‘ఎక్స్‌పోజింగ్’తో సమస్యలు రావద్దనే.. ఊర్లో మహిళలు నైటీ ధరిస్తే.. రూ. 2,000 జరిమానా - తోకలపల్లి ఊరిపెద్ద

నైటీ వేసుకుని పని చేసుకుంటున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శంకర్
    • హోదా, బీబీసీ కోసం

సంప్రదాయాలకు, కట్టుబాట్లకు కొల్లేరు ప్రాంతం పెట్టింది పేరు. ఆ కోవలోనే తోకలపల్లి గ్రామ పెద్దల కమిటీ ఇటీవల విధించిన ఓ ‘‘కట్టుబాటు’’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లాలోని తోకలపల్లి గ్రామ జనాభా 4,800 మంది. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం చేపల వేట. ఆక్వా సాగు విస్తరించటంతో ఆర్థికంగా ఇబ్బందులు లేవు. కొందరు ఉపాధి, ఉద్యోగాల కోసం గల్ఫ్ వలస వెళ్లారు.

నైటీ

ఫొటో సోర్స్, PRIYA KURIYAN

ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు రాత్రి సమయాల్లో మాత్రే నైటీలను ధరించేవారు. కానీ, ప్రస్తుతం పగటి పూట కూడా వేసుకోవడం పెరిగింది.

ఈ ఊర్లో మహిళల వస్త్రధారణపై ఆంక్షలు పెట్టారు. పగటిపూట నైటీలు ధరించకూడదని నిషేధం విధించారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ నైటీలు ధరించడం నిషిద్ధం.

గ్రామంలో 9 మంది పెద్దల కమిటీ ఈ నిర్ణయం చేసింది. గ్రామసభ నిర్వహించి ఈ కమిటీని ఎన్నుకుంటారు. ఇందులో గ్రామ పంచాయతీకి సంబంధం లేదు.

వీడియో క్యాప్షన్, వీడియో: ఈ ఊర్లో మహిళలు నైటీ ధరిస్తే.. రూ. 2,000 జరిమానా

పగలు నైటీ ధరిస్తే రూ. 2,000 జరిమానా

ఈ ఆంక్షలు అధిగమిస్తే శిక్షలు కూడా నిర్ణయించారు. పగటిపూట నైటీ ధరిస్తే.. 2,000 రూపాయలు జరిమానా విధిస్తారు. ఆంక్షలు ధిక్కరించి ఎవరు నైటీ ధరించారన్న సమాచారం ఇచ్చిన వారికి 1,000 రూపాయలు బహుమానం కూడా ప్రకటించారు.

పెద్దల కమిటీ నిర్ణయాన్ని ఊర్లో మైకులో ప్రచారం కూడా చేశారు.

నైటీ వేసుకుని పని చేసుకుంటున్న మహిళ

ఫొటో సోర్స్, PRIYA KURIYAN

ఫొటో క్యాప్షన్, నైటీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న కమిటీలో మహిళలు కూడా ఉన్నారు.

తోకలపల్లిలో పెద్దల కమిటీ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. వారి నిర్ణయం అందరూ అమలు చేయాల్సిందేనన్నది వారి కట్టుబాటు. వడ్డీల కులంలో పెద్దల మాటకు తిరుగులేదని చెప్తున్నారు. దీంతో మహిళల నైటీలపై నిషేధం నాలుగు నెలలుగా అమలవుతోంది.

స్కూలు పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ నైటీలతో వీధుల్లో తిరగడం వల్లే ఇలాంటి నిర్ణయం జరిగిందని గ్రామ మహిళలు చెప్తున్నారు.

పంచాయతీ కార్యాలయం

నిషేధంపై మాట్లాడటానికి మహిళల విముఖత

ఈ నిషేధాన్ని పిల్లలు కూడా పాటించాల్సి వస్తోందంటున్నారు. హైస్కూల్ విద్యార్థినులు కూడా తాము ఈ నిర్ణయం నాలుగు నెలలుగా అమలు చేస్తున్నామని తెలిపారు.

