'బతికించాలని వైద్యం చేయిస్తే.. అదే మా బిడ్డ జీవితాన్ని మరింత దారుణంగా మార్చేసింది'

వైద్యం, ఆరోగ్యం, రక్తమార్పిడి, తలసేమియా, హెచ్‌ఐవీ

ఫొటో సోర్స్, Pradeep Kashyap

    • రచయిత, విష్ణుకాంత్ తివారీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''మా అమ్మాయి ఇప్పటికే తలసేమియాతో బాధపడుతోంది. ఇప్పుడు హెచ్ఐవీ సోకింది. ఇక్కడ వైద్య వ్యవస్థ పూర్తిగా నాశనమైంది.''

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ తండ్రి ఆవేదన ఇది.

సత్నాలో హెచ్ఐవీ సోకినట్లు గుర్తించిన పిల్లల్లో ఈయన కుమార్తె కూడా ఒకరు.

తరచుగా జరిగే రక్తమార్పిడి ప్రక్రియలో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది.

దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న రక్తమార్పిడి ప్రక్రియపై ప్రశ్నలు తలత్తుతున్నాయి.

ఇంతకుముందు, ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని ప్రభుత్వ సదర్ ఆసుపత్రిలో కూడా తలసేమియా బాధిత చిన్నారులకు హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించిన కేసు వెలుగులోకి వచ్చింది.

వెస్ట్ సింగ్భూమ్ జిల్లా కలెక్టర్ చందన్ కుమార్ బీబీసీతో మాట్లాడుతూ, తలసేమియాతో బాధపడుతున్న ఎనిమిదేళ్లలోపు వయస్సున్న ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ సోకినట్లు ధ్రువీకరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

చిన్నారులకు హెచ్‌ఐవీ సోకడంపై విచారణకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసింది.

ఈ ఏడాది జనవరి నుంచి మే నెలల మధ్య నిర్వహించిన సాధారణ తనిఖీల్లో ఈ కేసులను గుర్తించారు. అయితే, స్థానిక మీడియాలో వార్తలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

''ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవీ సోకింది'' అని సత్నా జిల్లా కలెక్టర్ సతీశ్ కుమార్ ఎస్ ధ్రువీకరించారు.

దీనికి ముందు చిన్నారుల సంఖ్య గురించి పలు రకాల రిపోర్టులు వచ్చాయి.

''ఈ పిల్లలకు వేర్వేరు చోట్ల రక్తమార్పిడి జరిగింది. వేర్వేరు దాతల నుంచి రక్తం సేకరించారు. రక్తం తీసుకున్న బ్లడ్ బ్యాంకుల్లో టెస్టింగ్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ) అనుసరిస్తున్నారా లేదా అనే విషయాలపై దర్యాప్తు జరుగుతోంది'' అని కలెక్టర్ సతీశ్ కుమార్ చెప్పారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ పిల్లలందరికీ యాంటీ-రెట్రోవైరల్ థెరపీ కింద చికిత్స చేయిస్తున్నారు.

వైద్యం, ఆరోగ్యం, రక్తమార్పిడి, తలసేమియా, హెచ్‌ఐవీ

ఫొటో సోర్స్, Pradeep Kashyap

ఫొటో క్యాప్షన్, సత్నా జిల్లా ఆసుపత్రి

తలసేమియా పిల్లలకు పెద్ద ప్రమాదం...

మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, ఈ చిన్నారులకు సత్నా జిల్లా ఆసుపత్రితో పాటు జబల్‌పూర్ సహా ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా రక్త మార్పిడి జరిగింది.

తరచుగా రక్తమార్పిడి అవసరమయ్యే చిన్నారులు హెచ్‌ఐవీ హై-రిస్క్ గ్రూప్‌లోకి వస్తారని, వీరికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని సత్నా ప్రధాన వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ మనోజ్ శుక్లా తన రాతపూర్వక వివరణలో పేర్కొన్నారు.

అధికారుల వివరణ ప్రకారం, ఈ ఐదుగురు పిల్లల తల్లిదండ్రులకు కూడా హెచ్ఐవీ పరీక్ష నిర్వహించారు. ఒక్క మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రులిద్దరికీ హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. మిగతా నలుగురి పిల్లల తల్లిదండ్రులకు నెగటివ్ వచ్చింది.

