్తోంది.

తొమ్మిదేళ్ల నుంచి 32 ఏళ్లవరకు మెదడు అదే దశలో కొనసాగడం ‘‘చాలా ఆసక్తికరం’’ అని డాక్టర్ మౌస్లీ పేర్కొన్నారు.

3. వయోజన దశ

ఇక 32 సంవత్సరాల మెదడు తన సుదీర్ఘమైన దశలోకి అడుగుపెడుతుంది. ఈ దశ దాదాపు మూడు దశాబ్దాలపాటు ఉంటుంది.

గతంలో తీవ్రంగా కనిపించిన మార్పులతో పోల్చితే ఈ దశలో మార్పు మందగిస్తుంది.

కానీ ఇక్కడ మెదడు దక్షత మెల్లిగా తగ్గడం మొదలవుతుంది. ఈ దశ ‘‘వ్యక్తిత్వం, మేథస్సు కలిసి స్థిరంగా నిలిచే కాలం’’ అంటారు డాక్టర్ మౌస్లే. ‘‘ఇది మనందరం గమనించినదే.’’ అని చెబుతారు మౌస్లే.

4. తొలిదశ వృద్ధాప్యం

మనిషి 66వ పడిలో వృద్ధాప్యం తొలిదశ మొదలవుతుంది. ఇది అకస్మాత్తుగా కలిగే క్షీణత కాదు. మెదడులోని నాడీకణాల అనుసంధాన శైలిలో నెమ్మదిగా మార్పులు కలుగుతాయి.

ఇక్కడ మెదడు స్థూలంగా ఒకే విధమైన అవయవంలా పనిచేయడానికి బదులుగా, చిన్న చిన్న ప్రాంతాలుగా విడిపోయి వాటి మధ్య వేరువేరు అనుసంధానాలు ఏర్పడతాయి.అంటే మేళంలో ఏకరీతిన వాయించడం మాని, ఎవరికి నచ్చిన పాట వారు వాయించినట్టుగా అంతా కలగాపులగంగా ఉంటుందన్నమాట.

ఈ అధ్యయనంలో ఆరోగ్యకరమైన మస్తిష్కాలనే పరిశీలించినప్పటికీ ఇదే వయసులో మతిమరుపు, రక్తపోటు వంటి మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలు ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని డేటా చూపుతోంది.

వృద్దులు

ఫొటో సోర్స్, Getty Images

5. మలిదశ వృద్ధాప్యం

ఇది 83వ సంవత్సరంలో మన అవసానదశలో మొదలవుతుంది. ఈ వయసు వారిలో ఆరోగ్యకరమైన బ్రెయిన్ స్కాన్లు పొందడం కష్టం. అందుకే ఈ దశకు సంబంధించిన డేటా కొంచెం తక్కువగా ఉంది. అయితే ఈ దశలోని మార్పులు తొలివృద్ధాప్య దశలానే ఉన్నప్పటికీ మరింత స్పష్టంగా, తీవ్రంగా ఉంటాయి.

పరిశోధనలో గుర్తించిన ఈ మెదడు మార్పు దశలు మన జీవితంలోని పెద్ద సంఘటనలు సంభవించే వయసులతో అద్భుతంగా సరిపోలడం ఆశ్చర్యంగా అనిపించిందని డాక్టర్ మౌస్లీ చెప్పారు.

ఈ అధ్యయనం పురుషులు, మహిళలను వేరువేరుగా పరిశీలించలేదు.అయితే నెలసరి ఆగిపోవడం లాంటివి మెదడు తీరుపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే ప్రశ్నలు ఉన్నాయి.

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో న్యూరో ఇన్ఫర్మేటిక్స్ ప్రొఫెసర్, ఈ పరిశోధనలో భాగమైన డంకన్ అస్టెల్ మాట్లాడుతూ ‘‘మన మెదడు ఎలా కనెక్ట్ అయి పనిచేస్తుందో అది మన మానసిక ఆరోగ్యాన్ని, ప్రవర్తనను నిర్ణయిస్తుంది’’అన్నారు.

ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ డిస్కవరీ బ్రెయిన్ సైన్సెస్ డైరక్టర్ ప్రొఫెసర్ తారా స్పైర్స్-జోన్స్ ‘‘జీవితకాలంలో మన మెదడు ఎలా మార్పులు చెందుతుందో తెలిపే చక్కని అధ్యయనం’’ అన్నారు. మెదడుపై మనకున్న అవగాహనకు తగినట్టుగానే ఈ ఫలితాలు ‘‘చక్కగా సరిపోలుతున్నాయి’’ కానీ ‘‘ప్రతిఒక్కరికీ ఒకే వయసులో ఇలాంటి మార్పులు సంభవించకపోవచ్చనే’’ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)