విశాఖపట్నం: గూగుల్ డేటా సెంటర్ రాబోతున్న తర్లువాడ ఇప్పుడెలా ఉంది? గ్రామస్థులు ఏమంటున్నారు? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి రాయపూర్ హైవే మార్గంలో కనిపించే చిన్న గ్రామం తర్లువాడ. విశాఖ జిల్లాలోని ఈ గ్రామం ఇటీవల వరకు విశాఖ వాసులకు కూడా అంతగా తెలియదు. కానీ, ఇప్పుడీ గ్రామం గురించి దేశమంతా చర్చ నడుస్తోంది.
ఎక్కడ చూసినా పల్లె వాతావరణమే కనిపించే ఈ తర్లువాడ పరిసర ప్రాంతాలకు సుమారు 15 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.1.35 లక్షల కోట్లు పెట్టుబడులు రాబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ ప్రసిద్ధ ఐటీ దిగ్గజం గూగుల్ ఇక్కడ ఈ భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. 2026లో పనులు ప్రారంభించి, 2030 నాటికి డేటా సెంటర్ సిద్ధం చేయాలని గూగుల్ భావిస్తోంది.
అయితే, ఈ డేటా సెంటర్ ఏర్పాటుపై గ్రామంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఒక వైపు ఆనందం, మరోవైపు ఆందోళన. నీటి వినియోగం, కాలుష్యం విషయంలో ఆందోళనగా ఉందని కొందరు గ్రామస్థులు బీబీసీతో చెప్పారు.
పర్యావరణ సమస్యలు తలెత్తకుండా తాము పునరుత్పాదక ఇంధనంపైనే ఎక్కువగా ఆధారపడతామని గూగుల్ చెబుతోంది.


ఎక్కడుందీ తర్లువాడ?
విశాఖ నగరం నుంచి ఆనందపురం, అడవివరం, పెందుర్తి మీదుగా ఈ గ్రామానికి చేరుకోవచ్చు. ఏ వైపు నుంచైనా 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తర్లువాడ.
నగరానికి సమీపంలోనే ఉన్నప్పటికీ... ఈ గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుంచి పూర్తిగా గ్రామీణ వాతావరణమే కనిపిస్తుంది.
జాతీయ రహదారి పక్కనే ఉన్న రోడ్డు నుంచి గ్రామంలోకి వెళుతుంటే... దారి పొడవునా మామిడి, జీడిమామిడి తోటలు, పంట పొలాలు, పనుల్లో నిమగ్నమైన రైతులు, పశువులు కనిపిస్తాయి. వాటిని దాటి వెళ్తే... సిమెంట్ రోడ్డుకి ఇరువైపులా ఉన్న స్లాబ్ ఇళ్లు, గ్రామం మలుపులో రచ్చబండ కబుర్లు, గూగుల్ డేటా సెంటర్ ప్రకటనతో కొత్త వాళ్ల రాక అలవాటైపోయి.. కనీసం 'మీరు ఎవరు?' అని కూడా అడగని గ్రామస్థులు కనిపించారు.
బీబీసీ వారితో మాట్లాడినప్పుడు.. "అవును.. మా ఊరికి పెద్ద కంపెనీ వస్తోంది. కాకపోతే దాని గురించి ఒక్కొక్కరూ ఒక్కో మాట అంటున్నారు. ఏది నిజమో తెలియడం లేదు" అని పశువులను మేతకు తీసుకెళ్తున్న రైతు కృష్ణ బీబీసీతో అన్నారు.
లక్ష్మమ్మ అనే మహిళను అడిగితే... "మాకు ఏమీ తెలీదు. కానీ ఏదో కంపెనీ వస్తుందట, గూగులేటో అంటున్నారు" అన్నారు.
సుమారు 3500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో చాలా మంది గూగుల్ అనే పేరును పలకడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. కొందరు గులుగులే అని, మరికొందరు గూకులే అని, ఇంకొందరు గులుకు కంపెనీ అని గూగుల్ సౌండ్‌కి దగ్గరగా పలుకుతున్నారు. ఇది వారి గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబిస్తోంది.

