1978 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్: బొమ్మ తుపాకులతో హైజాక్ చేసిన ఇద్దరు వ్యక్తులు తర్వాతి రోజుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా అయ్యారు?

ఎయిరిండియా, విమానం హైజాక్, ఇందిరా గాంధీ, జనతా పార్టీ ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్

ఫొటో సోర్స్, Bureau of Aircraft Accidents Archives

ఫొటో క్యాప్షన్, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-200 విమానం (ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, వకార్ ముస్తఫా
    • హోదా, జర్నలిస్టు, పరిశోధకుడు

1978 డిసెంబర్ 20 ...ఓ చలికాలపు సాయంత్రం. ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 410 లో ఉన్న ఇద్దరు యువకులు పదిహేనో వరుసలో ఉన్న తమ సీట్లలో నుంచి లేచి కాక్‌పిట్ వైపు వెళ్లారు.

విమానంలో మిగతా ప్రయాణికులు, సిబ్బంది వారిని అంతగా పట్టించుకోలేదు.

వారిలో ఓ యువకుడు కాక్‌పిట్‌లోకి వెళతానని సిబ్బందిలో ఒకరిని 'మర్యాద పూర్వకంగా' అభ్యర్థించారు.

కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా) నుంచి లఖ్‌నవూ మీదుగా దిల్లీ వెళుతున్న ఈ విమానంలో 126 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

మరో 15 నిముషాల్లో దిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుందనగా విమానంలో పరిస్థితులు మారిపోయాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘‘యువకుడి 'మర్యాదపూర్వక అభ్యర్థన' మేరకు సిబ్బందిలో ఒకరైన జీవీ డే, కెప్టెన్‌కు విషయం చెప్పేందుకు కాక్‌పిట్‌లోకి ప్రవేశించే సమయంలో, మరో యువకుడు ఇందిరా థాకరీ అనే ఎయిర్ హోస్టెస్ మో చేయిని పట్టుకున్నారు. మరో వ్యక్తి కాక్‌పిట్‌లోకి ప్రవేశించారు’’ అని ఇండియా టుడే రాసిన కథనం చెబుతోంది.

"కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన మేగ్నటిక్ డోర్‌ ఆటోమేటిక్ లాక్ పడి ఉంది. దీంతో యువకులిద్దరూ తమ బలాన్ని ఉపయోగించి తలుపు తెరిచి కాక్‌పిట్‌లోకి ప్రవేశించారు" అని ఆ కథనం తెలిపింది.

విమానంలో అవాంఛనీయమైనది ఏదో జరుగుతోందని ప్రయాణికులు, సిబ్బంది గ్రహించారు.

"మన విమానాన్ని హైజాక్ చేశారు. మనం పట్నా వెళుతున్నాం" అని కెప్టెన్ ప్రకటన వినిపించింది.

ఈ ప్రకటన వచ్చిన కొన్ని క్షణాల్లోనే "మనం వారణాసి వైపు వెళుతున్నాం" అని మరో అనౌన్స్‌మెంట్ వచ్చింది.

ఈ ప్రకటనలకు ముందు కాక్‌పిట్‌లో హైజాకర్లు, పైలట్ల మధ్య చాలా చర్చలు జరిగాయని కెప్టెన్ చెప్పినట్లు ఇండియా టుడే పేర్కొంది.

"ఆ మూర్ఖులకు(హైజాకర్లు) విమాన ప్రయాణానికి పరిమితి ఉందని వివరించడం కష్టం. ఎందుకంటే వాళ్లు మొదట నేపాల్ వెళ్లాలని డిమాండ్ చేశారు. నా తలపైకి తుపాకీ గురిపెట్టినప్పుడు, నేను విమానంలో తగినంత ఇంధనం లేదని చెప్పాను. వాళ్లు బంగ్లాదేశ్ వెళ్లాలని డిమాండ్ చేశారు. స్కూల్‌లో వాళ్లు జాగ్రఫీ పాఠాలేవి నేర్చుకోలేదని నాకనిపించింది" అని కెప్టెన్ చెప్పారు.

