డిజిటల్ ఫుట్‌ప్రింట్స్: ఇంటర్నెట్‌లో మనం పోస్ట్ చేసిన కంటెంట్‌ను తొలగించవచ్చా, లేదా శాశ్వతంగా అలాగే ఉంటుందా?

ఇంటర్నెట్‌, డిజిటల్ ప్రింట్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, తనీషా చౌహాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మీరు ఎప్పుడైనా మీ పాదముద్రలను గమనించారా?

ఎప్పుడైనా బీచ్‌లో లేదా పార్క్‌లో నడుస్తూ చూశారా?

లేదా ఎప్పుడైనా మురికి బూట్లతో ఇంట్లోకి ప్రవేశించి ఉంటే ఇల్లంతా పాదముద్రలు కనిపించాయా?

ఈ గుర్తులు లేదా పాదముద్రలను బహుశా తుడిచేయొచ్చు. కానీ, మీ డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ (ఆనవాళ్లు)ను తుడిచేయగలరా?

అసలు ఈ డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ అంటే ఏంటి? వాటిని పూర్తిగా తొలగించవచ్చా? ఈ రోజు దీని గురించి తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్నెట్‌, డిజిటల్ ప్రింట్స్, యాప్, సమాచారం, డేటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏదైనా యాప్ గురించి మీ సమాచారాన్ని పంచుకునే ముందు, ఆ యాప్ గురించి తెలుసుకోవాలి.

డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ అంటే ఏంటి?

మీరు కంప్యూటర్ లేదా ఏదైనా ఇతర డిజిటల్ పరికరాన్ని ఉపయోగించినప్పుడు, మీ డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ అక్కడ వదిలేస్తున్నారని మీకు తెలుసా?

బీబీసీ బైట్‌సైజ్ నివేదిక ప్రకారం, మీరు ఇంటర్నెట్‌లో ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు, ఒక ఆనవాలు (హిస్టరీ) ఏర్పడుతుంది. దీనినే డిజిటల్ ఫుట్‌ప్రింట్ అని అంటారు.

ఏయే సందర్భాల్లో డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ వదిలిపెడతాం?

  • ఏదైనా వెబ్‌సైట్‌ను సందర్శిండం
  • లింక్‌పై క్లిక్ చేయడం
  • వీడియోపై క్లిక్ చేయడం
  • ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం
  • యాప్‌ను ఓపెన్ చేయడం

ఇవి సాధారణ ఫుట్‌ప్రింట్స్ కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే, అవి వాటంతట అవే మాయంకావు. కొన్ని సందర్భాల్లో ఈ ఫుట్‌ప్రింట్స్ పైకి కనిపించకపోయినప్పటికీ, కచ్చితంగా ఉంటాయి.

మనం తరచుగా వివిధ వెబ్‌సైట్లను సందర్శిస్తుంటాం. యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తుంటాం, లేదా వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగిస్తుంటాం.

డేటా కోసం శోధిస్తాం. ఇలా చేసే ప్రతిసారీ, ఆ సమాచారం డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ హిస్టరీ జాబితాలో చేరిపోతుంది.

ఇంటర్నెట్‌, డిజిటల్ ప్రింట్స్, యాప్, సమాచారం, డేటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌ను చెరిపివేయడం కష్టమైన పని అని నిపుణులు అంటున్నారు.

ఇవి కొన్నిసార్లు ఉపయోగకరంగా కూడా ఉంటాయి. ఉదాహరణకు, మీరు ఒక వీడియో చూసి, మీరు ఏ వీడియో చూశారో మర్చిపోయి ఉంటే, మీ హిస్టరీ జాబితాకు వెళితే, మీరు చూసిన వీడియో కనిపిస్తుంది.

లేదా ముందుగా చదివిన ఆర్టికల్స్‌ను మళ్లీ చదవాలనుకున్నప్పుడు, ఆన్‌లైన్ షాపింగ్ పేజీకి తిరిగి వెళ్లాలనుకున్నప్పుడు, లేదా ఆన్‌లైన్ గేమ్‌లో మళ్లీ అదే లెవెల్ నుంచి ఆడడం మొదలుపెట్టాలనుకున్నప్పుడు ఈ హిస్టరీ జాబితా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రతిసారీ పూర్తి యూఆర్ఎల్ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, మీ డిజిటల్ మార్కర్లను కూడా సెట్ చేసుకోవచ్చు. అలా చేస్తే నేరుగా ఆ వెబ్‌సైట్‌ ఓపెన్ అవుతుంది. వీటినే బుక్‌మార్క్స్ లేదా ఫేవరెట్స్ అంటారు.

