శరీరంలో కొవ్వు ఎక్కువ ఉంటే చలి తక్కువ వేస్తుందా? మజిల్స్ ఉంటే చలి వేయదా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?

చలి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శీతాకాలంలో చాలా ప్రాంతాల్లో పొగమంచు ప్రధాన సమస్య.

ఇది తరచూ రైళ్లు, విమానాలు, రోడ్లపై వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది.

శీతాకాలంలో దిల్లీ, శివారు ప్రాంతాల్లోని ప్రజలకు గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోంది.

కానీ, మరికొందరికి చలి వాతావరణమే ఇబ్బందికరంగా ఉంటుంది.

ఈ సమయంలో ఎన్నో మీమ్స్ పుట్టుకొస్తుంటాయి.

చలికాలంలో స్నానం చేయాలా? వద్దా? అనేదానిపై సోషల్ మీడియాలో, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా చర్చ జరుగుతుందనే స్టోరీలు వినిపిస్తుంటాయి.

కొందరు స్నానాన్ని నీటి వృథాకు ముడిపెడుతూ.. చలికాలంలో స్నానం చేయకపోవడాన్ని సమర్థించుకుంటుంటారు.

కొందరు టైమ్ లేదంటూ స్నానాన్ని పక్కనపెట్టేస్తుంటారు.

అయితే, చలికాలంలో ఒకే ప్రాంతంలో లేదా ఒకే కుటుంబంలో నివసించే వారిలోనూ కొందరికి ఎందుకు ఎక్కువ, మరికొందరికి ఎందుకు తక్కువ చలి వేస్తుంటుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దిల్లీ, పట్నా వంటి నగరాలకు వచ్చిన ప్రజల విషయం మాట్లాడుకుంటే.. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు నుంచి వచ్చిన వారి కంటే ఉత్తరఖాండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన వారు తక్కువ చలిని ఫీలవుతుంటారు.

దీనికి కారణం తెలిసిందే. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వారు చిన్నప్పటి నుంచి ఇదే చలి వాతావరణంలో పెరిగి ఉంటారు.

ఈ చలి వాతావరణానికి తగట్లు వారి శరీరం అలవాటు పడి ఉంటుంది.

కానీ, ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాల వారికి అక్కడ చలి తక్కువ ఉంటుంది కాబట్టి దిల్లీ వంటి ఉత్తరాది నగరాలకు వచ్చినప్పుడు చలిని తట్టుకోవడం కష్టమవుతుంది.

అయితే.. ఒకే కుటుంబంలోనివారై ఒకే ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు కూడా వారిలో కొందరు చలికి వణుకుతుంటే మరికొందరు సాధారణంగానే ఉంటుంటారు.

ఇలా ఎందుకు జరుగుతుంది?

శీతాకాలం, చలిమంట

ఫొటో సోర్స్, Getty Images

''మనిషికి, మనిషికి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. కొందరికి ఎక్కువ చలిగా, కొందరికి తక్కువగా అనిపిస్తుండొచ్చు. మీ శరీరం చలికి ఎలా స్పందిస్తుంది అనేది మీరు మిమ్మల్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారనే దానిపైనా ఆధారపడి ఉంటుంది'' అని దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ (ఎయిమ్స్)లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ సంజయ్ రాయ్ తెలిపారు.

''మీ శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకుంటారనే దానిపైనే అది ఎలా ప్రవర్తిస్తుందో ఆధారపడి ఉంటుంది. ఇదే కొందరు ఎక్కువ లేదా తక్కువ చలి ఫీలయ్యేందుకు ప్రాథమిక కారణం'' అని చెప్పారు.

''పూర్వకాలంలో వేడి నీటి కోసం గీజర్లు ఉండేవి కావు. శీతాకాలంలో కూడా సాధారణ నీళ్లతోనే స్నానం చేసేవారు. మన శరీరం గీజర్లకు అలవాటు పడిన తర్వాత, చలికాలంలో గీజర్ నీటితో స్నానం చేస్తున్నాం. ఇదే మన పిల్లల్లో భిన్నమైన అలవాట్లను అభివృద్ధి చేసింది. అందుకే, చలి బాగా తగ్గినా మన పిల్లలు గీజర్ నీటితోనే స్నానం చేస్తారు'' అని సంజయ్ రాయ్ తెలిపారు.

మన చుట్టూ వాళ్లల్లో లేదా మన కుటుంబంలో కొందరిలో మనం ఈ అలవాట్లను చూస్తుంటాం. కొందరు శీతాకాలంలో కూడా సాధారణ నీటితోనే స్నానం చేస్తున్నారు. కొందరికి మాత్రం స్నానానికి వేడి నీళ్లు కావాలి.

బాగా చలిగా ఉన్నప్పుడు స్నానం చేయకుండా ఉండే వారు చాలామంది ఉంటారు.

''థైరాయిడ్ పేషెంట్లు, బాగా సన్నగా ఉన్నవారు, డయాబెటిక్ రోగులు లేదా రక్తపోటును నియంత్రణలో ఉంచుకునేందుకు కొన్ని రకాల మందులు తీసుకునే వారు చలిని ఎక్కువగా ఫీలవుతుండొచ్చు'' అని దిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ సీనియర్ డాక్టర్ మోహిసిన్ వాలి చెప్పారు.

