మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్: ట్రంప్ - కిమ్ ‘ప్రేమ కథ’ ముందుకు సాగదేం?

ఫొటో సోర్స్, Getty Images
కిమ్ జోంగ్-ఉన్ తాను ప్రేమలో పడ్డామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట గుర్తుందా? కానీ.. ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య మాటలు లేనట్లు కనిపిస్తోంది.
పైగా.. అమెరికా, ఉత్తర కొరియాలు ఒక దానినొకటి ఉరిమురిమి చూసుకుంటున్నట్లు.. ఎవరు ముందు తప్పటడుగు వేస్తారని ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. కానీ ఇద్దరిలో ఎవరూ వెనుకడుగు వేయటానికి సిద్ధంగా లేరు.
ఇద్దరు నాయకుల మధ్య రెండో శిఖరాగ్ర సమావేశం ఏర్పాటుకు సంబంధించిన చర్చలు.. ముందు అనుకున్నట్లుగా ఈ వారం జరగలేదు.
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ సహాయకుడు కిమ్ యాంగ్-చోల్ న్యూయార్క్ వచ్చి అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయోను కలవాల్సి ఉంది.
కానీ.. ఉత్తర కొరియా ప్రతినిధులు ప్రణాళిక ప్రకారం బయలుదేరలేదని తెలుసుకున్న అమెరికా విదేశాంగ శాఖ ఈ సమావేశాన్ని రద్దు చేసినట్లు బీబీసీకి తెలిసింది.

ఫొటో సోర్స్, Reuters
అయితే.. ఈ సమావేశం మరో తేదీన నిర్వహిస్తామని అమెరికా చెప్తోంది. ఉత్తర కొరియా విషయంలో తాము అనుకున్నట్లుగా పరిణామాలు జరుగుతున్నాయని ట్రంప్ ‘‘చాలా సంతోషం’’ వ్యక్తం చేశారు. ఆంక్షలు అమలులో ఉండగా తాను ‘‘తొందరపడబోను’’ అని చెప్పారు.
దక్షిణ కొరియాలో కూడా.. రద్దయిన సమావేశం గురించి ఊహాగానాలు చేయవద్దని విలేఖరులను కోరుతున్నారు. గతంలో కూడా కొన్ని సమావేశాలు రద్దయ్యాయని చెప్తున్నారు.
మరోవైపు.. ఆ దేశ విదేశాంగ శాఖ అధికారులు ఈ సమావేశం రద్దవటం పట్ల నిరుత్సాహం వ్యక్తం చేశారు.
ఉత్తర కొరియా మీద నిరాయుధీకరణ కోసం అంతర్జాతీయ సమాజం ఒత్తిడి చేసే ప్రయత్నంలో ‘‘ఎగుడుదిగుళ్లు, ఎదురుదెబ్బలు’’ ఉంటాయని తాను భావిస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
కానీ.. చర్చల ఒరవడి.. ఉత్తరకొరియాతో సంభాషించే అవకాశం చేజారిపోతోందోమేనని అనిపించకుండా ఉండటం కష్టం.
కింది స్థాయిలో కూడా.. ఉత్తర కొరియాకు అమెరికా కొత్త రాయబారి స్టీఫెన్ బీగన్ ఆ బాధ్యతలు చేపట్టి రెండు నెలలకు పైగా గడచిపోయినా.. ఆయన అమెరికాకు ఉత్తర కొరియా రాయబారి, ఆ దేశ విదేశాంగ ఉప మంత్రి చోయ్ సన్-హుయిని ఇంకా కలవలేదు.

ఫొటో సోర్స్, Getty Images
సంపూర్ణ అణు నిరాయుధీకరణ?
ఈ ప్రతిష్టంభనకు మూల కారణం.. ‘‘అణు నిరాయుధీకరణ’’ లక్ష్యాల విషయంలో ఉత్తర కొరియా - అమెరికాల మధ్య నిజంగా ఒక అంగీకారం లేకపోవటం.
ఇద్దరు నాయకులూ సింగపూర్‌లో ఒక ఒప్పందం మీద సంతకాలు చేశారన్నది నిజమే. కానీ.. ఆ ఒప్పందంలో వివరాలు లేవన్న విషయం ఇప్పుడు ఈ చర్చలపై నీలి నీడలు కమ్ముకొనేలా చేస్తోంది. పురోగతిని నిరోధిస్తోంది.
ఉత్తర కొరియా ఆరంభం నుంచీ స్పష్టంగానే ఉంది. ఆ దేశం ఏకపక్షంగా నిరాయుధీకరణ చేయబోదు. ఈ ప్రక్రియ దశల వారీగా సాగాలని.. తాము కొంత చేస్తే.. దానికి ప్రతిఫలంగా ఏదైనా దక్కాలని కోరుకుంటోంది.
దానర్థం.. ఇప్పటికి తాము చేసిన దానికి.. తమపై ఆంక్షల నుంచి ఉపశమనం కావాలని భావిస్తోంది.