మహిళల వస్త్రధారణ మీద ఆంక్షలు విధించటం పట్ల గ్రామస్తుల్లో భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. వడ్డీలలో కొందరు తమ వ్యతిరేకతను బహిరంగంగా చెప్పలేని పరిస్థితి ఉంది.

గ్రామ సర్పంచ్ కూడా మహిళే. అయినా ఆమె కూడా ఈ నిషేధంపై గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు.

గ్రామ పెద్ద విష్ణుమూర్తి

‘ఎక్స్‌పోజింగ్’తో సమస్యలు రావద్దనే: ఊరి పెద్ద

మహిళలు నైటీలలో బయట తిరగటం వల్ల.. ‘ఎక్స్‌పోజింగ్’ వల్ల సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఈ ఆంక్షలు విధించినట్లు ఊరి పెద్దల్లో ఒకరైన బలే విష్ణుమూర్తి చెప్తున్నారు.

భయంతోనైనా కట్టుబాటును పాటిస్తారన్న ఉద్దేశంతోనే జరిమానాలు ప్రకటించామని.. కానీ ఎవరికీ జరిమానా వేయలేదని ఆయన అంటున్నారు.

అయితే.. గ్రామంలో ఇతర సామాజిక వర్గాలు మాత్రం నైటీలపై నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎస్‌సీ సామాజిక వర్గం వారు ఈ నిషేధాన్ని పాటించటం లేదు. అలాగని తమ వ్యతిరేకతను బలంగా వ్యక్తం చేయలేమని వారు అంటున్నారు.

ఎస్ఐ విజయ్‌కుమార్

మాకు ఫిర్యాదులేమీ రాలేదు: ఎస్ఐ

తోకలపల్లిలో చర్చనీయాంశంగా మారిన నైటీలపై నిషేధం విషయం అధికార యంత్రాంగం దృష్టికి కూడా వెళ్లింది.

నిడమర్రు తహసీల్దార్, తాను కలిసి దీనిపై గ్రామంలో విచారించామని.. మహిళలు తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పారని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.

వస్త్రధారణపై ఆంక్షల గురించి తమకు ఎటువంటి ఫిర్యాదులూ అందలేదని ఆయన చెప్పారు.

నైటీ

ఫొటో సోర్స్, PRIYA KURIYAN

అయితే.. కొల్లేరు ప్రాంతంలో గ్రామ పెద్దల నిర్ణయాన్ని కాదంటే.. జరిమానాలు, వెలి వంటి చర్యలతో వేధింపులకు గురిచేస్తారని.. అందువల్ల ఈ ఆంక్షలు ఇష్టం లేకున్నా ఎవరూ మాట్లాడటం లేదని తమ వివరాలు వెల్లడించటానికి ఇష్టపడని స్థానికుడు ఒకరు పేర్కొన్నారు.

తోకలపల్లి చెరువు

మహిళల వస్త్రధారణపై పురుషుల ఆంక్షలా?

ఇదిలావుంటే.. తోకలపల్లి చుట్టుపక్కలున్న అద్దంకివారి లంక, గుడివాడ లంక తదితర గ్రామాల్లో కూడా నైటీలపై నిషేధం పెట్టాలన్న చర్చ జరిగిందని స్థానికులు చెప్తున్నారు.

మహిళల వస్త్రధారణ విషయంలో పెద్దల పేరుతో ఆంక్షలు విధించటాన్ని మహిళా కార్యకర్తలు తప్పుపడుతున్నారు.

నైటీ

ఫొటో సోర్స్, PRIYA KURIYAN

సంప్రదాయం, కట్టుబాట్ల విషయంలో మహిళలే ముందుంటారని మహిళా కార్యకర్త లక్ష్మీ సంతోషి ఉద్ఘాటించారు. అటువంటిది వారి వస్త్రధారణపై పురుషులు నిషేధం పెట్టటం సరికాదన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)