అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోతే మధ్యవర్తి, గ్యారంటీర్ బాధ్యత ఏంటి?

బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, అప్పు, మధ్యవర్తులు, పూచీకత్తు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫోటో(ఆత్మహత్యకు పాల్పడ్డ దంపతులు)
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం

స్నేహితులు తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో మధ్యవర్తిగా ఉన్న ఒకరు ఒత్తిడికి గురై భార్య సహా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

పోలీసులు బీబీసీకి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన 32 ఏళ్ల వడ్లకొండ శ్రీహర్ష, 25ఏళ్ల రుక్మిణి దంపతులు బెజ్జంకిలో వస్త్ర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.

శ్రీహర్ష తనకు తెలిసిన స్నేహితులు, పరిచయస్తులకు మధ్యవర్తిగా ఉండి సుమారు 13 లక్షల రూపాయల వరకు అప్పులు ఇప్పించారు.

అయితే, అప్పు తీసుకున్న వారు సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో అసలు సమస్య మొదలైంది.

డబ్బులు ఇచ్చిన వారు శ్రీహర్షపై ఒత్తిడి పెంచడం, వేధింపులకు గురిచేయడంతో దిక్కుతోచని స్థితిలో దంపతులిద్దరూ ఆదివారం(డిసెంబరు 21) ఆత్మహత్యకు పాల్పడ్డారని బెజ్జంకి పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ సౌజన్య బీబీసీతో చెప్పారు.

ఇలా తెలిసిన వారు తీసుకున్న రుణాలకు, చిట్‌ఫండ్స్‌కి మధ్యవర్తిగా, హామీదారుగా, పూచీకత్తుగా ఉండి అనేకమంది ఇబ్బందులు పడిన ఘటనలు చాలానే చూస్తుంటాం. వింటుంటాం.

అయితే అప్పులు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించకపోతే మధ్యవర్తులు లేదా గ్యారంటీర్‌ల బాధ్యత ఎంతవరకు అనేది చర్చాంశనీయంగా మారింది.

చాలామందికి ఈ విషయమై పూర్తి అవగాహన ఉండదు. ఈ విషయంపై బ్యాంకర్లు, చిట్‌పండ్‌ కంపెనీల ప్రతినిథులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులతో పాటు న్యాయవాదులతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, అప్పు, మధ్యవర్తులు, పూచీకత్తు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పూచీకత్తు అంటే బాధ్యత వహించడమేనని బ్యాంకర్లు అంటున్నారు.

బ్యాంకర్లు ఏమంటున్నారంటే...

‘‘అప్పులు తీసుకున్న వారు ఎగవేస్తే ఆ రుణాలకు పూచీకత్తు లేదా హామీదారుగా ఉన్న వారికి కచ్చితంగా బాధ్యత ఉంటుంది. అందుకనే పూచీకత్తు రాయించుకునేది. అప్పు తీసుకున్నవారు తీర్చకపోతే నాదే బాధ్యత అని లిఖితపూర్వకంగా రాస్తారు ..కాబట్టి బాధ్యత ఉంటుంది'' అని విశాఖపట్నంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో హెడ్‌ క్యాషియర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన రవికుమార్‌ బీబీసీతో అన్నారు.

''బ్యాంకులకే కాదు.. బ్యాంక్‌ ఉద్యోగుల కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలోనైనా ఇదే రూల్‌ వర్తిస్తుంది'' అని ఆయన చెప్పారు.

‘‘రుణం తీసుకున్న వ్యక్తి అర్ధంతరంగా చనిపోయినా కూడా మధ్యవర్తులకి బాధ్యత ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో బ్యాంకర్లు నేరుగా మధ్యవర్తుల వద్దకి వెళ్లరు. మృతుడి కుటుంబసభ్యులను, ఆయన ఆస్తికి వారసులను సంప్రదిస్తారు. వాళ్లు చెల్లించకపోతే నేరుగా మధ్యవర్తి అకౌంట్‌ నుంచి నెలవారీగా ఇన్‌స్టాల్‌మెంట్‌ డెబిట్‌ చేసేస్తాం.. కచ్చితంగా పూచీకత్తు ఉన్న వారి నుంచి కలెక్ట్‌ చేసుకుంటాం.. ఇది నిబంధనే..'' అని రవికుమార్‌ వివరించారు.

