బండ్ల‌ప‌ల్లి: ఉపాధి హామీ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ తొలి గ్రామం ఎలా మారింది?

బండ్లపల్లి గ్రామంలో కూలీలు
ఫొటో క్యాప్షన్, బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం వలసలను ఆపింది
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా ఉన్న కాలంలోనూ గ్రామీణ ప్రజలకు ఊరటనిస్తున్న పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నగరాలు, పట్టణాల నుంచి తిరిగి సొంతూళ్లకు వెళ్లిన వలస కూలీలతోపాటు స్థానికులకు ఉపాధి కల్పిస్తూ వారిని ఆదుకొంటోంది.

ఈ పథకం 2006లో ప్రారంభమైన నాటి నుంచే అనేక గ్రామాల్లో పెను మార్పులకు కారణమయ్యింది. ముఖ్యంగా సాగు నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో వలసల నివారణ సహా వివిధ సామాజిక అంశాలను ప్రభావితం చేసినట్టు వివిధ అధ్యయనాలు చాటిచెబుతున్నాయి.

డెల్టాలో ఉపాధి హామీ పథకం మూలంగా వ్యవసాయం భారంగా మారిందనే వాదన కూడా ఉంది.

దేశంలోనే తొలిసారిగా ఈ పథకాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంతపురం జిల్లా ప్రస్తుత శింగనమల నియోజకవర్గం పరిధిలోని బండ్లపల్లిలో ప్రారంభించారు. ఈ గ్రామంలో ఈ పథకం తీసుకొచ్చిన మార్పులను బీబీసీ పరిశీలించింది.

సుదీర్ఘకాల డిమాండ్

గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి హామీ కల్పించే చట్టం చేయాలని సుదీర్ఘకాలం పాటు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. మధ్యలో పనికి ఆహార పథకం వంటి కార్యక్రమాలు కొంత మేరకు అమలు చేశారు. చివరకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో 2005లో పార్లమెంటులో చట్టం రూపొందించి 2006 నుంచి అమలు ప్రారంభించారు. ఆ సంవత్సరం ఫిబ్రవరి నుంచి దేశంలో వెనకబడిన 200 జిల్లాల్లో మొదట అమలు చేశారు.

ఈ పథకానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అప్పటికే కరువు సమస్యతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా బండ్లపల్లి వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ సందర్భంగా కూలీలతో మాట్లాడారు. స్థానికుల రాగి సంకటి ఆరగించి సంతృప్తి వ్యక్తం చేయడం అందరినీ ఆకట్టుకుంది.

వీడియో క్యాప్షన్, బండ్లపల్లి: జాతీయ ఉపాధి హామీ పథకం తొలిసారిగా అమలైన ఊరు ఇప్పుడెలా ఉంది?

ఒకనాటి వలసల గ్రామం బండ్లపల్లి

బండ్లపల్లి గ్రామ జనాభా 2011 నాటి లెక్కల ప్రకారం 2560 మంది. సుమారు 600 కుటుంబాలు ఉండేవి. అయితే వర్షాభావం మూలంగా ఆనాటికి తీవ్రమైన కరువు పీడిత గ్రామం. గ్రామంలో ఉపాధి లేక అత్యధికులు బెంగళూరు, కొందరు కేరళ వలసలు వెళ్లారు. ఆనాటికి సుమారు 60 కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. ప్రతీ పది ఇళ్లకు ఒక ఇల్లు బోసిపోతూ కనిపించేది.

వలస కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయ కూలీలకు ముఖ్యంగా వేసవి నాలుగు నెలల పాటు ఉపాధి సమస్య తీవ్రంగా ఉంటుందని, ఆ కాలంలో గ్రామీణ ఉపాధి హామీ అవసరమని పలువురు చేసిన సూచనతో ప్రభుత్వం అంగీకరించింది. దానికి అనుగుణంగా బండ్లపల్లిలో అమలు చేసిన ఉపాధి హామీ పనులు కూలీలకు ఊరటనిచ్చాయి.

