తినగానే మల విసర్జనకు వెళ్లాలని అనిపిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారో చదవండి

తినగానే టాయ్‌లెట్‌కు పరుగులు పెట్టడం అనారోగ్య హేతువా?

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

చాలామంది ఆహారం తిన్న కొన్ని నిమిషాలలోనే మల విసర్జనకు వెళ్లాల్సిన సమస్యను ఎదుర్కొంటుంటారు.

దీనివల్ల మనం తిన్న ఆహారం జీర్ణమవుతోందా, లేక వ్యర్థంగా మారుతోందా అనే సందేహం కలుగుతుంది.

ఈ సందేహ వల్లే ఆఫీసులో ఉన్న సమయాలలో మితంగా లేదంటే తక్కువగా తినడం, ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా తినడానికి కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే అసలు ప్రశ్న ఏమిటంటే.. తిన్నవెంటనే మల విసర్జనకు వెళ్లాలని అనిపించడం సాధారణమేనా? లేదంటే అది ఏదైనా వ్యాధి లక్షణమా? రోజులో అనేకసార్లు మల విసర్జన చేయడం ఆరోగ్య సమస్యేనా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తినగానే ఆహారం వ్యర్థంగా మారుతుందా?

ఫొటో సోర్స్, Getty Images

ఆహారం తిన్నవెంటనే ఏమవుతుంది?

"తిన్న వెంటనే మల విసర్జన చేయాలనే తక్షణ కోరికను గాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. తిన్న వెంటనే ఆ ఆహారం మలంగా మారదు" అని చెన్నైకు చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ మహాదేవన్ పేర్కొన్నారు.

సాధారణంగా మనం తినే ఆహారం మలంగా మారి శరీరం నుంచి బయటకు వెళ్లేందుకు (గట్ ట్రాన్సిట్ టైమ్) 10 నుండి 73 గంటలు పట్టొచ్చు. అయితే ఇది వయసు, జెండర్, శరీర బరువు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఓ అధ్యయనం తెలిపింది.

మనం తినే ఆహారం కడుపులోకి వెళ్తే నరాలు పెద్దపేగు కండరాలకు సంకేతాలు పంపుతాయి. ఆ సంకేతాలు పెద్దపేగును సంకోచించేలా చేస్తాయి, ఇప్పటికే అక్కడ ఉన్న వ్యర్థాలను పురీషనాళం వద్దకు తరలిస్తాయి. ఈ చర్య శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపాలనే కోరికను కలిగిస్తుంది.

పెద్దపేగు నుంచి వ్యర్థాలు పురీషనాళానికి వెళ్లినప్పుడు , మరింత ఆహారం జీర్ణంకావడానికి పెద్దపేగు స్థలం కల్పిస్తుంది. ఇదే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్.

మలవిసర్జన సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

"ఇది శరీరం సహజ ప్రతిస్పందనే. ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది, అందుకే పాలు తాగిన వెంటనే పిల్లలు మలవిసర్జనం చేస్తారు" అని మహదేవన్ అన్నారు.

ఈ భావన భోజనం చేసిన కొద్ది నిమిషాల్లోనూ లేదా గంటలోనూ కలగవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం, ఇది పిల్లల్లో వేగంగా, పెద్దల్లో నెమ్మదిగా జరుగుతుంది.

ఇది సాధారణమైనదే అయినప్పటికీ, ఈ కోరిక అంత ఎక్కువగా ఉండి భరించలేని స్థాయికి చేరితే, అది కడుపు సమస్యలు లేదా పేగువ్యాధుల లక్షణం కావచ్చని మహదేవన్ చెబుతున్నారు.

కడుపు సంబంధిత సమస్యలకు ఇరెటబుల్ బొవెల్ సిండ్రోమ్ ప్రధాన కారణమని, కానీ అది నియంత్రించగలిగిన సమస్యే అని చెప్పారు.

మలవిసర్జన సమస్యలు

ఫొటో సోర్స్, Getty Images

ఇరెటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)

ఇరెటబుల్ బొవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) సాధారణమని, అది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుందంటూ దాని లక్షణాలను యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) వివరించింది.

  • టాయ్‌లెట్‌కు వెళ్లాలనిపించడంతోపాటు పొత్తి కడుపు నొప్పి, కండరాలు పట్టేయడం
  • ఎక్కువగా గ్యాస్, కడుపులో శబ్దాలు రావడం
  • విరేచనాలు లేదా మలబద్దకం
  • విరేచనం అయ్యాక కూడా ఇంకా కడుపు ఖాళీ కాలేదనే భావన

ఈ లక్షణాలు 4 వారాలకు మించి ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని నేషనల్ హెల్త్ సర్వీస్ సిఫార్సు చేస్తోంది.