‘‘అయితే.. అప్పు తీసుకున్నవారు మరణించి.. ఆయన వారసులు పూర్తిగా డబ్బుల్లేక కట్టలేని పరిస్థితి., మరోవైపు గ్యారంటీర్‌ కూడా కట్టలేని స్థితిలో ఉంటే ''నాన్‌ పెర్మాఫెన్స్‌ అసెట్‌– ఎన్‌పీఎ''గా పరిగణించి.. ఎంతవరకు కట్టగలరో అంచనా వేసి అంత కట్టించుకునే పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఉంటుంది’’ అని రవికుమార్‌ తెలిపారు.

బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, అప్పు, మధ్యవర్తులు, పూచీకత్తు

ఫొటో సోర్స్, Getty Images

‘మేం లీగల్‌గానే మధ్యవర్తి వద్దకు వెళ్తాం’

చిట్‌ ఫండ్స్‌లో కూడా హామీదారు లేదా మధ్యవర్తిదే బాధ్యత అని హైదరాబాద్‌లోని బండారు చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజర్‌ కుమార్‌ బీబీసీతో అన్నారు.

అయితే చీటీ పాడుకుని డబ్బులు తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోతే తాము నేరుగా మధ్యవర్తి వద్దకు వెళ్లమని, కోర్టు ద్వారానే వెళ్తామని ఆయన చెప్పారు.

‘‘కోర్టులో కేసు వేస్తాం.. న్యాయాధికారి ఆదేశాల మేరకే వసూలు చేస్తాం.. ఈ ప్రాసెస్‌లో రెండు, మూడేళ్లు ఆలస్యమైతే.. లేట్‌ పెనాల్టీతో పాటు కోర్టు ఫీజులు కూడా వసూలు చేస్తాం’’ అని ఆయన చెప్పారు.

మరోవైపు ప్రైవేటు వడ్డీ వ్యాపారులూ ఇదే చెప్తున్నారు.

‘‘అప్పు తీసుకున్న వాళ్లు ఎగ్గొడితే ఏం చేయాలి.. మధ్యవర్తులనే కదా అడగాలి,, అన్నీ ఆలోచించే కదా వాళ్లు సంతకం పెట్టేది’’ అని విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు వడ్డీ వ్యాపారి బీబీసీతో అన్నారు.

‘‘అప్పులు తీసుకున్న వాళ్లు ఎగవేస్తే మధ్యవర్తులు ఎంతో కొంత ఇచ్చి వదిలేస్తారే కానీ మొత్తం కట్టే పరిస్థితి దాదాపుగా ఉండదు.. అయినా వచ్చినంతవరకు చాల్లే అని మేం కూడా వదిలేస్తాం. ఇది పూర్తిగా నిబంధనల మేరకే ఉంటుంది. ప్రభుత్వాలే ఆస్తులు తనఖా పెట్టుకుని రుణాలు తెస్తున్నాయి. మేం కేవలం ప్రామిసరీ నోట్, మధ్యవర్తి సంతకంతో రుణాలు ఇస్తుంటాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే హామీదారులను లేదా గ్యారంటీర్‌లను బ్యాంకర్లు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు వేధించడం సరికాదని గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యురాలు, న్యాయవాది అనూరాధ బీబీసీతో అన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం కస్టమర్లు అప్పులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు చేసుకునేలా వేధింపులకు పాల్పడడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె తెలిపారు. దీనిపై ఆర్‌బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని అనూరాధ వివరించారు.

బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, అప్పు, మధ్యవర్తులు, పూచీకత్తు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పుల రికవరీపై ఆర్‌బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

అప్పులు చెల్లించలేని వారికి చట్టపరమైన రక్షణలు

వేధింపులు నిషేధం:

బ్యాంకులు లేదా ఫైనాన్స్‌ సంస్థలు ఫోనుల్లో బెదిరించడం, ఇంటికి వచ్చి అవమానించడం, కుటుంబ సభ్యులను భయపెట్టడం చేయకూడదు. ఇవన్నీ ఆర్‌బీఐ నియమాలకు విరుద్ధం.

