‘‘తన కంటే అందంగా ఉన్నారని, బంధువుల పిల్లలను చంపిన మహిళ..అనుమానం రాకూడదని కొడుకునూ చంపింది’’

ఫొటో సోర్స్, Vinit Kumar
- రచయిత, షకీల్ అక్తర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు)
అది 2025 డిసెంబర్ 1, హరియాణాలోని ఓ గ్రామం. ఓ ఇంట్లో పెళ్లి వాతావరణం. బయట పెళ్లి ఊరేగింపు జరుగుతోంది.
కానీ, పెళ్లికి వచ్చిన బంధువుల పాప విధి(6) చాలాసేపటి నుంచి కనిపించడం లేదు. పాప కోసం అన్నిచోట్లా వెదికారు. చివరికు విధి ఇంటి స్టోర్ రూమ్‌లో పాప చనిపోయి కనిపించింది.
స్టోర్‌రూమ్‌లో నీటితొట్టెలో పాప మృతదేహం కనిపించింది. ఆ స్టోర్ రూమ్ ఇంటి మొదటి అంతస్తులో ఉంది. అయితే, దానికి బయటి నుంచి లాక్ చేసి ఉంది.
నవంబర్ 30న బంధువుల వివాహానికి హాజరు కావడానికి విధితోపాటు ఆమె తల్లిదండ్రులు సోనిపట్‌లోని ఒక గ్రామానికి వచ్చారు. విధి చుట్టం పూనమ్ కూడా అదే పెళ్లికి వచ్చారు.
బాలిక మృతదేహం దొరికిన తర్వాత, పోలీసులు ఈ కేసుపై పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం, డిసెంబర్ 3న పూనమ్‌ను అరెస్టు చేశారు.


ఫొటో సోర్స్, Getty Images
మరో ముగ్గురి హత్య
"కుటుంబ సభ్యులు పెళ్లి ఊరేగింపుకు వెళ్లినప్పుడు ,విధిని పూనమ్ స్టోర్ రూమ్‌కు తీసుకెళ్లి, నీటి టబ్‌లో ముంచి చంపారు" అని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.
పాపను ముంచిన తర్వాత, పూనమ్ స్టోర్ రూమ్‌కు బయటి నుంచి లాక్ చేశారు. అనంతరం కిందకు వచ్చి, మునుపటిలాగే కబుర్లు చెబుతూ కూర్చున్నారు.
తన కొడుకుతో పాటు, మరో ముగ్గురు బంధువుల అమ్మాయిలను చంపినట్లు విచారణలో పూనమ్ అంగీకరించారని పానిపట్ ఎస్పీ భూపిందర్ సింగ్ మీడియా సమావేశంలో చెప్పారు. ఈ విషయాన్ని పూనమ్ బంధువులు నమ్మలేకపోయారు. పూనమ్ భర్త, విధి తండ్రి కజిన్స్.

ఫొటో సోర్స్, Vinit Kumar
ఎందుకు హత్య చేశారు?
ఆరేళ్ల విధి హత్య ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది. పూనమ్ 2023లో సోనిపట్‌లోని భవార్ గ్రామంలో తన సొంత ఇంట్లో మొదటి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పూనమ్ మొదట తన తొమ్మిదేళ్ల మేన కోడలిని నీటి ట్యాంక్‌లో ముంచి చంపారు. అనుమానం రాకుండా ఉండటానికి, తన మూడేళ్ల కొడుకును కూడా అదే ట్యాంక్‌లో ముంచి, ప్రమాదంగా నమ్మించారని పోలీసులు చెప్పారు.
ఆగస్టు 2025లో సేవా గ్రామంలో పూనమ్ తనకు వరుసకు సోదరుడైన వ్యక్తి ఆరేళ్ల కుమార్తెను కూడా ఇదే తరహాలో నీటిలో ముంచి హత్య చేశారు.
"బంధువులు ఈ మూడు సంఘటనలను ప్రమాదవశాత్తు జరిగినవిగా భావించారు. వారికి ఎటువంటి అనుమానం రాలేదు. కేసు నమోదు చేయలేదు" అని పోలీసులు తెలిపారు.
పూనమ్ బాలికలను చంపడానికి గల కారణాన్ని ఎస్పీ భూపేంద్ర సింగ్ వివరిస్తూ, "ఆమె అందమైన అమ్మాయిలను ద్వేషిస్తుంది" అన్నారు.
" పూనమ్ ఎవరైనా అందమైన అమ్మాయిని చూసిన వెంటనే, తన కంటే అందంగా మారుతుందని అసూయపడేది" అన్నారు ఎస్పీ భూపేంద్ర సింగ్.
"ఆమె కుటుంబంలో మరే అమ్మాయి తన కంటే అందంగా ఉండకూడదనుకున్నారు. ఈ అసూయ ఆమెను సైకో కిల్లర్‌గా మార్చింది" అని వివరించారు.

ఫొటో సోర్స్, Vinit Kumar
'హత్యకు ముందు నిశ్శబ్దంగా, ఒంటరిగా'
పూనమ్ వయసు 32 ఏళ్లు. పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ, బీఎడ్ పూర్తి చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఉద్యోగం చేయలేదని, 2019లో వివాహం చేసుకున్నారని తెలిపారు.
నిందితురాలు 'సైకో కిల్లర్' అని దర్యాప్తు ద్వారా తెలుస్తోందని పోలీసులు చెప్పారు.
"పూనమ్ ఈ హత్యలను యాదృచ్ఛికంగా చేయలేదు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి, ప్రమాదాలుగా చూపించారు" అని పోలీసులు తెలిపారు. హత్యలకు ముందు పూనమ్ చాలా నిశ్శబ్దంగా, ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించినట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. విధి హత్య తర్వాత, పూనమ్ సాధారణంగా కనిపించారని, వివాహ వేడుకలకూ హాజరయ్యారని స్థానికులు తెలిపారు.
"పూనమ్ ప్రవర్తన, హత్య తర్వాత తనకు పశ్చాత్తాపం లేదని స్పష్టంగా చూపిస్తుంది" అని పోలీసులు చెప్పారు.
తన మేనకోడలి హత్యను ప్రమాదంగా చూపించడానికి పూనమ్ తన కొడుకును కూడా నీటిలో ముంచి చంపారని పోలీసులు వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














