జస్వీన్ సంఘా: ‘కెటామైన్ క్వీన్’గా పేరున్న ఈ సంపన్న యువతి డ్రగ్స్ ప్రపంచంలో ఎంత సీక్రెట్‌గా ఉండేవారు?

ఫొటో సోర్స్, Courtesy of Zanc
- రచయిత, బెన్ బ్రయంట్
- హోదా, బీబీసీ న్యూస్
జస్వీన్ సంఘాను దూరం నుంచి చూస్తే, ఆమెకు దేనికీ కొదవ లేదన్నట్లు కనిపిస్తారు. ధనిక కుటుంబం, ఉన్నత చదువులు, పెద్ద ఫ్రెండ్స్ జాబితా.
కానీ జస్వీన్ సంఘాలో మరో రహస్యకోణం కూడా ఉంది. దాన్ని ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడూ గుర్తించలేకపోయారు.
బ్రిటిష్-అమెరికన్ పౌరురాలు జస్వీన్ సంఘా హాలీవుడ్‌లోని ధనవంతులు, ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేవారు. ఆమె కొకైన్, జనాక్స్, నకిలీ అడెరాల్ మాత్రలు, కెటామైన్ కేటమిన్ వంటి డ్రగ్స్‌ని 'స్టాష్ హౌస్' ద్వారా సరఫరా చేసేవారు.
ప్రముఖ నటుడు మాథ్యూ పెరీకి 50 సీసాల కెటామైన్‌ను ఆమె సరఫరా చేశారు. 2023లో డ్రగ్స్ ఓవర్‌డోస్ అయ్యి ఆయన మరణానికి దారితీయడంతో ఆమె చేసే వ్యాపారం, ఆకర్షణీయమైన జీవితం ఒక్కసారిగా కుప్పకూలాయి.
పెరీ మరణానికి కారకులైనవారిలో సంఘా సహా ఐదుగురు ఉన్నట్టు తేలింది. వారిలో ఇద్దరు వైద్యులు కూడా ఉన్నారు. లాస్ ఏంజెలెస్‌లో ఉన్న కేటమిన్ అండర్‌గ్రౌండ్ డ్రగ్ నెట్‌వర్క్‌ని బయటపెట్టిన కేసులో ఫిబ్రవరిలో, సంఘాకి చివరి నిందితురాలిగా శిక్ష పడనుంది.
ఆమె గరిష్ఠంగా 65 సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించాల్సి రావచ్చు. ఈ నెట్‌వర్క్ ద్వారా హాలీవుడ్‌లోని ధనవంతుల కోసం డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు బయటపడింది.


సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఇమేజ్
"సంఘా ఉన్నత విద్యావంతురాలైన మహిళ.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా జీవనోపాధి పొందాలని నిర్ణయించుకుంది. ఆ డబ్బును సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తన ఇమేజ్‌ను నిలబెట్టుకోవడానికి వినియోగించింది" అని పెరీ మరణించిన సమయంలో లాస్ ఏంజిల్స్‌లో డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి ప్రత్యేక ఏజెంట్‌గా ఉన్న బిల్ బోడ్నర్ బీబీసీతో చెప్పారు.
"హాలీవుడ్‌లోని సంపన్నులకు ఉపయోగపడేలా సంఘా ఒక భారీ మాదకద్రవ్య అక్రమ రవాణా కార్యకలాపాలను నిర్వహించింది" అని బిల్ బోడ్నర్ చెప్పారు.
డిప్రెషన్‌కు చికిత్స చేయడానికి వైద్యులు చట్టబద్ధంగా సూచించిన కెటామైన్‌ను పెరీ తీసుకుంటున్నారనీ, కానీ తర్వాత వైద్యులు ఆమోదించిన దానికంటే ఎక్కువ డిమాండ్ చేయడం మొదలుపెట్టారనీ ప్రాసిక్యూటర్లు తెలిపారు.
ఈ కోరిక ఆయన్ని అనేకమంది వైద్యుల వద్దకు, ఆ తర్వాత మధ్యవర్తి ద్వారా సంఘా నుంచి మందులు పొందిన డీలర్ వద్దకు నడిపించాయని ఫెడరల్ దర్యాప్తుకు సంబంధించిన కోర్టు పత్రాల్లో ఉంది.
"సంఘా తను చేసిన తప్పులను అంగీకరిస్తున్నారు, కానీ పెరీ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు" అని ఆమె న్యాయవాది మార్క్ గెరాగోస్ చెప్పారు.
మాథ్యూ పెరీ చాలా కాలం ప్రసారమైన ‘సిట్‌కామ్ ఫ్రెండ్స్’లో చాండ్లర్ బింగ్ పాత్రలో నటించి పాపులర్ అయ్యారు.
