ప్రధానమంత్రి కొత్త ఇంటి కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పడానికి నిరాకరించిన ప్రభుత్వం: బీబీసీ ఎక్స్‌క్లూజివ్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్, అర్జున్ పర్మార్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- నుంచి, దిల్లీ
న్యూదిల్లీ నడిబొడ్డున, రాష్ట్రపతి భవన్‌ను ఆనుకుని ఉన్న కొత్త ఆఫీస్ కాంప్లెక్స్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో పని చేయనున్నారు.
ఈ కాంప్లెక్స్‌కు 'సేవా తీర్థ్' అని పేరు పెట్టారు. అక్కడికి అత్యంత సమీపంలోనే ప్రధానమంత్రి కొత్త నివాసాన్ని కూడా నిర్మించనున్నారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో రెండు భవనాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టు 2026 నాటికల్లా పూర్తవుతుందని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20వేల కోట్లు అని పేర్కొంటూ ప్రభుత్వం స్వయంగా ప్రకటన జారీ చేసింది.
అయితే, వాస్తవ వ్యయం వివరాలను కోరుతూ, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) 2005 కింద దరఖాస్తు చేయగా, ఆ వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది.

ఈ ప్రాజెక్టు వ్యయం పెరుగుదలకు సంబంధించి ప్రభుత్వం ఈ సంవత్సరం పార్లమెంటులో ప్రస్తావించినందున ఈ ప్రశ్న చాలా కీలకమైనదిగా భావించవచ్చు.
పెరిగిన జీఎస్‌టీ రేట్లు, ఉక్కు ధర, అదనపు భద్రతా ఏర్పాట్లు వంటి అనేక అంశాలను ఉదహరిస్తూ ..కొత్త పార్లమెంట్, ఉపరాష్ట్రపతి నివాస భవనాల నిర్మాణం అధిక ఖర్చుతో కూడుకున్నదని గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అయితే, ప్రధానమంత్రి కొత్త నివాసం గురించి సామాన్య ప్రజలకు తెలిసింది చాలా తక్కువ.
వ్యయం పెరుగుదలను అంగీకరించినప్పటికీ, ముందు పేర్కొన్న రూ.20,000 కోట్లతో పోలిస్తే ప్రాజెక్టు మొత్తం ఖర్చు ఎంత, పెరిగింది ఎంత అన్నదాన్ని ప్రభుత్వం వెల్లడించడం లేదు.
ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం 2005 (ఆర్టీఐ) కింద బీబీసీ దరఖాస్తు దాఖలు చేసింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
బీబీసీ అడిగిన సమాచారం ఏమిటంటే?
మొదటి భాగంలో, సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారం, ఇప్పటివరకు ప్రాజెక్టు అంచనాలు, 2025 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం వ్యయం, ఆమోదించిన టెండర్ల జాబితా, పనుల పేర్లు, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లేదా ఏజెన్సీల పేర్లు, ప్రతి పని వారీగా ఖర్చు తదితర వివరాలు అడిగాము.
ప్రాజెక్ట్ పూర్తయ్యే అంచనా తేదీని కూడా తెలుసుకోవడానికి మేము ప్రయత్నించాము.
రెండవ భాగంలో, ప్రధానమంత్రి కొత్త నివాసం, పనులు, సౌకర్యాల స్థితి గురించి సమాచారం కోరాం.
చివరి భాగంలో, ఉపరాష్ట్రపతి నివాసం తదితర నిర్మాణ పనులకు సంబంధించిన సమాచారం అడిగాం.
ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి భద్రతకు సమస్య లేకుండా సమాచారం ఇవ్వాలని కూడా మేము దరఖాస్తులో పేర్కొన్నాం.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రభుత్వం చెప్పిన సమాధానం ఏమిటి?
ప్రారంభంలో, కేంద్ర ప్రజాపనుల శాఖ (సీపీడబ్ల్యూడీ) అన్ని ప్రజా సమాచార అధికారుల (పీఐవోల)ను అప్రమత్తం చేసి, సంబంధిత సమాచారాన్ని షేర్ చేయాలని కోరింది.
వారి వద్ద సమాచారం లేకపోతే, దరఖాస్తును సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేయాలని కూడా ఆదేశించింది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులన్నీ పర్యవేక్షించే సీపీడబ్ల్యూడీ 2025 అక్టోబర్ 24న ఇచ్చిన తన సమాధానంలో, దాని మాతృ మంత్రిత్వ శాఖ అయిన గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే విభాగం, ప్రాజెక్ట్ ఖర్చు, పూర్తి తేదీ, జారీ చేసిన టెండర్లకు సంబంధించిన ప్రశ్నలు "ఈ కార్యాలయానికి సంబంధించినవి కావు" అని పేర్కొంది.
ప్రధానమంత్రి నివాసానికి సంబంధించిన అంశాలపై స్పందిస్తూ ‘‘వివరాలు కోరిన పని 'సీక్రెట్ కేటగిరీ'కి చెందినది, కాబట్టి సమాచారం ఇవ్వలేము" అని సీపీడబ్ల్యూడీ పేర్కొంది.

