ఆస్ట్రేలియా: 'బోండై బీచ్‌లో కాల్పులు జరిపింది తండ్రీకొడుకులే'

ఆస్ట్రేలియా, సిడ్నీ, బోండై బీచ్‌, హనుకా, యూదులు, కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, టామ్ మెక్ ఆర్థర్, ఎమిలీ అట్కిన్సన్
    • హోదా, బీబీసీ న్యూస్

సిడ్నీలోని బోండై బీచ్‌లో జరిగిన హనుకా కార్యక్రమంలో యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన దుండగులు తండ్రీ కొడుకులేనని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు.

ఈ దాడిలో 10 ఏళ్ల బాలికతో సహా 15 మంది మరణించారు. దీనిని ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీజ్ ''ఇది యూదు వ్యతిరేక చర్య, మన గడ్డపై జరిగిన టెర్రరిస్ట్ దాడి"గా పేర్కొన్నారు.

కాల్పులకు పాల్పడిన ఇద్దరిలో 50 ఏళ్ల తండ్రి ఎదురుకాల్పుల్లో మరణించారు. 24 ఏళ్ల కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.

ఆస్ట్రేలియాలో ఇలాంటి కాల్పుల ఘటనలు చాలా అరుదు. 1996లో పోర్ట్ ఆర్థర్ ఊచకోత తర్వాత ఇదే దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన సంఘటన. అప్పటి ఘటనలో ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో 35 మంది చనిపోయారు.

ఈ ఘటనను "ఉగ్రవాద దాడి"గా పోలీసులు ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆస్ట్రేలియా, సిడ్నీ, బోండై బీచ్‌, హనుకా, యూదులు, కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాల్పుల్లో గాయపడినవారిని హాస్పిటల్‌కి తరలిస్తున్న సిబ్బంది.

దాడి ఎలా జరిగింది?

స్థానిక సమయం ప్రకారం, సాయంత్రం 6:47 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:17 గంటలకు) బోండై బీచ్‌లోని ఆర్చర్ పార్క్ వద్ద కాల్పులు జరిగాయని న్యూ సౌత్ వేల్స్ పోలీసులకు సమాచారం అందింది.

దీంతో ఘటనా స్థలంలో ఉన్నవారు సురక్షిత ప్రదేశంలో తలదాచుకోవాలని, ఇతరులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తుండగా, వందలాది మంది భయంతో అరుస్తూ, పరిగెత్తుకుంటూ బీచ్ నుంచి పారిపోతున్న దృశ్యాలు ధ్రువీకరించిన వీడియోల్లో కనిపించాయి.

క్యాంప్‌బెల్ పరేడ్‌లోని కార్ పార్కింగ్ నుంచి బోండై బీచ్ వైపు వెళ్లే చిన్న వంతెన దగ్గరి నుంచి ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరుపుతున్నట్లు బీబీసీ వెరిఫైడ్ ఫుటేజీ కనిపిస్తోంది.

ఇంతలో ఓ వ్యక్తి సాహసించి కాల్పులు జరుపుతున్న వారిలో ఒకరిని వెనుక నుంచి వచ్చి పట్టుకుని, తుపాకీ లాక్కుని, అతనికి గురిపెట్టిన మరో వీడియోను కూడా బీబీసీ ధ్రువీకరించింది.

ఆ తర్వాత దుండగుడు వంతెన వైపు పారిపోయారు. అక్కడ మరో వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపుతున్నారు.

సాహసించి తుపాకీ లాక్కున్న వ్యక్తిని పండ్ల దుకాణం యజమాని అహ్మద్ అల్ అహ్మద్‌గా గుర్తించారు.

ఆయనకు ఇద్దరు పిల్లలు.

ఆయన కుటుంబ సభ్యులు 7న్యూస్ ఆస్ట్రేలియాకు తెలిపిన వివరాల ప్రకారం, అహ్మద్ చెయ్యి, అరచేతికి అయిన బుల్లెట్ గాయాలకు ఆపరేషన్ జరిగింది.

న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ ఆయన్ను "నిజమైన హీరో"గా అభివర్ణించారు.

"ఆయన ధైర్య సాహసాలు ఈ రోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడాయనడంలో ఎలాంటి సందేహం లేదు" అని మిన్స్ మీడియా సమావేశంలో అన్నారు.

అదే ఫుటేజీలో, గాయపడినట్లు కనిపిస్తున్న మరో వ్యక్తి అక్కడి నుంచి పారిపోతున్నట్లు కనిపిస్తుంది.

ధ్రువీకరించిన మరో వీడియోలో, వంతెనపై చాలామంది పోలీసు అధికారులు కనిపిస్తున్నారు. చలనం లేని ఒక వ్యక్తికి సీపీఆర్ చేస్తుండగా.., "ఆయన చనిపోయారు, ఆయన చనిపోయారు" అని ఎవరో అరుస్తున్నారు.

ఆస్ట్రేలియా, సిడ్నీ, బోండై బీచ్‌, హనుకా, యూదులు, కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఎంతమంది మరణించారు?

