తమన్నా చెప్పినట్లు పొద్దున్నే బ్రష్ చేయడానికి ముందు ముఖానికి ఉమ్మి రాస్తే మొటిమలు తగ్గిపోతాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముఖంపై మొటిమలు (పింపుల్స్) లేదా యాక్నె (Acne) అనేది యుక్తవయసులోనే కాకుండా, ఆ తర్వాత కూడా ఆందోళన కలిగిస్తున్న సమస్య.
చాలా సందర్భాలలో, 'యాక్నె', 'పింపుల్స్' ఒకదాని బదులుగా ఇంకొక పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రెండు పదాలు వేర్వేరు.
యాక్నె ఒక చర్మ వ్యాధి. ఇది పింపుల్స్, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, సిస్ట్, గడ్డలు (నాడ్యూల్స్) వంటి అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. పింపుల్స్ అనేవి యాక్నె లోని ఒక భాగం మాత్రమే.
చర్మ రంధ్రాలలో నూనె, ధూళి, మురికి, బ్యాక్టీరియా పేరుకుపోయినప్పుడు ముఖంపై ఏర్పడే ఎర్రటి, చీముతో కూడిన కురుపులనే పింపుల్స్ అంటాం.
ఈ మొటిమలు లేదా యాక్నె సమస్య నుంచి బయటపడడానికి వివిధ రకాల పరిష్కారాలు చెప్తుంటారు. కొందరు చిట్కాలు చెప్తుంటారు, ఇంకొందరు అలాంటివి పాటిస్తుంటారు. అయితే, సరైన పద్ధతులు పాటించకపోతే సమస్య మరింత పెరగొచ్చు. చర్మం సున్నితత్వం దెబ్బతినొచ్చు.
అందుకే, ఏదైనా సొంత నిర్ణయం తీసుకునే ముందు వైద్యుల నుంచి సరైన నిర్ధరణ పొందడం అవసరం. వారి సూచనలతో చికిత్స తీసుకోవడం ఉత్తమం.

"మన నోటిలో రాత్రంతా యాంటీ బాక్టీరియల్ పదార్థాలు ఏర్పడతాయి. మొటిమలను నయం చేయడానికి అవి సహాయపడతాయి" అని అన్నారు.
తమన్నా ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు అనేక ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, మనకు మొటిమలు ఎందుకు వస్తాయి, ఉమ్మి (సలైవా)లో ఏమి ఉంటుంది? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
యాక్నె అంటే ఏమిటి?
అధిక నూనె, మృత చర్మ కణాలు, బాక్టీరియా చర్మ రంధ్రాలలో పేరుకుపోయినప్పుడు ఆ రంధ్రాలు మూసుకుపోతాయి. మన శరీరంలో సంభవించే హార్మోన్ల మార్పులు కూడా నూనె పరిమాణాన్ని పెంచి, ఈ రంధ్రాలలో వాపును కలిగిస్తాయి. దీనివల్ల పింపుల్స్, బ్లాక్‌హెడ్స్, నాడ్యూల్స్, సిస్ట్‌లు వంటి సమస్యలు వస్తాయి.
ముంబయికి చెందిన చర్మ వైద్య నిపుణురాలు డాక్టర్ షరీఫా చౌస్ మాట్లాడుతూ, ''యాక్నె రావడానికి అత్యంత సాధారణ కారణం హార్మోన్ల మార్పులే. యుక్త వయసు, రుతుస్రావం, గర్భధారణ, మానసిక ఒత్తిడితో కూడిన సమయాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందిలో, తీవ్రమైన యాక్నెకు హార్మోన్లే ప్రధాన కారణం'' అని ఆమె వివరించారు.
''మొటిమలు (యాక్నె) ఏ వయసులోనైనా రావచ్చు. యుక్తవయసులో.. 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసులో ఇది సర్వసాధారణం. అయినప్పటికీ, చాలామంది, ముఖ్యంగా మహిళలు ముప్పైలలో, నలభైలలో కూడా మొటిమలతో బాధపడుతున్నారు. కాలుష్యం, ధూళి చర్మ రంధ్రాలను మూసివేస్తాయి. వాయు కాలుష్య కారకాలు ఆక్సిడేటివ్ ఒత్తిడిని పెంచుతాయి. ఇది చర్మంపై నూనె పరిమాణాన్ని పెంచుతుంది, చర్మాన్ని మరింత సున్నితంగా మారుస్తుంది" అని డాక్టర్ షరీఫా చెప్పారు.