"సంఘా చాలా బాధపడుతున్నారు. మొదటి రోజు నుంచి ఆమె దుఃఖిస్తూనే ఉన్నారు" అని సంఘా నేరాన్ని అంగీకరించిన తర్వాత, ఆమె న్యాయవాది గెరాగోస్ విలేఖరులతో అన్నారు.

సంఘా రెండురకాల జీవితాన్ని ఎలా గడిపారు?
పెరీ మరణానికి కొన్ని వారాల ముందు, సంఘా తన పాత స్నేహితుడు టోనీ మార్క్వెజ్‌తో ఫోన్‌లో మాట్లాడారు.
టోనీ మార్క్వెజ్, సంఘాతో అనుబంధం ఉన్న కొందరు బీబీసీ ప్రెజెంటర్ అంబర్ హక్‌తో మాట్లాడారు.
ఈ డాక్యుమెంటరీ పెరీ మరణానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా "కెటామైన్ క్వీన్"గా పిలిచే జస్వీన్ సంఘా గురించి ఆమె స్నేహితులు బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి.
సంఘా, మార్క్వెజ్ ఇద్దరికీ 2010 నుంచి పరిచయం ఉంది. ఆమె కుటుంబాన్ని కూడా తాను కలిశానని మార్క్వెజ్ చెప్పారు. సంఘాలాగే, మార్క్వెజ్ కూడా లాస్ ఏంజిల్స్ పార్టీ లైఫ్‌లో తరచుగా భాగమయ్యేవారు.
టోనీ మార్క్వెజ్ కూడా మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయనను గతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషిగా నిర్ధరించారు. కానీ వారి మధ్య చాలాకాలంగా స్నేహం ఉన్నప్పటికీ, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టు సంఘా ఎప్పుడూ తనకు చెప్పలేదని మార్క్వెజ్ అన్నారు.
కొన్ని నెలల కిందట, పోలీసులు నార్త్ హాలీవుడ్‌లోని ఆయన ఇంటిపై దాడి చేశారు. దీనిని ప్రాసిక్యూటర్లు 'స్టాష్ హౌస్' అని పిలుస్తున్నారు.
జాష్ నెగాంధి 2001లో ఇర్విన్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో సంఘాతో కలిసి చదువుకున్నారు. 20 ఏళ్లకు పైగా సంఘాతో ఆయనకు స్నేహం ఉంది.
"ఆమె డాన్స్, మ్యూజిక్ రంగంలో చాలా చురుగ్గా ఉండేది. ఆమెకు డాన్స్ చేయడం, ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం" అని సంఘా గురించి చెప్పారు నెగాంధి.
తన స్నేహితురాలు డ్రగ్స్ అమ్ముతుందని తెలుసుకున్నప్పుడు తాను షాక్ అయ్యానని నెగాంధి చెప్పారు. "ఆమె దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు" అని నెగాంధి చెప్పారు.
"ఆమెకు డబ్బు ఉండేది. ఆమె ప్రైవేట్ జెట్‌లలో ప్రపంచాన్ని చుట్టేది. ఇదంతా బయటపడటానికి చాలా కాలం ముందునుంచే ఆమె ఇలా చేస్తోంది" అని మార్క్వెజ్ అన్నాడు.

ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి
టైమ్స్ కథనం ప్రకారం, సంఘా తాతా మామలు తూర్పు లండన్‌లో మల్టీ మిలియనీర్ ఫ్యాషన్ రిటైల్ మాగ్నెట్‌లు. నీలం సింగ్, డాక్టర్ బల్జిత్ సింగ్ చోకర్‌ల కుమార్తె సంఘా. వారే ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించారు.
సంఘా కుటుంబ ఆస్తిని వారసత్వంగా పొందవలసి ఉంది.
ఆమె తల్లి రెండుసార్లు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె కాలిఫోర్నియాలోని కాలాబాసాస్‌కు వెళ్లారు. సంఘా అక్కడే పెరిగారు.
ఉన్నత పాఠశాల తర్వాత, సంఘా లండన్‌లో కొంతకాలం గడిపి 2010లో లండన్‌లోని హల్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ నుంచి ఎమ్‌బీఏ పట్టా పొందారు.
2010లో ఫైనాన్షియల్ టైమ్స్‌ను సందర్శించినప్పుడు, ఆమె బ్లాక్ సూట్‌లో స్ట్రెయిట్ హెయిర్‌తో, కెమెరా వైపు నవ్వుతూ కనిపించారు.
"ఆమె మోసం చేసేదానిలా కనిపించలేదు" అని సంఘా క్లాస్‌మేట్ చెప్పారు.
ఆమె ఎమ్‌బీఏ పూర్తి చేసిన వెంటనే, లాస్ ఏంజెలెస్‌కు తిరిగి వచ్చారు సంఘా. తల్లి, సవతి తండ్రి కాలిఫోర్నియాలో కేఎఫ్‌సీ ఫ్రాంచైజీని నడిపారు.
