భారత్‌లో 1% కుబేరుల వద్దే భారీగా సంపద.. ప్రపంచ అసమానతల తాజా నివేదిక ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
తక్కువ సగటు ఆదాయం ఉన్న దేశాల్లో, భారత్‌లోనే అత్యధిక అసమానతలున్నట్లు ప్రపంచ అసమానతల నివేదిక 2026 (వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ - WIR 2026) నివేదిక తెలిపింది.
దేశంలో గత పదేళ్లలో పేదల పరిస్థితి ఇంకా దిగజారుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ పదేళ్లలో ఆర్థిక అసమానతలు స్వల్పంగా పెరిగినట్టు రిపోర్ట్ చేసింది.
సంపన్న, పేద వర్గాల ఆదాయ అసమానతలు 2014లో 38 శాతంగా ఉంటే, 2024 నాటికి 38.32 శాతానికి పెరిగినట్లు డబ్ల్యూఐఆర్ రిపోర్ట్ పేర్కొంది.
సంపద విషయానికొస్తే ప్రపంచవ్యాప్తంగా భారీ అసమానతలు ఉన్నాయి. ప్రపంచంలోని టాప్ 10 శాతం మంది వద్ద మొత్తం ప్రపంచ సంపదలో 65 శాతం ఉండగా, వారిలో 1 శాతం సంపన్నుల వద్ద ఏకంగా 37 శాతం సంపద ఉంది.
ఇక భారత్‌లో, టాప్ 10 శాతం మంది వద్ద మొత్తం దేశ సంపదలో 65 శాతం ఉండగా, కేవలం 1 శాతం సంపన్నుల వద్ద మొత్తం సంపదలో 40 శాతం ఉంది.
మహిళా శ్రామిక శక్తిలో ఎలాంటి మార్పూ లేదు.


ప్రపంచవ్యాప్తంగా మానవ మూలధన (విద్య, ఆరోగ్యం, నైపుణ్యం) అసమానతల్లో చాలామంది ఊహించిన దానికంటే భారీ తేడాలున్నాయి. సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో చిన్నారుల విద్య కోసం చేస్తున్న ఖర్చు సగటు 200 యూరోలు (రూ.21 వేలు)కాగా, యూరప్‌లో దాదాపు 7,400 యూరోలు (సుమారు రూ.7.8 లక్షలు), ఉత్తర అమెరికా, ఓషియేనియా (ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ వంటి దేశాలు) ప్రాంతాల్లో 9,000 యూరోలు, అంటే సుమారు రూ.9.5 లక్షలు అని రిపోర్టు పేర్కొంది.
ఇనీక్వాలిటీ రిపోర్ట్ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక, లింగ, ప్రాంతీయ, రాజకీయ అసమానతలను కూడా బయటపెట్టింది. 2018, 2022 తర్వాత ల్యాబ్ విడుదల చేసి మూడో నివేదిక ఇది. థామస్ పికెట్టి, లూకాస్ చాన్సెల్, రికార్డో గోమెజ్ కారెరా వంటి ఆర్థిక శాస్త్రవేత్తల నేతృత్వంలో ఇది రూపొందింది.
ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్‌తో అనుసంధానమై ఉన్న 200 మందికిపైగా విద్యావేత్తలు దీని కోసం పనిచేశారు. ప్రపంచ అసమానతలు, మారుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఈ డేటాబేస్ దోహదపడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఆదాయ అసమానతలు..
భారత్ ప్రపంచంలోనే అత్యధిక అసమానతలున్న ఆర్ధిక వ్యవస్థల్లో ఒకటని రిపోర్టు పేర్కొంది. ఇక్కడ సగటు ఆదాయం కూడా తక్కువే.
దేశంలో 10 శాతం మంది ఉన్నత ఆదాయ వర్గాల ఆదాయం దేశం మొత్తం ఆదాయంలో 58 శాతంగా ఉండగా, 50 శాతం మంది దిగువ ఆదాయ వర్గాల ఆదాయం మొత్తం ఆదాయం 15 శాతమేనని తేల్చి చెప్పింది.
అందులోనూ, టాప్ 1 శాతం మంది శ్రీమంతుల ఆదాయం దేశం మొత్తం ఆదాయంలో 22.6 శాతం.
దేశంలో సగటు ఆదాయం సుమారు 6.6 లక్షలుగా ఉంటే, దేశంలో సగం (50 శాతం) మంది దిగువ ఆదాయ వర్గాల సగటు ఆదాయం సుమారు 99 వేలు మాత్రమే.
దేశంలోని 40 శాతం మంది మధ్య ఆదాయ వర్గాల సగటు ఆదాయం సుమారు 4.5 లక్షల రూపాయలుగా ఉంది.
