అమ్మా, నాన్న, ఓ అమ్మాయి: హైస్కూల్ నాటి ప్రేమ పక్షులు, 40 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు.. !

ఫొటో సోర్స్, Deb, Kevin and Val
- రచయిత, అస్యా ఫౌక్స్, థామస్ హార్డింగ్ అస్సిండర్, రఫేల్ అబుచైబే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అది 1967 సంవత్సరం, కెవిన్ కరోల్, డెబ్బి వెబర్‌లు తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. ఇద్దరూ యుక్త వయస్కులే. వారి వారి హైస్కూల్ థియేటర్ గ్రూపుల్లో సభ్యులు.
బీబీసీ అవుట్‌లుక్ ప్రోగ్రాంలో కెవిన్ కరోల్ నాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ''నాది బాయ్స్ స్కూల్, డెబ్బీది గర్ల్స్ స్కూల్. ఆడిటోరియంలో జాయింట్ ఆడిషన్ జరుగుతున్నప్పుడు ఆమెను చూసి, నా ఫ్రెండ్‌తో 'ఆ అమ్మాయిని చూశావా? ఆమెను నేను స్కూల్ డ్యాన్స్‌కి తీసుకెళ్లబోతున్నా' అని చెప్పినట్లు వెల్లడించారు.
డెబ్బీ వెబర్ కూడా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ''ఆడిటోరియంలో నేనొక్కదాన్నే కూర్చుని ఉన్నా. ఆడిషన్‌కి వచ్చిన వేరే స్కూల్ అమ్మాయిలెవరూ నాకు తెలియదు. కానీ నాకు బాగా గుర్తు, అతన్ని చూడగానే, నేను చూసినవారిలో అతనే అత్యంత అందమైన అబ్బాయి అని అనుకున్నాను'' అని చెప్పారు.
చివరికి వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడమే కాదు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. మేరీల్యాండ్‌కి పారిపోతే, సులభంగా పెళ్లి చేసుకోవచ్చనీ ప్లాన్ చేసుకున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
కానీ ఆ వార్తతో అంతా మారిపోయింది
వెబర్ గర్భవతి అనే వార్తతో వారి ప్లాన్ అంతా చెదిరిపోయింది. అంతేకాదు, 40 ఏళ్లకు పైగా ఎడబాటుకు గురయ్యేలా చేసింది.
అయితే ఇన్నాళ్లకు మళ్లీ వారిద్దరూ కలుసుకోగలిగారు. తాము యవ్వనంలో అనుభవించలేని ప్రేమను ఇప్పుడు ఎంతో ఆస్వాదిస్తున్నామని చెప్పారు.
వారి ప్రేమ ప్రయాణం ఓ హాలీవుడ్ సినిమాకు కథాంశం అయ్యింది.

