బంగ్లాదేశ్‌లో 'భారత వ్యతిరేక' భావాలను రెచ్చగొడుతోంది ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తన్హా తస్నీమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బంగ్లాదేశ్‌లో డిసెంబర్ 18వతేదీ రాత్రి రెండు మీడియా సంస్థలు, కొన్ని సాంస్కృతిక సంస్థలపై మూక దాడి చేయడాన్ని ఈ ప్రతినిధి చూశారు.
ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్, అధికార ప్రతినిధి ఉస్మాన్ హాదీ మరణం తరువాత ఆందోళనాకారుల గుంపు 'ప్రథమ్ అలో, ది డైలీస్టార్' అనే రెండు మీడియా సంస్థల కార్యాలయాలపై దాడి చేసింది. ఆఫీసు ఫర్నీచర్ ధ్వంసంచేసి, నిప్పంటించింది.
ఛాయానట్ భవన్‌పైనా దాడి చేసి తగలబెట్టింది. ఈ సంస్థలపై 'భారత ఏజెంట్లు' 'ఫాసిజం మిత్రులు' అని ముద్ర వేశారు.
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో భారత్ సాయం చేసింది. అయితే సరిహద్దు ప్రాంతాల్లో హత్యలు, నదీ జలాల పంపిణీలో సమస్యలు, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వంటి వాటి వల్ల బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక భావన తరచూ పెరుగుతూ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.
తాజాదాడులు బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న భారత వ్యతిరేక భావజాలానికి నిదర్శనమని కొంతమంది నమ్ముతున్నారు.
బంగ్లాదేశ్‌ను 16నెలలుగా పాలిస్తున్న తాత్కాలిక ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల పరిస్థితి ప్రధాన సమస్య అని విశ్లేషకులు అంటున్నారు. ఈ అస్థిర పరిస్థితి నుంచి బంగ్లాదేశ్ బయటపడటానికి ఎన్నికలే మార్గం. కానీ, ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని భావిస్తున్న ఓ సమూహం భారత వ్యతిరేకతను ప్రేరేపించి హింసను రెచ్చగొడుతోందని కొందరు రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఫొటో సోర్స్, Getty Images
హాదీ మరణం సాకుతో భారత వ్యతిరేక రాజకీయం
గతేడాది జూలై ఉద్యమం తర్వాత బంగ్లాదేశ్‌లో చాలా కాలంగా చెలరేగుతున్న భారత వ్యతిరేక భావన కొత్త రూపాన్ని సంతరించుకుంది.
షేక్ హసీనా భారత్‌కు వచ్చిన తర్వాత అనేక మంది ఆవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలు భారత్‌లో ఆశ్రయం పొందారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడింది.
"ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎప్పుడూ చురుకైన ప్రతిఘటన ఉంటుంది. అధికారం కోల్పోయిన ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది" అని ఢాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాజీ మార్ఫుల్ ఇస్లాం అన్నారు.
షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ కోరినప్పటికీ ఆమెను వెనక్కి పంపకపోవడం, ఉస్మాన్ హాదీని హత్య చేసిన వారు భారత్‌లో తల దాచుకున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తత మరింత పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు.
అయితే హాదీని హత్య చేసిన వారు దేశం విడిచి వెళ్లినట్లు కచ్చితమైన ఆధారాలేవీ లభించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. "నిందితులు సరిహద్దు దాటారా లేదా అనేది మేమింకా నిర్థరించలేదు" అని బంగ్లాదేశ్ పోలీసు అడిషనల్ ఐజీ ఖాండేకర్ రఫీఖుల్ ఇస్లాం అన్నారు.ఆ తదుపరి హోంమంత్రిత్వ శాఖ సలహాదారు మీడియాతో మాట్లాడుతూ "నిందితుల ఆచూకీ గురించి కచ్చితమైన సమాచారం ఉంటే వారిని అరెస్టు చేసి ఉండేవారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Abu Sufian Jewel/AFP via Getty Images
భారత వ్యతిరేక భావనే హింసకు ఆయుధమా?
బంగ్లాదేశ్ రాజకీయాల్లో భారత్‌పై వ్యతిరేకతను అప్పుడప్పుడు వ్యూహాత్మకంగా ఉపయోగిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు.
రెండు మీడియా సంస్థలు, సాంస్కృతిక సంస్థ ఛాయానట్, ధన్మొండి-32 నివాసంపై ఆందోళనాకారులు దాడి చేసినప్పుడు భారత వ్యతిరేక నినాదాలు వినిపించాయి. దాడుల సమయంలో జమాత్‌తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఈ సంస్థలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు.
ఉస్మాన్ హాదీ మరణించారని తెలిశాక బంగ్లాదేశ్‌లో ఆకస్మిక నిరసనలు చెలరేగాయి. ఆ తర్వాత జరిగిన సమావేశంలో రాజ్‌షాహి యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేత మోస్తకుర్ రెహమాన్ "ఈ రోజు జరిగిన ఘటనల ద్వారా ప్రథమ్ అలో, ది డైలీ స్టార్ వంటి వార్తాపత్రికలను మూసివేస్తామని ప్రకటిస్తున్నాం" అని చెప్పారు.
