ఐపీఎల్ ‘గరిష్ఠ ఫీజు’ రూల్: కామెరూన్ గ్రీన్‌కు వేలంలో రూ. 25.20 కోట్లు.. అయినా, చేతికందేది రూ. 18 కోట్లే ఎందుకు?

కామెరూన్ గ్రీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్
    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ రూ. 25.20 కోట్ల భారీ ధర పలికాడు. కానీ, అతని చేతికి అందేది రూ. 18 కోట్లు మాత్రమే.

కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన మినీ వేలంలో ఈ రికార్డు ధరకు గ్రీన్‌ను సొంతం చేసుకుంది.

దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా కామెరూన్ గ్రీన్ ఘనత సాధించాడు.

అయితే, వేలంలో గెలుచుకున్న ఈ మొత్తమంతా అతని ఖాతాలో చేరదు. రూ. 18 కోట్లు మాత్రమే అందుతాయి.

మరి మిగతా డబ్బు ఏమవుతుంది? రూ. 18 కోట్లు మాత్రమే గ్రీన్ ఖాతాలో చేరితే మరి రూ. 25.20 కోట్ల వరకు వేలం ఎందుకు కొనసాగించినట్లు? ఇవి సాధారణంగా చాలామందికి వచ్చే సందేహాలు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

టేక్ హోమ్ అమౌంట్‌పై పరిమితులు

గ్రీన్ స్థానంలో ఏ విదేశీ ఆటగాడు ఉన్నా కూడా ఇలాగే జరుగుతుంది.

ఎందుకంటే, 2025 మెగా వేలానికి ముందు 'మ్యాగ్జిమమ్ ఫీ' పేరిట ఐపీఎల్ ఒక నిబంధనను తీసుకొచ్చింది.

ఈ నిబంధన ప్రకారం, తాజా సీజన్‌లో అత్యధిక రిటెన్షన్ ఫీజు ( టాప్ స్లాబ్ రూ. 18 కోట్లు), లేదా గత మెగా వేలం అత్యధిక ధర (రిషభ్ పంత్ రూ. 27 కోట్లు).. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తానికి మించి మినీ వేలంలో ఒక విదేశీ ఆటగాడి 'గరిష్ఠ ఫీజు' ఉండకూడదు. ఈ నియమం గురించి మెగా వేలానికి ముందు 'ఐపీఎల్ ప్లేయర్ రెగ్యులేషన్స్' పేరిట ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ బాడీ తెలియజేసింది.

ఈ లెక్కన తాజా మినీ వేలంలో ఒక విదేశీ ఆటగాడి గరిష్ఠ ఫీజును రూ. 18 కోట్లుగా నిర్ణయించారు.

ఉదాహరణకు రిటెన్షన్ ఫీజు రూ. 18 కోట్లు ఉండి, మెగా వేలంలో ఒక ఆటగాడు పలికిన అత్యధిక ధర రూ. 16 కోట్లు అయితే మినీ వేలంలో విదేశీ ఆటగాడి గరిష్ఠ ఫీజు రూ. 16 కోట్లు మాత్రమే అవుతుంది.

గాయం కారణంగా మెగా వేలానికి దూరమైన కామెరూన్, రూ. 2 కోట్ల కనీస ధరతో మినీ వేలంలో అందుబాటులోకి వచ్చాడు.

గ్రీన్, పతిరన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కామెరూన్ గ్రీన్, మతీశ పతిరన

‘గరిష్ఠ ఫీజు’ దాటాక కూడా బిడ్డింగ్ కొనసాగించొచ్చా?

వేలంలో ఒక ఆటగాడి కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతుంటాయి. ఈ క్రమంలో విదేశీ ఆటగాడి 'గరిష్ఠ ఫీజు' పరిమితిని దాటి కూడా ఫ్రాంచైజీలు బిడ్డింగ్‌ కొనసాగించవచ్చని ఐపీఎల్ నిబంధనల్లో పేర్కొంది.

అలా ఒక విదేశీ ఆటగాడిని ఒక ఫ్రాంచైజీ సొంతం చేసుకునేవరకు ఈ బిడ్డింగ్ పెంచుతూ వెళ్లొచ్చు. చివరకు ఫైనల్ బిడ్ మొత్తం, సదరు ఫ్రాంచైజీ పర్స్ నుంచి ఖాళీ అవుతుంది.

'అందులో నుంచి గరిష్ఠ ఫీజును ఆటగాడికి చెల్లించి, మిగతా మొత్తాన్ని బీసీసీఐ వద్ద జమచేస్తారు. ఈ మొత్తాన్ని బీసీసీఐ ఆధ్వర్యంలోని ఆటగాళ్ల సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తారని' ఐపీఎల్‌ను ఉటంకిస్తూ క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్‌ పేర్కొంది.

కోల్‌కతా నైట్ రైడర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫ్రాంచైజీ పర్సులో కోత..

ఈ లెక్కన ఫైనల్ బిడ్‌లో భాగంగా నమోదైన 25.20 కోట్ల బిడ్డింగ్‌లో రూ. 18 కోట్లు గ్రీన్ చేతికి, మిగతా 7.20 కోట్లు బీసీసీఐ ఖాతాకు చేరతాయి. గ్రీన్‌ను సొంతం చేసుకున్న కోల్‌కతా ఫ్రాంచైజీ పర్స్ నుంచి రూ. 25.20 కోట్లు ఖాళీ అవుతాయి.