సాయుధ హైజాకర్లు కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చి, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అరెస్ట్, 1977 మార్చ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికార జనతా పార్టీ 'ప్రతీకార రాజకీయాలను' తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారని ఇండియాటుడే కథనం వెల్లడించింది.

విమానం హైజాక్ సంఘటన జరగటానికి ఒక రోజు ముందు ఇందిరను అరెస్ట్ చేశారు.

ఎయిరిండియా, విమానం హైజాక్, ఇందిరా గాంధీ, జనతా పార్టీ ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1978లో ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు జైలులో ఉంచారు.

ఇందిరా గాంధీ అరెస్టు

లోక్‌సభలో ఏడు రోజుల వాడి వేడి చర్చ తర్వాత, ‌ఇందిరా గాంధీని సభ నుంచి బహిష్కరించి జైలుకు పంపించినట్లు అమెరికన్ వార్తా పత్రిక ది న్యూయార్క్ టైమ్స్‌లో రాశారు.

1975లో తన కుమారుడు సంజయ్ గాంధీ నియంత్రణలో ఉన్న మారుతీ లిమిటెడ్ సంస్థపై కేసును ఉపసంహరించుకోవాలని దర్యాప్తు అధికారులను ఇందిరా గాంధీ వేధించారని ఆరోపణలు వచ్చాయి.

మారుతీ లిమిటెడ్‌పై కేసు "ప్రతీకారం, రాజకీయ ప్రేరేపితం" అని ఇందిర అభివర్ణించారు.

ఎమర్జెన్సీ సమయంలో ఇందిర ప్రభుత్వ వ్యవహార శైలి లోక్‌సభలో చర్చ సందర్భంగా పదే పదే ప్రస్తావనకు వచ్చింది.

ఆమె క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే ఇందిర క్షమాపణ చెప్పలేదు.

తాను ఏ తప్పు చేయలేదని అన్నారు.

ఎయిరిండియా, విమానం హైజాక్, ఇందిరా గాంధీ, జనతా పార్టీ ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్

ఫొటో సోర్స్, Screengrab/Indian Express

ఫొటో క్యాప్షన్, ఇందిరను లోక్‌సభ నుంచి బహిష్కరించి, జైలులో పెట్టారంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథనం

కన్నీళ్లు లేవు, చిరునవ్వు తోడుగా ఉంది.

పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత తనను ఇంట్లో అర్థరాత్రి పూట నిశబ్దంగా అరెస్ట్ చేయవల్సిన అవసరం లేదని, పార్లమెంట్ దగ్గరే అరెస్ట్ చేయాలని ఇందిర పట్టుబట్టారని ది న్యూయార్క్ టైమ్స్ రాసింది.

"3 గంటల నిరీక్షణ తర్వాత, పోలీసులు అరెస్ట్ వారెంట్‌తో వచ్చారు. ఇందిరా గాంధీ నవ్వుతూ తన ఎదురుగా ఉన్న చెక్కబల్లపైకి ఎక్కారు. చేతులు కట్టుకుని కిందకు దిగారు. పోలీసులతో వెళ్లడానికి ముందు ఆమె పాత ఇంగ్లీష్ పాటలో లైన్లను కాగితం మీద రాశారు. దానికి ఆమె మద్దతురాల్లో ఒకరు ప్రజలకు వినిపించారు. అందులో ఇలా ఉంది.

"మీరు నాకు వీడ్కోలు పలుకుతున్నప్పుడు, నా శ్రేయస్సు కోరుకోండి

కళ్లలో నీళ్లు లేవు, కానీ చిరునవ్వు ఉంది.

నేను లేనప్పుడు నాకు తోడుగా ఉండే చిరునవ్వును నాకివ్వండి"

ఎయిరిండియా, విమానం హైజాక్, ఇందిరా గాంధీ, జనతా పార్టీ ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పట్లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రామ్ నరేశ్ యాదవ్ హైజాకర్లతో చర్చలు జరిపారు.

"కావాలంటే నన్ను కాల్చండి, నేను టాయిలెట్ కి వెళ్తున్నాను"

ఇందిరా గాంధీ అరెస్టు వార్త దేశమంతా వ్యాపించింది. అనేక ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి.