గ్రామానికి చెందిన పి.లక్ష్మయ్య బీబీసీతో మాట్లాడారు. "నేను 2005లో బెంగళూరు వలస పోయాను. అక్కడ బిల్డింగ్ వర్కర్ గా పనిచేశాను. రోజూ వచ్చే కూలీ ఖర్చులకు సరిపోయేది. కుటుంబ పోషణ గడుస్తుండడంతో ఆరేళ్లు అలానే గడిపేశాను. గ్రామంలో ఉపాధి హామీ పనులు రావడంతో మాకు కూడా మళ్లీ ఊర్లోనే గడుపుదామని అనిపించింది. అందుకే 2011లో తిరిగి వచ్చేశాను" అని చెప్పారు.

"ఉపాధి హామీ పనుల మూలంగా గ్రామంలో నీటి నిల్వలు పెరిగాయి. వ్యవసాయానికి అవకాశం వచ్చింది. ఓవైపు వ్యవసాయ పనులు, మరోవైపు ఉపాధి పనులతో ఏడాది అంతా చేతినిండా పని దొరుకుతుంది. కుటుంబం స్థిరపడుతోంది. అప్పట్లో రోజుకు రూ. 60 ఇచ్చేవారు. ఇప్పుడు చేసిన పనులను బట్టి ఆదాయం వస్తుంది. కానీ కనీసంగా రూ. 200 వస్తోంది. జీవితం గడిచిపోతోంది" అంటూ ఆయ‌న‌ వివరించారు.

'పిల్లలను చదివించుకోగలుగుతున్నాం'

ఉపాధి హామీ వల్ల గ్రామ పరిస్థితులే పూర్తిగా మారిపోయాయని గ్రామ‌స్థులు చెబుతున్నారు. రైతులంతా అప్పుల్లోనూ, కూలీలు పనుల్లేక వలసల గురించి ఆలోచించే స్థితి నుంచి ఇప్పుడు మళ్లీ ఇక్కడే వ్యవసాయంతో కళకళలాడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.

బండ్లపల్లి వాసి ఎం. రామశివారెడ్డి బీబీసీతో మాట్లాడుతూ, " ఏటా ప్రతీ జాబ్ కార్డులో 100 రోజుల పనిదినాలు పూర్తి చేస్తున్నాం. దాని వల్ల మాకు కనీసం రూ.15 వేలు ఒక్కొక్కరికీ వస్తాయి. ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి కార్డులుంటాయి. దాంతో కనీసంగా రూ. 30 వేలు ఈ పథకం ద్వారా వస్తాయి. అంటే నెలకు రెండున్నర వేలకు పైగా ఆదాయం వస్తోంది. ధీమాగా జీవితాలు గడిపే అవకాశం వచ్చింది. దానికి తోడు వ్యవసాయ పనులు".

"ఈకాలంలో బోర్లు పెరిగాయి. దాంతో పనులు ఏడాది పొడవునా ఉంటాయి. అలా కష్టపడితే వచ్చే ఆదాయం కూడా తోడవుతోంది. కూలీలకు ధీమాగా ఉంది. పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. 2005లో మా గ్రామంలో పదో తరగతి చదివే పిల్లలు 15 మందిలోపు ఉండేవారు. ఇప్పుడు 50 మంది ఉన్నారు. అందరూ చదువుకునే అవకాశం కూడా వచ్చింది" అని ఆయ‌న‌వివరించారు.

వలస కార్మికులు

ఫొటో సోర్స్, Getty Images

లక్ష్యాలకు అనుగుణంగా అమలు

గ్రామీణ ఉపాధి హామీ పథకం ఐదు లక్ష్యాలతో అమలు చేస్తున్నారు. అందులో మొదటిది, గ్రామీణ‌ ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 100 రోజులకు సరిపడా నైపుణ్యం అవసరం లేని శారీరక కష్టంతో కూడిన పనిని క‌ల్పించ‌డం. తద్వారా పేద ప్రజలకు జీవనోపాధి పొందే అవకాశాలను బలోపేతం చేయడం. మూడవది సమాజంలోని అన్ని వర్గాల వారిని గ్రామీణ‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో భాగస్వాములను చేయడం. దీనిద్వారా పల్లెల్లో సామాజిక స‌మ‌తౌల్యానికి బీజం ప‌డుతుంది.- నాలుగవది పరిపాలనలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం. ఐదు- పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం వంటివి ఈ పథకం అమలు చేయడం ద్వారా సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ లక్ష్యాలకు అనుగుణంగా దాదాపు 155 రకాల పనులు చేపడుతున్నారు. వాటిలో నీటి సంరక్షణ పనులు, ఇంకుడు గుంతల తవ్వకం, మొక్కల పెంపకం మొదలైనవి ఉంటాయి. బడుగు, బ‌ల‌హీన‌ వర్గాలకు తోడ్పడేలా బీడు, బంజరు భూముల అభివృద్ధి.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన వాటికి ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా వాడవాడలా సిమెంట్ రోడ్ల నిర్మాణం వంటివి ఆచరణలోకి వచ్చాయి. గ్రామాల్లో అనేక‌ ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఈ పథకం ఆధారంగా మారింది.