కాల్పుల్లో మరణించిన 15 మందిలో 10 ఏళ్ల బాలిక కూడా ఉందని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు.

బాధితుల వయస్సు 10 నుంచి 87 సంవత్సరాల వరకు ఉంటుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బ్రిటన్‌లో జన్మించిన రబ్బీ ఎలి ష్లాంగర్ (41) మరణించినట్లు ఆయన కుటుంబం బీబీసీకి తెలిపింది.

ష్లాంగర్ బంధువు రబ్బీ జల్మాన్ లూయిస్ మాట్లాడుతూ, ఆయన "ఉత్సాహంగా ఉండేవారు, ఇతరులకు సాయం చేసేవారు" అని అన్నారు.

ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ, ఒక ఇజ్రాయెల్ పౌరుడు కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది.

ఈ దాడిలో ఫ్రెంచ్ పౌరుడు డాన్ ఎల్కాయమ్ కూడా బాధితుడిగా తెలుస్తోంది.

ఎల్కాయమ్ కుటుంబం, స్నేహితులు, యూదు సమాజం, విషాదంలో మునిగిపోయిన ఆస్ట్రేలియన్లతో పాటు తాను కూడా విషాదంలో ఉన్నానని ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారోట్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

50 ఏళ్ల సాయుధుడిని పోలీసులు కాల్చి చంపగా, ఆయన కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.

మరో 42 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

"కొందరు తీవ్రంగా గాయపడగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది" అని న్యూ సౌత్ వేల్స్ ఆరోగ్య మంత్రి ర్యాన్ పార్క్ సోమవారం ఏబీసీ న్యూస్‌తో అన్నారు.

నలుగురు పిల్లలను సిడ్నీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించినట్లు పార్క్ చెప్పారు.

ఇద్దరు పోలీసులు కాల్పుల్లో గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారి పరిస్థితి ఆదివారం నాటికి " అత్యంత విషమంగా" ఉందని తెలిపారు.

కాల్పులు జరిపిన ఆ ఇద్దరు ఎవరు?

కాల్పులు జరిపిన వ్యక్తులు తండ్రీ కొడుకులని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ సోమవారం ఉదయం మీడియా సమావేశంలో చెప్పారు. వారిలో తండ్రి వయసు 50 ఏళ్లు కాగా కొడుకు వయసు 24 ఏళ్లు.

ఆ 50 ఏళ్ల వ్యక్తి వద్ద లైసెన్స్‌డ్ తుపాకీలు ఉన్నాయని, ఆరు తుపాకీలను బోండై బీచ్ దాడిలో ఉపయోగించినట్లు తెలుస్తోందని లాన్యన్ చెప్పారు.

ఆస్ట్రేలియా, సిడ్నీ, బోండై బీచ్‌, హనుకా, యూదులు, కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీచ్‌లో హనుకా వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు.

"ఉగ్రవాద దాడి"

ఆదివారం జరిగిన కాల్పులను "టెర్రర్ ఎటాక్"గా పోలీసులు ప్రకటించారు.

ఆదివారం నుంచి సోమవారం వరకు రాత్రివరకూ, సంఘటన స్థలం చుట్టూ నిషేధిత జోన్ ఏర్పాటు చేశారు. ముష్కరులలో ఒకరికి సంబంధించిన కారులో దొరికిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌(ఐఈడీ) లను తనిఖీ చేసేందుకు ప్రత్యేక పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని కోరుతున్నారు.

బోండై బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీజ్ తీవ్రంగా ఖండించారు. ''ఇది యూదు వ్యతిరేక దాడి"గా అభివర్ణించారు.

"ఇతరులకు సాయం చేసేందుకు కొంతమంది ఆస్ట్రేలియన్లు పరుగెత్తడం చూశాం. వీరంతా నిజమైన హీరోలు, వారి ధైర్యం ప్రాణాలను కాపాడింది" అని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఈ కాల్పులను "యూదులపై జరిగిన చాలా క్రూరమైన దాడి"గా అభివర్ణించారు.

"అత్యంత భయంకరమైన యాంటీసెమిటిక్ ఉగ్రవాద దాడి భయాందోళనకు గురిచేసింది" అని కింగ్ చార్లెస్ అన్నారు.

ఆస్ట్రేలియా, సిడ్నీ, బోండై బీచ్‌, హనుకా, యూదులు, కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

హనుకా అంటే ఏమిటి?

హనుకా, లేదా హిబ్రూలో చానుకా.. యూదుల దీపోత్సవంగా పిలుస్తారు.

హనుకా తేదీలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి, కానీ ఎప్పుడూ నవంబర్ లేదా డిసెంబర్‌లోనే వస్తుంది. ఎనిమిది రోజులపాటు కొనసాగుతుంది.

కాల్పులు జరిగిన సమయంలో బోండై బీచ్‌లో మొదటి రోజు వేడుకలో భాగంగా ఒక కార్యక్రమం జరుగుతోంది.

బోండైలోని యూదు కేంద్రం చాబాద్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని వయసుల వారికి కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 1,000 మంది హాజరైనట్లు చెబుతున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)