‘‘చనిపోయారనే రుజువూ చూపడంలేదు, డెత్‌సర్టిఫికెట్స్ ఇవ్వడంలేదు, పరిహారం కోటిరూపాయలని చెప్పి...’’

భీంరావు భార్య సోనీ.
ఫొటో క్యాప్షన్, ''మా కుటుంబ పరిస్థితి ఘోరంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక దేవుడే దిక్కు’’ అని చెప్పారు భీమ్‌రావు భార్య సోనీ.
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''ఏం చేయాలి సార్.. చిన్న ఎముక కూడా దొరకలేదు.. నాలుగు నెలల నుంచి పిచ్చోడిలా తిరుగుతున్నా..'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జస్టిన్ తండ్రి రామదాసు.

హైదరాబాద్ శివారు పాశమైలారంలో ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్‌లో జూన్ 30న జరిగిన పేలుడులో 22 ఏళ్ల జస్టిన్ జాడ తెలియలేదు.

''డెత్ సర్టిఫికెట్ అడిగితే మూడు నెలల్లో ఇస్తామన్నారు. ఆరు నెలలవుతున్నా ఇవ్వలేదు'' అని వాపోయారు రామదాసు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం బండలగూడ బస్తీలో రామదాసు కుటుంబం నివసిస్తోంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు జస్టిన్ ఉన్నారు.

సిగాచీ ఇండస్ట్రీస్‌లో జరిగిన ప్రమాదంలో 46 మంది చనిపోగా, మరో 8 మంది గల్లంతయ్యారని, వారికి సంబంధించిన ఏ చిన్న ఆధారం (ఎముకలు) కూడా దొరకలేదని ప్రభుత్వం ప్రకటించింది.

గల్లంతైన వారికి సంబంధించి చిన్న ఎముక దొరికినా, డీఎన్ఏ పరీక్ష చేద్దామని నాలుగైదు రోజులపాటు గాలించినట్లు సంగారెడ్డి జిల్లా అధికారులు జులైలో ప్రకటించారు.

అలా రామదాసు కుటుంబానికి జస్టిన్.. ఇప్పుడు జ్ఞాపకాల్లో మాత్రమే మిగిలిపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘క్రిస్మస్‌ను రంగుల పండగలా చేసేవాడు’’

' క్రిస్మస్ వస్తోందంటే ఏటా డిసెంబరు 25 నాటికి ఇల్లంతా రంగులు వేయించి ఎంతో బాగా చేసేవాడు. ఇప్పుడు ఆ ఆనందమంతా పోయింది'' అంటూ జస్టిన్ అత్త సుజాత బీబీసీతో చెప్పారు.

ప్రమాద సమయంలో జస్టిన్‌తో పాటు ప్యాకేజింగ్ యూనిట్‌లో పనిచేసేందుకు సిగాచీ ఇండస్ట్రీస్‌కు మరికొందరు వెళ్లినట్లు ఎంట్రీ రిజిస్టర్‌లో అధికారులు గుర్తించారు.

''అప్పటికి పనికి వెళ్లడం మొదలుపెట్టి రెండు రోజులే అయ్యింది. ఏదో పౌడర్ ప్యాకింగ్ చేసే పని అని చెప్పాడు. భీమ్‌రావు ఇద్దరూ కలిసి వెళ్లారు'' అని రామదాసు తెలిపారు.

భీమ్‌రావు కూడా ఇదే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయారని అధికారులు ప్రకటించారు.

సిగాచీ ఇండస్ట్రీస్‌ బాధితులు
ఫొటో క్యాప్షన్, ''డెత్ సర్టిఫికెట్ అడిగితే మూడు నెలల్లో ఇస్తామన్నారు. 6 నెలలవుతున్నా ఇవ్వలేదు'' జస్టిన్ తండ్రి రామదాసు ఆవేదన

‘‘కోటిరూపాయలు ఇస్తామని పాతిక లక్షలే ఇచ్చారు’’

''మాకు ఇస్తామని చెప్పిన పరిహారం కూడా పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పటివరకు పాతిక లక్షల రూపాయలే ఇచ్చారు'' అని బీబీసీతో చెప్పారు భీమ్‌రావు భార్య సోనీ.

బండలగూడ బస్తీలోని రామదాసు కుటుంబం నివాసం ఉంటున్న రెండు వీధుల ఆవల భీమ్‌రావు కుటుంబం ఉంటోంది. ఇరుకు వీధుల్లో అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లలో ఇక్కడి ప్రజల జీవనం సాగుతోంది.

భీమ్‌రావు చనిపోయే నాటికి ఆయన పాపకు ఐదు నెలల వయసు.

''నాకు పనికి వెళ్లడం రాదు.అనారోగ్యం ఉంది. పరిహారం ఇస్తే, పాపను చూసుకుంటూ, చదివించుకుందామనుకున్నా. ఇప్పటికే అధికారులను చాలాసార్లు కలిశాం'' అని సోనీ చెప్పారు.

