'చెల్లెలి పెళ్లి' కోసం వజ్రాన్ని తవ్వితీసిన ఇద్దరు స్నేహితులు.. కేవలం 20 రోజుల్లోనే వారిని అదృష్టం ఎలా వరించిందంటే..

వజ్రం, అదృష్టం, వజ్రాల వేట

ఫొటో సోర్స్, AMIT RATHAUR

    • రచయిత, విష్ణుకాంత్ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక అన్న తన చెల్లి కోసం ఏం చేయగలడు?

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో నివసించే ఇద్దరు స్నేహితుల కథ ఈ ప్రశ్నతోనే మొదలవుతుంది.

డిసెంబర్ 9 ఉదయం. చాలా చలిగా ఉంది. మధ్యప్రదేశ్ పన్నాలోని డైమండ్ ఆఫీసు బయట పెద్దగా రద్దీ ఏమీలేదు.

కానీ సాజిద్ మొహమ్మద్, సతీశ్ ఖటీక్‌లకు ఇది సాధారణమైన రోజు కాదు, పేపర్లలో చుట్టిపెట్టిన చిన్న ప్యాకెట్ పట్టుకుని నిలబడి ఉన్నారు.

ఆ ప్యాకేట్ లోపల 15.34 క్యారెట్ల వజ్రం ఉంది. దానితో పాటు, ఎంతోమంది ఆశపడినా.. కొందరికి మాత్రమే నిజమయ్యే కల కూడా.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సాజిద్‌కి ఒక చిన్న పండ్ల దుకాణం ఉంది. సాజిద్, సతీశ్ ఇద్దరూ ఆ దుకాణంలోనే కూర్చుని ఉన్నారు.

"వజ్రం దొరికినప్పుడు మనకి అర్థమైపోతుంది. అది ప్రకాశవంతంగా మెరుస్తుంది. శరీరం అంతా ఒక్కసారిగా గగుర్పొడుస్తుంది. అవును, ఇది వజ్రమే అని అనిపిస్తుంది" అని సాజిద్ అన్నారు.

"సతీశ్ ఖటీక్, సాజిద్ మొహమ్మద్ కనుగొన్న వజ్రం 15.34 క్యారెట్లు. ఆ గని సతీశ్ పేరు మీద ఉంది. వారిద్దరూ కలిసి ఈ వజ్రాన్ని వెలికితీశారు" అని పన్నా వజ్ర కార్యాలయంలో పనిచేస్తున్న ప్రభుత్వ వజ్రాల నిపుణులు అనుపమ్ సింగ్ తెలిపారు.

"ఇంత త్వరగా, ఇంత పెద్ద మొత్తాన్ని సొంతం చేసుకుంటామని మేం ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు మా చెల్లెళ్లకు ఘనంగా వివాహం చేయగలం" అని వజ్రం దొరికిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ సతీశ్ అన్నారు

వజ్రం, అదృష్టం, వజ్రాల వేట

ఫొటో సోర్స్, SIDDARTH KEJRIWA

ఫొటో క్యాప్షన్, పన్నాలో వజ్రాల కోసం జరిపే తవ్వకాలు కేవలం ఉపాధి మాత్రమే కాదు.. ఆశ, అనిశ్చితితో కూడిన నిర్ణయం కూడా.

'డైమండ్ సిటీ' వెనకున్న కథ..

బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్న పన్నా 'డైమండ్ సిటీ'గా ప్రసిద్ధి చెందింది.

కానీ, ఈ గుర్తింపు వెనుక పేదరికం, నీటి ఎద్దడి, ఉపాధి అవకాశాలు లేకపోవడం అనే సుదీర్ఘ కథ కూడా ఉంది.

ఇక్కడ, భూమిని తవ్వడం అనేది కేవలం ఒక పని కాదు.. ఆశ, అనిశ్చితి మధ్య తీసుకున్న నిర్ణయం.

వజ్రాన్ని వెతకాలనే కోరికతో సాజిద్, సతీశ్ కూడా అదే మార్గాన్ని అనుసరించారు.

పన్నాలో వజ్రాల కోసం చాలామంది తమ జీవితాంతం వెతుకుతూనే ఉంటారు. కానీ, ఈ ఇద్దరు స్నేహితులకు మాత్రం కేవలం 20 రోజుల్లోనే ఈ విజయం దక్కింది.

