బంగారం కోసం వెళ్లి సజీవ సమాధైన ఇద్దరు యువకులు.. సియెర్రా లియోన్‌లో ఆగని గని ప్రమాదాలు

బంగారం కోసం తవ్వకాలు

ఫొటో సోర్స్, David Wilkins / BBC

    • రచయిత, గాడ్విన్ అసెడిబా
    • హోదా, బీబీసీ న్యూస్

పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రాలియోన్ దేశంలోని ఓ గ్రామంలో, తెల్లని వస్త్రంలో చుట్టిన ఇద్దరు యువకుల శవాల ముందు ఆ గ్రామస్తులు విలపిస్తున్నారు.

తమ కుటుంబాల కోసం అదనంగా కొంత డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో అంతకు ఒకరోజు ముందే 16 ఏళ్ల మహ్మద్ బంగురా, 17 ఏళ్ల యయ్యా జెన్నె తూర్పు ప్రావిన్స్‌లోని తమ నైంబాడు గ్రామం నుంచి బయలుదేరారు.

వారు బంగారం అన్వేషణకు వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. వారు తవ్వుతున్న తాత్కాలిక గని కూలి వారిపై పడింది. ఇది నాలుగేళ్లలో ఈ ప్రాంతంలో జరిగిన మూడో ఘోర గని ప్రమాదం. ఈ ప్రమాదాలలో ఇప్పటి వరకు కనీసం ఐదుగురు చనిపోయారు.

మహ్మద్ , యయ్యాలానే మరికొంత మంది బడికి రాకుండా బంగారం కోసం ప్రమాదకర గనుల్లో తవ్వకాలకు వెళుతున్న పరిస్థితిలో భాగమవుతున్నారని ఈ ప్రాంతంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.

చారిత్రకంగా ఈ తూర్పు ప్రావిన్స్ వజ్రాల గనులకు ప్రసిద్ధి. కానీ ఇటీవల కాలంలో వజ్రాల నిల్వలు అడుగంటడంతో అనధికారిక, చిన్నతరహా బంగారం తవ్వకాలు పెరిగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగారం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న తన 17 ఏళ్ల కుమారుడి కోసం విలపిస్తున్న నమీనా జెన్నెహా

ఫొటో సోర్స్, Andre Lombard / BBC

ఫొటో క్యాప్షన్, బంగారం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న తన 17 ఏళ్ల కుమారుడి కోసం విలపిస్తున్న నమీనా జెన్నెహ్

సంపదతో నిండిన ఈ ప్రాంతంలో స్థానికులకు పలు ప్రాంతాలు తవ్వకం ప్రదేశాలుగా మారతాయి. అది వ్యవసాయ భూమి, పాత శ్మశాన వాటికో లేదంటే నదీపరీవాహక ప్రాంతం కూడా కావచ్చు. స్థానికులకు ఎక్కడ నిక్షేపాలు దొరికితే అవే తవ్వకం ప్రాంతాలుగా మారిపోతాయి.

ఇక్కడ అధికారికంగా పనిచేసే మైనింగ్ కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, లాభదాయకం కాని ప్రాంతాలలో,అనధికారికంగా భూమిపై 4 మీటర్లు (13 అడుగులు) లోతు వరకు ఉండే గోతులు కనిపిస్తాయి.

అనేక ఆఫ్రికా దేశాలలో ఇలాంటి ప్రమాదకరమైన గనులు కనిపిస్తాయి. అవి తరచూ ప్రాణాంతకంగా కూలిపోయిన ఘటనలు వినవస్తుంటాయి.

నైంబాడులోని చాలా కుటుంబాలకు చిన్నపాటి వ్యవసాయం, చిల్లర వ్యాపారాలే జీవనాధారం. ప్రత్యామ్నాయ ఉపాధి అంతంతమాత్రం కావడంతో కొంత అదనపు డబ్బు సంపాదించే అవకాశం ఏదైనా అక్కడ ఆకర్షణీయంగా ఉంటుంది.

