'డాక్టర్ డెత్': '30 మంది రోగులపై విష ప్రయోగం, 12 మంది మృతి'కి కారణమైన వైద్యుడికి యావజ్జీవ జైలు శిక్ష

ఫ్రెడరిక్ పెచియర్

ఫొటో సోర్స్, ARNAUD FINISTRE/AFP

    • రచయిత, లారా గోజీ
    • హోదా, బీబీసీ న్యూస్

ఉద్దేశపూర్వకంగా 30 మంది రోగులకు విషమిచ్చిన ఒక అనస్థటిస్ట్‌కు యావజ్జీవ శిక్ష వేశారు. విష ప్రయోగానికి గురైన 30 మంది రోగుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఫ్రెడరిక్ పెచియర్ అనే ఆ వైద్యుడిని ఇన్‌ఫ్యూజన్ బ్యాగ్స్‌ను(ఐవీ ఫ్లూయిడ్స్, కొన్ని రకాల మందులు, రక్తం వంటి నింపి ఉంచేది) కార్డియాక్ అరెస్ట్, రక్తనాళాలు చిట్లడానికి కారణమయ్యే రసాయనాలతో కలుషితం చేశారన్న కేసులో దోషిగా తేల్చింది ఫ్రాన్స్‌లోని బెసన్కాన్ నగరంలోని కోర్ట్.

ఫ్రెడరిక్ బాధితుల్లో నాలుగేళ్ల చిన్నారి నుంచి 89 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు.

టాన్సిల్ సర్జరీ కోసం వచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై ఫ్రెడరిక్ విష ప్రయోగం చేయడంతో ఆ చిన్నారి రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్‌కు గురైంది.

ఫ్రెడరిక్‌ కేసు వాదనల సమయంలో ప్రాసిక్యూటర్లు.. 'మీరు డాక్టర్ డెత్, విషప్రయోగం చేశారు, హత్యలకు పాల్పడ్డారు. వైద్యులందరూ సిగ్గుపడేలా చేశారు' అని వ్యాఖ్యానించారు.

'ఈ క్లినిక్‌ను స్మశానంగా మార్చారు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విషప్రయోగం ఆరోపణలు ఎదుర్కొన్న ఫ్రెడరిక్‌పై ఎనిమిదేళ్ల కిందట తొలిసారి దర్యాప్తు మొదలైంది.

2008 నుంచి 2017 మధ్య బెసన్కాన్ నగరంలోని రెండు క్లినిక్‌లలో రోగులకు విషప్రయోగం చేసినట్లు ఫ్రెడరిక్‌పై అనుమానాలు రావడంతో ఈ దర్యాప్తు మొదలైంది.

తాజాగా ఈ కేసులో దోషిగా తేలడంతో ఫ్రెడరిక్ కనీసం 22 ఏళ్లు జైలులో గడపాల్సి ఉంటుంది.

అయితే, కేసు దర్యాప్తు, విచారణ సందర్భంగా ఫ్రెడరిక్ ప్రతిసారీ తాను ఈ నేరాలు చేయలేదనే చెప్పారు. 'నేను ఇప్పటికే చెప్పాను.. ఇకపైనా అదే చెప్తాను.. నేను పాయిజనర్‌ను కాదు' అని ఫ్రెడరిక్ అన్నారు.

కాగా దోషిగా తేలిని ఫ్రెడరిక్ పది రోజుల్లో అప్పీల్ చేసుకునేందుకు వీలుంది. ఆయన అప్పీలును కోర్టు పరిగణనలోకి తీసుకుంటే ఏడాదిలోగా ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలపై మరోసారి విచారణ జరుపుతారు.