ట్రంప్‌కు కిమ్ లేఖ: మళ్లీ కలుద్దాం, చర్చలు కొనసాగిద్దాం

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్-ఉన్ నుంచి మళ్లీ ఎప్పుడు సమావేశం అవుదామంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ఒక లేఖ వచ్చిందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ఇద్దరు నేతలూ మరోసారి సమావేశం అవడానికి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామని అమెరికా అధికారులు చెప్పారు. "అణు నిరాయుధీకరణపై దృష్టి పెట్టేందుకు వారు నిబద్ధతతో ఉన్నట్టు ప్యాంగ్‌యాంగ్ నుంచి వచ్చిన లేఖ చెబుతోంది" అని వైట్ హౌస్ ప్రతినిధి సారా శాండర్స్ తెలిపారు.
ఇద్దరు నేతల మధ్య జూన్‌లో సింగపూర్ చర్చల తర్వాత ఈ అంశంపై సంప్రదింపులకు బ్రేక్ పడినట్లు కనిపించింది.
ఈ లేఖలో ప్రధానంగా అమెరికా అధ్యక్షుడితో మరోసారి సమావేశం అయ్యేందుకు ఏర్పాట్లు చేయాలని కిమ్ కోరారని శాండర్స్ చెప్పారు.
సమావేశం ఏర్పాటు కోసం తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఆ ఏర్పాట్లు ప్రారంభించామని ఆమె తెలిపారు. అయితే, ఇద్దరి మధ్య రెండో సమావేశం ఎక్కడ ఉంటుందనేదానిపై ఎలాంటి సంకేతం ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, AFP
స్వాగతించిన దక్షిణ కొరియా
ఇటు, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ ఈ లేఖను స్వాగతించారు. కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణ అంశం, అమెరికా, ఉత్తర కొరియా మధ్య జరిగే చర్చల వల్లే మాత్రమే కొలిక్కి వస్తుంది అన్నారు.
జూన్‌లో ట్రంప్-కిమ్ సింగపూర్‌లో సమావేశం కావడానికి మూన్ సయోధ్య కీలకం అయ్యింది. ఆయన కూడా వచ్చే వారం కిమ్‌తో మూడో దశ ముఖాముఖి చర్చలకు సిద్ధమవుతున్నారు. అమెరికా-ఉత్తర కొరియా చర్చలవైపు అడుగులు వేసేలా ఆయన ఒక మధ్యవర్తిలా వ్యవహరిస్తున్నారని బీబీసీ సియోల్ ప్రతినిధి చెప్పారు.
ఉత్తర కొరియా అణు కార్యకలాపాలపై ఐక్యరాజ్యసమితి అణు ఇంధన సంస్థ హెడ్ యుకియా అమానో ఆ దేశాన్ని హెచ్చరించిన తర్వాత రోజే ట్రంప్‌కు కిమ్ రాసిన లేఖ అందింది.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలను అతిక్రమించినందుకు ఐక్యరాజ్యసమితి ఉత్తర కొరియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, AFP
స్నేహపూర్వక లేఖ
గత వారం జరిగిన ఉత్తర కొరియా మిలిటరీ పెరేడ్‌పై కూడా శాండర్స్ ప్రశంసలు కురిపించారు. అణ్వాయుధాలు లేవని అలా అనడం లేదని, విజయవంతమైన ట్రంప్ విధానాలే దీనికి కారణం అన్నారు.
ఉత్తర కొరియా 70వ వార్షికోత్సవ పెరేడ్‌లో సైనికులు, ట్యాంకులు, ఇతర ఆయుధాలు కనిపించినా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను(ఐసీబీఎం) మాత్రం ప్రదర్శించలేదు. అమెరికాను తాకగల వార్‌హెడ్స్ మోసుకెళ్లే ఆ క్షిపణులు పెరేడ్‌లో కనిపించి ఉంటే కిమ్ తమను రెచ్చగొట్టినట్టు అమెరికా భావించేది.
కిమ్ లేఖ రాసినందుకు ట్రంప్ ట్విటర్‌లో థాంక్స్ చెప్పారు. పరేడ్‌ను "ఉత్తర కొరియా వైపు నుంచి ఒక భారీ, సానుకూల ప్రకటన"గా వర్ణించారు. "థాంక్యూ ఛైర్మన్ కిమ్. మనం అందరూ అనుకుంది తప్పని నిరూపించాం" అన్నారు.

ఫొటో సోర్స్, AFP
కొరియన్ ద్వీపకల్పంలో నిరాయుధీకరణ దిశగా పనిచేసే ఒక ఒప్పదంపై సింగపూర్ శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్-కిమ్ సంతకాలు చేశారు. కానీ ఈ ప్రక్రియను ధ్రువీకరించే గడువుగానీ, వివరాలుగానీ, విధానాలుగానీ అందులో లేవు.
రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు, పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పర్యటన మాత్రం చివరి నిమిషంలో రద్దయింది. తాము ఈ ప్రక్రియకు నిబద్ధతతో ఉన్నప్పటికీ చర్చలు ఆగిపోవడానికి మీరే కారణమంటూ రెండు దేశాలూ పరస్పరం నిందించుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
- గర్భస్థ పిండానికి జీవించే హక్కు లేదా?
- ‘నా కుమారుడు ఒక గే... అలా చెప్పుకోవడానికి నేను ఏమాత్రం సిగ్గుపడను’
- అలీబాబా అధిపతి జాక్ మా: అపర కుబేరుడి అయిదు విజయ రహస్యాలు
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి మరణశిక్ష, ఒకరికి జీవిత ఖైదు
- పెట్రోల్ ధరలు, రూపాయి పతనంపై మోదీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