అయితే ఈ పని ఇద్దరు బాలుర జీవితాలను పణంగా పెట్టిందని ఆ గ్రామంలో అంత్యక్రియలకు హాజరైన ప్రజలందరికీ తెలుసు.

యాయా తల్లి నమీనా జెన్నెహ్ ఒక వితంతువు. ఆమె తన మిగిలిన ఐదుగురు పిల్లల పోషణ కోసం తన చిన్న కొడుకుపై ఆధారపడ్డారు. ఆమె కూడా అలాంటి గనులలో పనిచేసే మహిళ కావడంతో ఆ పనిని యాయాకు పరిచయం చేసింది తానేనని ఆమె అంగీకరిస్తారు. కానీ ''అక్కడకు వెళుతున్నానని వాడు నాకు చెప్పలేదు. తెలిసి ఉంటే వెళ్లనిచ్చేదానిని కాదు'' అంటారామె.

గని కూలిపోయిందనే వార్త విన్నప్పుడు వెంటనే ఎక్స్‌కవేటర్ డ్రైవర్‌ను పిలిచారు.

''డ్రైవర్ వచ్చి శిథిలాలను తొలగించారు'' కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది.

యయ్యా

ఫొటో సోర్స్, Namina Jenneh

ఫొటో క్యాప్షన్, యయ్యా జెన్నె

తనకు అండగా ఉన్న తన కుమారుడి ఫోటోలను పగిలిపోయిన స్క్రీన్‌తో ఉన్న మొబైల్లో చూపుతూ జెన్నెహ్ ఎంతో బాధపడుతున్నారు.

స్థానిక బాలల రక్షణ కార్యకర్త సహర్ అన్సుమానా, నన్ను కూలిపోయిన గని వద్దకు తీసుకెళ్లారు.

"మీరు కొంతమంది తల్లిదండ్రులను అడిగితే, వారికి వేరే ప్రత్యామ్నాయం లేదని చెబుతారు. వారు వితంతువులు, ఒంటరి తల్లిదండ్రులు" అని చెప్పారాయన.

"వారు పిల్లలను పోషించాలి. దీంతో వారే పిల్లలను మైనింగ్‌కు వెళ్లమని ప్రోత్సహిస్తున్నారు. మేం చాలా కష్టపడుతున్నాం, మాకు సహాయం కావాలి. ఇది ఆందోళన కలిగించే విషయమే కాదు. ఇది అదుపు తప్పిపోతోంది'' అన్నారు.

కానీ ఈ విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. యయా, మొహమ్మద్ మరణాలు అక్కడి గనులను ఖాళీ చేయించలేదు.

వారి అంత్యక్రియలు జరిగిన మరుసటి రోజే, పిల్లలతో సహా కార్మికులు తిరిగి పనిలోకి వచ్చారు. వారు నది పక్కన చేతులతో ఇసుకను జల్లెడ పడుతున్నారు లేదా బంగారం కోసం చేతులతో తవ్విన మట్టిని పరీక్షిస్తున్నారు.

లాయర్ కావాలనుకుంటున్న కొంబా పని కారణంగా స్కూలుకు వెళ్లడం లేదు

ఫొటో సోర్స్, David Wilkins / BBC

ఫొటో క్యాప్షన్, లాయర్ కావాలనుకుంటున్న కొంబా పని కారణంగా స్కూలుకు వెళ్లడం లేదు

ఓ గనిలో నేను 17 ఏళ్ల కొంబా సెసేను కలిశాను. అతను ఓ లాయర్ కావాలనుకుంటున్నారు. కానీ తన తల్లికి చేదోడువాదోడుగా ఉండేందుకు అతను పగలు 8 గంటలపాటు ఇక్కడ పనిచేస్తారు.

