సౌదీ అరేబియాకు చెందిన ఈ కుటుంబ సంపద ఏడాదిలోనే ఇంత ఎలా పెరిగింది? సంపన్న కుటుంబాల జాబితాలో అంబానీ ఫ్యామిలీ ఎక్కడుంది?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా మీడియా అవుట్‌లెట్ బ్లూమ్‌బర్గ్ 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోని టాప్ 25 సంపన్న కుటుంబాల జాబితాను విడుదల చేసింది.
ఈ జాబితాలో ఈ ఏడాది కూడా వాల్టన్ కుటుంబమే అగ్రస్థానంలో నిలిచింది. వాల్‌మార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్ యజమానులే ఈ వాల్టన్ ఫ్యామిలీ.
గత ఏడాది ఈ కుటుంబం మొత్తం సంపద 432 బిలియన్ డాలర్లుగా (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 38,98,540 కోట్లు) ఉండగా, ఈ ఏడాది సంపద మరో 81 బిలియన్ డాలర్లు (రూ.7,31,729 కోట్లు) పెరిగింది.
అంటే మొత్తంగా 513 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 46,31,466 కోట్ల) సంపద ఈ కుటుంబం దగ్గర ఉంది.
అదేవిధంగా, సౌదీ రాజవంశ కుటుంబం 'అల్ సౌద్ ఫ్యామిలీ' సంపద కూడా గణనీయంగా పెరిగినట్లు బ్లూమ్‌బర్గ్ జాబితాలో వెల్లడైంది.
ఈ కుటుంబం ప్రస్తుతం బ్లూమ్‌బర్గ్ జాబితాలో మూడో స్థానానికి చేరింది. అంతకుముందు ఏడాది ఆరో స్థానంలో ఉండేది.
ఇది మాత్రమే కాక.. ప్రపంచంలోని టాప్ 5 ధనిక కుటుంబాల్లో మూడు అరబ్ వరల్డ్‌కు చెందినవే.

ఈ జాబితాలో భారత్‌కు చెందిన అంబానీ కుటుంబం ఎనిమిదో స్థానంలో ఉంది.
ఈ జాబితాలోని తొలి 10 సంపన్న కుటుంబాలు, వారి దగ్గరున్న సంపద, వారి సంపద సృష్టి రహస్యం గురించి మనం తెలుసుకుందాం..

ఫొటో సోర్స్, Getty Images
1. వాల్టన్ ఫ్యామిలీ
కంపెనీ పేరు: వాల్‌మార్ట్
నికర సంపద: 513 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో ప్రస్తుత విలువ ప్రకారం సుమారు రూ. 46,31,466 కోట్లు)
దేశం: అమెరికా
వాల్‌మార్ట్ స్టోర్లలో సుమారు 44 శాతం వాటా వాల్టన్ ఫ్యామిలీ వద్దనే ఉంది. వారి సంపదకు ఈ సూపర్‌మార్కెట్‌నే అతిపెద్ద కారణం.
వాల్‌మార్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా 10,750 స్టోర్లు ఉన్నాయి. ప్రతి వారం సుమారు 27 కోట్ల మంది కస్టమర్లకు ఈ సూపర్‌మార్కెట్ సేవలందిస్తోంది.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. వాల్‌మార్ట్ పురోగతికి అతిపెద్ద కారణం దాని ఆస్తులను చాలా బాగా నిర్వహించడమే. దాని సంపదను తగ్గించని వ్యాపార ఒప్పందాలను ఈ కంపెనీ చేసుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
2. నహ్యాన్ ఫ్యామిలీ
వ్యాపారం: ఆయిల్ అండ్ ఇండస్ట్రీ
నికర సంపద: 335 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 30,23,676 కోట్లు)
దేశం: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
యూఏఈను పాలించే కుటుంబం అల్ నహ్యాన్ ఫ్యామిలీకి చమురు వ్యాపారాలే ప్రధాన ఆదాయ వనరు. అబుదాబి పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. అల్ సౌద్
వ్యాపారం: ఆయిల్ అండ్ ఇండస్ట్రీ
నికర సంపద: 213 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,22,548 కోట్లు)
దేశం: సౌదీ అరేబియా
అల్ సౌద్ కుటుంబ సంపద గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది.
బ్లూమ్‌బర్గ్ గత ఏడాది విడుదల చేసిన జాబితాలో ఈ కుటుంబ ఆస్తులు 140 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఈ ఏడాది ఈ సంపద మరో 73 బిలియన్ డాలర్లు పెరిగింది.
బ్లూమ్‌బర్గ్ ఈ సంపదను గత 50 ఏళ్లుగా రాయల్ ఖజానా నుంచి కుటుంబ సభ్యులకు జరిపిన చెల్లింపుల ఆధారంగా లెక్కించింది.