తర్లువాడలో ఏం జరుగుతోంది?
గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ కోసం విశాఖ జిల్లాలోని తర్లువాడలో 308 ఎకరాలు, అడవివరంలో 120 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో 160 ఎకరాలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌కు భూములను బదలాయిస్తూ జీవో జారీ చేసింది. తర్లువాడ నుంచి అడవివరం సుమారు 25 కిలోమీటర్లు, రాంబిల్లి సుమారు 85 కిలోమీర్ల దూరంలో ఉంటుంది.
అయితే, ఇందులో అడవివరం భూములు సింహాచలం దేవస్థానానికి చెందడం వల్ల వారి అనుమతి, రాంబిల్లి ప్రాంతం నౌకాదళానికి సమీపంలో ఉండడంతో సెక్యూరిటీ క్లియరెన్స్ రావాల్సి ఉంది.
గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం భూములు కేటాయించిన తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో... ఎక్కడ ఏ కార్యకలాపాలు జరుగుతాయనే విషయాన్ని ప్రభుత్వంగానీ, గూగుల్‌గానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ప్రస్తుతానికి తర్లువాడకు పలుమార్లు అధికారులు వెళ్లడం, గూగుల్ డేటా సెంటర్ కోసం భూములు కేటాయించిన ప్రాంతంలో కొలతలు తీసుకోవడం.. మట్టి పరీక్షలతో పాటు అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి.

తర్లువాడ ఎలా ఉందంటే...
గ్రామంలో ఉత్సాహం, సందేహం... రెండూ కలిసిన వాతావరణం కనిపిస్తుంది. రచ్చబండ వద్ద గూగుల్ డేటా సెంటర్‌పైనే మాట్లాడుకుంటున్నారు.
"గూగుల్ డేటా సెంటర్ వలన గ్రామస్థులకు ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. దీంతో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశపడుతున్నాం. మా ఊళ్లో భూముల ధరలు కూడా గతంలో ఎప్పుడూ లేనంతంగా పెరిగిపోయాయి. ఇది సంతోషమే" అని గ్రామస్థుడు సత్యారావు బీబీసీతో అన్నారు.
"గూగుల్ వంటి పెద్ద సంస్థ మా ఊళ్లో తమ కంపెనీ పెడుతోందంటే ముందు చాలా సంతోషపడ్డాం. అయితే అసలు గూగుల్ మా ఊరిలో ఏ కంపెనీ పెడుతుంది? ఏం పని చేస్తుంది? అని గూగుల్ తల్లిని అడిగినప్పుడు... కాలుష్యం పెరుగుతుందనే సమాధానం కూడా వచ్చింది. దీంతో ఇప్పుడు కాస్త ఆందోళన పెరిగింది" అని ఐటీఐ చదివి, ప్రస్తుతం టీ దుకాణం నడుపుతున్న అప్పలరాజు బీబీసీతో చెప్పారు.
గూగుల్ డేటా సెంటర్ వస్తుండటంతో... తర్లువాడ గ్రామస్థులు తమ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్నట్లు కనిపించింది.
ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో పాటు తమ గ్రామం పెద్ద నగరంగా మారిపోతుందనే ఆశను వ్యక్తం చేశారు.
గూగుల్ సంస్థలో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన కోర్సులు చేసి సిద్దంగా ఉంటామని బీబీసీతో చెప్పుకొచ్చారు.

గూగుల్ సంస్థ తమ ఊరిలో డేటా సెంటర్ ప్రారంభించి ఉద్యోగాలిస్తుందంటే... దానికి తాము ఏ కోర్సు చదవాలో అవగాహన కల్పిస్తే ఆ కోర్సు నేర్చుకోడానికి సిద్ధంగా ఉంటామని ఎమ్మెస్సీ చేసిన తర్లువాడ యువకుడు గణికుమార్ చెప్పారు.
"స్థానికులుగా ఇక్కడ గూగుల్‌లో ఉద్యోగం చేయాలని మాకు ఉంటుంది కదా!" అని తర్లువాడ వాసి మహేష్ అన్నారు.
మరోవైపు గూగుల్ డేటా సెంటర్‌కు భూములు ఇచ్చిన వారు.. తమకి దక్కిన ప్యాకేజీ, భవిష్యత్తులో ఊరిలో వచ్చే మార్పులను ఊహిస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
"ఎకరానికి రూ.40 లక్షల నగదు, 20 సెంట్లు పట్టా భూమి, నిర్మాణం కాబోయే షాపింగ్ మాల్ లో ఒక దుకాణం, ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ప్రభుత్వం ప్రకటించింది. గూగుల్ సంస్థ ఇక్కడ సాయిల్ టెస్టులు చేయిస్తోంది. గూగుల్ కంపెనీ వలన మా ఊరు మరో ఐదేళ్లలో అమెరికాలాగో, హైదరాబాద్ కోకాపేటలాగో మారిపోతుందని చెప్తున్నారు" అని గూగుల్ డేటా సెంటరుకి 4 ఎకరాల భూమి ఇచ్చిన వెంటకరాజు బీబీసీతో చెప్పారు.
సర్పంచ్ బీ. నాయుడు బీబీసీతో మాట్లాడుతూ... "మా గ్రామంలో ఇంత సందడి చూసింది లేదు" అన్నారు.

