'నీట్'‌లో సీటు రాకపోయినా వైద్య రంగంలో మరెన్నో అవకాశాలు.. ప్లాన్ 'బీ'కి ఇలా సిద్ధం కావొచ్చు

పారా మెడికల్ సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రియాంక ఝా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డాక్టర్ కావాలనేది దిల్లీకి చెందిన దివ్య శర్మ కల. కానీ, వైద్య విద్య కోసం నిర్వహించే జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)లో అర్హత సాధించలేకపోయారు. కానీ, ఆమె తన ప్లాన్ బి అమలు చేశారు.

ఆయుర్వేదం ఆమె ప్లాన్ బి. ప్రస్తుతం దివ్య బనారస్ హిందూ యూనివర్సిటీలో బీఏఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ) చదువుతున్నారు.

ప్రతిఏటా లక్షలాది మంది విద్యార్థులు నీట్ పరీక్షలో అర్హత సాధించేందుకు పోటీపడుతున్నారు.

చాలామంది సఫలమవుతున్నారు, కానీ అర్హత సాధించలేకపోతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. దీనివల్ల వారు అక్కడే ఆగిపోతున్నారా? అంటే కాదు.

నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోవడం వైద్యం రంగంలో కెరీర్ లక్ష్యానికి ముగింపు కాబోదని, వైద్యరంగంలోనే ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నదానికి దివ్య అనుభవమే నిదర్శనం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

2020లో ఇంటర్ పూర్తి చేసిన దివ్య, తర్వాత వరుసగా రెండుసార్లు నీట్‌ పరీక్షకు హాజరయ్యారు. 2020లో ఆమెతో పాటు 13 లక్షలకు మందికి పైగా పోటీపడ్డారు. కానీ, వారిలో దాదాపు 7.5 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు.

మరి, మిగిలిన వారి పరిస్థితేంటి?

మరోసారి నీట్ రాసేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని దివ్య సలహా ఇస్తున్నారు.

''నా తొలి ప్రయత్నంలో కొద్ది మార్కులతోనే అవకాశం పోయింది. రెండో ప్రయత్నంలో క్లియర్ అవుతుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. అయితే, రెండో ప్రయత్నంలో క్లియర్ చేసిన విద్యార్థులు చాలామంది ఉన్నారు'' అని ఆమె చెప్పారు.

ఒకవేళ 'నీట్'లో అర్హత సాధించలేకపోయినా, వైద్య రంగాన్ని ఎంచుకోవడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేమిటో ఈ కెరీర్ కనెక్ట్‌లో తెలుసుకుందాం.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యామ్నాయాలేంటి?

నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ప్రకారం, దేశంలో 13,86,190 మంది అల్లోపతి వైద్యులు ఉన్నారు.

'ఆయుష్' మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. దేశంలో ఆయుర్వేద, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) తదితర భారతీయ సంప్రదాయ వైద్యవిధానాల్లో దాదాపు 7.5 లక్షల మందికి పైగా రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్లు ఉన్నారు.

వైద్య రంగం అనగానే మనకు మొదట గుర్తొచ్చేది డాక్టర్ కావడమే. కానీ, ఈ రంగంలో ఉత్తమ కెరీర్‌కు ఢోకాలేని కోర్సులు ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా మరెన్నో ఉన్నాయి.

ఈ విషయమై విద్యావేత్త, కెరీర్ కౌన్సెలర్ డాక్టర్ అమిత్ త్రిపాఠి బీబీసీతో మాట్లాడుతూ, వైద్యరంగం అంటే కేవలం డాక్టర్ కావడమే అనే అపోహ మన దేశంలో బలంగా ఉందన్నారు.

''వైద్యరంగంలో కేవలం 15-20 శాతం మంది మాత్రమే డాక్టర్లుగా ఉన్నారు. మిగిలిన 80 నుంచి 85 శాతం అనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపుణులే ఉన్నారు. వాటిలో నర్సింగ్, రేడియాలజీ, ల్యాబ్ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు.. ఇంకా కైరోప్రాక్టిక్, కాస్మెటిక్ మెడిసిన్ వంటి కొత్తగా వస్తున్న రంగాలు కూడా ఉన్నాయి. నీట్‌లో విఫలమైనంత మాత్రాన కెరీర్ ముగిసినట్లు కాదని ఈ డేటా చూపుతోంది'' అని ఆయన అన్నారు.