2013లో, కంపెనీ తన బ్రాండింగ్‌ను ఉపయోగించినందుకు రాయల్టీలు చెల్లించడంలో విఫలమైనందుకు ఆయనపై 50 వేల డాలర్లకంటే ఎక్కువ పరిహారం కోసం ఆ కంపెనీ పిటిషన్ దాఖలు చేసిందని కోర్టు పత్రాల్లో ఉంది.
కేసు ముగియకముందే సంఘా సవతి తండ్రి దివాలా తీసినట్లు ప్రకటించారు. ఆ సమయంలో సంఘా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, వారు దాని గురించి ఎవరికీ చెప్పలేదు.
రోజుల తరబడి కొనసాగిన డ్రగ్స్ పార్టీలు
"సంఘా ఆసక్తంతా క్లబ్బింగ్ పైనే ఉండేది. లాస్ ఏంజెలెస్‌లో, ఆమెకు "కిట్టీస్" అని పిలిచే క్లోజ్ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది. ఇది సెలబ్రిటీలను కూడా ఆకర్షించే పార్టీలు చేయడానికి ఇష్టపడే అమ్మాయిల గ్రూప్" అని మార్క్వెజ్ చెప్పారు.
"వారు తరచుగా హాలీవుడ్ నడిబొడ్డున ఉన్న అవలోన్ అనే పాత థియేటర్‌లో కలుసుకునేవారు. తెల్లారేవరకు పార్టీలు చేసుకునేవారు" అని వెల్లడించారు మార్క్వెజ్.
"ఈ పార్టీలకు కెటామైన్ ప్రతిసారీ వచ్చేది. ఈ స్నేహితుల బృందంలో సంఘాకు చాలా మారుపేర్లు ఉన్నప్పటికీ, ఎవరూ ఆమెను 'కెటామైన్ క్వీన్' అని పిలవలేదు" అని మార్క్వెజ్ చెప్పారు.
'సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలు ఇచ్చే జీవితానికి బానిస'
సంఘా డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు తాను ఎప్పుడూ అనుమానించలేదని మార్క్వెజ్ చెప్పారు.
‘‘సంపన్నులు, ప్రముఖులకు మాదకద్రవ్యాలను సరఫరా చేయడంతో వచ్చిన సోషల్ స్టేటస్‌కు సంఘా బానిసయ్యింది" అని తాను భావిస్తున్నట్లు మార్క్వెజ్ చెప్పారు.
మార్క్వెజ్ తాను ఎప్పుడూ 'కింగ్‌పిన్' లేదా ప్రధాన డీలర్ కాదని ఒప్పుకున్నారు.
"కానీ మా అందరిలాగే ఆమె కూడా కెటామైన్‌ను ఇష్టపడింది. అందుకే ఈ వ్యాపారంలోకి దిగింది" అని చెప్పారు.
'ఆమె 17 నెలలుగా మద్యం ముట్టుకోలేదు'
2010లో కలిసి క్లబ్‌లకు వెళ్ళిన మరో స్నేహితుల బృందం కూడా ఈ వార్త విని అంతే ఆశ్చర్యపోయారు.
సంఘా ఉన్నత పాఠశాలలో చదువుకునేరోజుల నుంచి తనకు తెలుసునని, మార్క్వెజ్‌తో పాటు ఆమెతో కూడా చాలా సమయం గడిపానని ఆమె స్నేహితుడు బీబీసీకి తెలిపారు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆయన 'డ్రగ్ లార్డ్' అని ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ గురించి మాట్లాడుతూ.."మేం చాలాసార్లు పార్టీలలో కలిశాం. కానీ, ఆమె నాకు ఎప్పుడూ డ్రగ్స్ ఆఫర్ చేయలేదు" అని చెప్పారు.
సంఘా 2020లలో రీహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లారని మార్క్వెజ్ చెప్పారు.
గత నెలలో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, సంఘా న్యాయవాది మార్క్ గెరాగోస్, ఆమె 17 నెలలుగా మద్యం తాగలేదని పేర్కొన్నారు.
నెగాంధీతో తన చివరి సంభాషణలో, ఆమె భవిష్యత్తు గురించి మాట్లాడారు సంఘా.
‘‘మేమిద్దరం 40లలో ఉన్నాం. ఆ వయసులో ఎవరైనా తమను తాము అంచనా వేసుకోవడం మొదలుపెడతారు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అని ఆలోచిస్తారు. తాను చాలాకాలంగా మద్యం ముట్టకపోవడంపట్ల ఎంతో ఆమె సంతోషంగా ఉంది. ఆమె అరెస్టు అయినట్లు నాకు చెప్పలేదు. ఆమెకు ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు’’ అని నెగాంధీ అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