భూముల ధరలు రెట్టింపు...
గ్రామస్థుడు నర్సింగరావు బీబీసీ బృందాన్ని గూగుల్ డేటా సెంటర్ వస్దుందని చెబుతున్న కొండ వద్దనున్న ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు పహారా కాస్తున్నారు. పక్కనే మేకలు కాస్తూ కొందరు గ్రామస్థులు కనిపించారు.
"పరిహారం, ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీ.. అంతా బాగుంది. కానీ భూమి ఉంటే ఎప్పటికైనా పిల్లలకు ఉపయోగపడుతుందని భూమి ఇవ్వడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు" అని అన్నారు స్థానికంగా ఉండే గురుమూర్తి, నరసింహరావు.
ప్రస్తుతం విశాఖలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్ధుగా ఉంది.
కానీ, డేటా సెంటర్ ప్రకటనతో తర్లువాడలో భూముల ధరలు రోజుల వ్యవధిలోనే ఊహించనంత పెరిగిపోయాయి. అయినా కూడా తర్లువాడ గ్రామస్థుల్లో చాలామంది భూములు అమ్మడానికి సిద్ధంగా లేరు.
"ఇంకా రేట్లు పెరుగుతాయనే ఆశతో భూములు అమ్మట్లేదండి. డేటా సెంటర్ ప్రకటనకు ముందు రూ. 3 లక్షలున్న సెంటు భూమి ఇప్పుడు ఏడు, ఎనిమిది లక్షలు అంటున్నారు" అని తర్లువాడ రైతు వెంకటరావు బీబీసీతో అన్నారు.
"ఊరికి దూరంగా ఉన్న భూమి విలువ ఒకప్పుడు రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్లు వరకు పలికేది. ఈ రోజు రూ.5 కోట్లు అన్నా భూమి దొరకడం లేదు" అని బీ. వెంకటరాజు చెప్పారు.
ఎన్నారైల తరపున మనుషులమంటూ కొందరు, భూములు అమ్మండంటూ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్లు రోజూ గ్రామానికి వస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు.
డేటా సెంటర్ ప్రకటనతో తర్లువాడ నుంచి 10 కిలోమీటర్ల వరకు రియల్ ఎస్టేట్‌పై ప్రభావం కనిపిస్తోంది. 20 నుంచి 30 శాతం ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీరామరాజు చెప్పారు.
అయితే, భూముల ధరల పెరుగుదలను బీబీసీ స్వయంగా ధ్రువీకరించడం లేదు.

గూగుల్ విశాఖనే ఎందుకు ఎంచుకుందంటే...
గూగుల్ డేటా సెంటర్ వలన 2030 నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ పనుల నుంచి దానికి అనుబంధంగా వచ్చే సంస్థల ఉద్యోగాలు.. ఇలా అన్నీ కలిపే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 2028-32 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ప్రతి సంవత్సరం రూ.10,518 కోట్లు సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో ఏపీలో ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా 30 వేల వరకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
అయితే, నేరుగా డేటా సెంటర్‌లో వచ్చే ఉద్యోగాలు తక్కువ సంఖ్యలోనే ఉంటాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు.
ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం గూగుల్ సంస్థ విశాఖను ఎందుకు ఎంచుకుందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
"డేటా సెంటర్ నిర్వహణకు విశాఖలోని సముద్రపు నీటిని డీశాలినేషన్ చేసుకోవచ్చు. అలాగే, డేటా సెంటర్లకు అవసరమైన సీ కేబుల్ ఏర్పాటు చేసి... ల్యాండింగ్ స్టేషన్లతో కనెక్ట్ అయ్యేందుకు అనువైన ప్రదేశం విశాఖ. ఇవన్నీ ఉండటంతోనే గూగుల్ సంస్థ విశాఖను ఎంచుకుని ఉంటుంది" అని ఐటీ రంగ నిపుణులు, రిటైర్డ్ ప్రొఫెసర్ పీఎస్ అవధాని విశ్లేషించారు.

