జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్.. తేడా ఏంటి?

JEE advanced

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రియాంక ఝా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇంజినీర్ కావాలనే తమ కలను నెరవేర్చుకోవడానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)కు సన్నద్ధమవుతుంటారు.

ఈ పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది: జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్.

ఈ రెండు పరీక్షల మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది.

ఏ విద్యాసంస్థలో ప్రవేశానికి ఏ పరీక్ష రాయాలో, ఆ పరీక్షకు సన్నద్ధమవ్వడానికి సరైన వ్యూహమేమిటో ఎంపిక చేసుకొనే విషయంలో కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతుంటారు.

జేఈఈ పరీక్షకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలుసుకోవడం, తగిన ప్రణాళిక రూపొందించుకోవడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటంటే...

జేఈఈ అనేది దేశంలోనే అత్యధిక సంఖ్యలో హాజరయ్యే భారీస్థాయి ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దీన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు: జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్.

ఈ రెండు పరీక్షల లక్ష్యాలే కాదు, వాటి స్ట్రక్చర్, ప్రశ్నల సంక్లిష్టత స్థాయి భిన్నంగా ఉంటుంది.

జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను దేశంలోని ఐఐటీలు ఏటా ఒక్కొక్కటి చొప్పున రొటేషన్ విధానంలో నిర్వహిస్తుంటాయి.

జేఈఈ శిక్షణ ఇస్తున్న ఏసీఈ4 ఇనిస్టిట్యూట్ సహ వ్యవస్థాపకుడు గణేష్ పాండే మాట్లాడుతూ, జేఈఈ మెయిన్ పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు స్క్రీనింగ్ పరీక్ష వంటిదన్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధిస్తే దేశంలోని ప్రతిష్టాత్మకమైన 23 ఐఐటీలలో ప్రవేశానికి అవకాశం పొందవచ్చు.

జేఈఈ మెయిన్‌ పరీక్షలో ర్యాంకుతో దేశంలోని 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్‌ఐటీలు, ప్రభుత్వ నిధులతో నడిచే సుమారు 26 సాంకేతిక విద్యాసంస్థల్లోనూ, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ ప్రవేశానికి అర్హత వస్తుంది.

2026 జేఈఈ మెయిన్‌కు 14 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. వారిలో సుమారు 2.5 లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యేందుకు అర్హత పొందారని గణేష్ పాండే చెప్పారు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరీక్షలకు అర్హత, అవకాశాల మాటేమిటి?

జేఈఈ మెయిన్: 12వ తరగతి లేదా ఇంటర్మీడియెట్‌లో ఉన్నప్పుడు, ఆ తర్వాత వరుసగా రెండు సంవత్సరాల పాటు అవకాశం ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్: రెండుసార్లు మాత్రమే. 12వ తరగతి లేదా ఇంటర్మీడియెట్‌లో ఉన్నప్పుడు, ఆ తర్వాత సంవత్సరం మాత్రమే అవకాశం ఉంటుంది.

ఈ పరీక్షలకు హాజరుకావడానికి అర్హత ఏమిటంటే...

జేఈఈ పరీక్షకు హాజరుకావాలంటే, ఇంటర్మీడియెట్ లేదా 12వ తరగతిలో తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులవ్వాలి.

జనరల్ కేటగిరీ విద్యార్థులు కనీసం 75 శాతం మార్కులు లేదా బోర్డు ఎగ్జామ్‌లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీల విద్యార్థులకు కనీసం 65 శాతం ఉండాలి.

''ఉదాహరణకు బోర్డు పరీక్ష ఫలితాల్లో టాపర్‌కు 75 పర్సంటైల్ వచ్చిందనుకుందాం. మిగతా విద్యార్థులు ఆ విద్యార్థి వెనుకే ఉన్నారనుకుందాం. కానీ, ఈ విద్యార్థులకు కూడా టాప్ 20 పర్సంటైల్ సాధిస్తేనే, జేఈఈ మెయిన్‌ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులవుతారు'' అని గణేష్ పాండే చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

పరీక్షల సరళి, ర్యాకింగ్ ఎలా ఉంటుంది?

జేఈఈ మెయిన్...

మూడు గంటల పాటు కంప్యూటర్ ఆధారిత పరీక్ష

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్... ఈ సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం

బహుళైచ్ఛిక ప్రశ్న(ఎంసీక్యూ)లు, న్యూమరికల్ వేల్యూ బేస్డ్ క్వశ్చన్స్.

ఎంసీక్యూలకు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, న్యూమరికల్ వేల్యూ బేస్డ్ క్వశ్చన్స్‌కు ఉండదు

జేఈఈ అడ్వాన్స్‌డ్..

రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2), ఒక్కో పరీక్షకు మూడేసి గంటల చొప్పున సమయం

బహుళైచ్ఛిక ప్రశ్న(ఎంసీక్యూ)లు, న్యుమెరికల్ వేల్యూ బేస్డ్ క్వశ్చన్స్‌తో పాటు మ్యాట్రిక్స్-మ్యాచ్ టైప్ క్వశ్చన్స్.

ప్రశ్నల సంఖ్య, మార్కుల విధానం ప్రతి సంవత్సరం భిన్నంగా ఉంటోంది.

జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఈ రెండు పరీక్షల సిలబస్ ప్రధానంగా ఇంటర్మీడియట్ లేదా 11వ, 12వ తరగతుల్లో చదువుకున్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల ఆధారంగానే ఉంటుంది.

ఈ రెండు పరీక్షలకు ప్రశ్నల సంక్లిష్టత స్థాయి మాత్రమే భిన్నంగా ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నలు విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని, ఆలోచనా విధానాన్ని మరింత లోతుగా పరీక్షించేవిగా ఉంటాయి.