రికవరీకి సమయం ఇవ్వాలి:

కస్టమర్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, రీస్ట్రక్చరింగ్‌ (ఈఎంఐ తగ్గింపు), మోరటోరియం (కొంతకాలం వాయిదా), వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) వంటి అవకాశాలు ఇవ్వాలి.

రాతపూర్వక నోటీసులు మాత్రమే:

నోటీసులు మర్యాదగా, చట్టబద్ధంగా ఇవ్వాలి. దూషణలు, బెదిరింపులు చేయరాదు.

రికవరీ ఏజెంట్ల నియంత్రణ:

రికవరీ ఏజెంట్లు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 మధ్యనే సంప్రదించాలి. అసభ్య ప్రవర్తన చేస్తే బ్యాంకర్లు, అప్పులిచ్చిన వారే బాధ్యత వహించాలి.

నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేయాలి?:

మొదట బ్యాంక్‌కు ఫిర్యాదు చేయాలి.

బ్యాంక్‌ బ్రాంచ్‌ లేదా గ్రీవెన్స్‌ సెల్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.

బ్యాంకింగ్‌ ఆంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు:

బ్యాంక్‌ స్పందించకపోతే ఆర్‌బీఐ ఒంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఉచితం.

పోలీస్‌ ఫిర్యాదు:

బెదిరింపులు, దాడులు, ఆత్మహత్యకు ఉసిగొల్పడం వంటివి జరిగితే బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చు.

లీగల్‌ నోటీసు / న్యాయవాది సహాయం:

న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసు ఇవ్వడం ద్వారా వేధింపులను ఆపించవచ్చు.

బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, అప్పు, మధ్యవర్తులు, పూచీకత్తు

ఫొటో సోర్స్, Getty Images

అప్పులు చెల్లించలేని పరిస్థితి వస్తే..

చట్టపరంగా కస్టమర్లకు ఉన్న సులభమైన మార్గాలు ఇవి:

1. బ్యాంక్‌తో వెంటనే మాట్లాడాలి

ఆదాయం తగ్గడం, వ్యాపారం నష్టాల్లో ఉండడం, అనారోగ్యం వంటి కారణాలు ఉంటే బ్యాంక్‌ లేదా ఫైనాన్స్‌ సంస్థకు నేరుగా చెప్పాలి. మౌనంగా ఉండకూడదు.

2. ఈఎంఐ తగ్గింపు / గడువు పెంపు కోరవచ్చు,చట్టబద్ధంగా కోరవచ్చు

ఈఎంఐ తగ్గించడం,లోన్‌ కాలాన్ని పెంచడం, కొంతకాలం వాయిదా (మారటోరియం)

ఇవి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం అనుమతించినవే.

3. వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)

మొత్తం అప్పు కట్టడం కష్టమైతే ఒకేసారి తక్కువ మొత్తంతో ముగించేందుకు ఓటీఎస్‌ కోరవచ్చు.అంగీకారం వచ్చినదాన్ని రాతపూర్వకంగా తీసుకోవాలి

4. వేధింపుల నుంచి రక్షణ

బ్యాంకులు లేదా రికవరీ ఏజెంట్లు బెదిరించకూడదు. దూషించకూడదు. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదు

ఉదయం 8 నుంచి సాయంత్రం 6 మధ్యలోనే సంప్రదించాలి

ఇవి ఉల్లంఘిస్తే అది చట్టవిరుద్ధం.

5. వేధిస్తే ఫిర్యాదు చేయాలి

మొదట బ్యాంక్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు మెయిల్‌ చేయాలి

స్పందన లేకపోతే ఆర్‌బీఐ బ్యాంకింగ్‌ ఒంబుడ్స్‌మన్‌కు (ఉచితం), బెదిరింపులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు

6. న్యాయవాది సహాయం

న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీసు ఇవ్వొచ్చు. కోర్టులో మన హక్కుల రక్షణ పొందవచ్చు.