ఇలాంటి సందర్భంలో కుకీస్ గురించి కూడా చర్చించాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్‌, డిజిటల్ ప్రింట్స్, యాప్, సమాచారం, డేటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వెబ్‌సైట్లు తరచుగా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, షాపింగ్ కార్ట్ వివరాలు, లేదా మీరు ఆన్‌లైన్ గేమ్‌లో ఏ లెవెల్ వరకు చేరారో వంటి సమాచారాన్ని నిల్వ చేస్తాయి.

ఇంటర్నెట్‌లో ఏదైనా వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు, కొన్నిసార్లు ఆ వెబ్‌సైట్ కుకీస్ గురించి అడుగుతుంది. మీరు అన్ని కుకీస్ లేదా అవసరమైన కుకీస్‌ను అంగీకరిస్తారు.

ఈ కుకీస్ కూడా డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌లో ఒక రకం మాత్రమే, ఇవి వెబ్‌సైట్‌కు మీ గురించి కావలసిన సమాచారాన్నిసేవ్ చేస్తాయి.

ఈ సమాచారంలో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, షాపింగ్ కార్ట్ వివరాలు, లేదా ఆన్‌లైన్ గేమ్‌లో మీరు ఏ లెవల్ వరకు చేరారో, మీరు ఎక్కడ ఉన్నారో మొదలైనవి ఉండవచ్చు. చాలావరకు కుకీస్ హానికరంగా ఉండవు. కానీ, కొన్ని కుకీస్ మీ సాధారణ డేటాను సేవ్ చేసి, మీకు అనుగుణంగా విభిన్న రకాల ప్రకటనలు లేదా షాపింగ్ సైట్లు చూపిస్తాయి.

మనం ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ లేదా గేమింగ్ కోసం మన యూజర్ ఖాతా లేదా ప్రొఫైల్‌ను సృష్టించుకోవాల్సి వస్తుంది.

దీనర్థం ఈ సమాచారం అంతా ఇవ్వాల్సి ఉంటుందని.

  • పేరు
  • ప్రదేశం
  • పుట్టిన తేదీ
  • బ్యాంక్ వివరాలు లేదా యూపీఐ ఐడీ

మీరు ఆన్‌లైన్ గేమ్ ఆడేటప్పుడు, మీరు షేర్ చేసే సమాచారం, పంపే మెసేజ్‌లు, మిత్రుల ఫోటోపై కామెంట్లు.. ఇవన్నీ మీ డిజిటల్ ఆనవాళ్లలో భాగమవుతాయి.

ఇంటర్నెట్‌, డిజిటల్ ప్రింట్స్, యాప్, సమాచారం, డేటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ కోడింగ్ భాషల్లో ఉంటాయి.

డిజిటల్ ఫుట్‌ప్రింట్స్‌ను తొలగించవచ్చా?

మీ మనసులో కూడా ఈ ప్రశ్న మెదిలిందా?

"ఆన్‌లైన్‌లో మీరు ఏదైనా పోస్ట్ చేసినా, యాక్టివిటీ చేసినా, దానిని పూర్తిగా తొలగించడం చాలా కష్టం. అందుకే, ఆన్‌లైన్‌లో ఏది చేస్తున్నా ఎల్లప్పుడూ జాగ్రత్తగా, బాగా ఆలోచించి చేయాలి" అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు, సుప్రీం కోర్ట్ సీనియర్ న్యాయవాది డాక్టర్ పవన్ దుగ్గల్ చెప్పారు.

"చాలా మంది ఇంటర్నెట్‌ను ఒక ఆటలా ఉపయోగిస్తున్నారని, కానీ ఇది చాలా సీరియస్ ప్లాట్‌ఫాం" అని ఆయన అన్నారు.

"మీరు మీ కంప్యూటర్ నుంచి ఎంత కంటెంట్‌ తొలగించినప్పటికీ, అది చాలా కాలం ఇంటర్నెట్‌లో ఉంటుంది. డేటా ఎక్కడ నుంచి తొలగించారో, ఎక్కడ తొలగించలేదో తెలుసుకోవడం చాలా కష్టం. సర్వీస్ ప్రొవైడర్లు, కంపెనీలు, ప్రభుత్వానికి ఈ డేటా ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది" అని ఆయన తెలిపారు.

"మీ డేటా థర్డ్ పార్టీకి చేరిన తర్వాత, దాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యం" అని పరిశోధకురాలు, సాంకేతిక నిపుణురాలు రోహిణి లక్షణ అంటున్నారు.