జేఈఈ మెయిన్ ఏటా రెండుసార్లు జరుగుతుంది. తొలుత జనవరి నెలలో, రెండోసారి ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. విద్యార్థులు రెండు పరీక్షలకు హాజరుకావచ్చు. అత్యధిక స్కోరు ఏ పరీక్షలో వస్తే దాన్నే ర్యాకింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు. ఏప్రిల్‌లో పరీక్ష తర్వాత ర్యాంకింగ్‌లను నిర్ణయిస్తారు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

జేఈఈ వ్యూహం ఎలా ఉండాలంటే...

జేఈఈ అంటే ఎన్నిసార్లు అయినా ప్రయత్నించుకొనే ప్రవేశ పరీక్ష కాదు. అవకాశాలు తక్కువ. అందుకే, తమ తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించాలనే ఒత్తిడి విద్యార్థులపై అధికంగా ఉంటుంది.

ఐఐటీ బీహెచ్‌యూ (బెనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఐఐటీ)లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న తన్మయ్ అగర్వాల్, తన తొలి ప్రయత్నంలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌లో 1000 లోపు ర్యాంక్ సాధించారు.

ఈ విజయం వెనుక వ్యూహం మాక్ టెస్ట్‌లపై ప్రధానంగా దృష్టిపెట్టడం, ప్రశ్నల సరళిని విశ్లేషించుకోవడమేనని తన్మయ్ అగర్వాల్ చెప్పారు.

''మెయిన్ పరీక్ష రాయడానికి ఇంకా నెల సమయం ఉంది. ఈ పరీక్ష రాయడానికి సిద్ధమవుతున్న విద్యార్థులు సాధారణంగా నవంబర్ నాటికే తమ సిలబస్ పూర్తి చేసుకుంటారు. తర్వాత రివిజన్ సమయం. కేవలం మాక్ టెస్టులు రాయడంతోనే సరిపోదు, ప్రతి సబ్జెక్టులో మీ లోపాలు, బలహీనతలను విశ్లేషించుకొని, వాటిని అధిగమించడంపై దృష్టి పెట్టండి. అలా చేయకపోతే, మీరు ఎన్ని మాక్ టెస్టులు రాసినా, వాటితో ఉపయోగం ఉండదు'' అని ఆయన సూచించారు.

టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలన్న ప్రశ్నకు తన్మయ్ అగర్వాల్ స్పందిస్తూ, ''రోజంతా చదివినంత మాత్రాన పరీక్షలో టైమ్ మేనేజ్‌మెంట్ రాకపోవచ్చు. అలాకాకుండా, విరామం తీసుకుంటూ చదవాలి. ఒక టాస్క్ పూర్తి చేయడానికి ఎన్ని గంటలు పడుతుందో చూసుకోవాలి. పాత ప్రశ్నాపత్రాలు తీసుకొని, ఇప్పుడు పరీక్ష పెడితే ఎలాగైతే రాస్తామో అంతే సీరియస్‌గా రాయాలి'' అని చెప్పారు.

వ్యూహం ఎలా ఉండాలన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ''అది ఎవరి సౌలభ్యాన్ని బట్టి వారు రూపొందించుకోవాలి. మీ వ్యూహం ఏదైనా సరే, అది పరీక్ష రోజున ఉపయోగపడేలా ఉండాలి'' అని అన్నారు.

మాక్ టెస్టులను క్రమం తప్పకుండా రాయడం మంచిదని గణేష్ పాండే విద్యార్థులకు సూచిస్తున్నారు.

''ఎక్కువ మాక్ టెస్టులకు హాజరుకావడం వల్ల, అసలైన పరీక్ష రాసేటప్పుడు కూడా అది కూడా మాక్ టెస్టు మాదిరిగానే ఉంటుందని చాలామంది చెబుతుంటారు'' అని ఆయన అన్నారు.

ఐఐటీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యామ్నాయ అవకాశాలు...

ఒక్క 2025 సంవత్సరంలోనే 54,378 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ క్లియర్ చేశారు. కానీ, దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లోనున్న అన్ని బ్రాంచీలు కలిపి 18,160 సీట్లు మాత్రమే ఉన్నాయి.

అంటే అడ్వాన్స్‌డ్ పరీక్షను విజయవంతంగా క్లియర్ చేసినా, సీటు గ్యారంటీలేని పరిస్థితిలోనే 50 శాతం పైగా విద్యార్థులు ఉన్నారు. వారి ముందున్న మార్గాలేమిటి అనేది ప్రశ్న.

''అలాంటి విద్యార్థులు జేఈఈ మెయిన్‌లో చూపించిన ప్రతిభ ఆధారంగా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఐఎఫ్‌టీ, డీటీయూ, ఎన్ఎస్‌యూటీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రతిష్టాత్మక కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. లేదా పరిశోధన వైపు కెరీర్ మలచుకోవాలనుకుంటే ఐఐఎస్‌ఈఆర్, ఎన్‌ఐఎస్ఈఆర్‌లో చేరవచ్చు'' అని గణేష్ పాండే చెప్పారు.

''కొన్నిసార్లు ఐఐటీలలో అవకాశం అనుకోకుండా వస్తుంది. కొందరు విద్యార్థులు మెరుగైన బ్రాంచ్ కోసమో, మరేదైనా ఉన్నతశ్రేణి ఐఐటీ కోసమో తమ ఆప్షన్లను వదులుకుంటారు. అలా ఖాళీ అయ్యే సీట్లను తదుపరి ర్యాంకింగ్ ఉన్నవారితో భర్తీ చేస్తుంటారు. అయితే, ఇదంతా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తికావడానికి ముందు మాత్రమే సాధ్యమవుతుంది'' అని పాండే చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)