పనికి వెళ్లిన రెండు రోజులకే ఇలా జరుగుతుందనుకోలేదని వాపోయారామె.

''ఐదు రోజులు ఆసుపత్రిలో ఉంచారు. తర్వాత చనిపోయాడని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మా అత్తమ్మ కూడా ఛాతీలో నొప్పితో చనిపోయింది'' అని చెప్పారు.

''మా కుటుంబ పరిస్థితి ఘోరంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక దేవుడే దిక్కు '' అన్నారు సోనీ.

సిగాచీ ఇండస్ట్రీస్ ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే..

ప్రమాదం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగాచీ ఇండస్ట్రీస్‌ను సందర్శించారు. బాధితులతో మాట్లాడారు. చనిపోయిన వారి కుటుంబాలకు పరిశ్రమతో మాట్లాడి కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని ప్రకటించారు.

''పరిశ్రమ వాళ్లతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. ఆదేశాల ప్రకారం, మా మంత్రులు పరిశ్రమ వాళ్లతో మాట్లాడి పరిహారం అందిస్తారు'' అని అప్పట్లో ప్రకటించారు.

ప్రమాదం జరిగి 6 నెలలు కావస్తున్నా, బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదు. చనిపోయిన పర్మినెంట్ ఉద్యోగులు లేదా కార్మికుల కుటుంబాలకు రూ.45 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు… క్యాజువల్, కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెల్లించినట్లు డిసెంబరు 9న తెలంగాణ హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది.

సీఎం ప్రకటించిన మేరకు, ఏ ఒక్కరికీ రూ.కోటి పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. మరోవైపు, ఇప్పటివరకు ఎక్కువ పరిహారం దక్కిన వారిలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు వంటివి కలుపుకొని ఉన్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ అంశాన్ని బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

అయితే, పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి బీబీసీతో చెప్పారు.

సిగాచీ ఇండస్ట్రీస్
ఫొటో క్యాప్షన్, గల్లంతైన 8 మంది డెత్ సర్టిఫికెట్లను అధికారులు ఇంకా జారీ చేయలేదు.

''డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు''

ఝార్ఖండ్‌కు చెందిన 22 ఏళ్ల ఇర్ఫాన్ అన్సారీ ప్రమాదంలో కనిపించకుండా పోయారని అధికారులు ప్రకటించారు.

ఆయన కుటుంబం హైదరాబాద్ వచ్చి ఎప్పుడెప్పుడు తమ కుమారుడి డెత్ సర్టిఫికెట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. తమకు రూ.కోటి పరిహారం ఇస్తామని చెప్పి రూ.25 లక్షలే ఇచ్చారని ఇర్ఫాన్ అన్సారీ తండ్రి జుమెరత్ మియా చెప్పారు.

''ఇప్పటికీ బాడీ దొరకలేదు. నా పెద్ద కొడుకుకు ఒకసారి, నాకోసారి.. రెండుసార్లు డీఎన్ఏ టెస్టు చేశారు. అయినా సరే మాకేమీ దొరకలేదు. అక్కడ మట్టి, ఇతరత్రా తవ్వుతున్నారు. ఏదైనా చిన్న ఎముక దొరికినా డీఎన్ఏ టెస్టు చేసి, మీకు అందిస్తామని, అది తీసుకుని వెళ్లొచ్చని చెప్పారు. 10-12 రోజులు చూసినా ఏం దొరకలేదు'' అన్నారు.

డెత్ సర్టిఫికెట్ ఇవ్వపోవడంతో కొడుకును తలచుకుంటూ బీబీసీ వద్ద కన్నీరు పెట్టుకున్నారాయన. 20 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి, డెత్ సర్టిఫికెట్ కోసం ఎదుచూస్తున్నారు.

జాడతెలియని 8 మందికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్లను అధికారులు ఇంకా జారీ చేయలేదు.

అయితే, ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని ఐఐసీటీ మాజీ శాస్త్రవేత్త, పర్యావరణవేత్త బాబూరావు బీబీసీతో చెప్పారు.

సిగాచీ ఇండస్ట్రీస్

నిపుణుల కమిటీ ఏం చెప్పింది?

సిగాచీ ఇండస్ట్రీస్ హైదరాబాద్‌ యూనిట్ సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో సుమారు నాలుగు ఎకరాల్లో ఉందని, దాదాపు 190 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు వివరించారు.

హైదరాబాద్ యూనిట్‌లో కంపెనీ మైక్రో క్రిస్టలిన్ సెల్యూలోజ్ పౌడర్ (ఎంసీసీపీ) తయారు చేస్తోందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఇచ్చిన సమాచారంలో సిగాచీ యాజమాన్యం పేర్కొంది.