''అలా కాకుండా ఎవరైనా ఆరోగ్యకరమైన వ్యక్తికి బాగా చలిగా అనిపిస్తుందంటే.. వారి శరీరంలో హీట్ ప్రొడక్షన్ తక్కువగా ఉండటమే'' అని వాలి తెలిపారు.

శీతాకాలం

ఫొటో సోర్స్, Getty Images

‘శరీరం దానికదే సిద్ధమవుతుంది’

హీట్ ప్రొడక్షన్ అంటే.. మీ శరీరం ఎంత వేడిని ఉత్పత్తి చేస్తుందో తెలియజేసేది. వ్యాయామం, దైనందిన కార్యకలాపాలు, శరీర కొవ్వు వంటి వాటిపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఇద్దరు ఆరోగ్యకరమైన సోదరుల్లో ఒకరికి ఎక్కువగా చలి వేస్తుందంటే.. ఆయన శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణంగా శారీరక శ్రమ తక్కువైనప్పుడు జరుగుతుంది.

'' ఏ రకమైన వాతావరణాన్నైనా తట్టుకునేలా శరీరం దానికదే సిద్ధమవుతుంటుంది. ఒకవేళ బాగా చలిగా ఉంటే, దాన్ని ఎదుర్కొనేందుకు కూడా శరీరం సన్నద్ధమవుతోంది. మీ అలవాట్లను బట్టి మీ శరీరం తట్టుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది'' అని సంజయ్ రాయ్ చెప్పారు.

నడక, వ్యాయామం

ఫొటో సోర్స్, Getty Images

ఇతర కారణాలు..

కొందరు వేసవి కాలంలో రోజులో ఒకటి కంటే ఎక్కువ సార్లు స్నానం చేస్తుంటారు. అదే వారి అలవాటుగా మారుతుంది.

అదేవిధంగా కొందరు శీతాకాలంలో స్నానం చేయరు. కొందరు కేవలం చేతులు లేదా కాళ్లను కడుక్కోవడం లేదా జుట్టును తడుపుకోవడం ద్వారా స్నానం చేసినట్లు భావిస్తారు.

''కొందరు ఎక్కువ చలిగా ఫీల్ కావడానికి చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు, వారు వేసుకున్న వస్త్రాలు, ఎంత నీరు తాగుతున్నారు (ఎందుకంటే, నీరు శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంటుంది), శారీరకంగా ఎంత యాక్టివ్‌గా ఉన్నారు అనేవి కూడా కారణాలే'' అని పుణేలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ అమితావ్ బెనర్జీ చెప్పారు.

''ఒకే ప్రాంతంలో వివిధ రకాల వ్యక్తులు ఎక్కువ చలిగా లేదా తక్కువ చలిగా ఫీలయ్యేందుకు అతిపెద్ద కారణం.. వారి అలవాటే. కానీ, ప్రతి ఒకరి శరీరం అన్ని వేళలా పనిచేస్తుంటుంది. ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారు. అందుకే, కొందరు ఎక్కువగా, కొందరు తక్కువగా చలిని ఫీలవుతుంటారు'' అని అమితావ్ బెనర్జీ వివరించారు.

''శరీరంలో థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉన్న వ్యక్తి ఇతరులతో పోలిస్తే ఎక్కువ చలిగా ఫీలవుతుంటారు. అదేవిధంగా శరీరంలో కొవ్వు ఎక్కువున్న వ్యక్తి తక్కువ చలిగా ఫీలవుతుండొచ్చు'' అని తెలిపారు.

''70 నుంచి 80 ఏళ్ల వ్యక్తులు ఎక్కువగా శారీరక శ్రమ చేయలేరు. వారి శారీరక శ్రమ తగ్గుతుంది. అందుకే, అలాంటివారు ఎక్కువగా చలి ఫీల్ అవుతుంటారు'' అని తెలిపారు.

అలాగే, బాడీ మాస్ ఇండెక్స్, మెటబాలిక్ రేటు ఆధారంగానూ కూడా చలిని ఫీలవ్వడం ఉంటుంది. ఎక్కువ మజిల్ మాస్ (కండర కణజాలం) ఉన్నవారు తక్కువ చలిని ఫీలవుతుంటారు.

కేవలం అది మాత్రమే కాదు, వేసుకునే దుస్తులు కూడా చలిని నిర్దేశిస్తుంటాయి. అరచేతులు, కాళ్లు, తల వంటి శరీర భాగాలు వస్త్రాలతో సరిగ్గా కవర్ చేసుకోకపోతే, శరీర ఉష్ణోగ్రతలు బయటకు వెళ్లేలా చేసి, మీకు మరింత చలిగా అనిపించేలా చేస్తాయి.

అంతేకాక, కొందరు శీతాకాలంలో శారీరక శ్రమను తగ్గిస్తారు. కొందరు ఎక్కువసేపు దుప్పటి కప్పుకునే ఉంటారు. ఇది మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అయితే, చలిని తట్టుకునే అలవాటు మారుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)