అమెరికా వెళ్లాలంటే సోషల్‌ మీడియా చరిత్ర చెప్పాల్సి రావొచ్చు, ఆ 40 దేశాలకు ఎఫెక్ట్- అసలేంటీ నిబంధనలు?

అమెరికా ప్రయాణం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జేమ్స్ ఫిట్జ్‌గెరాల్డ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యూకే సహా వివిధ దేశాల నుంచి తమ దేశానికి వచ్చే టూరిస్టులు వారి ఐదేళ్ల సోషల్ మీడియా హిస్టరీని అందించాలనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు అమెరికా అధికారులు.

వీసా లేకుండా 90 రోజులపాటు అమెరికాను సందర్శించడానికి అర్హత కలిగిన డజన్ల కొద్దీ దేశాల ప్రజలను ఈ కొత్త షరతు ప్రభావితం చేస్తుంది. ఇకపై ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈఎస్‌టీఏ) దరఖాస్తు నింపినవాళ్లకే 90 రోజులపాటు అమెరికాలోకి ప్రవేశం లభిస్తుంది.

జనవరిలో వైట్‌హౌస్‌లోకి ట్రంప్ అడుగుపెట్టినప్పటి నుంచి జాతీయ భద్రతను కారణంగా చూపిస్తూ సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఈ కొత్త ప్రతిపాదన టూరిస్టులకు అడ్డంకిగా మారొచ్చని, వారి డిజిటల్ రైట్స్‌కు హాని కలిగించవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా వీసా

ఫొటో సోర్స్, AFP

ప్రతిపాదనలో ఏముంది?

ఈ ప్రతిపాదన పత్రాన్ని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ), ఆ ఏజెన్సీలో భాగమైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) నివేదించాయి.

ఇది అమెరికా ప్రభుత్వ అధికారిక పత్రిక అయిన ఫెడరల్ రిజిస్టర్‌లో కనిపించిందని అమెరికా మీడియా పేర్కొంది. దీనిపై స్పందించాల్సిందిగా డీహెచ్‌ఎస్‌ను అడిగింది బీబీసీ.

"ఈఎస్‌టీఏ దరఖాస్తుదారులు గత ఐదేళ్ల తమ సోషల్ మీడియా వివరాలను అందించాలని ఈ డేటా కోరుతుంది" అని ఆ ప్రతిపాదనా పత్రం చెబుతోంది. అయితే ఏ నిర్దిష్ట సమాచారం అవసరమనే విషయంపై మరిన్ని వివరాలు ఇవ్వలేదు.

ప్రస్తుతం ఈఎస్‌టీఏ ప్రయాణికుల నుంచి చాలా పరిమిత మొత్తంలో సమాచారం, అలాగే 40 డాలర్ల డబ్బు ఒకేసారి చెల్లించాలని కోరుతోంది. ఇది యూకే, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్‌ సహా దాదాపు 40 దేశాల పౌరులకు అందుబాటులో ఉంది. అలాగే రెండేళ్ల కాలంలో అమెరికాను అనేకసార్లు సందర్శించడానికి వారికి అనుమతిస్తోంది.

సోషల్ మీడియా సమాచారంతోపాటు, దరఖాస్తుదారు గత ఐదు, పదేళ్లలో ఉపయోగించిన టెలిఫోన్ నంబర్లు ఈమెయిల్ అడ్రస్‌లు, వారి కుటుంబ సభ్యుల గురించి మరింత సమాచారాన్ని అందించాలని ప్రతిపాదిస్తోంది.

కెనడా, మెక్సికోతో పాటు పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచ కప్, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు అమెరికా ఆతిథ్యం ఇస్తుండటంతో, వచ్చే ఏడాది విదేశీ పర్యటకులు భారీ ఎత్తున వస్తారని అమెరికా అంచనా వేస్తోంది. ఈ నిబంధనను అమలు చేస్తే ఇప్పుడు వారందరూ సంబంధిత సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.

ఈటీఎస్ఏ

ఫొటో సోర్స్, Getty Images

తగ్గిన కెనడా ప్రయాణీకుల సంఖ్య

ట్రంప్ పాలన గతంలో విద్యార్థి వీసాలు లేదా నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా ఉంచాలని కోరింది. వీటిలో హెచ్1బీ వీసాకు ఇప్పుడు చాలా ఎక్కువ ఫీజు ఉంటోంది.

స్టూడెంట్ వీసా విధానం గురించి ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ "మన దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని అమెరికన్ పౌరులు ఆశిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం అదే పని చేస్తోంది" అన్నారు.

‘‘నిర్దిష్ట విదేశీ తీవ్రవాద సిద్ధాంతాలను సమర్థించే వారు, మద్దతు ఇచ్చేవారు, జాతీయ భద్రతను సవాల్ చేసేవారికి మద్దతిచ్చేవారు లేదా యాంటీ సెమెటిజం (యూదు వ్యతిరేకత)తో వేధింపులు లేదా హింసకు పాల్పడే వారిని స్క్రీనింగ్ చేయాలి'' అని అధికారులకు సూచించారు.

సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసే విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఇప్పటికే విధించిన ట్రావెల్ బ్యాన్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ కరేబియన్‌లలోని 19 దేశాలను ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు దాన్ని విస్తరించే అవకాశం ఉందని ఇటీవల అధికారులు చెప్పారు.

వాషింగ్టన్‌ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పుల దాడి తర్వాత ఈ ప్రకటన వెలువడింది. దీనిలో ఒక అఫ్గాన్‌ వ్యక్తి అనుమానితుడు.

ఈఎస్‌టీఏ డేటా సేకరణకు సంబంధించిన కొత్త ప్రతిపాదనపై ప్రజాభిప్రాయాన్ని ఆహ్వానిస్తోంది. ప్రజలు 60 రోజులలో తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు.

డిజిటల్ రైట్స్ సంస్థ ఎలక్ట్రానిక్ ఫ్రంటియర్ ఫౌండేషన్‌కు చెందిన సోఫియా కోప్ ఈ ప్లాన్‌ను విమర్శించారు. ‘‘ఇది పౌర హక్కులకు జరుగుతున్న నష్టాన్ని తీవ్రం చేస్తుంది’’ అని న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు.

ట్రంప్ హయాంలో వచ్చిన ట్రావెల్ పాలసీలు అమెరికా టూరిజంపై గతంలో ప్రభావం చూపాయని నిపుణులు చెప్పారు. ఇక 184 ఆర్థిక వ్యవస్థలలో అమెరికాలో మాత్రమే విదేశీ సందర్శకుల వ్యయంలో క్షీణత ఉంటుందని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ఈ ఏడాది ప్రారంభంలో అంచనా వేసింది.

ట్రంప్ ఇటీవల విధించిన సుంకాలకు నిరసనగా చాలామంది కెనడియన్ల అమెరికా ప్రయాణాన్ని బహిష్కరించడం వంటివి కూడా అమెరికా పర్యటకంపై ప్రభావం చూపినట్లు కనిపిస్తుంది.

అక్టోబర్‌లో అమెరికాకు వెళ్లే కెనడియన్ ప్రయాణీకుల సంఖ్యలో వరుసగా 10వ నెల క్షీణత కనిపించింది. అమెరికాకు వచ్చే అంతర్జాతీయ సందర్శకులలో నాలుగోవంతు మంది కెనడియన్లు ఇటీవలి వరకూ ఉండేవారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)