ఆమె జైలులో ఉన్నంత కాలం ఆందోళనలు కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది.

హైజాకర్లు తాము యూత్ కాంగ్రెస్ సభ్యులమని, ఇందిరా గాంధీని విడుదల చేయించేందుకే విమానాన్ని హైజాక్ చేసినట్లు చెప్పారు.

విమానం హైజాక్ సంఘటన ముగిసిన తర్వాత, 27 ఏళ్ల భోలానాథ్ పాండే, 28 ఏళ్ల దేవేంద్ర పాండే అనే ఇద్దరిని హైజాకర్లుగా గుర్తించారు.

తాము గాంధేయవాదులమని, అహింసను నమ్ముతామని హైజాకర్లు విమానంలో ఉన్నప్పుడే ప్రకటించారు. "మీకు హాని చేసే ఉద్దేశం ఏదీ లేదు" అని ప్రయాణికులతో చెప్పారు.

విమానంలో హైజాకర్లను పట్టుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులు, సిబ్బంది అలాంటి ప్రయత్నం చేయలేదని ఇండియా టుడే రాసింది.

ఒక సమయంలో హైజాకర్లు విమానంలో ప్రయాణికుల్ని టాయిలెట్ రూమ్‌కు కూడా వెళ్లనివ్వలేదు.

న్యాయశాఖ మాజీ మంత్రి ఏకే సేన్ కూడా ఆ సమయంలో విమానంలో ఉన్నారు.

ఆయన అర్జంట్‌గా టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడంతో "కావాలంటే మీరు నన్ను కాల్చేయండి. నేను టాయిలెట్‌ రూమ్‌కు వెళుతున్నాను" అని పెద్దగా అరిచారు.

విమానం వారణాసిలో దిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రామ్ నరేశ్ యాదవ్‌తో మాట్లాడాలని హైజాకర్లు డిమాండ్ చేశారు.

అయితే ఆయన వాళ్లతో మాట్లాడేందుకు మొదట నిరాకరించారు. కానీ, ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ సూచనలతో వారణాసి బయల్దేరారు.

తమకు నాలుగు డిమాండ్లు ఉన్నాయని హైజాకర్లు అధికారులకు తెలిపారు. అందులో ప్రధానమైనది ఇందిరాగాంధీని బేషరతుగా విడుదల చేయడం.

ముఖ్యమంత్రి స్వయంగా విమానంలోకి వచ్చి తమతో మాట్లాడాలని హైజాకర్లు డిమాండ్ చేయడంతో ఆయన విమానంలోకి వెళ్లి హైజాకర్లతో చర్చలు మొదలు పెట్టారు.

చర్చలు జరపాలంటే విమానంలో ఉన్న విదేశీయులు, మహిళా ప్రయాణికుల్ని సురక్షితంగా పంపించాలని యాదవ్ షరతు పెట్టారు.

ఇదంతా కొనసాగుతూ ఉండగానే ఎస్‌కే మోదీ అనే ప్రయాణికుడు విమానం వెనుక తలుపు తెరిచి కిందకు దూకారు. ఆయన వెళ్లిపోవడాన్ని ఎవరూ గమనించలేదు.

డిసెంబర్ 21న జరిగిన లోక్‌సభ సమావేశంలో పర్యటక, పౌర విమానయాన మంత్రి పురుషోత్తం కౌశిక్ ఈ పరిణామాల గురించి వివరించారు.

"విమానంలోని ఎయిర్‌హోస్టెస్ సాయంతో ఎస్‌కే మోదీ విమానం నుంచి తప్పించుకోగలిగారు. ఆయన బయటకు వచ్చి, విమానంలో ఇద్దరు హైజాకర్లు ఉన్నారని, ఒకరు తెల్లటి కుర్తా, పైజమా, మరొకరు ధోతీ కుర్తా ధరించారని అధికారులకు చెప్పారు.