ఐబీఎస్‌‌
ఫొటో క్యాప్షన్, ఐబీఎస్ నియంత్రించగలిగే సమస్య అని డాక్టర్ మహదేవన్ చెబుతున్నారు

ఐబీఎస్‌కు ప్రత్యేకమైన కారణాలు లేకపోయినప్పటికీ, మద్యపానం, కాఫీ, టీలు, మసాలాలు, కొవ్వు పదార్థాలు, ఒత్తిడి, తరచూ యాంటిబయాటిక్స్ వినియోగం ఐబీఎస్‌‌ను ప్రేరేపిస్తాయి.

ఐబీఎస్ కేవలం తిన్నవెంటనే టాయ్‌లెట్‌కు వెళ్లాలనే లక్షణానికి మాత్రమే కారణం కాదు..

  • కడుపు ఉబ్బరం
  • అలసట, నిస్సత్తువ
  • వికారం
  • నడుం నొప్పి
  • తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాలనిపించడం
  • పూర్తిగా మూత్ర విసర్జన కాలేదనే అనుభూతి కూడా కలుగుతుంటుందని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.

ప్రపంచ జనాభాలో 5 నుంచి 10 శాతం మందికి ఐబీఎస్ ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. ఐబీఎస్‌ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు యాంగ్జైంటీ, డిప్రెషన్‌తో బాధపడుతున్నారు.

‘‘అనేకమంది ప్రజలు ఐబీఎస్‌ను ఎదుర్కొంటున్నారు. శారీరకంగా ఆరోగ్యవంతులైనవారు కూడా కడుపులో అసౌకర్యాన్ని అనుభూతి చెందుతారు. ఐబీఎస్‌లో రెండు రకాలు ఉన్నాయి. ఐబీఎస్ -సీ (ఐబీఎస్-మలబద్దకం), ఇందులో మలబద్దకంతోపాటు పొత్తికడుపులో నొప్పి ఉంటుంది. అలాగే ఐబీఎస్-డీ( ఐబీఎస్-డయేరియా). దీనివల్ల విరేచనాలు అవుతాయి’’ అని ఈరోడ్‌కు చెందిన డైటీషియన్, డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.

ఐబీఎస్

ఫొటో సోర్స్, Getty Images

ఇది పేగు వ్యాధుల లక్షణమా?

‘‘ఎవరికైనా చాలాకాలంగా తినగానే మలవిసర్జనకు వెళ్లే అలవాటు ఉండి, ఆ పరిస్థితి వారికి శారీరకంగా, మానసికంగా అసౌకర్యం కానంతవరకూ అది సమస్య కాదు. కానీ హఠాత్తుగా ఓ వ్యక్తికి క్రమం తప్పకుండా అలాంటి పరిస్థితి వస్తే దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని గ్యాస్ట్రో‌ఎంట్రాలజిస్టు డాక్టర్ రవీంద్రన్ కుమారన్ చెప్పారు.

‘‘ఇలా తరచూ కడుపులో అసౌకర్యంగా ఉండటం ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారికి అసౌకర్యంగా ఉంటుంది. అలాంటి వారికి కొన్ని జీవనశైలి మార్పులు సూచిస్తాం. మలబద్ధకం, లేదా డయేరియా తగ్గకుండా ఉంటే మీరు వైద్య సలహా తీసుకోవాలి’’ అని ఆయన తెలిపారు.

ఇదే విషయాన్ని డాక్టర్ మహదేవన్ కూడా చెప్పారు. ‘‘మల విసర్జన విషయంలో క్రమం తప్పకుండా మార్పులు జరుగుతుంటే మీరు వాటిని అలా వదిలేయకూడదు. ఉదాహరణకు రాత్రివేళ మలవిసర్జనకు వెళ్లడానికి పదేపదే లేవడమనేది ఓ ప్రమాదకర మార్పు. అది మరే ఇతర వ్యాధికైనా సంకేతం కావచ్చు’’

మీ మలంలో తెల్లని జిగట లేదా రక్తం కనపడటం, బరువు తగ్గడం, తరచూ మలబద్దకం, డయారియా అనేవి పురీషనాళ సమస్యలు కావచ్చు. దీనికి మీరు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)