ఫొటో సోర్స్, AFP
ఉత్తర కొరియా మీద అమెరికా, ఐక్యరాజ్యసమితులు రెండూ కఠినమైన ఆంక్షలు విధించాయి.
బొగ్గు, ఇనుప ఖనిజం, సముద్ర ఆహారం, వస్త్రాలు సహా ఆ దేశపు ఎగుమతుల్లో 90 శాతాన్ని నిషేధించారు.
ఆ దేశం కొనుగోలు చేయగల చమురు పరిమాణం మీద కూడా పరిమితులు విధించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తానని ఉత్తర కొరియా ప్రజలకు హామీ ఇచ్చిన కిమ్.. ఆ పని చేయాలంటే ఈ ఆంక్షలను తొలగింపజేయాల్సి ఉంటుంది.
మరోవైపు అమెరికా కూడా పట్టుదలగానే ఉంది. ‘‘సంపూర్ణ అణు నిరాయుధీకరణ’’ జరిగే వరకూ ఆంక్షల నుంచి ఉపశమనం ఉండదని అంటోంది.
ఇప్పటికైతే అది అవాస్తవికమైన లక్ష్యంగా కనిపిస్తోంది. ‘‘ఆంక్షలను తొలగించటం నాకు ఇష్టమే’’ అని ట్రంప్ చెప్పారు కూడా. అయితే.. అందుకు ‘‘ఉత్తర కొరియా కూడా ప్రతిస్పందించాల్సి ఉంటుంది’’ అని షరతు పెట్టారు.

ఫొటో సోర్స్, AFP
అమెరికా రాజీ పడుతుందా?
ఉత్తర కొరియా బ్యాంకుల మీద ఆంక్షల విషయంపై చర్చించటానికి రష్యా ఈ వారంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేసింది.
కానీ.. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ.. ‘‘ముప్పు ఇంకా కొనసాగుతోంది. ఉత్తర కొరియాలో అణు స్థావరాలు ఇంకా కొనసాగుతున్నాయి. వాటిని తనిఖీ చేయటానికి పరిశీలకులను ఆ దేశం ఇంకా అనుమతించలేదు’’ అని విస్పష్టంగా పేర్కొన్నారు.
అమెరికా తన ఆలోచనా విధానం, వైఖరిలో కొంత సర్దుకుపోవాలని కొందరు విశ్లేషకులు సూచించారు. ఈ ప్రక్రియ పూర్తిగా విచ్ఛిన్నమవకముందే కాస్త మెత్తబడాలన్నారు. కానీ అందుకు ట్రంప్ సర్కారు సుముఖంగా ఉన్న సంకేతాలు ఇప్పటివరకూ లేవు.
అమెరికా అందుకు సంసిద్ధంగా లేకపోతే.. ఉత్తర కొరియా ఏం చేస్తుంది? ఆ దేశం గత వారంలో విదేశాంగ మంత్రిత్వశాఖలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ అమెరికన్ స్టడీస్ ద్వారా ఇచ్చిన ఒక ప్రకటనలో ఒక హెచ్చరిక జారీ చేసింది.
‘‘సంబంధాలు, ఆంక్షల పరిస్థితి మెరుగుపడటం అసంపూర్ణంగా ఉంద’’ని.. అమెరికా ‘‘తన వైఖరిలో ఎలాంటి మార్పూ చూపకుండా.. మేం పదే పదే చేస్తున్న డిమాండ్‌ను సరిగ్గా అర్థం చేసుకోకుండా అహంకారంతో ప్రగల్భాలు పలుకుతోంద’’ని ఆ ప్రకటనలో పేర్కొంది.
అమెరికా ఆంక్షలను రద్దు చేయకపోతే.. తాము తమ అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించగలమని ఆ ప్రకటన సూచించింది.
ఉత్తర కొరియా ఆయుధాలను తయారు చేయటం, పోగువేసుకోవటం ఆపలేదని అమెరికా, ఐక్యరాజ్యసమితి నిఘా పరిశీలనలు చెప్తున్న విషయం గుర్తుంచుకోవాలి.
అయితే.. క్షిపణులు, అణ్వాయుధాలను పరీక్షించటాన్ని ఆ దేశం నిలిపివేసింది. అది తన వ్యక్తిగత విజయమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకుంటున్నారు. ‘‘ఉత్తర కొరియా నుంచి ఇక ఏ మాత్రం అణు ముప్పు లేదు’’ అని కూడా ఆయన ప్రకటించారు.

