హిందూ వృద్ధిరేటు: ఈ పదం వాడుకపై ప్రధాని మోదీ ఏమని అభ్యంతరం చెప్పారు?

ఫొటో సోర్స్, ANI/GettyImages
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశ వృద్ధి రేటును 'హిందూ వృద్ధి రేటు' అని ప్రస్తావించడం బానిస మనస్తత్వానికి చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
న్యూదిల్లీలో శనివారం జరిగిన 'హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్'లో ఆయన మాట్లాడుతూ, ‘‘ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ, దీన్ని ఎవరైనా హిందూ వృద్ధి రేటు అని అంటారా?'' అని అన్నారు.
''భారతదేశం 2 నుంచి 3 శాతం వృద్ధి రేటును ఆశిస్తున్న సమయంలో 'హిందూ వృద్ధి రేటు' అనేదాన్ని సృష్టించారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ఆ దేశ ప్రజల విశ్వాసం, అస్థిత్వంతో ముడిపెట్టడం అనేది బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది'' అని మోదీ అన్నారు.
''ఒక మొత్తం సమాజాన్ని, ఒక సంప్రదాయాన్ని పేదరికానికి పర్యాయపదంగా మార్చారు. భారతదేశం నెమ్మదిగా వృద్ధి చెందడానికి మన హిందూ నాగరికత, సంస్కృతియే కారణమని నిరూపించే ప్రయత్నం జరిగింది. నేడు, ప్రతి దానిలో మతతత్వాన్ని వెతికే మేధావులు 'హిందూ వృద్ధి రేటు'లో దాన్ని చూడలేదా?'' అని మోదీ ప్రశ్నించారు.
భారత ఆర్థిక వృద్ధి తాజా గణాంకాలను ఉటంకిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిందని ఆయన అన్నారు.
ఈ గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో భారతదేశ వృద్ధి రేటు 8.2 శాతం.
ఈ నేపథ్యంలో, మోదీ ప్రస్తావించిన 'హిందూ వృద్ధి రేటు' అంటే ఏమిటి, అది ఎప్పుడు మొదలైందో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
'వృద్ధి రేటు' అంటే ఏమిటి, దాన్నెలా లెక్కిస్తారు?
'హిందూ వృద్ధి రేటు' అంటే ఏమిటో అవగాహన చేసుకోవడానికి ముందుగా, వృద్ధి రేటు అంటే ఏంటి, దాన్ని ఎలా లెక్కిస్తారు అన్నది తెలుసుకుందాం.
ఒక దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న వేగాన్ని 'వృద్ధి రేటు' సూచిస్తుంది.
''ఉదాహరణకు, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈ ఆర్థిక సంవత్సరంలో 100 ఉండి, వచ్చే సంవత్సరం 105 అయితే, వృద్ధి రేటు ఐదు శాతంగా ఉందని అర్థం'' అని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ అరుణ్ కుమార్ వివరించారు.
వృద్ధి రేటును అనేక విధాలుగా అంచనా వేస్తారు.
ఉదాహరణకు, ఒక దేశంలో జరిగే ఆర్థిక కార్యకలాపాలన్నీ ఆర్థిక వృద్ధి రేటులోకి వస్తాయి. దీన్ని సాధారణంగా జీడీపీ వృద్ధి రేటు అని సూచిస్తారు.
కానీ ఆర్థిక వృద్ధికి విస్తృతంగా రెండు కొలమానాలు ఉన్నాయి: అవి ఒకటి నామమాత్రపు వృద్ధి రేటు, రెండోది వాస్తవిక వృద్ధి రేటు.
ద్రవ్యోల్బణాన్ని కూడా నామమాత్రపు వృద్ధి రేటు పరిగణనలోకి తీసుకుంటుంది. అంటే, మొత్తం జీడీపీలో ద్రవ్యోల్బణం భాగమవుతుంది. దీన్నే ధరల పెరుగుదలగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది జీడీపీలో పెరుగుదలకు దారితీస్తుంది.
వాస్తవిక వృద్ధి రేటు... ఇది ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసిన తర్వాత జీడీపీని లెక్కిస్తుంది. ఒక సంవత్సరంలో చేసిన ఉత్పత్తి (కార్లు, యంత్రాలు, దుస్తులు, ధాన్యాలు మొదలైనవి), సేవల మొత్తం విలువను పరిగణనలోకి తీసుకుంటుంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
స్వాతంత్ర్యం తర్వాత ఆర్థిక వ్యవస్థ పురోగమనం...
ప్రొఫెసర్ అరుణ్ కుమార్ వివరణ ప్రకారం, బ్రిటిష్ వలస పాలనలో 1900 నుంచి 1950 మధ్య కాలంలో భారతదేశ వృద్ధి రేటు 1 శాతం కంటే తక్కువగా, అంటే దాదాపు 0.75 శాతం ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వృద్ధి రేటు వేగంగా పెరిగింది.
దీనికి కారణాలను ఆయన వివరిస్తూ, ''వలస పాలనలో బ్రిటిష్ వారు ఇక్కడి నుంచి దోచుకునేవారు. దీని కారణంగా ఇక్కడ పెట్టుబడులు, పొదుపులు చాలా స్వల్పంగా ఉండేవి'' అని చెప్పారు.
