వాట్సాప్ ఘోస్ట్ పెయిరింగ్: ఈ కొత్త సైబర్ స్కామ్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి

ఫొటో సోర్స్, Getty Images/EPA
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వాట్సాప్ వాడుతున్నారా? అయితే ఈ విషయం మీరు తప్పకుండా తెలుసుకోవాలి!
ఎందుకంటే సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌ను వాడుకుని సరికొత్త మోసానికి పాల్పడుతున్నారని తెలంగాణ పోలీసులు ప్రకటించారు.
ఈ కొత్త స్కామ్ వాట్సాప్ ఘోస్ట్ పెయిరింగ్ పేరుతో సాగుతోంది.
మరోవైపు ఈ వ్యవహారంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక శాఖ (మైటీ) కూడా దేశ ప్రజలను అప్రమత్తం చేసింది.
వాట్సాప్ ద్వారా జరుగుతున్న ఈ స్కామ్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌లు సూచించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అసలు ఏమిటీ మోసం?
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కలుగుతున్న కొద్దీ.. నేరగాళ్లు కూడా మోసాలు చేసేందుకు కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు.
గతంలో ఫోన్ కాల్స్ చేయడం ద్వారానో, మెసేజ్ పంపించి మాల్‌వేర్ చొప్పించడం ద్వారానో మోసాలకు పాల్పడేవారు.
ఇప్పుడు ఏకంగా వాట్సాప్ పెయిరింగ్ (లింకు చేయడం) ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు.
'హేయ్.. మీ ఫొటో చూశారా?' అంటూ ఏదైనా లింక్ పంపించి ఈ స్కామ్‌ను మొదలు పెడుతున్నారని హైదరాబాద్ సిటీ పోలిస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు.
''ఈ లింకు, తెలియనివారి నుంచే కాదు, తెలిసినవారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకూడదు'' అని ఆయన సూచించారు.
అలాంటి లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుందని, ఓటీపీ గాని, స్కానింగ్ గాని లేకుండానే వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్ (కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ లేదా మొబైల్)కు కనెక్ట్ అవుతుందని సజ్జనార్ చెప్పారు.
ఆ సమయంలో యూజర్లు తమ ఖాతాను వాడలేకుండా లాక్ చేస్తారని ఆయన వివరించారు.

ఒక్కసారి పెయిర్ అయిందంటే...
యూజర్ల వ్యక్తిగత వాట్సాప్‌ను సైబర్ నేరగాళ్లు తమ డివైజ్‌లకు కనెక్ట్ చేశాక సమాచారం దొంగిలిస్తున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పారు.
''బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత చాటింగ్స్, ఫోటోలు, వీడియోలు… అన్ని వివరాలూ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతున్నాయి. ఆ యూజర్ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడుతుంటారు'' అని వివరించారు.

ఫొటో సోర్స్, UGC
‘మైటీ’ ఏం చెప్పిందంటే..
ఘోస్ట్ పెయిరింగ్ విషయంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక శాఖ (మైటీ) ప్రజలకు సలహాలు, సూచనలు జారీ చేసిందని ఆకాశవాణి న్యూస్ తెలిపింది.
''వాట్సాప్‌లో ఉండే డివైజ్ లింకింగ్ ఫీచర్ ఉపయోగించి వాట్సాప్ అకౌంట్లను నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. పెయిరింగ్ కోడ్స్ సాయంతో అథెంటికేషన్ అవసరం లేకుండానే వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు'' అని మైటీ ప్రకటించింది.

ఫొటో సోర్స్, UGC
ఈ సూచనలు పాటిస్తే మేలు!
అనుమానిత లింకులను అస్సలు క్లిక్ చేయొద్దని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక శాఖ (మైటీ) తెలిపింది.
ఇదే విషయాన్ని శిఖా గోయల్ కూడా బీబీసీతో చెప్పారు.
ఆమె సూచనలు ఇవీ..
- వాట్సాప్ సెట్టింగ్స్‌లో ''లింక్డ్ డివైజెస్'' ఆప్షన్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. తెలియని డివైజ్‌లకు కనెక్ట్ అయి ఉంటే వెంటనే లాగౌట్ కావాలి.
- వాట్సాప్ సెట్టింగ్స్‌లో అకౌంట్‌లోకి వెళ్లి.. ''టూ స్టెప్ వెరిఫికేషన్'' ఫీచర్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి.

ఫొటో సోర్స్, UGC
హ్యాకింగ్‌కు గురైతే ఏం చేయాలి?
జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు హ్యాకింగ్ జరిగే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ వాట్సాప్ లేదా బ్రౌజర్ హ్యాక్ అయితే.. వెంటనే వాడటం నిలిపివేయాలన్నారు శిఖా గోయల్.
హ్యాకింగ్‌కు గురైన సమయంలో వచ్చే మెసేజ్‌లు, లింకులు, పాప్-అప్స్.. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటే మంచిది.
ట్రాన్సాక్షన్ ఐడీలు, యూటీఆర్ నంబర్లు, కాల్ లాగ్స్ సేవ్ చేసి పెట్టుకోవాలి.
ఈమెయిల్, బ్యాంకింగ్, సోషల్ మీడియా అకౌంట్ల పాస్‌వర్డ్స్ వెంటనే మార్చుకోవాలి. ఒకవేళ బ్యాంకు లేదా పేమెంట్ యాప్ నుంచి డబ్బు పోతుంటే వెంటనే సదరు సంస్థలకు కాల్ చేసి చెప్పాలి.
గూగుల్ క్రోమ్, యాప్స్‌కు సంబంధించి అధికారికంగా వచ్చే లేటెస్ట్ వెర్షన్స్ అప్‌డేట్ చేసుకోవాలి.
ఎలా ఫిర్యాదు చేయాలంటే..
ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, పిన్, సీవీవీ, వాట్సాప్ కోడ్స్ ఎవరికి షేర్ చేయవద్దని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు.
సైబర్ నేరాలలో మోసపోయినా లేదా సైబర్ నేరాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా 1930 లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని శిఖా గోయల్ సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