మోస్తకుర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజే "రాజకీయ పోరాటం ద్వారా బంగ్లాదేశ్‌కు నిజమైన స్వాతంత్య్రం సాధించడం సాధ్యం కాదు. షహీద్ ఉస్మాన్ హాదీ నాయకత్వంలోని ఇంక్విలాబ్ మంచ్ చేస్తున్న సాంస్కృతిక పోరాటంతో కలిపి మా పోరాటం ప్రారంభమవుతుంది. బామ్, షాబాగి, ఛాయనత్, ఉడిచిలను ధ్వంసం చేయాల్సి వస్తుంది. అప్పుడే బంగ్లాదేశ్‌కు నిజమైన స్వాతంత్య్రం" అని ఇస్లామీ ఛత్ర క్యాంప్‌లోని జహంగీర్‌నగర్ విశ్వవిద్యాలయ శాఖ కార్యదర్శి ముస్తాఫిజుర్ రెహమాన్ అన్నారు.
మోస్తకుర్ రెహమాన్, ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యాఖ్యలపై వివరణ కోసం బీబీసీ వారిని సంప్రదించింది. వారు తమ వ్యాఖ్యల్ని ఖండించలేదు. అయితే వాటికి వేర్వేరు అర్థాలు చెప్పారు. ఈ సంస్థలు ఆవామీ లీగ్‌కు ఇచ్చిన చట్టబద్దతను ముగించడమే తమ వ్యాఖ్యల ఉద్దేశమని చెప్పారు. అలాగే రెండు మీడియా సంస్థలు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నాయన్నారు.
మరోపక్క తమ నాయకులు చేసిన వ్యాఖ్యల వల్లే హింస జరిగిందని నిందించడానికి కుట్ర జరుగుతోందని ఇస్లామిక్ స్టూడెంట్ క్యాంప్ చెబుతోంది. ఇలాంటి కుట్రలను తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించింది.
"మత ఆధారిత రాజకీయాల ద్వారా బలోపేతం కావాలని భావిస్తున్న సంస్థలకు భారత వ్యతిరేక నినాదాలు చేయడం అనుకూలంగా ఉంటుంది. జూలైలో విద్యార్థుల ఆందోళనలు, హసీనా భారత్‌లో తలదాచుకోవడం వంటివి భారత్‌పై ఆగ్రహాన్ని పెంచాయి. ఇప్పుడు హాదీ మరణాన్ని కూడా మత ఆధారిత రాజకీయాలు చేసే సంస్థలు ప్రభావవంతంగా ఉపయోగించుకుంటున్నాయి" అని కౌన్సిల్ ఆఫ్ సెక్రటరీస్ చైర్మన్ నూరుల్ కబీర్ చెప్పారు.
"బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేయాలని భావించే వర్గానికి భారత వ్యతిరేక నినాదాలను తలకెత్తుకోవడం సౌకర్యవంతంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ పాత్రపై ఆరోపణలు
దాడి జరగడానికి ముందే, తమకు రక్షణ కల్పించాలని ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి వ్యక్తులను సంప్రదించినప్పటికీ తమకు సాయం అందలేదని ప్రథమ్ అలో, ది డైలీ స్టార్ ఆరోపించాయి.
భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, వారు అల్లరిమూకను నియంత్రించ డానికి ఎటువంటి చర్యా తీసుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో హింసచెలరేగడం వెనుక ప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
"తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటివరకూ ఏ విభాగం పైనా ప్రభుత్వానికి పట్టు లేదు. తాత్కాలిక ప్రభుత్వమే ఈ హింసను ప్రేరేపిస్తున్నట్లు కనిపిస్తోంది" అని ప్రొఫెసర్ ఖాజీ మార్ఫూల్ ఇస్లాం అన్నారు.
ఈ దాడికి సంబంధించి 300 మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తులపై ఛాయానట్ ఫిర్యాదు చేసింది. ప్రథమ్ అలో, ది డైలీ స్టార్‌పై దాడులకు సంబంధించి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే సంఘటన జరిగిన రోజున సోషల్ మీడియాలో కనిపిస్తున్న అనేక వీడియోలలో ఒకదాంట్లో ఓ సైనిక అధికారి దాడి చేసిన వారిని నియంత్రించడానికి బదులు వారితో మంతనాలు జరపడం కనిపించింది. భవనంలో చిక్కుకున్న జర్నలిస్టులను రక్షించేందుకు అవకాశం ఇవ్వాలని దాడి చేయడానికి వచ్చినవారిని ఆయన 20 నిముషాల పాటు అడుగుతున్నట్లు కూడా ఆ వీడియోలో ఉంది. ప్రభుత్వంలోని ఒక వర్గం మద్దతుతోనే ఇలాంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని న్యూఏజ్ ఎడిటర్, ఎడిటర్స్ కౌన్సిల్ చైర్మన్ నూరుల్ కబీర్ అన్నారు.
"ది డైలీ స్టార్, ప్రథమ్ అలో కార్యాలయాలపై దాడుల వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ సంఘటనలు జరగాలని కోరుకునే వ్యక్తులు మూహమ్మద్ యూనస్ ప్రభుత్వంలో, పాలక వర్గంలో ఉన్నారని కచ్చితంగా చెబుతాను" అని ఆయన అన్నారు.
నేషనల్ సిటిజన్ పార్టీ కన్వీనర్ నహీద్ ఇస్లాం కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. పార్టీ బాధ్యతలు చేపట్టడానికి ముందు నహీద్ దాదాపు ఏడున్నర నెలల పాటు తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేశారు.
ఎడిటర్స్ కౌన్సిల్, వార్తాపత్రికల యజమానుల సంఘ సంయుక్త నిరసన ర్యాలీలో నహీద్ మాట్లాడుతూ "వాళ్లు మా నినాదాన్ని ఉపయోగించుకుని దాడులు చేసి, దానికి సానుకూల అభిప్రాయన్ని ఆపాదించారు. ఈ దాడుల్లో ప్రభుత్వం కూడా భాగస్వామి అని మేం చెబుతున్నాం" అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