అప్పులు పూర్తిగా అదుపు తప్పిపోయి చెల్లించే మార్గం లేకపోతే, చట్టపరంగా చివరి మార్గంగా ఇన్‌సాల్‌వెన్సీ (దివాలా) పిటిషన్‌ వేయడానికి అవకాశం ఉంది.

బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, అప్పు, మధ్యవర్తులు, పూచీకత్తు

ఫొటో సోర్స్, Getty Images

ఇన్‌సాల్వెన్సీ అంటే ఏంటి?

వ్యక్తి లేదా వ్యాపారి ఆదాయం లేక అప్పులు చెల్లించలేని స్థితిలో ఉంటే

కోర్టును ఆశ్రయించి ''నేను ప్రస్తుతం అప్పులు తీర్చలేకపోతున్నాను'' అని చట్టబద్ధంగా ప్రకటించడమే ఇన్‌సాల్వెన్సీ. ఇది ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టిసీ కోడ్‌ (ఐబీసీ) ప్రకారం జరుగుతుంది.

ఎవరు ఇన్‌సాల్‌వెన్సీ పిటిషన్‌ వేయవచ్చు?

వ్యక్తిగత అప్పులు ఎక్కువగా ఉన్నవారు, చిన్న వ్యాపారులు, గ్యారంటీ ఇచ్చి ఇబ్బందుల్లో పడ్డవారు. ఇది నేరం కాదు, జైలుకి పంపే ప్రక్రియ కాదు.

ఇన్‌సాల్వెన్సీ పిటిషన్‌ వేస్తే ఏమవుతుంది?

కోర్టు రక్షణ లభిస్తుంది, పిటిషన్‌ స్వీకరించిన తర్వాత బ్యాంకులు,ఫైనాన్స్‌ కంపెనీల ప్రతినిథులు, రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడలేరు. రికవరీ చర్యలు నిలిపివేస్తారు.

ఫోన్లు, నోటీసులు, బెదిరింపులు ఆగిపోతాయి.

బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, అప్పు, మధ్యవర్తులు, పూచీకత్తు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్యాంక్‌ లేదా రికవరీ ఏజెంట్లు ఫోన్‌లతో బెదిరించకూడదు, అసభ్య పదజాలం ఉపయోగించకూడదు.

ఆస్తులు–ఆదాయం పరిశీలన

కోర్టు లేదా అధికారి మీ ఆదాయం, ఆస్తులు పరిశీలించి న్యాయమైన పరిష్కారం చూస్తారు. కొంత అప్పు మాఫీ కావచ్చు. లేదా మీ స్థితిని బట్టి చెల్లింపు ప్రణాళిక రూపొందిస్తారు.

పిటిషన్‌ వేయడం ఎలా?

న్యాయవాదిని సంప్రదించాలి, అవసరమైన పత్రాలు,లోన్‌ వివరాలు,ఆదాయ ఆధారాలు,ఆస్తుల సమాచారం వారికి సమర్పించాలి.

బ్యాంకులు లేదా ఫైనాన్స్‌ సంస్థలు లోన్‌ వసూలు పేరుతో వేధింపులకు పాల్పడితే, అది ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, సర్వీస్‌ డెఫిషియన్సీ (సేవా లోపం) కిందకు వస్తుంది. అప్పుడు కస్టమర్లు కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించవచ్చు.

బ్యాంకులు ఏం చేయకూడదు?

బ్యాంక్‌ లేదా రికవరీ ఏజెంట్లు ఫోన్‌లతో బెదిరించడం, అసభ్య పదజాలం ఉపయోగించడం,

కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం,ఇంటికి వచ్చి అవమానించడం, ఉద్యోగ స్థలానికి వెళ్లి పరువు తీస్తూ మాట్లాడడం చేస్తే అవన్నీ చట్టవిరుద్ధం.

ఇది సర్వీస్‌ డెఫిషియన్సీ ఎలా అవుతుంది?

బ్యాంక్‌ కస్టమర్‌కు మర్యాదగా సేవ అందించాలి. ఆర్‌బీఐ మార్గదర్శకాలు పాటించాలి వేధింపులు, బెదిరింపులకు పాల్పడితే, మానసిక ఒత్తిడి కలిగిస్తే అది సేవలో లోపం అవుతుంది.

