బీచ్‌లో కాల్పులు జరిపిన తండ్రీకొడుకులెవరు? ఐఎస్‌తో వారికి సంబంధాలున్నాయా

ఐసిస్, ఆస్ట్రేలియా, సిడ్నీ బీచ్, కాల్పులు

ఫొటో సోర్స్, Saeed KHAN / AFP via Getty

ఫొటో క్యాప్షన్, బాధితుల బంధువులు

ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్‌లో ఆదివారం(డిసెంబరు 14) కాల్పులు జరిపిన ఇద్దరిని గుర్తించారు. వారు తండ్రీకొడుకులని స్థానిక మీడియా తెలిపింది.

తండ్రి పేరు సాజిద్ అక్రమ్. ఆయనకు 50 ఏళ్లు. కొడుకు నవీద్ అక్రమ్‌కు 24 ఏళ్లు.

ఈ ఘటనలో తండ్రి అక్కడికక్కడే మరణించారని, కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

యూదుల పండుగ హనుకా సమయంలో ఆదివారం బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

దాడి చేసిన వారి కారులో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) జెండాలు కూడా కనిపించినట్టు చెప్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఐసిస్, ఆస్ట్రేలియా, సిడ్నీ బీచ్, కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మృతులకు నివాళులుఅర్పిస్తున్న ప్రజలు

'తండ్రికి ఆయుధ లైసెన్స్'

సాజిద్ అక్రమ్‌కు వేటకు సంబంధించిన తుపాకీ లైసెన్స్ ఉందని, అతను గన్ క్లబ్‌లో సభ్యుడని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర పోలీసు కమిషనర్ మెల్ లెన్నాన్ చెప్పారు.

బీచ్ కాల్పులు జరిపిన వారి కారులో రెండు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) జెండాలు దొరికాయని ఒక సీనియర్ అధికారి ఆస్ట్రేలియా ప్రసార సంస్థ ఏబీసీ న్యూస్‌కు తెలిపారు.

''సాజిద్ అక్రమ్ 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చారు. 2001లో ఆయన వీసాను పార్టనర్ వీసాగా మార్చారు. తర్వాత ఆయనకు రెసిడెంట్ రిటర్న్ వీసా లభించింది.

సాజిద్ అక్రమ్ కుమారుడు నవీద్ ఆస్ట్రేలియాలో జన్మించారు. ఆయనకు ఆ దేశ పౌరసత్వం ఉంది'' అని ఆస్ట్రేలియా హోం వ్యవహారాలమంత్రి టోనీ బర్కీ చెప్పారు.

ఐసిస్, ఆస్ట్రేలియా, సిడ్నీ బీచ్, కాల్పులు

సంఘటన స్థలం నుంచి వచ్చిన ఫుటేజ్‌లో కారు మీద ఒక జెండా స్పష్టంగా కనిపిస్తోంది.

కాల్పులు జరిపిన వారిలో ఒకరైన నవీద్ అక్రమ్‌ను గతంలో సిడ్నీలో ఉన్న ఐఎస్ సంబంధిత సెల్‌తో సన్నిహిత సంబంధాలపై ప్రశ్నించినట్టు సమాచారం ఉందని ఏబీసీ న్యూస్ తెలిపింది.

కాల్పులు జరిపిన ఇద్దరికీ ఐఎస్ సంస్థతో సంబంధాలు ఉండొచ్చని ఆస్ట్రేలియా పోలీసులు భావిస్తున్నారు.

ఐఎస్, ఆస్ట్రేలియా, సిడ్నీ బీచ్, కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

దాడి చేసిన ప్రదేశానికి దగ్గరలోనే అద్దె ఇంట్లో నివాసం

కాల్పులు జరిపిన ఇద్దరు బీచ్ దగ్గర ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అంతకుముందు బోండి బీచ్ నుంచి దాదాపు గంట దూరంలో ఉన్న బోన్నీరిగ్ శివార్లలో నివసించేవారు.

సాజిద్, నవీద్ అక్రమ్ కొన్ని వారాల క్రితం వరకు అక్కడే నివసించారు. ఆ తర్వాత వారు దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరగా ఉన్న క్యాంప్సీలోని అద్దె ఇంటికి మారారు.

బీబీసీ ప్రతినిధి వాట్సన్ బోనీరిగ్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు.

"పోలీసులు ఈ ఇంటిపై దాడి చేశారు. ఇక్కడ నివసిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. తరువాత వారిని విడిచిపెట్టారు" అని ఆమె చెప్పారు.

ఐసిస్, ఆస్ట్రేలియా, సిడ్నీ బీచ్, కాల్పులు

ఫొటో సోర్స్, Facebook/Chris Minns

ఫొటో క్యాప్షన్, అహ్మద్ అల్ అహ్మద్‌ను పరామర్శించిన న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్

'అహ్మద్ రియల్ లైఫ్ హీరో'

కాల్పులు జరిపిన ఇద్దరిలో ఒకరిని అహ్మద్ అల్ అహ్మద్ అనే స్థానికుడు ధైర్యంగా అడ్డుకున్నారు.

న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అహ్మద్ అల్ అహ్మద్‌ను కలిశారు.

"అహ్మద్ రియల్ హీరో. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆయన ప్రదర్శించిన అసాధారణ ధైర్యం ఒక ఉగ్రవాదిని నిరాయుధుడిని చేసింది. న్యూ సౌత్ వేల్స్ ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం గౌరవంగా ఉంది" అని క్రిస్ మీన్స్ రాశారు.

ఐసిస్, ఆస్ట్రేలియా, సిడ్నీ బీచ్, కాల్పులు

ఫొటో సోర్స్, GoFundMe

ఫొటో క్యాప్షన్, కాల్పుల్లో చనిపోయిన పదేళ్ల బాలిక

మృతుల్లో పదేళ్ల బాలిక

కాల్పుల మృతుల్లో పదేళ్ల బాలిక ఉంది. "ఆమె ఎప్పుడూ సంతోషంగా, చురుగ్గా ఉండేది" అని ఆమె టీచర్ చెప్పారు. పదేళ్ల మటిల్డా కుటుంబం కోసం ఏర్పాటు చేసిన గోఫండ్‌మీ పేజ్‌లో టీచర్ ఈ వ్యాఖ్యను పోస్ట్ చేశారు.

"నిన్న, హనుకాను జరుపుకొంటున్నప్పుడు, చిన్న వయసులో ఉన్న ఆమె జీవితాన్ని ముగించారు. ఆమె జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మన హృదయాల్లో నిలిచి ఉంటాయి" అని టీచర్ పోస్ట్ చేశారు.

అంతకుముందు, మటిల్డా బంధువు ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ, మటిల్డాకు స్కూల్ అంటే చాలా ఇష్టమని, చాలా మంది స్నేహితులు ఉండేవారని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)