ఆ పర్వతంపై డైనోసార్ల వేల పాదముద్రలు

ఇటలీ, పర్వత ప్రాంతం

ఫొటో సోర్స్, Elio Della Ferrera, Arch. PaleoStelvio

ఫొటో క్యాప్షన్, పర్వత వాలుపై డైనోసార్ల పాదముద్రలను చూపుతున్న చిత్రం
    • రచయిత, లారా గోజి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర ఇటలీలోని ఒక నేషనల్ పార్క్‌లో 21 కోట్ల ఏళ్ల కిందటి వేలాది డైనోసార్ల అడుగు జాడలను కనుగొన్నారు.

ఈ పాదముద్రలో కొన్నిటి వ్యాసం 40 సెంటీమీటర్ల వరకు ఉంది.

ఈ అడుగు జాడలు ఒకే దిశలో సమాంతరంగా ఉన్న వరుసల్లో ఉన్నట్లు గుర్తించారు. చాలా అడుగుజాడల్లో వాటి వేళ్లు, పంజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ డైనోసార్లను ప్రోసారోపాడ్స్‌గా భావిస్తున్నారు. ఇవి పొడవాటి మెడలు, చిన్న తలలు, పదునైన పంజాలు కలిగిన శాకాహార డైనోసార్లు.

‘నేను నివసిస్తున్న ప్రాంతంలో ఇలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణను కనుగొంటారని నేనెప్పుడూ ఊహించలేదు'' అని మిలాన్‌కు చెందిన పాలియాంటాలజిస్ట్ క్రిస్టియానో దాల్ సాసో అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈశాన్య మిలాన్‌లోని స్టెల్వియో నేషనల్ పార్కులో నిట్టనిలువుగా ఉన్న ఒక పర్వత వాలుపై వందల మీటర్ల మేర విస్తరించిన అడుగు జాడలను సెప్టెంబర్‌‌లో ఒక ఫోటోగ్రాఫర్ గుర్తించారు.

25 కోట్ల నుంచి 20.1 కోట్ల ఏళ్ల క్రితం నాటి త్రయాసిక్ కాలంలో.. ఈ వాలు తీరప్రాంతంలాగా ఉండేది. ఈ తర్వాత ఇది ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలో కలిసిపోయింది.

''ఈ ప్రాంతం పూర్తిగా డైనోసార్లతో ఉండేది. ఇది అపారమైన శాస్త్రీయ సంపద'' అని దాల్ సాసో చెప్పారు.

డైనోసార్ల గ్రూప్ చాలా సామరస్యంతో కదిలేవని తెలిపారు.

‘కొన్నిచోట్ల చాలా క్లిష్టమైన ప్రవర్తన ఆనవాళ్లను కూడా గుర్తించవచ్చు. అంటే రక్షణ కోసం ఈ జంతువుల సమూహాలు సర్కిల్‌గా సమావేశమైనట్లు కనిపించింది'' అని దాల్ సాసో తెలిపారు.

డైనోసార్లు

ఫొటో సోర్స్, Illustrazione di Fabio Manucci, Arch. PaleoStelvio

ప్రోసారోపాడ్స్‌ 10 మీటర్ల (33 అడుగుల) వరకు పొడవుగా ఉండొచ్చు. రెండు కాళ్లతో నడుస్తాయి. కానీ, కొన్ని చోట్ల చేతి వేళ్ల ముద్రలు, పాదముద్రలకు ముందు కనిపించాయి.

బహుశా ఈ ప్రోసారోపాడ్స్ నడిచేటప్పుడు కాసేపు ఆగి, నేలపై విశ్రాంతి తీసుకునేవని ఇవి సూచిస్తున్నాయి.

'' ఈ డిస్కవరీ మనందరిలో ఒక ఆలోచనను రేకెత్తిస్తుందని ఆశిస్తున్నా. మనం నివసిస్తున్న ప్రాంతాలు, మన గ్రహం గురించి మనకెంత తక్కువ తెలుసో ఇది చెప్తోంది'' అని డైనోసార్ల ప్రాంతాన్ని గుర్తించిన ఫోటోగ్రాఫర్ ఎలియో డెల్లా ఫెరెరా చెప్పారు.

ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌లో.. ఈ ప్రాంతం మారుమూలన ఉంది. నడుచుకుంటూ కూడా వెళ్లలేం. అందుకే, డ్రోన్లను, రిమోట్ సెన్సింట్ టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)