ఇక 10 శాతం అధిక ఆదాయ వర్గాల సగటు ఆదాయం విషయానికొస్తే, వారి ఆదాయం దాదాపు 38 లక్షలకు పైగా ఉంది.
టాప్ 1 శాతం మంది సంపన్నుల సగటు ఆదాయం దాదాపు రూ.1.49 కోట్లుగా ఉంది.
అంటే, దేశంలో 50 శాతం మంది పేదల సగటు ఆదాయం సుమారు లక్ష రూపాయాలు కాగా, సంపన్నుల ఆదాయ సగటు కోటిన్నర రూపాయలుగా ఉంది. అంటే, సుమారు 150 రెట్లు ఎక్కువ.

గత దశాబ్ద కాలంలో ఆదాయ అసమానతలు తగ్గకపోగా స్వల్పంగా పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. 2014లో 38 శాతంగా ఉన్న సగటు, 2024 నాటికి 38.2 శాతానికి పెరిగింది.
ప్రపంచ ఆదాయ అసమానతలను పరిశీలిస్తే, టాప్ 10 శాతం మంది... మొత్తం ప్రపంచ ఆదాయంలో 90 శాతం ఆర్జిస్తుండగా.. ప్రపంచ జనాభాలో సగం మంది ఆదాయం, మొత్తం ఆదాయంలో కేవలం 10 శాతం మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
సంపదలో మరింత అసమానతలు..
ఆదాయ అసమానతలతో పోలిస్తే, దేశంలో సంపద అసమానతలు అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది.
దేశ మొత్తం జనాభా సగటు సంపద సుమారు రూ.29.86 లక్షలుగా డబ్ల్యూఐఆర్ లెక్కగట్టింది.
ఇందులో దేశంలోని 50 శాతం మంది దిగువ వర్గాల సగటు సంపద మొత్తం సంపదలో కేవలం 6.4 శాతం కాగా, వారి సగటు సంపద విలువ సుమారు రూ.1.9 లక్షలు.
ఇక టాప్ 1 శాతం మంది భారతీయ శ్రీమంతుల సగటు సంపద, దేశం మొత్తం సంపదలో 40 శాతం దాటింది. వారి సగటు సంపద విలువ సుమారు రూ.12 కోట్లు.
దేశంలోని టాప్ 10 శాతం మంది సగటు సంపద 65 శాతం.

ప్రపంచవ్యాప్తంగా సంపద అసమానతలు మరింత ఆందోళనకరమైన అంశం. ప్రపంచ జనాభాలో టాప్ 10 శాతం మంది వద్ద ప్రపంచ మొత్తం సంపదలో దాదాపు మూడొంతులు ఉంటే, ప్రపంచ జనాభాలో సగంమంది వద్ద కేవలం 2 శాతం మాత్రమే సంపద ఉంది.
అలాగే, మొత్తం ప్రపంచ జనాభాలో సగంమంది దగ్గరున్న సంపద కంటే.. కేవలం 0.001 శాతం మంది (సుమారు 60 వేల లోపు) మల్టీ మిలియనీర్ల వద్ద మూడురెట్లు ఎక్కువ సంపద ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
భారీగా ఉన్న ఈ సంపద అసమానతలు వేగంగా పెరుగుతున్నట్లు కూడా రిపోర్ట్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
లింగ అసమానతలు..
లింగ అసమానతలో ఆదాయం, సంపద వంటి విషయాలే కాకుండా దైనందిన జీవనం, ఎవరి పనికి గుర్తింపు లభిస్తుంది, ఎవరి పనికి ప్రతిఫలం దక్కుతోంది, ఎవరికి అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయనే అంశాలు కూడా ఇమిడి ఉంటాయి.
చాలా విషయాల్లో పురుషులు, మహిళల మధ్య భారీ అసమానతలను ప్రస్తావించింది ఈ రిపోర్టు. ప్రపంచ శ్రామిక శక్తిలో మహిళల వాటా ఇప్పటికీ తక్కువగానే ఉన్నట్లు వెల్లడించింది.
ప్రపంచ మొత్తం శ్రామిక ఆదాయంలో మహిళల వాటా పావువంతు కంటే కొద్దిగా ఎక్కువ. మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో మహిళల వాటా కేవలం 16 శాతం మాత్రమే. దక్షిణ, ఆగ్నేయాసియాలో ఇది 20 శాతం కాగా, సహారా ఆఫ్రికాలో 28 శాతం, తూర్పు ఆసియాలో 34 శాతంగా ఉంది.
