పార్లమెంటుకు కొత్త భవనం - లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా : ప్రెస్‌ రివ్యూ

భారత పార్లమెంటు

ఫొటో సోర్స్, Getty Images

పార్లమెంటుకు నూతన భవనాన్ని నిర్మించాలని యోచిస్తున్నామని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఎంపీలతో పాటు ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ అన్నారు.

‘ప్రజాభిప్రాయ సేకరణకు పలు బృందాలు ఏర్పాటు చేశాం. మన పార్లమెంటు భవనం ఆకట్టుకునేలా ఉండాలి’ అని స్పీకర్ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

గోశాల

ఫొటో సోర్స్, Getty Images

విజయవాడ గోశాలలో 86 ఆవుల మృత్యువాత

విజయవాడ గోశాలలో శుక్రవారం రాత్రి 86 ఆవులు మృత్యువాత పడ్డాయని ఆంధ్రజ్యోతి తెలిపింది. విజయవాడ ఇంద్రకీలాద్రిసమీపంలో కొందరు మార్వాడీలు గోసంరక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆవులను సంరక్షిస్తున్నారు.

ఈ ఆవరణ సరిపోకపోవడంతో కొత్తూరు తాడేపల్లిలో ఏడు ఎకరాల స్థలంలో మరో గోశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ పది షెడ్లు, మూడు బ్యారక్‌ల్లో సుమారు 1500 ఆవులు ఉన్నాయి. కమిటీ సభ్యులు కొన్నాళ్ల కిందటిదాకా విజయవాడలో దాణాను కొనుగోలు చేసేవారు.

ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి దాణా (ముక్కలుగా నరికిన పచ్చిగడ్డి) తెప్పించుకుంటున్నారు. శుక్రవారం అద్దంకి నుంచి 7,425 కిలోలు... విజయవాడ చుట్టుపక్కల నుంచి నాలుగు విడతలుగా 5,610 కిలోల పచ్చిమేత వచ్చింది. కార్మికులు శుక్రవారం రాత్రి దీనిని గోవులకు ఆహారంగా వేశారు.

రాత్రి 9.30 గంటల నుంచి ఆవులు నిలబడిన చోటే పడిపోసాగాయి. నోరు, ముక్కు నుంచి నురగలు వచ్చాయి. రాత్రి 10 గంటల సమయానికి ఒక ఆవు చనిపోయింది. అప్పటి నుంచి ఒక్కో గంట గడిచేకొద్దీ మృత్యుఘోష మరింత పెరిగింది.

కమిటీ సభ్యులు అప్పటికప్పుడు పశు సంవర్ధక శాఖ వైద్యులకు సమాచారం ఇచ్చారు. గోశాలలో సుమారు 1500 ఆవులు ఉండగా... 128 ఆవులు మాత్రం అస్వస్థతకు గురయ్యాయి.

రసాయన గుళికలు వేసి పెంచిన మేత విషపూరితం (టాక్సిక్‌) కావడంవల్లే ఆవులు మరణించాయని ప్రాథమికంగా నిర్ధారించారు. 30కి పైగా ఆవులకు పోస్టుమార్టం చేయగా... వాటన్నింటి కడుపులో పచ్చగడ్డి ఉంది.

వాటి ఊపిరితిత్తులు, పేగులపై 'పెటికల్‌ హ్యామరేజ్‌' (నరాలు చిట్లి రక్తస్రావం జరగడం) ఛాయలు కనిపించాయి. టాక్సిసిటీ వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. శుక్రవారం గోశాలకు అద్దంకితోపాటు విజయవాడ పరిసరాల నుంచి నాలుగు లోడ్‌ల మేత వచ్చింది. వీటిలో ఏ మేత వల్ల ఈ ఘోరం జరిగిందో గుర్తించాల్సి ఉంది.

చనిపోయిన ఆవులకు గోశాల ప్రాంగణంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు కలెక్టర్‌ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆవులకు వేసిన దాణా నమూనాలను పరీక్షలకు తరలించారు. గోవులకు ఇస్తున్న నీటిని, చుట్టుపక్కల ఉన్న నీటి నమూనాలను గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులు సేకరించారని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.

కేసీఆర్

ఫొటో సోర్స్, KCR/FB

‘కొత్తచట్టంతో పంచాయతీరాజ్ బలోపేతం’

కొత్త పంచాయతీరాజ్ చట్టం వెలుగులో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చెప్పారని నమస్తే తెలంగాణ తెలిపింది.

గ్రామపంచాయతీ నుంచి జిల్లాపరిషత్తుల వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా, మండల పరిషత్తులు ఇప్పటిమాదిరిగా ఏ పనీ లేకుండా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవని, అధికార వికేంద్రీకరణద్వారా వాటికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని చెప్పారు.