ఫొటో సోర్స్, Deb, Kevin y Val
అదొక ఊహించని వార్త...
ఆ కాలంనాటి సామాజిక విలువల నేపథ్యంలో, తమ కుమార్తె గర్భం గురించి చెప్పినప్పుడు వెబర్ తల్లిదండ్రులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
''కెవిన్ వాట్ల వారు ఎంతో ప్రేమగా ఉండేవారు. అతను మంచివాడని, మేము ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నామని వారికి తెలుసు'' అని వెబర్ బీబీసీకి చెప్పారు.
''కానీ అప్పట్లో, గర్భవతి అయిన అమ్మాయిల విషయంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి'' అని ఆమె అన్నారు.
''వారాంతాల్లో కెవిన్ వచ్చేవాడు. తనతో నన్ను తీసుకెళ్లడానికి మా అమ్మ అనుమతించేది. మేము ఇద్దరం డ్రైవింగ్‌కు వెళ్లేవాళ్లం'' అని వెబర్ గుర్తుచేసుకున్నారు.
ఇద్దరూ పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు జన్మనిచ్చి, చక్కగా పెంచాలని కలలుగనేవాళ్లు.
అప్పటికి 17 ఏళ్ల వయసున్న కరోల్ యుఎస్ మెరైన్ కోర్‌లో చేరారు.
‘‘మేం పెళ్లి చేసుకోకపోయినా, సైన్యంలో చేరితే డెబ్బీకి డబ్బు పంపగలనని, వైద్యపరంగా ఆమెను, బిడ్డను మెరైన్ వైద్య సిబ్బంది చూసుకుంటారని అనుకున్నాను. ట్రైనింగ్ పూర్తయ్యాక తనను వివాహం చేసుకోవచ్చని భావించా'' అని కరోల్ చెప్పారు.
కానీ అదంతా కలగానే మిగిలిపోయింది.
ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు కెవిన్‌కు ఒక లెటర్ వచ్చింది. బిడ్డను దత్తత ఇవ్వబోతున్నానని వెబర్ అందులో పేర్కొన్నారు.
''ఆ బాధ నాకు గుర్తుంది'' అంటున్న కరోల్ గొంతు జీరబోయింది.
‘‘ట్రైనింగ్‌లో నా చుట్టూ చాలామంది ఉన్నారు. అక్కడ మనం భావోద్వేగాలను ప్రదర్శించలేం. కానీ, మనస్సులో నా కలల ప్రపంచం కూలిపోయింది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Deb, Kevin y Val
జీవితమంతా ట్విస్టులే...
వియత్నాంలో యుద్ధం కోసం వెళ్లిన కరోల్‌తో సంబంధం తెగిపోవడంతో తన బిడ్డ భవిష్యత్తు గురించి వెబర్ మదిలో భయాలు మొదలయ్యాయి.
దత్తత తీసుకోవడానికి ఒక కుటుంబం ఆసక్తిగా ఉందని డాక్టర్ చెప్పినప్పుడు ఆమెకు కాస్త ఊరట లభించింది.
''వారిది నలుగురు పిల్లల కుటుంబం. ఇక పిల్లలు కలిగే అవకాశంలేని తల్లి ఒకరు మీకు ఆడపిల్ల ఉంటే, ఆమెను దత్తత తీసుకోవాలనుకుంటున్నారు'' అని డాక్టర్ చెప్పారు.
వెబర్ ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు. తన బిడ్డ అచ్చం కరోల్‌లాగా తనకు కనిపించిందని వెబర్ అన్నారు.
దత్తత తీసుకోవాలనుకుంటున్న కుటుంబం గురించి పెద్దగా ఏమీ తెలుసుకోకుండానే ఆ బిడ్డను ఆమె అప్పగించారు.
ఆ తర్వాత కరోల్ వియత్నాంలోనే ఉండిపోవడంతో, ఆమె కుటుంబం వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది.
''యుద్ధంలో కూలిపోయిన విమానాలను, అందులో పైలట్లను వెతికి తీసుకురావడం నా పని. 1969 అక్టోబర్ 10వ తేదీన ఒక హెలికాప్టర్‌ను వెతుక్కుంటూ మేము వెళ్లాం'' అని కరోల్ గుర్తుచేసుకున్నారు.
ఆ ఆపరేషన్ సమయంలోనే కరోల్ చేతులు, కాళ్లు, వీపులో లోహపు ముక్కలు గుచ్చుకున్నాయి.‘‘నేను అక్కడి నుంచి బయటపడతానని అనుకోలేదు'' అని కరోల్ బీబీసీకి చెప్పారు.
''డెబ్బీని మళ్లీ చూడకుండా, నా బిడ్డను చూడకుండా, ఇంటి నుంచి ఎక్కడో 18,000 మైళ్ల దూరంలో ఇక్కడ నన్ను ఇలా చంపేయబోతున్నావా’’ అని తాను దేవుడిని మనసులో ప్రశ్నించినట్లు కరోల్ గుర్తుచేసుకున్నారు.
అయితే, తోటి మెరైన్ ఒకరు కరోల్‌ను రక్షించారు. అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌కు, తర్వాత జపాన్‌కు ఆయన్ను తరలించారు. ఆ తర్వాత కోలుకోవడానికి ఆయన అమెరికాకు తిరిగివచ్చారు.
''ఆ సమయంలో నాకు 18 ఆపరేషన్లు జరిగాయి. ఆ తర్వాత మరో 20 ఆపరేషన్లు జరిగాయి. వీల్‌చైర్ నుంచి వాకర్‌కు, వాకర్ నుంచి చేతికర్రలకు మారాను. ఎప్పుడూ మళ్లీ అనారోగ్యం పాలుకాలేదు'' అని కరోల్ చెప్పారు.
ఇదంతా జరుగుతున్న సమయంలోనే, వెబర్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నించానని కరోల్ చెప్పారు.
కానీ, అపరాధ భావనతో వెబర్ మాత్రం గతాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె చాలాసార్లు వివాహం చేసుకున్నారు. ముగ్గురు కూతుళ్లకు తల్లిగా మారి, చివరికి విడోగానే మిగిలిపోయారు.
చాలా సంవత్సరాల కిందటే దూరమైన తమ కుమార్తె గురించి ఇద్దరికీ తెలియదు.

