మిషెల్ ఒబామా: నా పిల్లలిద్దరూ ఐవీఎఫ్ ద్వారా జన్మించారు

ఒబామా కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

'బికమింగ్' అన్న తన పుస్తకంలో అమెరికా మాజీ ఫస్ట్ లేడీ మిషెల్ ఒబామా పిల్లల కోసం తాను ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. తనకు అబార్షన్ జరిగిందని.. దాంతో తాను పిల్లల కోసం ఐవీఎఫ్‌ను ఆశ్రయించానని వెల్లడించారు. ఒబామా దంపతులకు మాలియా, సాషా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఏబీసీ కార్యక్రమం 'గుడ్ మార్నింగ్ అమెరికా'లో ఆమె 20 ఏళ్ల క్రితం తనకు అబార్షన్ అయిందని తెలిపారు. దీంతో తామిద్దరం ఐవీఎఫ్‌ను ఆశ్రయించినట్లు ఆమె తన పుస్తకంలో వివరించారు.

'బికమింగ్' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా మంగళవారం విడుదల కానుంది.

కూతుళ్లతో ఒబామా దంపతులు

ఫొటో సోర్స్, BRENDAN SMIALOWSKI

ఫొటో క్యాప్షన్, కూతుళ్లతో ఒబామా దంపతులు

గర్భధారణ

గతంలో లాయర్‌గా, ఆసుపత్రి నిర్వాహకురాలిగా పని చేసిన మిషెల్ తన అబార్షన్ గురించి ఏబీసీతో మాట్లాడుతూ, ''అబార్షన్ జరిగినపుడు నేనేదో తప్పు పని చేసినట్లు నాకనిపించింది. ఎందుకంటే, సాధారణంగా మనకు అబార్షన్‌ల గురించి తెలియదు. ఎందుకంటే మనం వాటి గురించి ఎప్పుడూ మాట్లాడుకోం'' అని వివరించారు.

''అబార్షన్ అయినప్పుడు మనం ఎంతో దిగులు పడతాం. నిజానికి గర్భంతో ఉన్నవాళ్లకు ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పాలి'' అన్నారు.

34 ఏళ్ల వయసులో 'జీవగడియారం నిజమైనది', 'అండోత్పాదన పరిమితమైనది' అన్న విషయం తాను గుర్తించానని ఆమె తెలిపారు. దీంతో ఐవీఎఫ్‌కు వెళ్లడానికి నిర్ణయించుకున్నానని వెల్లడించారు.

''మహిళలు తమ శరీరం ఎలా పని చేస్తుందన్న దానిపై ఒకరితో ఒకరు చెప్పుకోకపోవడం అన్నది చాలా విచారకరమైన విషయం'' అని మిషెల్ ఏబీసీ ప్రతినిధి రాబిన్ రాబర్ట్స్‌తో అన్నారు.

the book cover

ఫొటో సోర్స్, Crown

పెళ్లి గురించి మిషెల్ ఏమన్నారు?

బరాక్ ఒబామాకు, తనకు మధ్య అప్పుడప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని ఆమె వెల్లడించారు.

ఆయన చట్లసభలలో చేరినపుడు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటూ, ఐవీఎఫ్ చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.

దీంతో ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలను తొలగించుకోవడానికి తాము కౌన్సెలింగ్ తీసుకోవాల్సి వచ్చిందని మిషెల్ వెల్లడించారు.

''చాలామంది యువ దంపతులు తమలో ఏదో లోపం ఉందని బాధపడుతుంటారు. వాళ్లందరికీ నేను ఒక విషయాన్ని చెప్పదల్చుకున్నా. ఎంతో ఆనందంగా ఉన్నామని, ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటామని పేరున్న మేం కూడా మా మధ్య సంబంధాలు మెరుగుపరచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం. అవసరమైనప్పుడు సహాయం తీసుకుంటాం'' అని మిషెల్ తెలిపారు.

షికాగోలో తాను ఒబామాతో ఎలా ప్రేమలో పడింది కూడా ఆమె ఈ టాక్ షోలో వివరించారు.

ఒబామా గురించి తలచుకున్నంతనే తనకు ఆశ్చర్యం, కృతజ్ఞత, ఆనందం మొదలైన భావాలన్నీ ఏకకాలంలో కలుగుతాయన్నారు.

మిషెల్ ఒబామా, బరాక్ ఒబామా

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ గురించి..

'బికమింగ్'లో మిషెల్ ఒబామా.. తన భర్త అమెరికాలో జన్మించలేదంటూ చేసిన వాదన విషయంతో తాను ఎన్నటికీ ట్రంప్‌ను క్షమించలేనని అన్నట్లు అమెరికా మీడియా చెబుతోంది.

''ఆ మొత్తం వాదన చాలా తుచ్ఛమైనది. దాని వెనుక మత దురభిమానం, విదేశీయులంటే ఉన్న భయం కనిపిస్తాయి'' అని మిషెల్ రాసుకొచ్చారు.

''ఎవరైనా మతిస్థిమితం లేని వ్యక్తి తుపాకీ లోడ్ చేసుకుని, వాషింగ్టన్‌కు వచ్చేస్తే ఏం చేస్తాం? అతను ఎవరైనా స్త్రీలను వెదుకుతుంటే ఏం చేయగలం? డొనాల్డ్ ట్రంప్ తన విచ్చలవిడి నిందలతో నా కుటుంబ భద్రతకు ప్రమాదం కలిగిస్తున్నారు. ఈ విషయంలో నేను ఎన్నడూ ఆయనను క్షమించలేను.''

ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్న వార్త విన్నపుడు తనకు షాక్ తగిలిందని మిషెల్ అన్నారు.

ట్రంప్, ఒబామా దంపతులు

ఫొటో సోర్స్, Getty Images

వివాదాల కోసం ఆమెకు చాలా డబ్బు ఇచ్చారు

మిషెల్ తన పుస్తకంలో రాసిన విషయాలపై డోనల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ''ఆ పుస్తకం రాయడానికి ఆమె చాలా డబ్బు ఇచ్చారు. వాళ్లు ఎప్పుడూ ఏదో వివాదం రేపుతుంటారు. వాళ్లకు తగిన సమాధానం ఇస్తాను'' అన్నారు.

''ఆయన (ఒబామా) మన మిలటరీకి తగిన నిధులు ఇవ్వకుండా కలిగించిన నష్టానికి నేను ఎన్నడూ ఆయనను క్షమించలేను'' అని ట్రంప్ అన్నారు. ''దాని వల్ల దేశానికి భద్రత లేకుండా పోయింది.''

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)