ప్రెస్ రివ్యూ: ‘ఐఐటీలు, ఐఐఎస్‌ల సరసన విద్యార్థులే లేని జియో ఇన్‌స్టిట్యూట్’

ఫొటో సోర్స్, Getty Images
ఇంకా విద్యార్థులే చేరని జియో ఇన్‌స్టిట్యూట్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రఖ్యాత హోదా కల్పించిందంటూ 'నవతెలంగాణ' పత్రిక ఓ కథనం రాసింది.
ఆ కథనం ప్రకారం.. దేశవిదేశాల్లో పేరొందిన రెండు ఐఐటీలు, బెంగుళూరు-ఐఐఎస్ సరసన...'జియో ఇన్‌స్టిట్యూట్'కు చోటు కల్పించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం 6 విద్యాసంస్థలకు 'ప్రఖ్యాత సంస్థ'(ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్) హోదా ఇస్తూ జాబితా విడుదల చేసింది.
వాటిలో రెండు ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు, బిట్స్ పిలానీ, మణిపాల్ ఉన్నత విద్యా అకాడమీతో పాటు జియో ఇన్‌స్టిట్యూట్ ఉన్నాయి.
అయితే జియో ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించి సమాచారమేదీ అందుబాటులో లేదు.
ఒక్క విద్యార్థి కూడా ఆ సంస్థ నుంచి పట్టా పొందలేదు. అలాంటి సంస్థకు ఈ హోదా ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది.
అధికారికంగా ఇంకా ఏర్పాటు చేయని సంస్థకు, వెబ్‌సైట్ కూడా లేనిదానికి 'ప్రఖ్యాత సంస్థ' అనే ట్యాగ్ ఇవ్వటమేందని ట్విటర్‌లో పలువురు మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది.
నీతా అంబానీ 2018 మార్చి 11న 'జియో' ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయబోతున్నామని మాత్రమే ప్రకటించారు. ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం కావడానికి ఇంకా మూడేండ్లు పడుతుంది.
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్డీ) కార్యదర్శి(ఉన్నత విద్య) ఆర్.సుబ్రమణ్యం మాత్రం ఆ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ఎంపిక చేశామని చెప్పారని నవతెలంగాణ పత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు అమలు చేయకుంటే 6 నెలల జైలు
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీచేసిందని 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.
ప్రాధికార సంస్థ ద్వారా ప్రత్యేకంగా 5 కమిటీలను వేసి, భాషకు పునరుత్తేజం కల్పించేందుకు కృషి చేయనున్నారు.
తెలుగు అమలు, విద్యావిధానంలో అంతర్భాగంగా తెలుగు భాషాభివృద్ధి, ఈ-తెలుగు అభివృద్ధి, ప్రచురణలు, అనువాదం, అంతర్జాతీయంగా తెలుగు అభివృద్ధి వంటి అంశాలలో ఈ కమిటీలు సేవలందించనున్నాయి.
అధికార భాష అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు ప్రాధికార సంస్థ ప్రయత్నిస్తుంది. ప్రతి రెండేళ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించనుంది.
హిందీ రాష్ట్రాలలో సైతం మూడోభాషగా తెలుగు ఉండేలా చూడటం, సరిహద్దు రాష్ట్రాల వెంబడి ఉన్న గ్రామాల్లోని తెలుగు ప్రజలు భాష పట్ల మక్కువ చూపేలా ప్రత్యేక పథకాలు అమలుచేయనుంది.
రాష్ట్రంలో దుకాణదారులు తెలుగులో నామ ఫలకాలను ఏర్పాటు చేయకపోతే రూ.50 వేలు వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. శిలాఫలకాలు, గోడపత్రికల్లో తెలుగు వినియోగించాలి. లేదంటే రూ.10వేలు జరిమానా విధిస్తారు.