''మా దగ్గర డబ్బులేదు'' అంటారు అతను. ''నేనిక్కడ సంతోషంగా లేను. డబ్బు సంపాదించడానికే ప్రయత్నిస్తున్నాం. నేనిక్కడ పనిచేయడానికి కారణం హైస్కూల్ పరీక్షలకు నమోదు చేసుకోవడానికి, నాకు మళ్లీ బడికి వెళ్లానుంది''

కొంబా సంపాదన చాలా తక్కువ. చాలా వారాల్లో అతను సుమారు $3.50 (రూ. 280) సంపాదిస్తారు. ఇది ఆ దేశ కనీస వేతనంలో సగం కంటే తక్కువ. కానీ ధనవంతుడవుతాననే ఆశతో అతను పట్టుదలతో పని చేస్తుంటారు. అయితే అదృష్టం కలిసొచ్చిన రోజులలో అతను 35 డాలర్లు సంపాదించడానికి సరిపడా ఖనిజాన్ని కనుగొంటారు.

ఈ పని ప్రమాదకరమని అతనికి తెలుసు. కొంబా స్నేహితులలో కొందరు గనులు కూలిన ఘటనల్లో గాయపడినవారు ఉన్నారు. కానీ కొంత డబ్బు సంపాదించాలంటే మైనింగ్ ఒక్కటే మార్గం అని అతను భావిస్తున్నాడు. బడిని వదిలేస్తున్నది కేవలం విద్యార్థులే కాదు.

నైంబాడులోని జూనియర్ సెకండరీ స్కూల్ హెడ్మాస్టర్ రూజ్‌వెల్ట్ బందో మాట్లాడుతూ, "టీచర్లు కూడా తరగతులు వదిలి మైనింగ్ ప్రదేశాలకు వెళ్తున్నారు; వారు విద్యార్థులతో కలిసి మైనింగ్ చేస్తున్నారు'' అన్నారు. బంగారం తవ్వకం ద్వారా వారు సంపాదించే దానితో వారి ప్రభుత్వ జీతం పోటీపడలేదు.

తగిన పనిముట్లు లేకుండా తవ్వుతున్న పిల్లలు

ఫొటో సోర్స్, David Wilkins / BBC

తవ్వకాలు జరిగే ప్రాంతాల చుట్టూ పరిస్థితులు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్లలో చిన్నపాటి గుడారాలుగా ఉన్న ప్రాంతాలు పట్టణాలుగా మారాయి.

ఈ సమస్యను పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం విద్యాభివృద్దికి కట్టుబడి ఉందని , ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం గుర్తిస్తుందని కూడా చెప్పారు.

"మేం మా జీడీపీలో లో సుమారు 8.9 శాతం విద్య కోసం ఖర్చు చేస్తాం, ఈప్రాంతంలో మరే ఇతర దేశం కంటే ఇదే ఎక్కువ" అని ఆయన చెప్పారు. ఉపాధ్యాయులు, పాఠశాలల్లో ఆహార కార్యక్రమాలు, పిల్లలను తరగతి గదిలో ఉంచడానికి ఉద్దేశించిన సబ్సిడీల కోసం నిధులు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.

కానీ క్షేత్రస్థాయి నిజం కఠినంగా ఉంది. ప్రభుత్వ విధానాలపై తక్షణ బతుకుదెరువు విజయం సాధిస్తోంది.

ధార్మిక సంస్థలుస్థానిక కార్యకర్తలు పిల్లలను గనుల గుంతల నుంచి తొలగించి, వారిని మళ్లీ బడిలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ ఆదారపడదగిన ఆదాయ ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో గనుల్లోని గుంతలే అక్కడివారికి ఆకర్షణీయంగా ఉన్నాయి.

నైంబాడోకు తిరిగి వస్తే, మరణించిన ఇద్దరు పిల్లల కుటుంబాలు అలసిపోయి, నిస్సత్తువతో కనిపిస్తున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)