పారా మెడికల్

ఫొటో సోర్స్, Getty Images

పారామెడికల్ కోర్సులు...

మోషన్ ఎడ్యుకేషన్‌ సంస్థ జాయింట్ డైరెక్టర్, నీట్ డివిజన్ హెడ్ అమిత్ వర్మ దీనిపై మాట్లాడుతూ, ఎవరైనా నీట్‌ క్లియర్ చేయలేకపోతే వారికి పారామెడికల్ కోర్సులనే ఆప్షన్ ఎప్పుడూ ఉంటుందన్నారు.

" 'నీట్'పై మాత్రమే ఆధారపడకుండా, ప్లాన్ బి సిద్ధం చేసుకోవాలి. నీట్‌కు సిద్ధమవుతూనే, పారామెడికల్ కోర్సులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’’ అన్నారు.

చాలా కోర్సులకు ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాల్సిన అవసరం లేదని ప్రముఖ పారామెడికల్ కాలేజీలు, అనుబంధ హెల్త్‌కేర్ ప్రోగ్రామ్‌లకు ఇండస్ట్రీ పార్టనర్‌గా వ్యవహరిస్తున్న విరోహన్ సంస్థ సహ వ్యవస్థాపకులు నళిన్ సలూజా అన్నారు.

''బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరఫీ, అనుబంధ హెల్త్ కేర్ కోర్సుల ఫౌండేషన్ ఇంటర్‌లో చదివిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల మీదే ఉంటుంది. ఆ సబ్జెక్టులను నీట్ కోసం ఎలాగూ చదువుతారు'' అని నళిన్ చెప్పారు.

''అనుబంధ హెల్త్ కేర్ కోర్సులన్నింటికీ మార్చి-ఆగస్టు మధ్యలో నోటిఫికేషన్లు వస్తుంటాయి. విద్యార్థులు నీట్ ఫలితాల కోసం వేచిచూడకుండా, ముందుగానే ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలి. అలా చేస్తే సీటు దొరక్కపోవడం అనే మాటే ఉండదు'' అని ఆయన సూచిస్తున్నారు.

మెడికల్ విద్యార్థి

ఫొటో సోర్స్, Getty Images

ఆ కోర్సులు ఏమిటంటే...

బీఎస్సీ నర్సింగ్:

ఆరోగ్య సంరక్షణ రంగంలో ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన వృత్తులలో ఒకటిగా నర్సింగ్‌ను పరిగణిస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆసుపత్రుల్లోని ఐసీయూలు, ఎన్ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లతో పాటు అత్యవసర సేవల విభాగాల్లో అత్యధిక డిమాండ్ ఉంది.

విదేశాల్లో కూడా పెద్దసంఖ్యలో ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. ఈ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో లేదా కాలేజీ స్థాయిలో ప్రవేశపరీక్షలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మెరిట్ ఆధారంగా కూడా ప్రవేశాలు జరుగుతాయి. నర్సింగ్ ఉద్యోగులకు జీతాలు నెలకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకూ ఉంటుంది. అనుభవంతో రూ.లక్ష వరకూ పెరిగే అవకాశం ఉంది.

బీపీటీ (బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజియోథెరపీ):

క్రీడలు, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి రంగాల్లో ఫిజియోథెరపిస్టులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ కోర్సులో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 'నీట్'లో సాధించిన స్కోర్‌ కూడా అవసరమవుతుంది. ఫిజియోథెరపిస్టులు ఆస్పత్రుల్లో పనిచేయవచ్చు, లేదంటే సొంతంతా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు.

బీఎంఎల్‌టీ (బ్యాచ్‌లర్ ఆఫ్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ):

ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆస్పతులు, ఐవీఎఫ్, పాథాలజీ ఆసుపత్రుల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ కోర్సుల్లో ప్రవేశం సాధారణంగా కాలేజీ లేదా యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

బీఎస్సీ రేడియాలజీ/ఇమేజింగ్:

సిటీ స్కాన్, ఎంఆర్ఐలు, ఎక్స్-రే విభాగాల్లో అవసరం ఉంది. ఉద్యోగంలో అనుభవాన్ని బట్టి రూ.60 వేల నుంచి లక్ష రూపాయల వరకూ వేతనం ఉంటుంది.

బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ:

అమిత్ త్రిపాఠి ప్రకారం, ఫార్మాస్యూటికల్ పరిశ్రమ దేశంలో మూడో అతిపెద్ద రంగం. ఈ నాలుగేళ్ల కోర్సు ఔషధ రంగం గురించి, వాటి తయారీ, ఆ మందులు ఎవరికి ఉపయోగపడతాయనే వాటి గురించి లోతైన అవగాహనను అందిస్తుంది. ప్రారంభ జీతం నెలకు రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకూ ఉంటుంది. రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు ఉంటాయి.

బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్:

తక్కువ ఖర్చు, వెనువెంటనే ఉద్యోగ అవకాశం ఉంటాయి. రేడియాలజీ, ఆపరేషన్ థియేటర్, డయాలసిస్, ఎమర్జెన్సీ కేర్ విభాగాల్లో ఈ వృత్తి నిపుణుల అవసరం ఉంటుంది. మెరిట్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.

కాస్మెటాలజీ, ఈస్తటిక్ మెడిసిన్: ఈ రోజుల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగమిది. దేశంలో చర్మం, జుట్టు, యాంటీ ఏజింగ్, లేజర్ ట్రీట్‌మెంట్లు, బొటాక్స్, ఫిల్లర్స్ వంటి చికిత్సలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ రంగానికి సంబంధించిన క్లినిక్‌లు నగరాల్లో వేగంగా పెరుగుతున్నాయి. ఈ రంగంలో ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ, ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా కూడా డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సులు చేయడానికి అవకాశం ఉంది.

పై కోర్సులే కాకుండా, బీఏఎంఎస్ (ఆయుర్వేద), బీహెచ్ఎంఎస్ (హోమియోపతి), బీఎన్‌వైఎస్ (న్యూరోపతి, యోగా సైన్స్), బీయూఎంఎస్ (యునాని) వంటి కోర్సులు చేయడానికీ అవకాశాలు ఉన్నాయి.

Medical profession

ఫొటో సోర్స్, Getty Images

ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు...

అమిత్ చెప్పినదాని ప్రకారం, ఒక కోర్సును ఎంపిక చేసుకునే ముందు కొన్ని ప్రధాన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.

  • మొదటగా, కోర్సు అనేది విద్యార్థి ఆసక్తికి అనుగుణంగా ఉండాలి. పేషెంట్ కేర్, ల్యాబ్ వర్క్, మెషినరీ, రీసర్చ్... వీటిలో ఏది ఇష్టమో చూసుకోవాలి.
  • ఆ తర్వాత, మీరు ఎంచుకుంటున్న కోర్సు ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి.
  • మీరు వెళ్లాలనుకున్న కాలేజీకి యూజీసీ, ఏఐసీటీఈ లేదా ఆ కోర్సుకు సంబంధించిన అధీకృత సంస్థ నుంచి గుర్తింపు ఉందో లేదో ఆరా తీయాలి.
  • మీరు ఎంచుకున్న కాలేజీ ఏదైనా ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ సౌకర్యాన్ని అందిస్తుందా లేదా అనేదీ తెలుసుకోవాలి.
  • ఆ కాలేజీ ప్లేస్‌మెంట్ రికార్డు కూడా చెక్ చేయండి.
  • ఫీజు ఎంత, కోర్సు కాలపరిమితి గురించి కూడా తెలుసుకోవాలి.

వైద్య రంగంలో ఒక కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయో నిపుణులు చెబుతున్నారు.

  • ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
  • డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో మంచి ఉద్యోగం సంపాదించవచ్చు.
  • విద్యార్థులు తమ కెరీర్‌ను మెరుగుపరచుకోవడానికి పునరావాస కేంద్రాల్లో పనిచేయవచ్చు.
  • నర్సింగ్ హోమ్స్, ప్రైవేట్ క్లినిక్‌లలోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)