ఆయన ప్రకారం, భారతదేశ వృద్ధి రేటు 1950 నుంచి 1965 మధ్యకాలంలో వేగం పుంజుకుంది. ఇది ఆరు నుంచి ఏడు రెట్లు పెరిగింది, దాదాపు 4 శాతానికి చేరుకుంది. ఆ సమయంలో దీన్నే చాలా మంచి ఫలితాలుగా పరిగణించేవారు.
కానీ, 1965 నుంచి 1975 మధ్యకాలంలో ఈ వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 1965-66 సంవత్సరాల్లో తూర్పు భారతదేశంలో కరువు కాటకాలు, పొరుగు దేశంతో 1965, 1971 యుద్ధాలు, 1974-75లో దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధింపు మొదలైనవి చెప్పుకోవచ్చని అరుణ్ కుమార్ చెప్పారు.
అదే సమయం (1973)లో, పశ్చిమాసియాలో జరిగిన ఓ యుద్ధం కారణంగా చమురు ధరలు బాగా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది.
పాకిస్తాన్‌తో 1971 యుద్ధకాలంలో, బంగ్లాదేశ్ నుంచి దాదాపు 1.25 కోట్ల మంది భారతదేశానికి శరణార్థులుగా వచ్చారు.
దీంతో, భారతదేశ వృద్ధి రేటు 2 - 2.5 శాతం మధ్యకు పడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
1970 దశకంలో ఒడిదుడుకులు...
ఇక 'హిందూ వృద్ధి రేటు' అంటే ఏమిటో చూద్దాం.
''భారతీయ సమాజం చాలా నెమ్మదిగా మార్పులకు లోనవుతున్నట్లే, ఆర్థిక వ్యవస్థ కూడా అదే పరిస్థితిలో పడిందనేది నా ఉద్దేశం'' అని ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అన్నారు.
''స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ వృద్ధి రేటులో అనేక హెచ్చుతగ్గులు వచ్చాయని, దీనికి చాలా స్పష్టమైన కారణాలు ఉన్నాయని, 'హిందూ వృద్ధి రేటు' అనే నిర్వచనం సరైంది కాదనే విషయాన్ని పదేపదే చెబుతున్నాం'' అని ఆయన చెప్పారు.
ప్రొఫెసర్ అరుణ్ కుమార్ ప్రకారం, 1975 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిని చూసింది. 1980లలో వృద్ధి రేటు ఐదు శాతానికి మించింది.
''1990 తర్వాత, నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టినప్పటికీ, వృద్ధి రేటు దాదాపు దశాబ్దం కాలం పాటు స్థిరంగా కొనసాగింది. 2003 తర్వాత పుంజుకుంది. కానీ, 2008లో సబ్‌ప్రైమ్ సంక్షోభం తర్వాత, భారత ఆర్థిక వ్యవస్థ 2011-2013 మధ్యకాలంలో కుంటుపడింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటిగా పరిగణించడం మొదలైంది'' అని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దాని ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతదేశ వాస్తవ స్థూల జాతీయోత్పత్తి (రియల్ జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతం.
ప్రధాని మోదీ శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో, ఈ గణాంకాలను ఉటంకిస్తూ ''భారతదేశ పురోగతికి ఒక కొత్త ప్రతిబింబం'' అని అభివర్ణించారు.
''ప్రపంచ వృద్ధి రేటు కేవలం మూడు శాతం, జీ-7 దేశాల ఆర్థిక వ్యవస్థలు సగటున ఒకటిన్నర శాతం వృద్ధి చెందుతున్న సమయంలో, భారతదేశంలో ఈ గణాంకాలు నమోదయ్యాయి'' అని మోదీ అన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
భారతదేశ జీడీపీ లెక్కలపై సందేహాలు ఎందుకు...
భారతదేశ జీడీపీ అంచనా పద్ధతులపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఐఎంఎఫ్ భారతదేశ జీడీపీకి, నేషనల్ అకౌంట్స్ డేటాకు 'సి' రేటింగ్ ఇచ్చింది.
నేషనల్ అకౌంట్స్ డేటా తగినంత వివరాలతో అందుబాటులో ఉంటోందని, అయితే అనుసరిస్తున్న పద్ధతిలో లోపాలు ఉండటం వల్ల పర్యవేక్షణ దెబ్బతింటుందని ఆ నివేదిక పేర్కొంది.
ఉత్పాదక ధరల సూచీ (పీపీఐ)ని కాకుండా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ)ని భారతదేశం ఉపయోగిస్తుందని, ఇది డేటాలో వ్యత్యాసాలకు దారితీయవచ్చని తెలిపింది.
డేటాను ఐఎంఎఫ్ నాలుగు వర్గాలుగా విభజిస్తుంది. 'సి' గ్రేడ్ అంటే, ఆ డేటాలో కొన్ని లోపాలు ఉన్నాయని, అవి పర్యవేక్షణ ప్రక్రియకు కొంతవరకూ ఇబ్బంది ఉంటుందని అర్థం.
దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా అనుమానాలు వ్యక్తం చేసింది.
అందుకు ప్రతిస్పందనగా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మాట్లాడుతూ, 'డేటా ఫ్రీక్వెన్సీ, సమయపాలనలో భారతదేశం 'ఎ' గ్రేడ్‌ను పొందింది, దీన్ని విస్మరించారు'' అని అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














