ఎలాంటి ఆర్డర్లు చేయకపోయినా ఆ మహిళకు వందలకొద్దీ ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు.. కూపీ లాగిన పోలీసులకు ఏం తెలిసిందంటే..

కోయంబత్తూరు, మహిళ, ఉద్యోగం, కంపెనీ, పార్సిల్, క్యాష్ ఆన్ డెలివరీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కోయంబత్తూరులో ఓ మహిళకు వందలాదిగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిల్స్ రావడానికి కారణమైన ఓ కంపెనీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందో కోయంబత్తూర్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు బీబీసీకి వివరించారు.

కోయంబత్తూరుకు చెందిన ఓ మహిళ సొంతంగా కంపెనీ నడుపుతున్నారు. ఏడాది కాలంగా ఆమెకు వివిధ కొరియర్ కంపెనీల నుంచి రకరకాల పార్సిళ్లు వస్తున్నాయి. ఆమె ఎటువంటి ఆర్డర్లు చేయకపోయినా ఆమె పేరుపై ఆమె మొబైల్ నంబర్, ఈ మెయిల్ చిరునామా పేర్కొంటూ క్యాష్ ఆన్ డెలివరీ పేరుతో పార్సిళ్లు వచ్చేవి . దీనితో ఆ మహిళ చాలా గందరగోళానికి గురయ్యారు.

తాను ఎటువంటి ఆర్డర్ చేయలేదని చెప్పి వాటిని వెనక్కి పంపేవారు. కానీ తరువాత కూడా ప్రతిరోజూ 50 నుంచి 100 పార్శిళ్లు వస్తూనే ఉన్నాయి. ఆ మహిళ పేరుకు ముందు లేదా తర్వాత మరో అసభ్యకరమైన పేరు జోడించి మరీ ఆమె చిరునామాకి పార్శిళ్లు పంపించారని పోలీసులు చెబుతున్నారు.

"ఈ పార్సిళ్లను డెలివరీ చేయడానికి చాలా మంది ఒకేసారి ఆమె ఫోన్‌కు కాల్ చేసేవారు, చాలా మంది పార్శిళ్లతో ఒకేసారి ఇంటిదగ్గరకు వచ్చేవారు. ఒక్క రోజు కూడా విరామం లేకుండా...కొన్ని నెలలుగా ఇదే జరుగుతోంది. దీంతో ఆ మహిళ చాలా ఇబ్బందిపడ్డారు" అని పోలీసులు తెలిపారు.

ఆమె గత ఏప్రిల్‌లో కోయంబత్తూరు సిటీ సైబర్ క్రైమ్ యూనిట్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు 8 నెలల తర్వాత, "ఇదంతా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశాం" అని పోలీసులు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సతీష్ కుమార్

ఫొటో సోర్స్, Sathish Kumar

ఫొటో క్యాప్షన్, సతీష్ కుమార్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది?

ఒక కంపెనీకి యజమాని అయిన సతీష్ కుమార్ ఈ పార్శిళ్లను పంపాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు.

"సతీష్ కుమార్ కంపెనీలో 2023లో చేరిన ఆ మహిళ అక్కడ ఏడాదికి పైగా పనిచేశారు. గతేడాది ఆ కంపెనీలో మానేసి తన సొంత కంపెనీని ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత ఈ పార్శిళ్లు రావడం మొదలైంది" అని పోలీసులు తెలిపారు.

"ఈ మహిళ అక్కడ పనిచేస్తున్నప్పుడు కంపెనీకి చాలా ఆర్డర్లు, ఆదాయం వచ్చింది. ఆమె బయటకు వచ్చి తన సొంత కంపెనీని మొదలుపెట్టాక, ఆ కస్టమర్లందరూ ఈ మహిళ కంపెనీకి మారారు" అని కోయంబత్తూరు నగర సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అళుగురాజా అన్నారు.

"ఆ ప్రభావం సతీష్ కుమార్ కంపెనీపై పడింది. దీంతో ఆ మహిళపై ప్రతీకారం తీర్చుకునేందుకే తానే ఇలా చేశానని సతీష్ కుమార్ ఒప్పుకున్నారు. సోషల్ మీడియాలో తాను చూసిన ప్రతిదాన్ని ఆర్డర్ చేసి, ఆ మహిళకు వేల పార్శిళ్లను పంపారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడా తన పేరు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతోపాటు ఆ మహిళకు కూడా సతీష్ గురించి ఎటువంటి అనుమానాలు లేకపోవడంతో, ఆయన్ని కనిపెట్టడానికి టైం పట్టింది" అని ఆయన చెప్పారు.

పోలీసులు, తమిళనాడు

ఫొటో సోర్స్, TNPolice

ఆ మహిళ ఫిర్యాదు ఆధారంగా, పార్శిళ్లను పంపిన అనేక కంపెనీలను సంప్రదించి, కొంత సమాచారం సేకరించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఒక కంపెనీ ఐపీ అడ్రస్ నుంచి ఈ ఆర్డర్లన్నీ చేసింది సతీష్ కుమార్ అని తాము కనిపెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.

సతీష్‌కుమార్‌ను అరెస్ట్ చేసే ముందురోజు కూడా ఆ మహిళకు ఇలాంటి పార్శిళ్లు వస్తూనే ఉన్నాయని పోలీసులు తెలిపారు.

కాంటాక్ట్ నంబర్ మార్చితే తన వ్యాపారం దెబ్బతింటుందని, ఆ మహిళ తన ఫోన్ నంబర్ మార్చుకోలేదని వారు తెలిపారు.

తాను ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవడంలేదని ఆమె బీబీసీకి తెలిపారు.

ఆన్ లైన్ ఆర్డర్, క్యాష్ ఆన్ డెలివరీ, ప్రతీకారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి'

మహిళలపై నేరాలకు పాల్పడేందుకు సోషల్ మీడియా, ఇంటర్‌నెట్ సౌకర్యాలను నేరగాళ్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, చాలా మంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.

ఇందుకోసం వివిధ కళాశాలలు, ఐటీ సంస్థలలో అవగాహనా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కోయంబత్తూర్ నగర పోలీసులు తెలిపారు.

"ఈ మహిళ ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు. ఆమె అనేక విధాలుగా పోరాడారు. ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టుకోగలిగారు . కానీ వేధింపులు ఎలా మొదలైనా వెంటనే మహిళలు ఫిర్యాదుచేస్తే, వారికి కలిగే హానిని తగ్గించుకోవచ్చు" అని అళుగురాజా అన్నారు.

"ఈ కేసులో బాధితురాలు బాగా చదువుకున్న వ్యక్తి, ప్రతిభావంతురాలు. కాబట్టి ఆమె పనిచేసిన కంపెనీ మంచి ఆదాయాన్ని ఆర్జించింది. కానీ కంపెనీని వదిలిపెట్టినందుకు దాని మేనేజర్ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలు వెంటనే ధైర్యంగా వ్యవహరించడం చాలా ముఖ్యం" అని ఆయన అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)