పంచాయతీరాజ్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన పలు ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలవడానికి ముందే స్థానికసంస్థలకు అప్పగించే విధులు, నిధులు, బాధ్యతల విషయాల్లో స్పష్టత ఇస్తామని వెల్లడించారు. గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి గ్రీన్‌కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు.

గ్రామాలు బాగుపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, పట్టుబట్టి పనిచేస్తే గ్రామాల్లో తప్పక మార్పు వస్తుందనే నమ్మకం ఉన్నదని సీఎం చెప్పారు. పల్లెల రూపురేఖలు మార్చడంకోసం ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిందని, ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యతలు స్పష్టంగా నిర్వచించామని పేర్కొన్నారు.

ఇప్పుడు ప్రభుత్వం స్థానికసంస్థలకు అధికారాలను బదిలీచేయాలని నిర్ణయం తీసుకున్నదని, సహాయమంత్రి హోదా కలిగిన జెడ్పీ చైర్‌పర్సన్ కూడా ప్రస్తుతం ఏ పనీ లేకుండా ఉండటం సమంజసం కాదని సీఎం పేర్కొన్నారు.

ప్రజలతో ఎన్నికైన ఎంపీపీలు, జెడ్పీటీసీలది కూడా ఇదే కథగా ఉన్నదన్నారు. భవిష్యత్తులో ఇలా జరుగటానికి వీల్లేదని, స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా పాలనలో భాగస్వామ్యం కావాలని చెప్తూ.. విద్య, వైద్యం, పచ్చదనం, పారిశుద్ధ్యం.. ఇలా ఏ విషయంలో ఎవరిపాత్ర ఎంత అనేది నిర్ధారిస్తామని సీఎం కేసీఆర్ వివరించారు.

గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు ఏంచేయాలనే విషయాలపై పూర్తి స్పష్టత ఇస్తామని చెప్పారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఇసుక

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో ఇసుక కష్టాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా నిర్మాణాలు ఎక్కువగా ఉన్న విజయవాడ, గుంటూరు, రాజధాని ప్రాంతం, విశాఖపట్నం లాంటి చోట్ల ఈ సమస్య ఎక్కువగా ఉందని నిర్మాణదారులు వాపోతున్నారని ఈనాడు తెలిపింది.

అదే సమయంలో కొన్ని చోట్ల ఇసుక ధరలు పెరిగి భారంగా మారాయని సొంత ఇళ్లు కట్టుకునేవారూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో గతంలో కొనసాగిన ఇసుక విధానం సక్రమంగా లేదంటూ కొత్త ప్రభుత్వం ఇసుక తవ్వకాలను నిలిపేసింది. సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక విధానం తీసుకొస్తామని ప్రకటించింది.

అప్పటి వరకు జిల్లాల్లో ఇసుక కొరత లేకుండా చూడాలంటూ కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. అయినా దాదాపు అన్ని జిల్లాల్లో పరిస్థితుల్లో మార్పులేదు.

రీచ్‌ల సంఖ్య తగ్గిపోవడంతో ట్రాక్టర్లలో ఎక్కువ ఇసుక తరలించేందుకు అవకాశం ఉండటం లేదు. గతంలో సగటున 2, 3 ట్రిపులు తిరిగే ట్రాక్టర్లు, ఇపుడు ఒక ట్రిప్పు అయినా దొరికితే చాలు అనేలా ఉంది. విజయవాడ, గుంటూరుల్లో రెండు రోజులకు ఓ ట్రిప్పు ఇసుక లభిస్తోంది. దీనివల్ల ట్రాక్టర్ల యజమానులు రవాణా ఛార్జీలు పెంచేశారు.

మూడు నెలల కిందట రాష్ట్రంలో అన్ని అనుమతులు ఉన్న రీచ్‌లు 156 ఉండేవి. వీటిలో ప్రస్తుతం 73 మాత్రమే కొనసాగుతున్నాయి. మరోవైపు అనేక చోట్ల నదులకు ఆనుకొని ఉండే పట్టా భూముల్లో ఇసుక మేటలు వేసి ఉంటుంది.

రెండు నెలల కిందటి వరకు వీటిలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చేవారు. ప్రస్తుతం పట్టా భూముల్లో తవ్వకాలు నిలిపేశారని దీంతో ఇసుక లభ్యత కష్టంగా మారింది.

అయితే, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలతో కృష్ణా నది పరిధిలో ఇసుక తవ్వకాలు నిలిపేయడం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తోందని భూగర్భ గనుల కార్యదర్శి రామ్ గోపాల్ తెలిపారు. 5వ తేదీ నాటికి కొత్త ఇసుక విధానం రానుందని, అప్పటి వరకు అన్ని జిల్లాల్లో కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేసేలా ఆదేశాలిచ్చామని ఆయన చెప్పినట్లు ఈనాడు వెల్లడించింది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)