సాజిద్, సతీశ్ చిన్ననాటి స్నేహితులు. వీరిద్దరి జీవితాలు కూడా చాలా వరకు ఒకేలా ఉన్నాయి.

పన్నాలోని రాణిగంజ్ ప్రాంతంలోనే ఇద్దరి ఇళ్లు ఉన్నాయి. వారి పూర్వీకులు కూడా వజ్రాల వేట సాగించారు.

వజ్రం, గనులు, లీజు, అదృష్టం, వజ్రాల వేట

సతీశ్ పన్నాలో ఒక చిన్న మాంసం దుకాణం నడుపుతుండగా, సాజిద్ కుటుంబం పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది.

ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలా? అనే ఆందోళన రెండు కుటుంబాలనూ వెంటాడుతుండేది. చాలీచాలని ఆదాయంతో నెట్టుకొస్తున్న కుటుంబాలకు అది చాలాపెద్ద విషయమే.

"మా నాన్న, తాత కూడా చాలా ఏళ్లు తవ్వకాలు జరిపారు. కానీ, ఎప్పుడూ వజ్రం దొరకలేదు" అని సాజిద్ తెలిపారు.

సతీశ్ కుటుంబం కథ కూడా దీనికి భిన్నమేమీ కాదు. పార చేతబట్టిన ప్రతిసారీ, ఈసారైనా తమ అదృష్టం మారుతుందా అని అనుకుంటూ ఉండేవారు.

పెరుగుతున్న ఇంటి ఖర్చులు, వారి సోదరీమణుల వివాహాల గురించిన బెంగ నవంబర్‌లో ఇద్దరు స్నేహితులూ ఒక నిర్ణయానికి వచ్చేలా చేశాయి. అదే వజ్రాల వేట.

పన్నా నేపథ్యంలో చూస్తే, ఇది ఏ మాత్రం ఆశ్చర్యకరమైన నిర్ణయం కాదు.

తరతరాలుగా వందలాది కుటుంబాలు వజ్రాలను వెతకడానికి ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో, ఇద్దరు యువకుల నిర్ణయం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. కానీ కేవలం 20 రోజుల్లోనే వారి గురించి ప్రతిచోటా చర్చ మొదలైంది.

వజ్రం, గనులు, లీజు, అదృష్టం, వజ్రాల వేట

ఫొటో సోర్స్, AMIT RATHAUR

ఫొటో క్యాప్షన్, తవ్వకాల సమయంలో సాజిద్ మొహమ్మద్, సతీష్ ఖటీక్‌కు దొరికిన వజ్రం 15.34 క్యారెట్లు, దీని మార్కెట్ ధర రూ. 50 నుంచి 60 లక్షలు ఉంటుందని అంచనా.

పన్నాలో వజ్రం వెతకడం ఎలా?

పన్నాలోని మఝగవాన్ వజ్రాల గనిని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) నిర్వహిస్తుంది, ఇది దేశంలోని ఏకైక వ్యవస్థీకృత వజ్రాల ఉత్పత్తి కేంద్రం.

పన్నాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8x8 మీటర్ల భూమిని లీజుకు తీసుకోవడం ద్వారా చట్టబద్ధంగా ఒక సంవత్సరం పాటు ఎవరైనా వజ్రాలను తవ్వుకోవచ్చు. ఏడాది ఫీజు 200 రూపాయలు.

అయితే, మీకు కచ్చితంగా వజ్రం దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు.

సాజిద్, సతీశ్ కూడా ఇలా లీజుకి తీసుకునే తవ్వడం మొదలుపెట్టారు. దాదాపు 20 రోజుల పాటు కష్టపడి పనిచేసిన తర్వాత, డిసెంబర్ 8వ తేదీ ఉదయం, వారి జీవిత గమనాన్ని మార్చే శక్తి ఉన్న రాయి వారికి దొరికింది.

మరుసటి రోజు పన్నా వజ్రాల కార్యాలయానికి వచ్చినప్పుడు, దానిని పరీక్షించగా, దాని బరువు 15.34 క్యారెట్లుగా తేలింది. ఇది జెమ్-క్వాలిటీ వజ్రం.