ఈ గరిష్ఠ ఫీజు నిబంధన కేవలం విదేశీ ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. భారత ఆటగాళ్లకు ఈ నియమాలు వర్తించవు. వేలంలో పలికిన ధర మొత్తం వారికే దక్కుతుంది.

ఉదాహరణకు ఎవరైనా ఒక భారత క్రికెటర్ వేలంలో రూ. 30 కోట్లు పలికితే అదంతా అతని ఖాతాలోకే చేరుతుంది.

ఐపీఎల్

ఫొటో సోర్స్, Getty Images

వేలంలో ఓవర్సీస్ ప్లేయర్లకు, భారత క్రికెటర్లకు మధ్య ఈ తేడా ఎందుకు?

చాలామంది హై ప్రొఫైల్ ఓవర్సీస్ ప్లేయర్లు, మెగా వేలంలో పాల్గొనకుండా ప్రత్యేకంగా మినీ వేలంలోనే రిజిస్టర్ అవుతున్నారని ఫ్రాంచైజీలు సమష్టిగా ఆందోళన వ్యక్తం చేసినట్లు 'క్రిక్ ఇన్ఫో' పేర్కొంది.

ఈ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం, మినీ వేలంలో ఆటగాళ్ల కొరత, ఫ్రాంచైజీలకు ఉండే డిమాండ్ కారణంగా ఆటగాళ్లపై కనకవర్షం కురిపించాల్సి వస్తోందనే ఫ్రాంచైజీల ఆందోళనలను పరిష్కరించడానికి 2025 మెగా వేలానికి ముందు ఈ గరిష్ఠ ఫీజు నిబంధనను ఐపీఎల్ తీసుకొచ్చింది.

దీని వెనుక లీగ్ ఉద్దేశం ఒక్కటే. ఓవర్సీస్ ప్లేయర్లు ఎవరూ కూడా ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉన్న అత్యధిక రిటెన్షన్ ఫీజు కంటే గరిష్ఠంగా పొందకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు స్పోర్ట్స్‌స్టార్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఒక్కో మ్యాచ్‌కు రూ. 7.5 లక్షలు

ఐపీఎల్ ఆడే ఆటగాళ్లకు వేలంలో దక్కిన మొత్తంతో పాటు ప్రోత్సాహక మ్యాచ్ ఫీజు కూడా అందుతుంది.

ఐపీఎల్‌లో ఆడే ఒక్కో మ్యాచ్‌కు ఒక ఆటగాడికి రూ. 7.5 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు ఇవ్వనున్నట్లు 2025 సీజన్ మెగా వేలానికి ముందు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు.

'ప్లేయర్ల మ్యాచ్ ఫీజుల కోసం ఒక్కో ఫ్రాంచైజీ రూ. 12.60 కోట్లు కేటాయిస్తుంది. ఒక ప్లేయర్ సీజన్‌లో అన్ని లీగ్ మ్యాచ్‌లు ఆడితే మ్యాచ్ ఫీజుల రూపంలో రూ. 1.05 కోట్లు ఆర్జిస్తాడు' అని జై షా గతంలో ట్వీట్ చేశారు.

2026 ఏడాదికి గానూ ఒక ఫ్రాంచైజీ సాలరీ క్యాప్ (వేలం పర్స్+ఇంక్రిమెంటల్ ఫర్మామెన్స్ పే) రూ. 151 కోట్లుగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో నిర్ణయించారు.

ఆ సమావేశంలోని వివరాల ప్రకారం, ఐపీఎల్ ఆడాలనుకునే విదేశీ క్రికెటర్లందరూ తప్పనిసరిగా మెగా వేలంలో రిజిస్టర్ చేయించుకోవాలి. ఒకవేళ మెగా వేలంలో రిజిస్టర్ కాకపోతే, తర్వాతి ఏడాది జరిగే వేలానికి అనర్హులుగా మారతారు.

ఒక వేలంలో రిజిస్టరై, ఏదైనా టీమ్ కొనుగోలు చేసిన తర్వాత, వ్యక్తిగత కారణాలతో సీజన్ ఆరంభానికి ముందే తప్పుకుంటే ఆ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధిస్తారు.

ఐపీఎల్

ఐపీఎల్‌లో గ్రీన్ ప్రదర్శన ఎలా ఉందంటే...

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు.

2023 వేలంలో ముంబయి రూ.17.5 కోట్లు వెచ్చించి గ్రీన్‌ను సొంతం చేసుకుంది. నాటి వేలంలో గ్రీన్ రెండో అత్యధిక విలువైన ఆటగాడిగా నిలిచాడు. తర్వాతి ఏడాది ముంబయి ఇండియన్స్ ఇదే మొత్తానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గ్రీన్‌ను ఇచ్చేసింది.

ఈ రెండు సీజన్లలో కలిపి గ్రీన్ మొత్తం 29 మ్యాచ్‌ల్లో 153.70 స్ట్రయిక్ రేట్‌తో 707 పరుగులు చేశాడు. 16 వికెట్లు తీశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

మినీ వేలంలో టాప్-5 ప్లేయర్లు వీళ్లే..

తాజాగా జరిగిన మినీ వేలంలో గ్రీన్ అత్యధిక ధర పలకగా, శ్రీలంక ప్లేయర్ మతీశ పతిరన రూ. 18 కోట్లతో రెండో అత్యధిక విలువైన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఇద్దరినీ కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.

తర్వాతి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 14.20 కోట్ల చొప్పున సొంతం చేసుకున్న ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌ నిలిచారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లియామ్ లివింగ్‌స్టన్‌ను రూ. 13 కోట్లకు దక్కించుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)