తమ నాయకురాలిని విడుదల చేయాలని, ఈ హైజాక్ గురించి పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు రావాలని డిమాండ్ చేశారు హైజాకర్లు. వారి దగ్గర హిందీ, ఇంగ్లీష్‌లో ముద్రించిన పాంప్లెట్లు ఉన్నాయని అధికారులకు చెప్పారు ఎస్‌కే మోదీ" అని పురుషోత్తం కౌశిక్ వివరించారు.

"ముఖ్యమంత్రితో హైజాకర్లు జరిపిన చర్చల్లో భాగంగా ఇందిరను తక్షణం విడుదల చేయాలని, ఆమెపైనున్న క్రిమినల్ కేసుల్ని ఎత్తేయాలని, జనతా ప్రభుత్వం రాజీనామా చేయాలని, విమానాన్ని లఖ్‌నవూ తీసుకెళ్లాలని, ఇందిరను కలిసేందుకు పాత్రికేయులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు" అని ఆయన అన్నారు.

"ప్రయాణీకులందరినీ విడుదల చేస్తే, హైజాకర్లను ప్రభుత్వ విమానంలో లఖ్‌నవూకు తీసుకెళతామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. హైజాకర్లు మొదట ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. విమానానికి ఇంధనం నింపాలని డిమాండ్ చేశారు. అయితే విమానంలో ఇంధనం నింపకుండా చర్చలు కొనసాగించాలని కేంద్ర కమిటీ వారణాసిలో ఉన్న సంధానకర్తలకు సూచించింది" అని పురుషోత్తం కౌశిక్ తెలిపారు.

హైజాకర్లతో ముఖ్యమంత్రి చర్చలు రాత్రంతా కొనసాగాయి. హైజాకర్ల డిమాండ్లు ఆమోదించేది లేదని రామ్ నరేశ్ యాదవ్ హైజాకర్లకు స్పష్టం చేసినట్లు ఇండియాటుడే కథనంలో రాశారు.

ఉదయం 6 గంటల సమయంలో విమానం లోపల ఉక్కపోత పెరగడంతో హైజాకర్లు వెనుక తలుపు తెరిచారని ప్రయాణికులు చెప్పారు

‘‘విమానం వెనుక తలుపు తెరిచిన తర్వాత కెప్టెన్ ఎమర్జెన్సీ స్లైడర్‌ డోర్‌ను తెరిచారు. దీంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారు. కాసేపటికే 60 మంది ప్రయాణికులు రన్ వే మీదకు వచ్చారు.

అదే సమయంలో హైజాకర్లలో ఒకరి తండ్రి వారణాసి చేరుకుని వైర్‌లెస్ సెట్ ద్వారా కొడుకుతో మాట్లాడారు.

తండ్రి గొంతు విన్న హైజాకర్ తన సహచరుడితో కలిసి విమానం నుంచి బయటకు వచ్చారు. ఇందిరా గాంధీకి మద్దతుగా నినాదాలు చేస్తూ అధికారుల ఎదుట లొంగిపోయారు.

ఎయిరిండియా, విమానం హైజాక్, ఇందిరా గాంధీ, జనతా పార్టీ ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్

ఫొటో సోర్స్, ScreenGrab/ Indian Express

హైజాకర్లకు ఎమ్మెల్యే టిక్కెట్లు

హైజాక్ డ్రామా 13 గంటలు నడిచింది. హైజాకర్ల చేతిలో "హ్యాండ్ గ్రనేడ్‌ను పోలిన రెండు బొమ్మ పిస్టల్స్, నల్లటి వస్త్రంలో చుట్టిన క్రికెట్ బంతి ఉన్నాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రాసింది.

"హైజాకర్ ప్రశాంతంగా కిందకు వచ్చి 'ఇందిరా గాంధీ జిందాబాద్' అని నినాదాలు చేశారు. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు" అని ఆ కథనం తెలిపింది.

విమానాన్ని హైజాక్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు తమకు డబ్బులు ఇచ్చినట్లు హైజాకర్లు ఇద్దరూ విచారణలో చెప్పారు.

రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి చెందిన ఇద్దరు తమకు రూ. 600 ఇచ్చినట్లు చెప్పారు.