డేటా సెంటర్‌లో ఏయే ఉద్యోగాలుంటాయి?
డేటా సెంటర్‌లో ఎలాంటి ఉద్యోగాలుంటాయనే దానిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోని పారిశ్రామికవేత్త, విశాఖ ఐటీ సెజ్ వైస్ ప్రెసిడెంట్ ఓ.నరేష్ మాట్లాడారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఇక్కడ లభించే అవకాశమున్న ఉద్యోగాలివీ...
టెక్నికల్: డేటా సెంటర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, నెట్‌వర్క్ ఇంజినీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్టులు.
ఆపరేషన్స్: ఎలక్ట్రికల్ ఇంజినీర్లు, మెకానికల్ సర్వీసెస్, సెక్యూరిటీ ఆఫీసర్లు, కూలింగ్ సిస్టమ్ టెక్నీషియన్లు, పవర్ మేనేజ్‌మెంట్ స్టాఫ్.
అడ్మినిస్ట్రేషన్: ఫైనాన్స్, లాజిస్టిక్స్, స్కిల్ డెవలప్‌మెంట్ ఉద్యోగాలు
"కానీ... ఇవి లక్షల్లో ఉండవు. డేటా సెంటర్ దాని అనుబంధ సంస్థలు, ఏఐ ఎకో సిస్టమ్, ఎనర్జీ కారిడార్లు, బ్యాటరీ స్టోరేజ్ సెంటర్లు.. ఇవన్నీ వస్తేనే ఉద్యోగాలు పెరుగుతాయి. అయితే, అవన్నీ రావాలంటే అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలి" అని నరేష్ బీబీసీతో చెప్పారు.
"డేటా సెంటర్ అనేది 24/7 కంటిన్యూగా రన్ అవ్వాల్సి వస్తుంది. దీనికి లోకల్ మ్యాన్ పవర్ కూడా చాలా అవసరం పడుతుంది" అని విశాఖకు చెందిన డేటా అనలిస్ట్ శివాజీ అన్నారు.

కాలుష్యం, నీటి వినియోగంపై అనుమానాలు
డేటా సెంటర్లలో అత్యధిక స్థాయిలో విద్యుత్, మంచినీటి వినియోగం ఉంటుందని, డేటా సెంటర్ వల్ల ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందన్న వాదనలు ఉన్నాయి.
డేటా సెంటర్ వస్తే సంతోషమే కానీ... అది మా ఊరు, మా పిల్లల భవిష్యత్తుని దెబ్బతీయకుండా ఉంటే చాలు అని గ్రామస్థుడు నరసింగరావు బీబీసీతో అన్నారు.
దీనిపై బీబీసీ గూగుల్ సంస్థను మెయిల్ ద్వారా సమాధానం కోరగా... "మేం పూర్తిగా రెన్యూవబుల్ ఎనర్జీపైనే ఆధారపడుతున్నాం. పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించం" అని సమాధానమిచ్చింది.
"డేటా సెంటర్‌కు వాడే ఎనర్జీ కార్బన్ ఫ్రీ అయి ఉండాలి. డేటా సెంటర్ నిర్వహణకు సముద్రపు నీటిని శుద్ధి చేసి వినియోగించుకోవాలి. అలాగే డేటా సెంటర్లలో సర్వర్ల నుంచి వచ్చే వేడిని కూడా విద్యుత్తుగా మార్చే రెన్యూవబుల్ ఎనర్జీలను వాడుకోవాలి. గూగుల్ తన నీటి అవసరం కోసం రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవాలి" అని ఏయూ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఈయూబీ రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, APGO66
గూగుల్ డేటా సెంటర్ బాటలో మరికొన్ని...
తర్లువాడలోని గూగుల్ డేటా సెంటర్ ఇతర సంస్థల రాకకు మార్గంగా మారే అవకాశం ఉందని నరేష్ బీబీసీతో అన్నారు.
గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖలో మరికొన్ని డేటా సెంటర్లు వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అవి...
• అదానీ డేటా సెంటర్ – Adani Connex (200 MW) (దీనికి అదనంగా తర్లువాడలోని 1 GW గూగుల్ డేటా సెంటర్‌లో కూడా అదానీ, భారతీ ఎయిర్ టెల్ గ్రూపులు భాగస్వాములు)
• రిలయన్స్ - (RIL - 1 GW)
• సిఫీ టెక్నాలజీస్ (Sify – 500 MW)
• ఏఆర్పీసీఎల్ - (ARPCL - 117 MW)
• టిల్‌మన్ గ్లోబల్ - (Tillman - 300 MW) సంస్థలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