"అవును, దీన్ని కొంతవరకు తగ్గించవచ్చు, కానీ పూర్తిగా తొలగించడం దాదాపు అసాధ్యం. మీరు పోస్టులు లేదా అకౌంట్లను తొలగించినప్పటికీ, బ్యాకప్‌లు, లాగ్‌లు, ఆర్కైవ్‌లు లేదా స్క్రీన్‌షాట్‌లను తొలగించలేరు" అని ఆమె చెప్పారు.

"పబ్లిక్ డేటాబేస్ నుంచి మీ డేటాను తొలగించుకోవాలంటే, మీరు డేటా బ్రోకర్లు, వెబ్‌సైట్ల నుంచి కూడా స్వయంగా మీ డేటాను తీసేయాల్సి ఉంటుంది" అని రోహిణి అన్నారు.

" 'డిలీట్ మి' వంటి అనేక డేటా రిమూవల్ సర్వీసులు ఉన్నాయి, వీటికి మీరు కొంత ఖర్చు చేయాల్సి రావొచ్చు. దీనితో పాటు, మీ డేటాను ప్రతిచోటా కనుక్కుని తొలగించే అనేక మేనేజ్‌మెంట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి" అని రోహిణి తెలిపారు.

మీ డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ ఎంతకాలం ఉంటాయి? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. చాలా ప్లాట్‌ఫాంలలో, డేటా కొన్ని వారాలు లేదా నెలల పాటు బ్యాకప్‌గా ఉంటుందని, మరికొన్ని ప్లాట్‌ఫాంలలో, సంవత్సరాల పాటు ఉంటుందని రోహిణి లక్షణ చెప్పారు.

కొన్ని థర్డ్-పార్టీ సైట్లు, ఆర్కైవ్స్, ప్రైవేట్ బ్యాకప్ సిస్టమ్‌లలో డేటా ఎప్పటికీ ఉంటుంది.

ఇంటర్నెట్‌, డిజిటల్ ప్రింట్స్, యాప్, సమాచారం, డేటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, "మీ సోషల్ మీడియా ఖాతాలను తొలగించడం మీ చేతుల్లోనే ఉంది, కానీ యాప్‌కి ఇచ్చిన సమాచారం లేదా డేటాను డిలీట్ చేయడం మీ కంట్రోల్‌లో ఉండదు" అని నిపుణులంటున్నారు.

ఎలాంటి డేటా?

"డిజిటల్ సుడిగుండం లోపలకి ప్రవేశించడం సులభం, కానీ బయటపడటం చాలా కష్టం" అని సైబర్ నిపుణులు, సుప్రీం కోర్టు న్యాయవాది విరాగ్ గుప్తా అన్నారు.

ముందుగా మనం ఎలాంటి డేటాను తొలగించగలమో, ఏ డేటాను డిలీట్ చేయలేమో అర్థం చేసుకోవాలని విరాగ్ అంటున్నారు.

మొదటిది మన సోషల్ మీడియా ఖాతాల వంటి మనం స్వయంగా సృష్టించుకున్న డేటా అని ఆయన అన్నారు.

" మన సోషల్ మీడియా అకౌంట్‌ను పూర్తిగా ఖాళీ చేయడం, వాటి కంటెంట్ మొత్తాన్ని తొలగించడం, అకౌంట్‌ను డిలీట్ చేయడం మన కంట్రోల్‌లో ఉంది. కానీ, ఆ డేటా ఇతరులు షేర్ చేసిందైతే దాన్నిడిలీట్ చేయలేం. మన స్నేహితుల ఖాతాలలో మనం పంచుకున్న చిత్రాల మాదిరిగానే" అని గుప్తా చెప్పారు.

ఇక రెండోది.. యాప్స్, వెబ్‌సైట్లపై ఉన్న డేటా. మీరు డిలీట్ చేసినా, కంపెనీ దగ్గర ఆ డేటా ఉంటుంది, వారు దాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది.

"ఆ డేటా సున్నితమైనది కాకపోవచ్చు, అది మీకు ఎటువంటి ప్రమాదం అనిపించకపోవచ్చు, కానీ, ఆ డేటా కంపెనీకి అందుబాటులో ఉంది" అని విరాగ్ గుప్తా అంటున్నారు.

"పోస్ట్‌మార్టం డేటా కూడా ఇందులో ఒకటి కావొచ్చు. కొంతమంది తమ డిజిటల్ లెగసీ కోసం వీలునామాను వదిలివేస్తారు. వారు తమ సోషల్ మీడియా ఖాతాలు లేదా వారితో అనుసంధానమై ఉన్న డేటాను తమ మరణం తర్వాత తొలగించాలని కోరుకోవచ్చు" అని ఆయన చెప్పారు.