సిగాచీ ఇండస్ట్రీస్‌లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం ఐఐటీసీ, నాగ్‌పుర్‌కు చెందిన ఫోరెన్సిక్ ఫర్ సైబర్ ఇన్వెస్టిగేటర్స్, పరిశ్రమల శాఖ అధికారులతో నిపుణుల కమిటీని నియమించింది. ఈ నిపుణుల కమిటీ నవంబరులో ప్రభుత్వానికి 278 పేజీల నివేదిక సమర్పించింది.

పేలుడు జరిగిన సమయంలో 17 టన్నుల మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ (ఎంసీసీ) నిల్వ ఉందని, ఇది మండే స్వభావం కలదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ సమయంలో సుమారు 900-1000 డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడిందని వెల్లడించింది.

''పేలుడు కారణంగా మంటలు 25 మీటర్ల ఎత్తుకు ఎగసిపడ్డాయి. సీలింగ్ మిషన్, ప్యాకేజింగ్ ఏరియా ధ్వంసమైంది. సీలింగ్ మిషన్ పక్కనే 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో 26 మృతదేహాలు పడ్డాయి'' అని నివేదిక స్పష్టం చేసింది.

ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కారణమని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. పరిశ్రమ ఉత్పాదకత పెంచినా సుశిక్షితులైన కార్మికులను నియమించుకోలేదని, పరిశ్రమ విస్తరణ జరగలేదని పేర్కొంది.

''ఎంసీసీకి మండే స్వభావం, విస్పోటం జరిగేందుకు అవకాశం ఉంటుదని తెలిసినా, డస్ట్ డెన్సిటీ తగ్గించేందుకు పరిశ్రమ అవసమైన చర్యలు తీసుకోలేదు'' అని స్పష్టం చేసింది.

దీనిపై వివరణ కోరేందుకు సిగాచీ ఇండస్ట్రీస్ పీఆర్ వ్యవహారాలు చూస్తున్న ఏజెన్సీని బీబీసీ సంప్రదించింది.

''ప్రస్తుతం ఘటనపై విచారణ న్యాయస్థానం పరిధిలో ఉన్నందున స్పందించలేం'' అని యాజమాన్యం వివరణ ఇచ్చిందని పీఆర్ ఏజెన్సీ బీబీసీకి చెప్పింది.

అలాగే బీబీసీ నేరుగా యాజమాన్యాన్ని ఫోన్ ద్వారా సంప్రదించగా, వారి నుంచి స్పందన రాలేదు.

మరోవైపు, కార్మికులకు న్యాయం చేసే బాధ్యత కార్మిక సంక్షేమ శాఖ తీసుకోవాలని బాబూరావు చెప్పారు.

''కార్మిక శాఖ ఆ బాధ్యత తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగే పరిశ్రమల్లో అసంఘటిత రంగ కార్మికులు, శిక్షణ లేనివారిని నియమించుకుంటున్నారు. వాళ్లకు ప్రమాదాలపై అవగాహన ఉండటం లేదు. భద్రత గురించి తెలియడం లేదు. అదే ప్రమాదాలకు కారణమవుతోంది'' అని చెప్పారు.

పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమను ఇప్పుడు బీబీసీ మరోసారి సందర్శించింది. అక్కడ కాలిపోయి శిథిలమైన భవనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొందరు భద్రతా సిబ్బంది కాపలాగా ఉన్నారు.

ఇప్పుడక్కడ ఎలాంటి కార్యకలాపాలూ జరగడం లేదని భద్రతా సిబ్బంది చెప్పారు.

తెలంగాణ కార్మిక సంక్షేమ, పరిశ్రమల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి

ఫొటో సోర్స్, Vivek Venkatswamy/FB

ఫొటో క్యాప్షన్, తెలంగాణ కార్మిక సంక్షేమ, పరిశ్రమల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి

పరిహారం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం: మంత్రి

సిగాచీ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడుతున్నామని, పరిహారం పూర్తి స్థాయిలో ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ కార్మిక సంక్షేమ, పరిశ్రమల శాఖా మంత్రి జి.వివేక్ వెంకటస్వామి బీబీసీతో చెప్పారు.

''సిగాచీ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తెస్తున్నాం. ప్రభుత్వం ప్రకటించిన మేర పరిహారం ఇవ్వాలని చెబుతున్నాం. నిపుణుల కమిటీ సలహాలు, సూచనలు అమలు చేసేలా చూస్తాం. కేవలం సిగాచీ పరిశ్రమ ఒక్కటే కాదు, అన్ని పరిశ్రమల యాజమాన్యాలను సుశిక్షితులైన కార్మికుల నియమించుకోవడం, భదత్ర పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం'' అని చెప్పారు.

పరిశ్రమల శాఖ ఇన్‌స్పెక్టర్లతో ఎప్పటికప్పుడు భద్రత పరమైన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు.

మరోవైపు, డెత్ సర్టిఫికెట్స్ విషయంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను బీబీసీ ఫోన్ ద్వారా స్పందించింది. వారి నుంచి స్పందన రాగానే ఇక్కడ అప్డేట్ చేస్తాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)