తెలంగాణ వరి పంట

ఫొటో సోర్స్, Getty Images

జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి

ఉపాధి హామీ అమలు కారణంగా పల్లెల్లో చాలా మార్పులు వచ్చాయని నార్పల మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ బీబీసీకి తెలిపారు. గతంలో ఒక్కో గ్రామం నుంచి ఒకరిద్దరు కూడా డిగ్రీ చదివే వాళ్లుండేవారు. ప్రస్తుతం పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు.

"అంతే కాకుండా కూలీల జీవన స్థితిగతుల్లో కూడా మార్పు వచ్చింది. ఉపాధి హామీ పనులతో జరిగిన ప్రయత్నాల మూలంగా వ్యవసాయానికి సాగునీటి లభ్యత పెరిగింది. బోర్లు రావడంతో వ్యవసాయం పెరిగింది. ఒకనాడు వెలవెలబోయిన గ్రామాల్లో ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తోంది. ఈ పథకంతో కలిగిన ప్రయోజనాలు మా మండలమంతా స్పష్టంగా ఉన్నాయి. వెనుకబడిన అనేక జిల్లాలకు ఇది మేలు చేసిందని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. మరింత మెరుగుపరిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యవసాయం మాత్రం భారం

మెట్ట ప్రాంతాల్లో ఈ పథకం పట్ల పూర్తి సానుకూలత కనిపిస్తుండగా డెల్టాలో మాత్రం భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కూలీల ఖర్చు పెరిగిందనేది పలువురు వ్యవసాయదారుల వాదన.

కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఎం వెంకటేశ్వర రావు ఈ పథకాన్ని డెల్టాలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు మార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. లేదంటే వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ "ఇప్పటికే వ్యవసాయం ఖర్చు తడిసిమోపెడవుతోంది. అన్ని ఖర్చులు పెరిగిపోయాయి. వాటికి తోడు కూలీల రేట్లు చాలా పెరిగాయి. వ్యవసాయ పనులు లేకపోతే ఉపాధి పనులు అనే ధీమా కూలీల్లో వచ్చింది. రైతులకే భూమి తప్ప మరో దిక్కులేని స్థితి. అందుకే ఈ పథకాన్ని నీటి సదుపాయం లేని ప్రాంతాలకు పరిమితం చేయాలి. లేదంటే వ్యవసాయానికి అనుసంధానం చేసి, మా పంటలకు సాగుకి తోడ్పడేలా చేయాలి. రైతుకు ఈ పథకం ద్వారా మేలు చేసేలా మార్పులు చేయాలని కోరుతున్నాం. కానీ ఎవరూ స్పందించడం లేదు" అని అన్నారు.

పట్టణాల్లోనూ అమలు చేయాలి..

ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన అనుభవాలున్నప్పటికీ మొత్తంగా చూస్తే గ్రామీణ ఉపాధి హామీ పథకం పల్లెలను పరిపుష్టం చేసిందని వ్యవసాయరంగ పరిశీలకుడు పి.రవి బీబీసీతో అన్నారు.

"ఉపాధి హామీ మేలు చేసింది. కానీ చాలా మార్పులు తీసుకొస్తే మరింత ఉపయోగపడుతుంది. వలసలు నివారించడానికి తోడ్పడడం చాలా పెద్ద ప్రయోజనం. 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచితే గ్రామాల్లో ఇక వలసలు అనే మాట వినిపించదు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కూడా ఈ పథకం అమలుచేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల అనుభవంతో కరోనా లాంటి సమయంలో ఉపాధి కోల్పోయిన వారికి ఊరటినిస్తుంది. మొక్కల పెంపకం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడుతుంది. ప్రభుత్వాలు ఈ పథకం విస్తరణ మీద శ్ర‌ద్ధ‌ పెట్టాలి" అని సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)