ఫొటో సోర్స్, KCNA
ఉత్తర కొరియా ముందున్న దారులు
ఉత్తర కొరియా ముందు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. ఆ దేశం మరో క్షిపణిని పరీక్షించవచ్చు. అలా చేస్తే.. సమస్య పరిష్కారమైపోయిందని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడికి అది ఇబ్బందికర పరిస్థితి అవుతుంది.
కానీ.. దానివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
క్షిపణి పరీక్ష నిర్వహించినట్లయితే.. అనూహ్యంగా స్పందించే డొనాల్డ్ ట్రంప్‌ను.. తన అధికారం ఏ మాత్రం బలహీనంగా కనిపించటానికి ఇష్టపడని అమెరికా అధ్యక్షుడిని ఆగ్రహానికి గురిచేయవచ్చు.
ఉత్తర కొరియా మీద ఆంక్షలు తొలగించిన వెంటనే ఆ దేశంలో పెట్టుబడులు పెట్టటానికి దక్షిణ కొరియా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల మరోసారి క్షిపణి లేదా అణు పరీక్ష నిర్వహించటం.. దక్షిణ కొరియాతో ప్రస్తుతం బలపడుతున్న సంబంధాలను దెబ్బ తీయవచ్చు.
కిమ్ జోంగ్ ఉన్ ముందున్న మరో మార్గం.. తానే తొలుత వెనక్కు తగ్గి తన హామీలను నెరవేర్చటం. అంతర్జాతీయ పరిశీలకులను.. తమ దేశంలోని అణు పరీక్ష కేంద్రమైన పుంగ్యేరీ తనిఖీకి అనుమతించటం.
ఆ కేంద్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశామంటూ గత మే నెలలో అక్కడ జరిపిన వరుస పేలుళ్లను వీక్షించటానికి టీవీ కెమరాలను కూడా రప్పించారు.