ఆ డేటా థర్డ్-పార్టీల దగ్గర ఉండవచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు. దానిని తొలగించడం చాలా కష్టం. వీలునామా ఉన్నప్పటికీ కంపెనీలు డేటాను తొలగించడానికి అంగీకరించకపోవచ్చు. అలాంటి సందర్భంలో, మీరు హైకోర్టు లేదా ఏదైనా అధీకృత వ్యవస్థను సంప్రదించవలసి రావొచ్చని ఆయన అన్నారు.

విరాగ్ గుప్తా చెప్పిన మూడో కారణం "రైట్ టు బి ఫర్గాటెన్". అంటే, ఒక వ్యక్తి కోరుకుంటే, తన డేటా అన్ని ప్లాట్‌ఫాంల నుంచి పూర్తిగా తొలగించాలని కోరుకోవచ్చు.

హత్య లేదా అత్యాచారం నేరం మోపబడిన వ్యక్తిని ఆయన ఉదహరించారు. ఆయన గురించి అనేక కథనాలు వార్తాపత్రికలలో లేదా టీవీ, డిజిటల్ మాధ్యమాలలో ప్రచురితమై ఉండొచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించిన సందర్భంలో ఇది వర్తిస్తుందని ఆయన అంటున్నారు.

"ఆ కేసుకు సంబంధించిన మొత్తం కంటెంట్‌ను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని కోరవచ్చు. న్యాయస్థానం ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు. అయినప్పటికీ, అన్నిచోట్లా డేటాను పూర్తిగా డిలీట్ చేయడం సాధ్యం కాదు. ఆ డేటా ఎక్కడో ఒకచోట ఉండిపోయే అవకాశం ఉంది" అని గుప్తా చెబుతున్నారు.

ఇంటర్నెట్‌, డిజిటల్ ప్రింట్స్, యాప్, సమాచారం, డేటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డిజిటల్ యాప్‌లలో బ్యాంక్ ఖాతా వంటి సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు..

  • వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) మీ లోకేషన్‌ను రక్షించగలదు.
  • యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లు కూడా డేటా సెక్యూరిటీలో కీలకపాత్ర పోషిస్తాయి.
  • మీరు ఉపయోగించని అకౌంట్లు ఉంటే, వాటిని డిలీట్ చేయండి.
  • మీకు అవసరం లేని సబ్‌స్క్రిప్షన్స్‌లో మీ వ్యక్తిగత వివరాలు, చెల్లింపు వివరాలు, ఇతర సమాచారం తొలగించండి.
  • వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, కామెంట్లు చూడడాన్ని కూడా మార్చవచ్చు.
  • మీకు నమ్మకస్తులే చూడగలిగేలా సోషల్ మీడియా అకౌంట్స్‌ను లాక్ చేసి ఉంచండి.
  • మీ పర్సనల్, ప్రొఫెషనల్ అకౌంట్స్‌ను వేర్వేరుగా ఉంచండి. అప్పుడు మీరు చూపించాలనుకున్న వ్యక్తిగత సమాచారం మాత్రమే కనిపిస్తుంది.
  • ట్రాకర్-బ్లాకింగ్ బ్రౌజర్లు, ఎక్స్‌టెన్షన్‌లు, వీపీఎన్‌లు, ప్రైవేట్ సెర్చ్ ఇంజిన్‌ల వంటి ప్రైవసీ టూల్స్‌ను ఉపయోగించండి.
  • మీ బ్రౌజింగ్ హిస్టరీ, కుకీలు, కాష్ ఫైల్స్‌ని క్లీన్ చేస్తూ ఉండండి. వివిధ యాప్‌లకు (లొకేషన్, మైక్రోఫోన్, కాంటాక్ట్‌లు, ఫోటోలు) మంజూరు చేసిన అనుమతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండండి.
  • మీ యాప్‌లలో మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేయండి. చాలా భిన్నమైన, స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి.
  • సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండండి.
  • ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్స్‌ను ఎక్కువగా ఉపయోగించుకోండి.
  • లింక్‌లను క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
  • మీ డేటా దొంగిలిస్తున్నట్లు లేదా లీక్ అవుతున్నట్లు మీకు అనిపించినప్పుడల్లా, మీరు సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు లేదా 1930కు కాల్ చేయవచ్చు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)