నిబంధనల మేరకు తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపని ప్రభుత్వ శాఖలకు రూ.5 వేలు అపరాధ రుసుము విధిస్తారు. తెలుగును బోధనాంశంగా అమలు చేయకపోతే రూ.50వేలు జరిమానా లేదా ఆరు నెలల జైలుశిక్ష తప్పదు అని ఈనాడు పత్రిక రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
మూడేళ్లలో 16 మందికే భూ పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో కేవలం 16 మంది ఎస్టీలకు మాత్రమే భూమి పంపిణీ చేసిందంటూ 'ప్రజాశక్తి' ఓ కథనం రాసింది.
ఎస్టీ నిరుపేద మహిళలను భూ యజమానులుగా చేస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు.. మూడు సంవత్సరాలల్లో కేవలం 16 మంది ఎస్టీలకు మాత్రమే భూ పంపిణీ చేయగలిగింది.
భూమి లేని వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న గిరిజన తెగల మహిళలకు ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి, దాని ద్వారా వారికి కుటుంబ పోషణకు అవసరమైన ఆదాయం సమకూర్చడం, భూమికి యజమానులుగా చేయడం ద్వారా సమాజంలో వారి గౌరవ, మర్యాదలను పెంచడం ఈ పథకం ఉద్దేశంగా పేర్కొన్నారు.
ప్రభుత్వమే సాగుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. గతంలో రూ. లక్షను యూనిట్ ధరగా నిర్ణయించగా భూముల రేటు ఎక్కువుగా ఉన్నాయని దాన్ని రూ. 15 లక్షలకు పెంచారు.
రెండు ఎకరాల మాగాణి కానీ, మూడు ఎకరాల మెట్ట భూమిని కానీ కొని గిరిజనులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం గత మూడేళ్లుగా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు.
కనీసం కొనుగోలుకు అనువైన భూమి వివరాలు కూడా సేకరించలేకపోయారు.
అయితే గత ఏడాదిలో మాత్రం 16 మంది గిరిజనులకు 28.98 ఎకరాలు పంపిణీ చేసినట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని కోసం రూ. 86 లక్షలు వెచ్చించినట్టు పేర్కొన్నారు.
అది కూడా చిత్తూరు జిల్లాలోనే ఈ పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలిన 12 జిల్లాల్లో ఇంత వరకు అమలుకు నోచుకోలేదని ప్రజాశక్తి రాసింది.

ఫొటో సోర్స్, High court website
అంతా మీ ఇష్టమేనా?
ఎలాంటి నియామక ప్రక్రియ చేపట్టకుండానే తెలంగాణ ప్రభుత్వం 550 మందిని కళాకారులుగా ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టిందంటూ 'సాక్షి' ఓ కథనం రాసింది. ఇష్టమొచ్చిన వారిని ఇష్టమొచ్చినట్లు నియమించుకుంటామంటే కుదరదని, ఇలా చేయడం ద్వారా అర్హులు బయట, అనర్హులు లోపల ఉంటారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు రాజ్యాంగం అనుమతించదని, ఏ నియామకానికైనా ఓ పద్ధతి ఉంటుందని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
సాంస్కృతిక శాఖలో కళాకారుల అవసరం ఉందనుకుంటే, అందుకు అర్హులను ఎంపిక చేసేందుకు మూడు వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని.. మూడు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ 550 మంది కళాకారులను కొనసాగించవచ్చని సూచించింది. మంగళవారం ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కళాకారులుగా 550 మందిని ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసిందని సాక్షి పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- సమీక్ష: మహానటి - వెండితెరపై చెరగని వెన్నెల సంతకం
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- ఉత్తరప్రదేశ్ మహిళలకు పాలమూరు వనితల పాఠాలు
- 'శ్రీదేవి.. ఓ సమ్మోహన శక్తి'
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- #BBCSpecial : ప్లాస్టిక్ ఆవులు! ‘మారాల్సింది మనుషులే.. నోరులేని జీవాలు కాదు’
- #YouTubeStars: చెముడు హర్ష.. వైవా హర్షగా ఎలా మారారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