''ఆహారం, ఒత్తిడి, నిద్ర... అన్నీ మొటిమల సమస్యతో ముడిపడి ఉన్నాయి. అధికంగా చక్కెర, పాల ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల వాపు, నూనె ఉత్పత్తి పెరుగుతాయి. ఒత్తిడి కార్టిసాల్ వంటి హార్మోన్లను పెంచుతుంది. ఇది యాక్నెను మరింత తీవ్రతరం చేయగలదు. నిద్ర లేమి వల్ల కూడా చర్మానికి తీవ్ర నష్టం జరగవచ్చు. అందువల్ల, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం'' అని ఆమె సూచించారు.
చర్మరంధ్రాలను శుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు రెండుసార్లు మైల్డ్ క్లెన్సర్‌తో ముఖం కడుక్కోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. మొటిమలను గిల్లడం, చిదిమేయడం చేయవద్దని సలహా ఇస్తున్నారు.
''ముఖానికి అధికంగా మేకప్ లేదా చర్మ రంధ్రాలను మూసివేసే పదార్థాలను వాడటం వల్ల చర్మంపై నూనె, బాక్టీరియా పేరుకుపోయి యాక్నెను మరింత తీవ్రతరం చేయవచ్చు. ముఖాన్ని అతిగా కడగడం, గట్టిగా రుద్దడం, గోకడం వంటివి చేయడం వల్ల చర్మంలో వాపు ఏర్పడి పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తాయి. తీవ్రమైన సువాసన ద్రవ్యాలు (Strong fragrances), ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులు చర్మాన్ని దెబ్బతీసి, మొటిమల సమస్యను పెంచవచ్చు" అని డాక్టర్ షరీఫా చౌస్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ బాక్టీరియాను ఉమ్మితో చంపేయగలమా?
మొటిమలు, యాక్నె రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి.
మొటిమలను చిదిమేయడం వల్ల అవి త్వరగా నయమవుతాయని కొందరు అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల వాపు పెరిగి, ముఖంపై మచ్చలు ఏర్పడతాయి.
అలాగే, జిడ్డు చర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్ ఉపయోగించకూడదనే అపోహ ఉంది. కానీ, మాయిశ్చరైజర్‌ను ఉపయోగించకపోతే యాక్నె పెరగడానికి కారణం కావచ్చు.
మొటిమలపై ఉమ్మిని రాయడం గురించి కూడా అపోహ ఉంది.
అందుకే, చెన్నైలోని రెలా హాస్పిటల్‌లో చర్మవ్యాధి విభాగంలో కన్సల్టెంట్ డాక్టర్ ఖతిజా నసికాను సంప్రదించాం.
''లాలాజల గ్రంథులలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్‌లు ప్రాక్ని బాక్టీరియం యాక్నె వంటి బాక్టీరియాను చంపగలవని లిటరేచర్ ప్రకారం నిజమే అయినప్పటికీ, మనం ఉమ్మిని రాసినప్పుడు, దానితో పాటు మన నోటిలోని ఇతర బాక్టీరియాను కూడా చర్మానికి పూస్తాం. కాబట్టి ఇది మేలు కంటే ఎక్కువ కీడు చేస్తుంది. అందువల్ల, మొటిమలకు ఉమ్మిని రాయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు'' అని ఆమె చెప్పారు.
''మొటిమలను తగ్గించడానికి, డాక్టర్ మిమ్మల్ని పరీక్షించి మందులు సూచిస్తారు. ఇవి వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ఒకే మందు అందరికీ ఒకేలా పనిచేయదు. యాక్నె మచ్చలు అనేవి కొల్లాజెన్ తగ్గడం లేదా పిగ్మెంటేషన్, మెలనిన్ వల్ల ఏర్పడతాయి. అవి ఉమ్మి రాస్తే పోవు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉమ్మిలో అసలు ఏమి ఉంటుంది?