ఈ మొత్తంలో రూ. 350 ఖర్చు చేసి లఖ్‌నవూ నుంచి దిల్లీకి విమాన టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ఇందిర జైలు నుండి విడుదలయ్యారు.

విమానం హైజాక్ కేసులో ఆ ఇద్దరు యువకులు లఖ్‌నవూ జైలులో తొమ్మిది నెలల 28 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. కొన్ని నెలల తర్వాత కేంద్రంలో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చారు.

హైజాకర్లు భోలానాథ్, దేవేంద్ర పాండేలపై కేసుల్ని ఎత్తివేశారు.

బల్లియా జిల్లాలోని దోబా అసెంబ్లీ స్థానం నుంచి భోలానాథ్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మౌల్‌శ్రీ సేథ్ రాశారు.

1980లో 27 ఏళ్ల వయసులో భోలానాథ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో అదే స్థానం నుండి ఆయన మళ్లీ గెలిచారు.

ఆ తర్వాత ఏ ఎన్నికల్లోనూ గెలవలేకపోయారు. తర్వాతి కాలంలో ఆయన కాంగ్రెస్‌లో అనేక పదవులు చేపట్టారు.

కాంగ్రెస్ టికెట్‌పై జైసింగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దేవేంద్ర పాండే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆయన కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

ఎయిరిండియా, విమానం హైజాక్, ఇందిరా గాంధీ, జనతా పార్టీ ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విమానం హైజాక్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులు 'జోక్'గా కొట్టిపారేశారు.

కాంగ్రెస్ పార్టీ ఏమంది?

హైజాక్ సంఘటన గురించి దేవేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ "గాంధీ కుటుంబం పట్ల ఉన్న పిచ్చి ఇది. పిచ్చికి దగ్గరగా ఉన్న భక్తి" అని అన్నారని కృష్ణ ఆర్. వాధ్వానీ తన 'ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్ (షాకింగ్ గ్రౌండ్ రియాలిటీస్)' పుస్తకంలో రాశారు.

డిసెంబర్ 23న ఈ సంఘటనపై లోక్‌సభలో వాడివేడి చర్చ జరిగిందని సీనియర్ జర్నలిస్ట్ ఎ. సూర్య ప్రకాశ్ ఒక పరిశోధనా వ్యాసంలో రాశారు.

"ఇతర పార్టీల ఎంపీలు హైజాక్‌ను ఖండించారు. అయితే ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, ఆర్. వెంకటరామన్ (తరువాత భారత రాష్ట్రపతి అయ్యారు) వసంత్ సాథే తమ కార్యకర్తల ప్రవర్తనను సమర్థించుకున్నారు. హైజాక్‌ను ఒక జోక్‌గా కొట్టి పారేశారు" అని ఎ. సూర్యప్రకాశ్ తన కథనంలో పేర్కొన్నారు.

"హైజాక్ గురించి తెలియగానే దేశప్రజల్లో ఆగ్రహం ఏర్పడింది. అయితే హైజాకర్ల వద్ద బొమ్మ పిస్టల్, క్రికెట్ బంతి ఉన్నట్లు తేలడంతో ఇది ఆ ఏడాది బెస్ట్ జోక్‌ అయింది" అని ఆర్. వెంకటరామన్ అన్నారు.

తాను హైజాకర్ల చర్యలను సమర్థించడం లేదని, కానీ దానిని హైజాకింగ్ అని పిలవాలో లేదా "స్కై జోకింగ్" అని పిలవాలో తనకు తెలియదని వసంత సాథే చెప్పినట్లు సూర్య ప్రకాశ్ తెలిపారు.

హైజాక్‌ను ఒక చిన్న సంఘటనగా అభివర్ణించిన కాంగ్రెస్ సభ్యులను ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తీవ్రంగా విమర్శించారని ఆయన రాశారు.

పైలట్లు భయాందోళనలకు గురై ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని, అది బొమ్మ పిస్టల్ అయినా, క్రికెట్ బాలైనా పైలట్లు రిస్క్ తీసుకోలేరని మొరార్జీ దేశాయ్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)