ఫొటో సోర్స్, Deb, Kevin y Val
ఒకరికొకరు ఎలా తెలుసుకున్నారు?
గతంలో ఏం జరిగిందో తన బిడ్డలకు చెప్పాలని వెబర్ నిర్ణయించుకున్నారు.
''ఆ రోజు మదర్స్ డే. మేము వంటగదిలో ఉన్నాం. నేను మీకు ఒక విషయం చెప్పాలి. నా చిన్నతనంలో నాకొక బిడ్డ పుట్టింది' అని వారికి చెప్పడమే గాక, కరోల్‌కు తనకు మధ్య జరిగిన విషయాలన్నింటినీ వెబర్ పిల్లలకు వివరించారు.
నా కూతుళ్లలో ఒకరు ఒకరు ఆ బిడ్డను కనిపెట్టడానికి వివరాలు అడిగినట్లు చెప్పారు.
''నాకు ఇంటిపేరు తెలుసు, ఆ కుటుంబంలో నలుగురు అబ్బాయిలు ఉన్నారని తెలుసు. వారు నివసించిన ప్రాంతం గురించి తెలుసు'' అని వెబర్ తన కూతురికి చెప్పారు.
ఆ ఆధారాలతో వెబర్ కూతురు ఆ కుటుంబం వివరాలన్నీ తెలుసుకున్నారు. ఆ సోదరులలో ఒకరితో మాట్లాడారు.
ఫలితంగా వెబర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. అది తన మొదటి బిడ్డ వ్యాల్ నుంచి.

ఫొటో సోర్స్, Deb, Kevin y Val
'ఆమెకు కృతజ్ఞురాలిని...'
''ఉదయం ఎనిమిది గంటల సమయంలో నేను ఫోన్ చేశాను. మనం చాలా మాట్లాడుకోవాలని అన్నాను. ఆమె చేసింది తప్పేమీ కాదు. నాకు ఆమె మీద కోపంలాంటిదేమీ లేదు’’అని వ్యాల్ బీబీసీతో అన్నారు.
ఆ స్పందన వెబర్‌కు మనసును తేలిక చేసింది. ‘‘నాలోని అపరాధ భావన అంతా పోయింది’’ అని వెబర్ అన్నారు. ఆ రోజు రాత్రే వాళ్లు కలుసుకున్నారు.
అప్పుడు వాళ్ల ముందున్న ప్రశ్న... వ్యాల్ కన్న తండ్రి ఎక్కడ?.
ఆన్‌లైన్‌లో వెతికినప్పుడు, కరోల్ దివంగత భార్య సంస్మరణ గురించి తెలిసింది. ఆ అడ్రస్‌తో వెబర్ ఆయనకు ఒక లెటర్ రాశారు.
''మీ ఇంట్లో జరిగిన పరిణామాలకు చింతిస్తున్నాను. మన స్కూల్ డేస్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నా '' అంటూ లేఖ రాయడంతో పాటు తన ఫోన్ నంబరును కూడా ఇచ్చారు.

ఫొటో సోర్స్, Deb, Kevin y Val
‘ఆ లేఖను మర్చిపోలేను’
వెబర్ నుంచి వచ్చిన లెటర్ కరోల్‌కు ఒక అద్భుతంలా తోచింది.
''ఆ లేఖ అందుకున్న క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను నేరుగా ఫోన్ దగ్గరకు వెళ్లి, 'మనం ఇలా మాట్లాడుకోగలుగుతున్నామంటే నమ్మబుద్ధి కావడం లేదు' అని చెప్పాను'' అంటూ కరోల్ గుర్తుచేసుకున్నారు.
''మీతో చెప్పాల్సిన విషయం నా దగ్గరొకటి ఉంది'' అని తాను కరోల్‌తో అన్నట్లు వెబర్ గుర్తు చేసుకున్నారు.
‘‘మన అమ్మాయి ఎక్కడుందో నాకు తెలుసు. మీరు కూడా ఆమెను కలవాలనుకుంటున్నారా’’ అని కరోల్‌ను అడిగినట్లు చెప్పారు వెబర్.
''అవును'' అంటూ అటువైపు నుంచి గట్టిగా సమాధానం. తర్వాత, వెబర్ ఇంట్లో అందరూ కలుసుకున్నారు.
కరోల్ రాగానే, ఓహ్, ఎంత బాగున్నాడు' అంటూ తల్లి స్పందించిన తీరును చూసి వ్యాల్‌కు నవ్వొచ్చింది. తండ్రీ కూతురు గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Deb, Kevin y Va
70లలో పెళ్లి చేసుకున్నారు...
నాడు పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న వారి ప్లాన్ ఫెయిలై దాదాపు 40 ఏళ్లు గడిచిపోయిన తర్వాత వారిద్దరూ ఒకటయ్యారు.
ప్రస్తుతం 70 ఏళ్ల వయస్సులో ఉన్న వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను పంచుకుంటున్నారు.
''జీవితంలోని ఈ దశలో మేము ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నాం. ఒకరినొకరు ప్రేమించుకోగలుగుతున్నాం. నిజం చెప్పాలంటే, నాకు ఇంకేమీ అవసరం లేదు'' అన్నారు వెబర్.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