ఫొటో సోర్స్, Getty Images
4. అల్ థాని (సని) కుటుంబం
వ్యాపారం: ఆయిల్ అండ్ ఇండస్ట్రీ
నికర సంపద: 199 బిలియన్ డాలర్లు (రూ. 17,96,392 కోట్లు)
దేశం: ఖతార్
ఖతార్‌ను పాలించే అల్-థాని కుటుంబం చమురు, సహజ వాయువు వ్యాపారంలో ఉంది. ఈ కుటుంబ సభ్యులందరూ దాదాపు కీలకమైన ప్రభుత్వ స్థానాల్లో ఉన్నారు. అంతేకాక, అనేక రకాల పరిశ్రమలను నడుపుతున్నారు.
ఇది చాలా పెద్ద కుటుంబం. ఈ కుటుంబాలోని కొందరి చేతుల్లోనే ఆ దేశ అధికారం ఉంది.
అయితే, మీరు ఇక్కడొక విషయం గమనించాలి. లగ్జరీ ఎయిర్‌క్రాఫ్ట్ 'ఎయిర్ ఫోర్స్ వన్'ను తాత్కాలికంగా వాడుకునేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు ఖతార్ ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
5. హెర్మేస్ ఫ్యామిలీ
కంపెనీ పేరు: హెర్మేస్
నికర సంపద: 184 బిలియన్ డాలర్లు (రూ.16,60,967 కోట్లు)
దేశం: ఫ్రాన్స్
ప్రపంచంలో అతిపెద్ద ఫ్యాషన్ కంపెనీల్లో ఒకటి హెర్మేస్. ఈ వ్యాపారాన్ని కుటుంబ యజమానికి చెందిన ఆరవ తరంలోని సుమారు 100 మంది నడుపుతున్నారు.
ఈ కంపెనీ సీఈవో అక్సెల్ డుమాస్.

ఫొటో సోర్స్, Getty Images
6. కోచ్ కుటుంబం
కంపెనీ పేరు: కోచ్ ఇండస్ట్రీస్
నికర సంపద: 150 బిలియన్ డాలర్లు (రూ.13,54,072 కోట్లు)
దేశం: అమెరికా
తండ్రి ఫ్రెడ్ కోచ్ నుంచి నలుగురు సోదరులు ఫ్రెడెరిక్, చార్లెస్, డేవిడ్, విలియం కోచ్‌లు ఈ వ్యాపారాన్ని వారసత్వంగా పొందారు. కానీ, విభేదాల కారణంగా కేవలం చార్లెస్, డేవిడ్ మాత్రమే ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు.
ఈ కుటుంబానికి చమురు, ఇంధనం, రసాయనాలు, ఖనిజాలు వంటి పలు వ్యాపారాలు ఉన్నాయి. ఫైనాన్స్, ట్రేడ్, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌లలో ఈ కంపెనీలు భాగమయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
7. మార్స్ కుటుంబం
కంపెనీ పేరు: మార్స్ ఇన్‌కార్పోరేటెడ్
నికర సంపద: 143 బిలియన్ డాలర్లు (రూ.12,90,832 కోట్లు)
దేశం: అమెరికా
మనం తినే ఎం&ఎం, మిల్కీ వే, స్నికర్స్ వంటి చాకోలెట్ల వల్ల మార్స్ పాపులారిటీ బాగా పెరిగింది.
అయితే, కంపెనీ లాభాల్లో సగానికి పైగా పెట్ ప్రొడక్టుల నుంచే వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
8. అంబానీ ఫ్యామిలీ
కంపెనీ పేరు: రిలయన్స్ ఇండస్ట్రీస్
నికర సంపద: 105 బిలియన్ డాలర్లు (రూ.9,47,814 కోట్లు)
దేశం: భారత్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని ముకేశ్ అంబానీ నడుపుతున్నారు. 27 అంతస్తుల రాజ భవనం లాంటి 'యాంటిలియా'లో ఆయన నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ బిల్డింగ్‌గా దీన్ని పరిగణిస్తారు.
తన చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. కొన్ని రోజుల పాటు వివాహ వేడుకలు జరిగాయి.
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కుమార్త్ ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ వంటి సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
9. వర్థైమర్ కుటుంబం
కంపెనీ పేరు: షెనెల్
నికర సంపద: 85 బిలియన్ డాలర్లు (రూ.7,67,278 కోట్లు)
దేశం: ఫ్రాన్స్
అలైన్, గెరార్డ్ వర్థైమర్ సంపద సృష్టి రహస్యం 1920ల్లో పారిస్‌లో తమ తాత ఏర్పాటు చేసిన కోకో చానెల్ ఫ్యాషన్ కంపెనీనే.
ఈ కంపెనీకి కేవలం ఫ్యాషన్ హౌస్ మాత్రమే కాక.. అత్యంత ఖరీదైన రేసు గుర్రాలు, వైన్‌యార్డులూ ఉన్నాయి.
అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ కుటుంబ సంపద 3 బిలియన్ డాలర్లు తగ్గింది.

ఫొటో సోర్స్, Getty Images
10. థామ్సన్ కుటుంబం
కంపెనీ పేరు: థామ్సన్ రాయిటర్స్
నికర సంపద: 82 బిలియన్ డాలర్లు (రూ.7,40,234 కోట్లు)
దేశం: కెనడా
థామ్సన్ రాయిటర్స్‌లో 70 శాతం వాటా కెనడాలోని అత్యంత సంపన్న కుటుంబం థామ్సన్ ఫ్యామిలీ చేతిలో ఉంది. అంటారియోలో తొలి రేడియో స్టేషన్‌ను 1930ల్లో రాయ్ థామ్సన్ తెరిచినప్పుడు, ఈ కుటుంబం ఒక వెలుగులోకి వచ్చింది.
వర్థైమర్ ఫ్యామిలీ మాదిరిగానే ఈ కుటుంబ సంపద కూడా గత ఏడాదితో పోలిస్తే కాస్త తగ్గింది. బ్లూమ్‌బర్గ్ రిపోర్టు ప్రకారం.. గత ఏడాది వీరి మొత్తం సంపద 87 బిలియన్ డాలర్లు. అయితే, గత ఏడాది లాగానే ఈ కుటుంబం పదవ స్థానంలో ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














