‘భార్యను హత్య చేసి జైలుకెళ్లాడు.. పెరోల్‌పై వచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు.. తొమ్మిదేళ్లుగా పరారీలో ఉన్న దోషి బిస్కెట్ ప్యాకెట్ కోసం వచ్చి దొరికిపోయాడు’

నేరస్తుడు, పోలీసులు, గుజరాత్

ఫొటో సోర్స్, Bhargav Parikh

    • రచయిత, భార్గవ్ పారిఖ్
    • హోదా, బీబీసీ కోసం

ప్రతిరోజూ ఉదయం టీతో బిస్కెట్లు తినడం చాలామందికి అలవాటు.

ఈ అలవాటు ఎన్నో ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ నేరస్తుడిని పోలీసులకు పట్టించిందంటే మీకు ఆశ్చర్యం కలిగించొచ్చు.

భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు శిక్ష పడ్డ ఓ దోషి, పెరోల్‌పై బయటికి విడుదలై తొమ్మిదేళ్లుగా పరారీలో ఉన్నాడు.

ఈ సమయంలో ఆయన మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తనకంటూ సొంతంగా ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

అయితే, బిస్కెట్ ప్యాకెట్ వల్ల దొరికిన ఆయన్ను పోలీసులు పట్టుకుని జైలులో పెట్టారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

2007లో సురేంద్ర తన భార్యను హత్య చేశారన్న ఆరోపణలతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

‘సురేంద్ర వర్మ సూరత్‌లో ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసేవారు.

నగరంలోని సచిన్ ప్రాంతంలో ఒక గది ఇంటిని అద్దెకు తీసుకుని జీవించేవారు.

ఆయన, భార్య తరచూ గొడవ పడుతుండేవారు’ అని సూరత్ పోలీసులు చెప్పారు.

బలమైన ఆధారాలు, సాక్షుల వాంగ్ములంతో.. సూరత్ సెషన్స్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి సూరత్‌లో ఉన్న లాజ్‌పూర్ జైలులో శిక్ష అనుభవించేవారు.

''2016లో సురేంద్ర వర్మ పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అతని దరఖాస్తుకు ఆమోదం లభించింది. 28 రోజుల పాటు ఆయనకు బెయిల్ దొరికింది. అయితే, పెరోల్ సమయంలో సురేంద్ర వర్మ తప్పించుకున్నారు. దీంతో సచిన్ పోలీసు స్టేషన్‌లో ప్రిజన్ యాక్ట్ కింద ఆయనపై కేసు దాఖలైంది'' అని సూరత్ ఏసీపీ నీరవ్ గోహిల్ చెప్పారు.

సూరత్ ఏసీపీ నీరవ్ గోహిల్

ఫొటో సోర్స్, Bhargav Parikh

ఫొటో క్యాప్షన్, సూరత్ ఏసీపీ నీరవ్ గోహిల్

''సురేంద్ర కుటుంబానికి ఉత్తప్రదేశ్‌లో కొంత భూమి ఉంది. సురేంద్ర పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయం నుంచి సరైన ఆదాయం లేకపోవడంతో, అతను బియోహరా గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్విలో ఆటోరిక్షా నడిపేవారు'' అని సురేంద్ర బంధువు రవీంద్ర కుమార్ తెలిపారు.

'' 2005లో తమ కులంలోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలోని కొందరితో కలిసి పని కోసం సూరత్ వెళ్లారు. అక్కడే ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అంతేకాక, రాత్రిపూట అద్దెకు తీసుకుని ఆటో రిక్షా నడిపేవారు'' అని రవీంద్ర కుమార్ చెప్పారు.

అయితే, సురేంద్ర తన భార్య నుంచి కట్నం డిమాండ్ చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బులతో సొంతంగా ఆటో రిక్షా కొనుక్కోవాలని అనుకున్నాడని గ్రామస్థులు చెప్తున్నారు.

అదే సమయంలో సురేంద్ర తన భార్యను చంపినట్లు బంధువులకు తెలిసింది.

గురుగావ్, నేరస్తుడు, హత్యా నేరం

ఫొటో సోర్స్, Bhargav Parikh

ఫొటో క్యాప్షన్, సురేంద్రను గురుగావ్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు

తొమ్మిదేళ్లుగా పరారీలో ఉన్న నేరస్తుడిని ఎలా పట్టుకున్నారు?