ఫొటో సోర్స్, DIGITALGLOBE
పరిశీలకులను తనిఖీ కోసం అనుమతిస్తానని కిమ్ తనతో చెప్పినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ పేర్కొన్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని దక్షిణ కొరియాలో వార్తలు వచ్చాయి. ఇది.. ఉత్తర కొరియా తమ డిమాండ్లకు కట్టుబడి ఉండటానికి తోడ్పడుతుంది.
ఉత్తర కొరియా అణ్వాయుధాల కోసం అణు పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నట్లు భావిస్తున్న యాంగ్‌బ్యాన్ అణు కేంద్రాన్ని ఆ దేశం మూసివేయచ్చు కూడా.
దానిని మూసివేస్తామని ఈ ఏడాది ఆరంభంలో ఉత్తర కొరియా హామీ ఇచ్చింది. అయితే.. అందుకు అనుగుణంగా అమెరికా చర్యలు చేపట్టేటట్లయితేనే ఆ పని చేస్తామని చెప్పింది.
ఈ పని ముందుగా చేయాలంటే కిమ్‌కి రాజకీయంగా చాలా కష్టమవుతుంది. కాబట్టి ఉత్తర కొరియా ఈ పని చేసేందుకు వీలుగా అమెరికా ఏదైనా తాయిలం ఇవ్వాలి.
ఉత్తర కొరియా నాయకులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్న కొందరు వ్యక్తులు.. యువ నేతగా కిమ్ జోంగ్-ఉన్ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.
ఆయన చుట్టూ సైనిక అతివాదులు ఉన్నారు. నిరాయుధీకరణకు వారు సిద్ధంగా లేరు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గినట్లు కనిపించటానికి కూడా వారు సిద్ధంగా లేరు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా తెలివైన క్రీడ
కొంత కాలం గడవనివ్వాలని.. వేచిచూడటం మేలని బహుశా ఇరు పక్షాలూ భావిస్తుండివచ్చు. ఉత్తర కొరియా తదుపరి చర్యలు చేపట్టే వరకూ అమెరికా ఆంక్షలను కొనసాగించవచ్చు.
ఉత్తర కొరియా తన తరహా హెచ్చరికలను జారీ చేస్తూనే.. ఇతర దౌత్య సంబంధాలను అభివృద్ధి చేసుకుంటూ ఉండొచ్చు.
ఏదేమైనా.. ఇది అమెరికాకు పెద్ద జూదం. ఉత్తర కొరియా అణ్వాయుధాలు తక్షణ సమస్య అని అమెరికా రక్షణ, నిఘా సంస్థల అధిపతులు ముద్రవేశారు.
ఆ ప్రమాదం ఇంకా అలాగే ఉంది. ఈ ప్రతిష్టంభన ఎంత ఎక్కువ కాలం కొనసాగితే.. అంత ఎక్కువగా ఉత్తర కొరియా తన ఆయుధాలను అభివృద్ధి చేసుకోవటం కొనసాగించే అవకాశముంది.
ఆ దేశం మీద విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలు కేవలం పరిమిత ప్రభావమే చూపించొచ్చు. అమెరికా తన ‘‘తీవ్ర ఒత్తిడి’’ విధానానికి చైనా, రష్యాలు కొన్ని నెలల పాటు మద్దతు ఇచ్చేలా ట్రంప్ సర్కారు చూసుకోగలిగింది.
కానీ.. కొన్ని ప్రాంతాల్లో సరిహద్దులకు బీటలు వారాయని.. ఉత్తర కొరియాకు సరుకులు సరఫరా అవుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. కిమ్ జాంగ్-ఉన్ తెలివైన రాజకీయ నిర్వాహకుడిగా నిరూపించుకున్నారు. తన పొరుగు దేశాలతో సంబంధాలను పునర్నిర్మించుకున్నారు.
కిమ్ జోంగ్-ఉన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య వచ్చే ఏడాది ఆరంభంలో మరో శిఖరాగ్ర సమావేశం జరుగుతుందని అమెరికా చెప్తోంది.
ఈ ఇద్దరు నాయకులూ పరస్పరం నేరుగా మాట్లాడుకోవటానికి ప్రాధాన్యం ఇస్తుండొచ్చు. కానీ.. ఏదైనా ఒప్పందం విధివిధానాలు, వివరాలను ఖరారు చేయటానికి.. అధికార వరుసలో కింది శ్రేణుల మధ్య కూడా చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుంది. అణు నిరాయుధీకరణకు ఒక కాలక్రమ నిర్ణయం, అందుకు అనుగుణంగా అమెరికా చర్యలు వంటివి ఆ విధివిధానాల్లో ఒకటి.
ఈ వివరాలేవీ ఒప్పందంలో లేకపోతే.. ఇది ఎవరు ముందు వెనుకడుగు వేస్తారనే దౌత్య క్రీడగానే మిగులుతుంది. ఉత్తర కొరియా విషయంలో ప్రశంసలు అందుకున్న ట్రంప్ విధానం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది.
- ‘‘ఎక్స్పోజింగ్’తో సమస్యలు రావద్దనే.. ఊర్లో మహిళలు నైటీ ధరిస్తే.. రూ. 2,000 జరిమానా’
- అడ్వాణీని కోలుకోలేకుండా చేసిన ఆ ఒక్క తప్పు
- ‘ఫేక్‌న్యూస్ మూలాలు మహాభారతంలోనూ ఉన్నాయి’ - మాడభూషి శ్రీధరాచార్యులు
- ఫేక్ న్యూస్‌పై సమరం: ‘సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు’
- #BeyondFakeNews: రూ.2000 నోటు ఫేక్‌న్యూస్ కథ
- జాతీయవాదం పేరిట వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్ - బీబీసీ తాజా పరిశోధనలో వెల్లడి
- #HisChoice: వీర్యదాతగా మారిన ఓ కుర్రాడి కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








