ఇంటి అద్దె అడ్వాన్స్ ఎన్నినెలలు కట్టాలి, ఎప్పుడుపడితే అప్పుడు అద్దె పెంచవచ్చా? 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త నియమాలు ఏమిటో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదా అద్దెకు తీసుకోవడానికి సంబంధించిన నియమాలు 2026 నుంచి మారనున్నాయి. అద్దె ఒప్పందాలు చేసుకునే సమయంలో మరింత స్పష్టత తీసుకురావడం, వివాదాలను తగ్గించే ఉద్దేశంతో ఈ కొత్త నియమాలను తీసుకువస్తున్నారు.
ఇంతకీఏమిటీ నియమాలు? ఇల్లు అద్దెకు తీసుకునేవారికి ఏ నియమాలు ప్రయోజనకరంగా ఉంటాయి?
ఇవి మోడల్ టెనెన్సీ యూక్ట్ ఆధారంగా తీసుకొచ్చిన కొత్త నియమాలు .
వీటి ప్రకారం, ప్రతి అద్దె ఒప్పందంపై సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంప్ వేసి నమోదు చేసుకోవాలి. గతంలో, చాలా ఒప్పందాలు స్టాంప్ పేపర్‌పై జరిగేవి. వీటిపై సంతకం చేసేవారు, కానీ చాలా వరకు రిజిస్టర్ చేసేవారు కాదు.
ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేయడానికి వీలుగా రాష్ట్రాలు తమ ఆన్‌లైన్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.

ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను 60 రోజుల గడువులోపు పూర్తి చేయకపోతే, ఐదువేలరూపాయల నుంచి జరిమానా విధిస్తారు.
ఆన్‌లైన్‌లో లేదా స్థానిక రిజిస్ట్రార్ వద్ద ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇల్లు అద్దెకు తీసుకునే వ్యక్తి పోలీసు ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అదనంగా, సెక్యూరిటీ డిపాజిట్లు, అద్దె పెంపుదల, ఇల్లు ఖాళీ చేయడానికి సంబంధించిన నియమాలను కూడా స్పష్టం చేశారు.
ఇల్లు అద్దెకు తీసుకునేవారు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. అయితే నివాసాలకు సంబంధించి ఇకపై యజమానులు తమ ఇంటి అడ్వాన్సులను రెండునెలలకు మించి తీసుకోవడానికి వీల్లేదు. అనేక నగరాల్లో, ప్రస్తుతం 6 నుంచి 10 నెలల అద్దెను డిపాజిట్‌గా తీసుకుంటున్నారు. కానీ కార్యాలయాలు , దుకాణాల వంటి వాణిజ్య స్థలాల కోసం , 6 నెలల అద్దెకు సమానమైన మొత్తాన్ని డిపాజిట్‌గా తీసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
అద్దె ఎప్పుడైనా పెంచుకోవచ్చా?
అద్దెను ఎప్పుడు, ఎంత పెంచవచ్చనే దానిపై కూడా నియమాలు స్పష్టంగా ఉన్నాయి.
12 నెలల వ్యవధి ముగిసిన తర్వాత మాత్రమే ఇంటి యజమాని అద్దెను పెంచే అవకాశం ఉంటుంది. అద్దెను పెంచే ముందు, ఇంటి యజమాని అద్దెదారునికి కనీసం 90 రోజుల ముందు ఈ విషయాన్ని తెలియజేస్తూ లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి.
ఇంటి యజమానులు అకస్మాత్తుగా అద్దెలు పెంచలేరు. ఏడాదికోసారి మాత్రమే అద్దెను పెంచవచ్చు.
ఐదువేల రూపాయల కంటే ఎక్కువ అద్దె ఉంటే డిజిటల్ చెల్లింపులు చేయాలి. యూపీఐ లేదా బ్యాంక్ ద్వారా డిజిటల్‌గా చెల్లించాలి. నగదు లావాదేవీలు అనుమతించరు.అద్దె 50వేల రూపాయలు దాటితే టీడీఎస్ విధిస్తారు. దీనితో పాటు, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా అద్దెదారులను ఇల్లు ఖాళీ చేయమని చెప్పలేరు.
గడువు తేదీకి ముందే ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయాలనుకుంటే, యజమాని రెంట్ ట్రిబ్యునల్ నుంచి అద్దెదారుని ఖాళీ చేయించే ఉత్తర్వును పొందాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
అలాగే ఇంటికి తాళాలు వేయడం, విద్యుత్ లేదా నీటిని ఆపివేయడం లేదా అద్దెదారులను బెదిరించడం వంటి చర్యలు శిక్షకు దారితీయవచ్చు.
కొత్త చట్టం అద్దెదారులకు గోప్యతా హక్కును కల్పిస్తోంది. ఇంటి యజమానులు తనిఖీ లేదా మరమ్మతుల కోసం ఇంట్లోకి ప్రవేశించే ముందు అద్దెదారులకు 24 గంటల ముందే నోటీసు ఇవ్వాలి.
అద్దెకు ఉండేవారు ఇంటికి మరమ్మతులు చేయాల్సి వస్తే, వారు ఇంటి యజమానికి తెలియజేయాలి. యజమాని 30 రోజుల్లోపు పని పూర్తి చేయకపోతే, అద్దెదారే స్వయంగా పని చేయించుకోవచ్చు. అందుకు అయిన ఖర్చును అద్దె నుంచి మినహాయించి మిగిలిన అద్దె చెల్లిస్తేచాలు.
కానీ దీని కోసం, వారు ఇంటి యజమానికి రసీదులు, ఖర్చులకు సంబంధించిన ఇతర ఆధారాలను అందించాలి.
దీనితో పాటు, భూస్వాములు లేదా భూ యజమానులు, అద్దెదారుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి స్పెషల్ రెంట్ కోర్ట్స్, ట్రిబ్యునల్స్ ఉంటాయి. వాటిలో దాఖలు అయిన ఫిర్యాదులను 60 రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