ఫొటో సోర్స్, RTI Act 2005
ఇంకా ఏమని స్పందించిందంటే...
సీపీడబ్ల్యూడీ నుంచి సమాధానం అందిన కొద్ది రోజుల్లోనే, మేము ఆర్టీఐ చట్టం-2005 కింద అప్పీలు దాఖలు చేస్తూ, మేము మా మొదటి భాగంలో పేర్కొన్న ప్రశ్నలను మళ్లీ పంపాం.
అప్పీలుకు ప్రతిస్పందనగా, సీపీడబ్ల్యూడీకి చెందిన సుధీర్ కుమార్ తివారీ 2025 డిసెంబర్ 2న స్పందిస్తూ, మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం కోసం చేసిన అభ్యర్థన "అస్పష్టంగా ఉంది" అని పేర్కొన్నారు.
ఇక ప్రధానమంత్రి నివాసం విషయంలో, ‘‘ మీ దరఖాస్తు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(ఎ) కింద మినహాయింపు కేటగిరీలోకి వస్తుంది. దీని కారణంగా మీరు కోరిన సమాచారాన్ని బహిరంగపరచలేం" అని సుధీర్ కుమార్ తివారీ అన్నారు.
"ఈ సమాచారాన్ని బహిర్గతం చేస్తే భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా, సమాచారాన్ని బహిరంగపరచడం దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపిస్తుంది" అని పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌కు సంబంధించిన ఏ సమాచారంపైనా స్పందన ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అంటే ఏంటి?
"ప్రధానమంత్రి ప్రస్తుత నివాసం సెంట్రల్ విస్టా వెలుపల లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉంది. సౌత్ బ్లాక్ వెనుక ఉన్న ఎ, బి బ్లాకులలోని మురికివాడలను తొలగించిన తర్వాత ప్రధానమంత్రి కొత్త నివాసాన్ని నిర్మించాలనేది ప్రతిపాదన" అని ప్రాజెక్ట్ సైట్ పేర్కొంది.
"అవసరమైన అన్ని సౌకర్యాలతో కూడి ఉంటుంది. ప్లాట్ నంబర్ 30 వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ) కోసం అదనపు భవనాన్ని కూడా నిర్మించాలని ప్రతిపాదన వచ్చింది. అన్ని వీఐపీల కార్యాలయాలు, నివాసాలను ఒకేచోట ఉండటం వల్ల నగరంలో మౌలిక సదుపాయాల అవసరాలు తగ్గుతాయి. ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపడుతుంది" అని పేర్కొంది.
ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్ నిర్మాణం పూర్తయిందని ప్రభుత్వం చెప్పినప్పటికీ, ప్రధానమంత్రి నివాసం ఏ స్థితిలో ఉందో ఇంకా స్పష్టత లేదు.
ప్రధాన మంత్రి కార్యాలయం గురించి ప్రభుత్వం ఇలా చెబుతోంది: "క్యాబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ (ఎన్‌ఎస్‌సీఎస్), విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ హౌస్‌లో ఉన్నటువంటి కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలు పీఎంవో ఉన్న కాంప్లెక్స్‌లో ఉంటాయి. ఇవి అన్నీ కలిసి 'ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్'గా ఉంటాయి.
అధికారిక వెబ్‌సైట్‌లో వీటన్నింటినీ 'యాక్టివ్ ప్రాజెక్ట్'గా పేర్కొంటూ జాబితా ఉంచారు.
"కొత్త పార్లమెంట్ హౌస్‌లో ఎంపీల చాంబర్లు, సెంట్రల్ విస్టా అవెన్యూ, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ 10 భవనాల సహా అన్ని ప్రణాళికాబద్ధమైన డెవలప్‌మెంట్, రీడెవలప్‌మెంట్ పనులు" ఈ ప్రాజెక్టులో భాగమని పేర్కొంది.
సెంట్రల్ విస్టాను 'భావితరాలకు మౌలిక వసతుల కోసం చేపట్టిన ప్రాజెక్టు'గా ప్రభుత్వం అభివర్ణించింది.

ఫొటో సోర్స్, RTI Act 2005
అప్పీల్ తర్వాత ప్రభుత్వ స్పందన...
‘‘మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో పెద్ద ప్రాజెక్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చూపించే ఉదాహరణలు ప్రపంచ చరిత్రలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, జపాన్ టోక్యో టవర్‌ను నిర్మించింది. ఇది వేలమందికి ఉపాధిని అందించింది. ఇది దేశంలో జాతీయవాద భావాన్ని పెంచింది. జపాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది’’ అని ప్రభుత్వం పేర్కొంది.
జూలై 2025లో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ స్థితి గురించి పార్లమెంటులో ప్రశ్న వచ్చినప్పుడు, ‘‘కొనసాగుతున్న ప్రాజెక్టులలో సెంట్రల్ సెక్రటేరియట్-1, 2, 3 విభాగాలు ఉన్నాయి. ఇవి 88 శాతం పూర్తయ్యాయి. సెంట్రల్ సెక్రటేరియట్‌లోని 6, 7, 10 విభాగాలలో పనులు జరుగుతున్నాయి. ఈ పనులు 2026 అక్టోబర్ నాటికి పూర్తవుతాయి’’ అని ప్రభుత్వం పేర్కొంది.
ఈ సమాధానంలో ప్రధానమంత్రి కార్యాలయం లేదా ప్రధానమంత్రి నివాసం గురించి ప్రస్తావన లేదు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