''ఆ నలుగురు పిల్లల తల్లిదండ్రులకు హెచ్ఐవీ నెగటివ్ కాబట్టి, వారికి తల్లి ద్వారా సంక్రమించే అవకాశం లేదని తేలిపోయింది. ఆ నలుగురు పిల్లలకు రక్తమార్పిడి వల్లే హెచ్ఐవీ సంక్రమించిందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎక్కడ పొరపాటు జరిగిందో దర్యాప్తు చేస్తున్నాం'' అని కలెక్టర్ సతీశ్ కుమార్ చెప్పారు.

''ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం, జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో ప్రతి యూనిట్ రక్తాన్నీ పరీక్షిస్తారు. అయితే, అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే రక్తదాత శరీరంలో ఇన్ఫెక్షన్ ప్రారంభ దశ కారణంగా టెస్టుల్లో గుర్తించలేరు. దీన్నే విండో పిరియడ్ అంటారు'' అని డాక్టర్ మనోజ్ శుక్లా చెప్పారు.

''ఆ పిల్లలకు రక్తం ఇచ్చిన రక్తదాతలందరినీ గుర్తించేందుకు ఇప్పుడు ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తోంది. కొంతమంది దాతలు స్వచ్ఛందంగా హెచ్ఐవీ పరీక్షలకు ముందుకొస్తున్నారు. వారి నివేదికల్లో నెగటివ్ అనే వచ్చింది. ఈ ప్రక్రియ కొనసాగుతోంది'' అని ఆయన వెల్లడించారు.

ఈ సంఘటనపై దర్యాప్తు కోసం జిల్లా ఆసుపత్రి స్థాయిలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం కూడా రక్తమార్పిడి నిపుణుడు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ వైద్యాధికారి సహా ఆరుగురు సభ్యులతో మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఏడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

వైద్యం, ఆరోగ్యం, రక్తమార్పిడి, తలసేమియా, హెచ్‌ఐవీ

ఫొటో సోర్స్, Pradeep Kashyap

'మాకు న్యాయం జరుగుతుందా...'

అయితే, అధికారిక దర్యాప్తుతో బాధిత కుటుంబాలకు కలిగిన పెద్ద ఉపశమనమేమీ లేదు.

తొమ్మిదేళ్ల వయస్సు నుంచి తమ కుమార్తె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైందని మేం పైన పేర్కొన్న కుటుంబం తెలిపింది.

''మా అమ్మాయికి తలసేమియా ఉందని నిర్ధరించారు. జీవితాంతం రక్తమార్పిడి చేయాల్సి ఉంటుందని చెప్పారు. మూడు నెలల కిందట, మా అమ్మాయికి హెచ్ఐవీ పాజిటివ్ అని చెప్పారు.

అది విని షాక్‌కు గురయ్యాం. అలా ఎలా జరిగిందో మొదట్లో అర్థం కాలేదు. ఆ తర్వాత, రక్తమార్పిడి సమయంలో హెచ్ఐవీ సంక్రమించిందని చెప్పారు'' అని ఆ బాలిక తండ్రి వెల్లడించారు.

మరి, ఫిర్యాదు చేశారా? అని అడిగినప్పుడు.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తమకు తెలియడం లేదని ఆయన అన్నారు.

''ప్రభుత్వంపైనా, బ్లడ్ బ్యాంకుపైనా, ఎవరిపై ఫిర్యాదు చేయాలి? దీనికి బాధ్యులైన వారు తమ విధులు సరిగ్గా నిర్వహించలేదు. వారి నిర్లక్ష్యం నా కూతురి జీవితాన్ని మరింత దిగజార్చింది'' అని ఆయన అన్నారు.

మరో బాధిత బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ, హెచ్ఐవీ మందులు తమ బిడ్డపై దుష్ప్రభావం చూపిస్తున్నాయని, వాంతులు, నిరంతరం అలసటతో బాధపడుతోందని చెప్పారు.

''ఒక తండ్రిగా, నా బిడ్డను ఇలాంటి స్థితిలో చూడలేకపోతున్నా. మేం నిస్సహాయులం. మా బిడ్డకు ఏ విధంగానూ సాయం చేయలేకపోతున్నాం'' అని ఆయన ఆవేదన చెందుతున్నారు.

''మాకు న్యాయం జరుగుతుందో లేదో కూడా తెలీదు. మా బిడ్డను బతికించుకోవాలని వైద్యం చేయిస్తే.. అదే తన జీవితాన్ని మరింత దారుణంగా మార్చేసిందనే విషయం మమ్మల్ని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది.''

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)