మానవుల ఉమ్మిలో ప్రధానంగా 98 శాతం నీరు ఉంటుంది. మిగిలిన రెండు శాతం అనేక రసాయనాల మిశ్రమం. వీటిలో ప్రతి దానికీ ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది.
ఉమ్మిలోని అమైలేస్ వంటి ఎంజైమ్‌ల కారణంగా మీరు ఆహారాన్ని జీర్ణం చేసుకోగలరు. మీరు నమిలేటప్పుడు పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి ఇది సహాయపడుతుంది.
లింగ్యువల్ లైపేజ్ కొవ్వులను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.
ఉమ్మిలో లైసోజైమ్, లాక్టోఫెర్రిన్, ఇమ్యునోగ్లోబులిన్ వంటి రక్షణ ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇవి నోటి ఇన్ఫెక్షన్‌లను నియంత్రించడంలో సహాయపడతాయి.
పుణెలోని అపోలో ఆసుపత్రిలో చెవి, ముక్కు, గొంతు సర్జరీ (ఈఎన్‌టీ) కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ సుశ్రుత్ దేశ్‌ముఖ్, ''ఉమ్మిలో ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, కాల్షియం, బైకార్బోనేట్), దానికి మృదుత్వాన్ని ఇచ్చే మ్యూసిన్స్, తక్కువ మొత్తంలో గ్రోత్ ఫ్యాక్టర్లు, యాంటీమైక్రోబయల్ పెప్టైడ్స్ కూడా ఉంటాయి. నోటి పరిసరాల కోసం ఉమ్మి ప్రత్యేకమైన ఒక సమతుల ద్రవం'' అని చెప్పారు.
డాక్టర్ సుశ్రుత్ దేశ్‌ముఖ్ చెప్పిన వివరాల ప్రకారం, ఆహారాన్ని రుచి చూడటం, మింగడంతో పాటు నోటి ఆరోగ్యంలో ఉమ్మి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది నోటిలోని కణజాలాలను తడిగా ఉంచుతుంది. తిన్న తర్వాత ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ఆహార కణాలను కడిగివేస్తుంది. దంత క్షయం లేదా చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బాక్టీరియాను నియంత్రిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉమ్మిని చర్మానికి రాస్తే ఏమవుతుంది?
ఉమ్మిని చర్మానికి రాయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనే చెబుతున్నారు డాక్టర్ సుశ్రుత్ దేశ్‌ముఖ్.
ఆయన చెబుతున్న వివరాల ప్రకారం.. ఉమ్మిలో కొంతవరకు క్రిమిసంహారక గుణాలు ఉన్నప్పటికీ, అందులో నోటి నుంచి వచ్చే బాక్టీరియా కూడా ఉంటుంది. దాన్ని మొటిమలకు రాయడం వల్ల సమస్య మరింత పెరగవచ్చు లేదా కొత్త బాక్టీరియా చేరవచ్చు.
చర్మానికి దాని సొంత రక్షణ పొర, మైక్రోబయోమ్, సొంతంగా నయం చేసే విధానాలు ఉన్నాయి. ఈ వ్యవస్థల్లో ఏదీ ఉమ్మిపై ఆధారపడి లేదు.
అందువల్ల, యాక్నెకు "స్పాట్ ట్రీట్‌మెంట్"గా ఉమ్మిని ఉపయోగించడానికి చర్మశాస్త్రం (డెర్మటాలజీ)లో ఎటువంటి ఆధారం లేదు.
మీరు మీ జీవనశైలిలో ఏవైనా ముఖ్యమైన మార్పులు చేయాలనుకుంటే, అంటే ఆహారంలో మార్పులు, చికిత్స, మందులు లేదా శారీరక వ్యాయామం ప్రారంభించడం వంటివి చేయాలనుకుంటే, డాక్టర్, అర్హత కలిగిన శిక్షకుడి సహాయం తీసుకోవడం ముఖ్యం.
మీ శరీరం, దాని లక్షణాలను డాక్టర్ ద్వారా సరిగ్గా పరీక్షించుకుని, వారి సలహాతో మాత్రమే జీవనశైలి మార్పులు చేయడం ఉత్తమం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














