ఆస్ట్రేలియా: బోండై బీచ్ కాల్పుల నిందితుడి మూలాలు హైదరాబాద్‌లో.. తెలంగాణ పోలీసుల ప్రకటన

హైదరాబాద్, ఆస్ట్రేలియా, కాల్పులు, సాజిద్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, బోండై పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమం దగ్గర పోలీసుల భద్రత

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో డిసెంబర్ 14న జరిగిన కాల్పుల ఘటన నిందితుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్(50) హైదరాబాద్‌కు చెందినవారని తెలంగాణ పోలీసులు వెల్లడించారు.

ఈ మేరకు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.

సాజిద్ అక్రమ్, ఆయన కుమారుడు నవీద్ అక్రమ్ జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సిడ్నీ బోండై బీచ్‌లో కాల్పులు

వారిని నిలువరించే క్రమంలో ఆస్ట్రేలియా పోలీసులు జరిపిన కాల్పుల్లో సాజిద్ మరణించగా, ఆయన కుమారుడు నవీద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా సాజిద్ వద్ద భారతదేశానికి చెందిన పాస్‌పోర్ట్ ఉందని ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు.

నవంబర్ నెలలో సాజిద్, నవీద్‌లు ఫిలిప్పీన్స్ వెళ్లారని ఆ సమయంలో నవీద్ ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్ ఉపయోగించగా సాజిద్ భారత పాస్‌పోర్ట్ ఉపయోగించారని అక్కడి పోలీసులు తెలిపారు.

తెలంగాణ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్

ఫొటో సోర్స్, Telangana police

ఫొటో క్యాప్షన్, తెలంగాణ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్

హైదరాబాద్‌లోనే చదువు పూర్తి, ఉద్యోగం వేటలో ఆస్ట్రేలియాకు

సాజిద్‌కు సంబంధించిన వివరాలను తెలంగాణ పోలీసులు వెల్లడించారు. 'సాజిద్ హైదరాబాద్‌లో బీకామ్ చదివిన తరువాత ఉద్యోగం వేటలో 27 ఏళ్ల కిందట ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ యూరప్ మూలాలున్న మహిళను పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. వారికి కుమారుడు నవీద్‌తో పాటు మరో కుమార్తె ఉన్నారు' అని తెలంగాణ డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఉంది.

సాజిద్ అక్రమ్ ఇప్పటికీ భారత పాస్‌పోర్ట్ కలిగి ఉన్నారని.. అయితే, ఆయన కుమారుడు నవీద్, కుమార్తె మాత్రం ఆస్ట్రేలియాలో జన్మించారని, వారికి అక్కడి పౌరసత్వం ఉందని తెలంగాణ డీజీపీ కార్యాలయం తెలిపింది.

హైదరాబాద్, ఆస్ట్రేలియా, కాల్పులు, సాజిద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మృతులకు బోండి బీచ్‌లో నివాళులు, భారీ ఎత్తున తరలివచ్చిన సిడ్నీవాసులు

27 ఏళ్లలో ఆరుసార్లు హైదరాబాద్‌కు

హైదరాబాద్‌లోని తన కుటుంబీకులతో సాజిద్‌కు పెద్దగా సంబంధాలు లేవన్నది తమకు ఉన్న సమాచారం అని డీజీపీ కార్యాలయం పేర్కొంది.

ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన తరువాత గత 27 ఏళ్లలో సాజిద్ ఆరుసార్లు హైదరాబాద్ వచ్చారని.. హైదరాబాద్‌లో ఉన్న తన తల్లిదండ్రులను చూడడానికి, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలలోనూ ఆయన హైదరాబాద్ వచ్చారని తెలంగాణ పోలీసులు తెలిపారు.

సాజిద్ తన తండ్రి చనిపోయినప్పుడు కూడా హైదరాబాద్ రాలేదని డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఉంది.

హైదరాబాద్, ఆస్ట్రేలియా, కాల్పులు, సాజిద్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బోండై పెవిలియన్

‘సాజిద్ కార్యకలాపాలు మాకు తెలియవు’ - హైదరాబాద్‌లోని కుటుంబసభ్యులు

సాజిద్‌ కార్యకలాపాలు కానీ, ఆయన కాల్పులు జరపడానికి దారితీసిన పరిస్థితులు కానీ తమకు తెలియవని హైదరాబాద్‌లోని ఆయన బంధువులు చెప్పారని డీజీపీ కార్యాలయం పేర్కొంది.

సాజిద్, ఆయన కుమారుడు నవీద్ కార్యకలాపాలకు భారత్‌తోగానీ, తెలంగాణతోగానీ ఎలాంటి సంబంధం లేదని డీజీపీ కార్యాలయం చెప్పింది.

1998లో ఆయన ఆస్ట్రేలియా వెళ్లడానికి ముందు హైదరాబాద్‌లో ఉన్న కాలంలోనూ ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసుల వద్ద ఎలాంటి రికార్డ్ లేదని డీజీపీ కార్యాలయ ప్రకటన తెలిపింది.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)