కన్స్యూమర్‌ కోర్టులో ఎలా ఫిర్యాదు చేయాలి?

మీ జిల్లా కన్స్యూమర్ కమిషన్‌లో లేదా ఆన్‌లైన్‌ ద్వారా న్యాయవాది సహాయంతో లేదా స్వయంగా కూడా చేయవచ్చు

ముఖ్యమైన విషయం

అప్పు చెల్లించలేకపోవడం నేరం కాదు. వేధింపులు చేయడం మాత్రం నేరం

చట్టం కస్టమర్‌ వైపే ఉంది.

లోన్‌ చెల్లించలేని సందర్భాల్లో లోక్‌ అదాలత్‌ లేదా డీఎల్‌సీఎ– డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ – జిల్లా న్యాయ సేవల సంస్థ) ద్వారా చట్టబద్ధంగా, సులభంగా సమస్యలు పరిష్కరించుకోవచ్చు.

బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, అప్పు, మధ్యవర్తులు, పూచీకత్తు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బ్యాంక్‌ లోన్లు, ఫైనాన్స్‌ కంపెనీ బాకీలు, ఈఎంఐ వివాదాలు లోక్‌ అదాలత్‌లో పరిష్కరించవచ్చు

లోక్‌ అదాలత్‌ అంటే ఏంటి?

లోక్‌ అదాలత్‌ అనేది కోర్టు బయట త్వరగా ఖర్చు లేకుండా స్నేహపూర్వకంగా వివాదాలు పరిష్కరించే వ్యవస్థ.

బ్యాంక్‌ లోన్లు, ఫైనాన్స్‌ కంపెనీ బాకీలు, ఈఎంఐ వివాదాలు లోక్‌ అదాలత్‌లో పరిష్కరించవచ్చు.

ఎలాంటి లోన్‌ సమస్యలు పరిష్కరించవచ్చు?

ఈఎంఐ చెల్లించలేని సమస్య, వడ్డీ ఎక్కువగా వేసిన వివాదాలు,

రికవరీ వేధింపులు

లోక్‌ అదాలత్‌లో బ్యాంక్‌–కస్టమర్‌ మధ్య నేరుగా చర్చ జరుగుతుంది. చాలా సందర్భాల్లో తక్కువ మొత్తంతో సెటిల్‌మెంట్‌ అవుతుంది. అలానే వడ్డీ తగ్గుతుంది. పెనాల్టీలు మాఫీ అవుతాయి. తక్కువ మొత్తంలో అప్పు ముగుస్తుంది.

త్వరిత పరిష్కారం లభిస్తుంది. సంవత్సరాలు పట్టే కేసులు ఒక్క రోజులోనే పరిష్కారం అవుతాయి. ఖర్చు లేదు. కోర్టు ఫీజు లేదు. న్యాయవాది లేకుండానే వెళ్లొచ్చు

లోక్‌ అదాలత్‌ తీర్పు

కోర్టు తీర్పుతో సమానం

అప్పీల్‌ ఉండదు.

డీఎల్‌సీఏ(జిల్లా న్యాయ సేవల సంస్థ) ఎలా సహాయం చేస్తుంది?

ఉచిత న్యాయ సలహా, లోక్‌ అదాలత్‌కు కేసు పంపించడం, బ్యాంక్‌తో చర్చలు జరిపించడం. పేదలు, ఆర్థికంగా బలహీనులకు ఉచిత న్యాయవాది సౌకర్యాలు అందించడం వంటివి చేస్తుంది.

ఎలా సంప్రదించాలి?

మీ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న డీఎల్‌సీఏ కార్యాలయానికి వెళ్లాలి. లోన్‌ పత్రాలు, నోటీసులు తీసుకెళ్లాలి. లోక్‌ అదాలత్‌లో పరిష్కారం కోరాలి.

జీవితం అప్పుల కంటే విలువైనది. మార్గాలు ఉన్నాయి, చట్ట సహాయం తీసుకోవాలి ప్రాణాలు తీసే బలహీనతగా మారకూడదు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.

సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)