భారత్ విషయానికొస్తే, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం చాలా పరిమితంగానే ఉంది. గత దశాబ్దకాలంలో మహిళల వాటాలో ఎలాంటి మార్పూ లేదని నివేదిక పేర్కొంది. 2014లో దేశ శ్రామిక శక్తిలో మహిళల వాటా 15.7 శాతం కాగా, 2024 నాటికి కూడా ఎలాంటి పెరుగుదల లేకుండా అదే 15.7 శాతం వద్ద ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది.
దేశంలో ఈ లింగ అసమానత లోతుగా పాతుకుపోయి ఉందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ తేడాలను ఎత్తిచూపుతోందని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, మధ్య ఆసియా దేశాల్లో మహిళల వాటా మెరుగ్గానే ఉన్నప్పటికీ, మొత్తం శ్రమ ఆదాయంలో 40 శాతంగా ఉంది.
ఇంటి పని, కుటుంబ సంరక్షణ పనులను పరిగణనలోకి తీసుకుంటే మహిళలు వారానికి 53 గంటలు పనిచేస్తుంటే.. పురుషుల పని సగటు 43 గంటలే. అయినప్పటికీ మహిళల శ్రమకు విలువ తక్కువగా ఉంది. పురుషులు ఒక గంట సంపాదనలో మహిళల సంపాదన 61 శాతం మాత్రమే.
అందులో జీతం చెల్లించని శ్రమను కూడా చేర్చితే మహిళల సంపాదన 32 శాతానికి పడిపోతుందని డబ్ల్యూఐఆర్ పేర్కొంది.
ఈ లింగ అసమానత మహిళల కెరీర్ అవకాశాలను, రాజకీయ భాగస్వామ్యాన్ని పరిమితం చేయడమే కాకుండా సంపద సృష్టిని నెమ్మదింపజేస్తాయని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
కర్బన ఉద్గారాల్లో అసమానతలు..
ప్రపంచ ఉమ్మడి సవాల్ అయిన వాతావరణ సంక్షోభంలోనూ భారీగా అసమానతలు ఉన్నట్లు డబ్ల్యూఐఆర్ తెలిపింది.
ప్రపంచ జనాభాలో సగంమంది పేదవర్గాల వల్ల విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు కేవలం 3 శాతం కాగా, టాప్ 10 శాతం మంది వల్ల ప్రపంచం మొత్తం కర్బన ఉద్గారాల్లో 77 శాతం విడుదలవుతున్నాయి.
అందులోనూ టాప్ 1 అత్యంత సంపన్నుల వాటా 41 శాతంగా ఉంది. ఇది ప్రపంచ జనాభాలో 90 శాతం మంది కారణమవుతున్న కర్బన ఉద్గారాలకు దాదాపు రెట్టింపు అని నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాంతాల వారీగా..
ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలవారీగానూ భారీ అంతరాలను ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మధ్య వేర్వేరు ఆదాయ శ్రేణులుగా స్పష్టమైన విభజన ఉన్నట్లు పేర్కొంది.
ఉత్తర అమెరికా, ఓషియేనియా, యూరప్ వంటివి అధిక ఆదాయ రీజియన్లుగా ఉంటే.. రష్యా, మధ్య ఆసియా, తూర్పు ఆసియా, మిడిల్ ఈస్ట్ రీజియన్లు మధ్యస్థంగా ఉన్నాయి. లాటిన్ అమెరికా, దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా, సబ్ సహారా ఆఫ్రికా రీజియన్లు ప్రపంచ సగటు ఆదాయం తక్కువగా ఉండి, జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలుగా ఉన్నాయి.
ఉత్తర అమెరికా, ఓషియేనియా (ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ వంటి దేశాలు)లో సగటు వ్యక్తి సంపాదన సబ్ సహారా ఆఫ్రికాలోని వ్యక్తితో పోలిస్తే దాదాపు 13 రెట్లు ఎక్కువ.

ప్రపంచ సగటు కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ప్రపంచ సగటు 1200 యూరోలు, అంటే సుమారు రూ.1.27 లక్షలు.
నార్త్ అమెరికా, ఓషియేనియా ప్రాంతంలో రోజువారీ సగటు సంపాదన 125 యూరోలు అంటే, దాదాపు రూ.13 వేలు. సబ్ సహారా ప్రాంతంలో రోజువారీ సగటు సంపాదన కేవలం 10 యూరోలు, అంటే సుమారు వెయ్యి రూపాయలు.
ప్రతి రీజియన్‌లోనూ చాలామంది అతితక్కువ ఆదాయంతో జీవితాలు నెట్టుకొస్తున్నారని రిపోర్ట్ పేర్కొంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