పెరోల్ సమయంలో తప్పించుకుని పారిపోయిన 42 ఏళ్ల సురేంద్రను పట్టుకోవడానికి పోలీసులు ఒక ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించారు.

''సురేంద్ర గ్రామంలోని కొందరి నుంచి సమాచారం అందుకున్న తర్వాత, మేం ఒక టీమ్‌గా ఏర్పడ్డాం. విచారణ కోసం ఉత్తరప్రదేశ్‌లోని సురేంద్ర స్వస్థలానికి ఈ టీమ్‌ను పంపాం. యూపీ పోలీసులతో మేం నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం'' అని ఏసీపీ గోహిల్ చెప్పారు.

‘‘ఏదో ఒక రోజు పోలీసులు తనని వెతుక్కుంటూ వస్తారని భయపడ్డ సురేంద్ర, పెరోల్‌ నిబంధనలను అతిక్రమించి పారిపోయిన తర్వాత తన తల్లిదండ్రులతో, సోదరుడితో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోలేదు’’ అని సూరత్ పోలీసులు చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లోని సురేంద్ర గ్రామం చాలా చిన్నదని పోలీసులు చెప్పారు. కాబట్టి ఆయన బంధువులను పోలీసులు చాలా ఓపికగా విచారించినట్లు తెలిపారు.

కర్విలో సురేంద్ర ఆటో రిక్షా నడిపేవారు. ఇది బయోహరా నుంచి కొంత దూరంలోనే ఉంది. పోలీసులు అక్కడున్న ఆటో రిక్షా డ్రైవర్లను కూడా ప్రశ్నించారు.

‘‘సురేంద్ర ఫోటోను రిక్షా నడిపేవారికి చూపించినప్పుడు, వారిలో ఒకరు సురేంద్ర ఇక్కడ ఎలక్ట్రిక్ రిక్షా నడిపేవారని, ఇప్పుడు మరొక మహిళను వివాహం చేసుకుని ఆమెతో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడని చెప్పారు. ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నట్లు చెప్పారు.

ఆరు నెలల క్రితం, సురేంద్ర కూడా శంకర్పూర్ గ్రామంలోని తన బావమరిది పెళ్లికి హాజరయ్యారు. సురేంద్ర రెండో భార్య సోదరుడి ప్రశ్నించినప్పుడు, గురుగావ్‌లో ఆయన కూలి పని చేసుకుంటున్నట్లు తెలిసింది. సురేంద్ర భార్య ఫోన్ నెంబర్, వారు ఉండే ఇంటి చిరునామా మాకు దొరికాయి.

సురేంద్రకు రోజూ ఉదయం టీతో బిస్కెట్లు తినే అలవాటు ఉంది. రెండు రోజులు ఆయన ఇంటికి సమీపంలో సాధారణ దుస్తుల్లో ఉంటూ, ఆయన కదలికలను గమనించింది పోలీసుల బృందం.

నవంబర్ 14న సురేంద్ర, అతని కొడుకు బిస్కెట్లు కొనేందుకు బయటికి వచ్చినప్పుడు, ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం'' అని ఏసీపీ చెప్పారు.

గురుగావ్‌లో అరెస్ట్ అయిన సురేంద్రను గుజరాత్ పోలీసులు ఉత్తరప్రదేశ్ నుంచి సూరత్‌కు తీసుకొచ్చి, కోర్టులో ప్రవేశపెట్టారు.

సురేంద్ర వర్మ, పోలీసులు

ఫొటో సోర్స్, Bhargav Parikh

పెరోల్ ఎలా వచ్చింది?

''హత్యా నేరం కింద జైలు శిక్ష అనుభవించే వ్యక్తి రెండు రకాలుగా పెరోల్ పొందవచ్చు. హత్యా నేరస్తుడి ఇంట్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు లేదా ఏదైనా సరైన కారణం ఉంటే, న్యాయవాది సాయంతో హైకోర్టులో పెరోల్‌కు దాఖలు చేసుకోవచ్చు. కోర్టు దరఖాస్తును అంగీకరిస్తే, పెరోల్ లభిస్తుంది'' అని న్యాయవాది ఆశీశ్ శుక్లా చెప్పారు.

'' ఇక రెండవది, ఒక ఖైదీ తన శిక్షలో నిర్దిష్ట కాలాన్ని పూర్తి చేసినప్పుడు, పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు'' అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)