వజ్రం, గనులు, లీజు, అదృష్టం, వజ్రాల వేట

విలువ ఎంత?

దీని విలువ ఎంత ఉంటుంది? అని అనుపమ్ సింగ్‌‌ను అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు. "వజ్రానికి కచ్చితమైన ధర చెప్పడం కష్టం. ఎందుకంటే, అది అంతర్జాతీయ మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుత అంచనాల ప్రకారం, దీని ధర సుమారు 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చు."

ఆయన చెప్పిన ప్రకారం, పన్నాలో ఇప్పటివరకు దొరికిన అత్యంత ఖరీదైన వజ్రం 2017-18 సంవత్సరంలో మోతీలాల్ ప్రజాపతి అనే వ్యక్తికి దొరికింది.

ఆ వజ్రం 42.58 క్యారెట్ల బరువుండి, వేలంలో క్యారెట్‌కు 6 లక్షల రూపాయల ధర పలికింది, దీని మొత్తం విలువ రూ.2.5 కోట్లకు పైగా ఉంది.

వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన వజ్రాల గురించి అడిగినప్పుడు, చాలా వజ్రాలు ఐదు వేలం పాటల్లోపు అమ్ముడవుతాయని అనుపమ్ సింగ్ అన్నారు.

ఒక వజ్రం అమ్ముడవ్వకపోతే, అది దొరికిన వ్యక్తి ప్రభుత్వానికి నిర్దేశించిన రాయల్టీ చెల్లించి దానిని తిరిగి తీసుకొని ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకోవచ్చు.

వేలం నుంచి వచ్చిన మొత్తంలో 12 శాతం ప్రభుత్వం మినహాయించుకుంటుంది. మిగిలిన మొత్తం వజ్రం కనుగొన్న వారికి లభిస్తుంది.

వజ్రం, గనులు, లీజు, అదృష్టం, వజ్రాల వేట

ఫొటో సోర్స్, SIDDARTH KEJRIWAL

ఫొటో క్యాప్షన్, పన్నాలో ఏ వ్యక్తి అయినా రాష్ట్ర ప్రభుత్వంతో 8x8 మీటర్ల భూమిని లీజ్‌కి తీసుకుని చట్టబద్ధంగా ఒక సంవత్సరం పాటు వజ్రాల కోసం తవ్వుకోవచ్చు.

"మొదటిసారిగా జీవితం మారబోతోందని అనిపిస్తోంది" అని సాజిద్, సతీశ్ సోదరీమణులు అంటున్నారు.

"ఈ మొత్తం మేం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. ఎందుకంటే మా నెలవారీ ఆదాయం కొన్ని వేల రూపాయలే" అని సాజిద్, సతీశ్ చెబుతున్నారు.

సాజిద్ సోదరి సబా బానో మాట్లాడుతూ, వజ్రం దొరికిన వార్త తమ కుటుంబానికి తొలిసారిగా కొత్త ఆశలను తెచ్చిపెట్టిందని అన్నారు.

"మా నాన్న, తాతకు ఎప్పుడూ దొరకలేదు. మా అన్నయ్య, సతీశ్ అన్నయ్యా మా పెళ్లిళ్లు చేస్తామని చెప్పారు. మా కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది" అని అన్నారు.

"వజ్రం దొరికిన రాత్రి నిద్ర పట్టలేదు. డబ్బు కంటే.. భద్రమైన భవిష్యత్తు, చెల్లెళ్ల పెళ్లిళ్లు, ఇల్లు, కొంత స్థిరత్వం గురించే కలలు" అని సాజిద్, సతీశ్ అంటున్నారు.

పన్నాలో వజ్రం కోసం వెతకడం అనేది ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడే ప్రయాణం.

చాలామంది ఖాళీ చేతులతో తిరిగి వస్తారు. కానీ ఎవరికైనా వజ్రం దొరికితే, ఆ మెరుపు కేవలం ఆ ఒక్క కుటుంబానికే పరిమితం కాదు. బహుశా తరువాతి వంతు తమదే కావొచ్చనే భావన ఆ ప్రాంతమంతటా కలిగిస్తుంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)