వికసిత్ భారత్ – జీ రామ్ జీ: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ఏంటి? దీనిపై వివాదం ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
20 ఏళ్లుగా అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంఎన్ఆర్ఈజీఏ) స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది.
ఈ చట్టానికి 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)' .. సంక్షిప్తంగా వికసిత్ భారత్ – జీ రామ్ జీ అని పేరు పెట్టారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధి హామీ అమలైంది.
కొత్త బిల్లులో దీన్ని సంవత్సరానికి 125 రోజులకు పెంచాలని ప్రతిపాదించారు.
ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల కంటే 'ఎక్కువ అధికారాలు' ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కంటే 'ఎక్కువ డబ్బు' ఖర్చు చేయాల్సి ఉంటుందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.


ఫొటో సోర్స్, ani
'వికసిత్ భారత్ – జీ రామ్ జీ' బిల్లు అంటే ఏంటి? అది ఎంఎన్ఆర్ఇజిఏ నుంచి ఎలా భిన్నంగా ఉంటుంది?
మహాత్మా గాంధీ పేరును చేర్చిన ఎంఎన్ఆర్ఇజిఏ వంటి చట్టాన్ని తొలగించడం ద్వారా ప్రభుత్వం మహాత్మా గాంధీని 'అవమానిస్తోంది' అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
కానీ ఇది ఎంఎన్ఆర్ఇజిఏ కంటే మెరుగైన పథకం అని, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలను అందిస్తుందని ప్రభుత్వం చెప్తోంది.
ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే 20 ఏళ్ల నాటి ఎంఎన్ఆర్ఇజిఎ స్థానంలోకి వస్తుంది.
నైపుణ్యం లేని శారీరక శ్రమ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామీణ కుటుంబాలకు సంవత్సరంలో 125 రోజులు ఉపాధి కల్పించడం ఈ పథకం ఉద్దేశం.
ఎంఎన్ఆర్ఇజిఏ కింద సంవత్సరానికి 100 రోజుల ఉపాధి హామీ లభిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి భద్రతకు హామీ ఉంటుందని, సంబంధిత పనులలో ప్రజలకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
తాగు, సాగునీటి వనరులను మెరుగుపరచొచ్చు.
అలాగే గ్రామంలోని ప్రజల జీవనోపాధికి సంబంధించిన రోడ్లు, నీటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు వంటి పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
కొత్త బిల్లు కార్మికులకే కాకుండా రైతులకు కూడా ప్రయోజనం కలిగిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
కొత్త బిల్లు మరింత పారదర్శకతను తీసుకువస్తుందని, జవాబుదారీతనాన్ని పెంచుతుందని ప్రభుత్వం అంటోంది.

ఫొటో సోర్స్, Kalpit Bhachech/Dipam Bhachech/Getty Images
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంతంటే...
గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాలను "మెరుగుపరిచే" లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో ఎంఎన్‌ఆర్‌ఇజిఏ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇది దేశంలోని అన్ని జిల్లాల్లో అమలవుతోంది.
ఎంఎన్‌ఆర్‌ఇజిఏలో కార్మికులకు ఇచ్చే వేతనాల మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే వస్తువుల ధర మొదలైన వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణీత నిష్పత్తిలో భరిస్తాయి.
కొత్త బిల్లు ప్రకారం మొత్తం ఖర్చులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఇతర కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పథకం కింద అయ్యే ఖర్చులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు ఒక వ్యక్తికి పని దొరకకపోతే వారికి రోజువారీ నిరుద్యోగ భృతి ఇస్తారు. ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ నిబంధన ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కింద కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
‘యూపీఏ కన్నా మేమే ఎక్కువ నిధులు ఖర్చు చేశాం’
ఈ బిల్లును మంగళవారం వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఎంఎన్‌ఆర్‌ఇజిఏ చట్టాన్ని రద్దు చేయడం మహాత్మాగాంధీని అవమానించడమేనన్నప్రతిపక్షాల ఆరోపణలను శివరాజ్ సింగ్ తోసిపుచ్చారు.
"ఈ బిల్లు గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుంది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మహాత్మాగాంధీ కూడా గ్రామాల అభివృద్ధిని కోరుకున్నారు. మరి కొత్త బిల్లు ఆయన్ను అవమానించడం ఎలా అవుతుంది?'' అని ఆయన ప్రశ్నించారు.
"ఎంఎన్‌ఆర్‌ఇజిఏ చట్టంపై యూపీఏ కన్నా మేం ఎక్కువ డబ్బు ఖర్చు చేశాం. గ్రామాల అభివృద్ధి మా సంకల్పం. మహాత్మాగాంధీ కోరుకున్నది మేం చేస్తున్నాం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఉద్దేశం కూడా అదే" అని శివరాజ్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పేర్లు ఎందుకు మార్చుతున్నారు?’
అంతర్లీనంగా కేంద్ర ప్రభుత్వం "నియంత్రణ పూర్తిగా ఉండే" పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు "ఎక్కువ ఖర్చు" చేయాల్సి ఉంటుందని, " క్రెడిట్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది" అని ఆరోపిస్తోంది.
"నేను ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. మేం ఎంఎన్‌ఆర్‌ఇజిఏ ప్రవేశపెట్టినప్పుడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ప్రజల సంక్షేమం కోసం తీసుకువచ్చిన చట్టం అని ఇది రుజువు చేస్తుంది. కొత్త బిల్లులో అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి కేటాయించారు. ఏ రాష్ట్రానికి ఎంత నిధులు ఇవ్వాలో అది నిర్ణయిస్తుంది. ఎంఎన్‌ఆర్‌ఇజిఏలో గ్రామ పంచాయతీలకు కూడా నిధుల కేటాయింపులో భాగస్వామ్యం ఉంది'' అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ లోక్‌సభలో అన్నారు.
"గత ప్రభుత్వాల ప్రతి పథకం పేరు మార్చే ఉద్దేశం అర్ధంకానిదిగా ఉంది" అని ప్రియాంక గాంధీ విమర్శించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘గ్రామీణ పేదల సురక్షితమైన జీవనోపాధికి విఘాతం’
బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.
"సభతో చర్చించకుండా, సంప్రదించకుండా ఈ బిల్లును ఆమోదించకూడదు. దీనిని ఉపసంహరించుకోవాలి. కనీసం దీనిని క్షుణ్ణంగా పరిశీలించడానికి, విస్తృత చర్చ జరపడానికి స్టాండింగ్ కమిటీకి పంపాలి" అని ప్రియాంక గాంధీ అన్నారు.
ఈ బిల్లు విషయంలో రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
"ఈ కొత్త బిల్లుతో మహాత్మాగాంధీ ఆదర్శాలను అవమానిస్తున్నారు. నిరుద్యోగం ద్వారా మోదీ ప్రభుత్వం ఇప్పటికే భారతదేశ యువత భవిష్యత్తును నాశనం చేసింది. ఇప్పుడు ఈ బిల్లు గ్రామీణ పేదల సురక్షితమైన జీవనోపాధిని నాశనం చేస్తుంది" అని రాహుల్ గాంధీ 'ఎక్స్'లో పోస్టు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














